Once you stop learning, you start dying

31, డిసెంబర్ 2008, బుధవారం

2009 లో ఇండియా జాతకం

2009 లో ఇండియా జాతకం ఎలా ఉండబోతున్నది? తెలుసుకోవాలని ఉండడం మనకు సహజం.



మనకు స్వతంత్రమొచ్చిన సమయానికి గ్రహస్థితి ఇలా ఉంది. 
లగ్న,రాహు : వృషభ 
కుజ:మిథున 
రవి,చంద్ర,శుక్ర,బుధ,శని:కటక 
గురు:తులా 
కేతు:వృశ్చిక 

ప్రస్తుతం శుక్రదశలో కేతు అంతరం మే 2008 నుంచి జూలై 2009 వరకు జరుగుతున్నది. గోచారాన్ని చూస్తె రాహు గురువులు తొమ్మిదిలో శని నాలుగులో కేతువు మూడింట ఉన్నారు. చంద్ర లగ్నాత్ వీరు ఏడు,రెండు, ఒకటిలో ఉన్నారు. 

వీరి ఫలితాలు వరుసగా చూస్తె, 
1. రాహుగురువులు తొమ్మిదిలో వృద్ధనేతల అసహజ మరణం. గురువులుగా ఉండవలసిన వాళ్లు భ్రస్టు పట్టటం. జడ్జీలు లాయర్లు అవినీతి పరులవడం, నీతి బజార్న పడడం, అన్యాయాలు అక్రమాలు ఎక్కువ కావడం. ఏడింట స్థితి వల్ల శత్రువుల కుట్రలకు బలి కావడం, అవినీతి పెచ్చు మీరడం, గుంపులుగా చావులు ఉంటాయి. 

2. శని నాలుగింట స్థితి వల్ల అంతర్గత శాంతి లోపించడం, జల సంబంధ ప్రమాదాలు, కుట్రలు. రెండు స్థితి వల్ల కుమ్ములాటలు, ధన రంగం దిగజారడం, నేతల అనవసర వాగుడు, పనిలో మాత్రం గుండు సున్నా. 

3. కేతువు మూడింట: తలా తోకా లేని ప్లానులు, పొరుగు దేశ కుట్రలు, ఉగ్రవాద చర్యలు, పిరికితనం. ఒకటి స్థితి వల్ల అన్నింటా దిగజారుడుతనం, శత్రువు చేతిలో చావుదెబ్బ తినడం జరుగుతుంది. శుక్రదశలో కేతుఅంతరంవల్ల ఆడపిల్లల అన్యాయపుచావులు, హింస, అన్యాయపు సంపాదనతో విలాసాలు ఎక్కువ కావడం, ఫైనాన్సురంగం దెబ్బ తినడం, సినిమాలు ఘోరంగా ప్లాపులుకావడం, సినిమా తారల విషాదాంతాలు, విలాసభవనాలు నాశనం కావడం, జలప్రమాదాలు ఉంటాయి. జనవరి ఇరవైఆరున సూర్యగ్రహణానికి అటూఇటూగా అనేక ఘోరాలు ప్రమాదాలు ప్రకృతిభీభత్సాలు జరుగవచ్చు. 

ప్రస్తుతానికి చాలు. ఇంత అందమైన భవిష్యత్తు కనబడుతుంటే ఇంకేం చూస్తాం? జూలై తరువాత రాబోయే రవిదశ ఎలా ఉంటుందో మళ్ళీ చూద్దాం.