ఈ రోజు తేది ప్రకారం వివేకానంద స్వామి జన్మ దినం. తిథుల ప్రకారం పదిహేడవ తేది. ఆ మహనీయుని తలచుకుంటేనే నాకు ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఈ రోజు నా హృదయం లోనించి వెలువడిన ప్రార్థన ఇది.
ఓ మహనీయ మూర్తీ
దేవతలు కూడా తొంగి చూడడానికి భయపడే
నిరాకార, జ్యోతిర్మయ లోకం నుంచి
చీకటి, అజ్ఞానం, అసమర్థతా నిండి
తన్ను తాను మరచిన భారత
జాతిని
ఉద్ధరించడానికి దిగి వచ్చిన తేజో పున్జమా
నీ అమృత హస్తంతో భారత ఆత్మను తట్టి నిద్ర లేపావు గదా
అవతార మూర్తి శ్రీ రామకృష్ణుని అనుగ్రహ పాత్రుడా
అపవిత్రుల స్పర్శను భరించలేని ఆ దివ్య మూర్తి
తన చేతితో నీకు ప్రసాదాన్ని తినిపించాడు
నీవు కనిపిస్తే చాలు ఆయన మనసు సమాధిలో కెగసి
భగవంతునిలో లీనమయ్యేది
కోట్లాది ప్రజలు దేవునిగా కొలిచే రామకృష్ణుడు
శివుని అంశగా నిన్ను దర్శించి
నీకు నమస్కరించాడు
ఏమిటయ్యా ఈ వింత
నిన్ను ఒర నుంచి తీసిన
ఖడ్గానివన్నాడు
నా నరేంద్రుని దగ్గరకు రాలేక మహా మాయ
దూరంగా నిలవాల్సిందేనన్నాడు
ఎంతటి పవిత్రాత్ముడవో నీవు
నా శిష్యులలో ఒకడు నాలుగు రేకుల పద్మం
ఒకడు పది రేకుల పద్మం, ఇంకొకడు ఇరవై
అయితే నరేంద్రుడు
సహస్ర దళ పద్మం అన్నాడు
ఎవరికీ లేని చనువు నీకిచ్చాడు
ఎట్టి అపవిత్రతా నిన్ను ఏమీ చెయ్యలేదన్నాడు
నిన్ను సమీపించి అది
భస్మం కావలసిందే నన్నాడు
నీవు జ్ఞాన సూర్యుడవు
ప్రచండ వైరాగ్యాగ్నివి
దయా హృదయుడవు
నిత్యం దైవానుభూతిలో ఉండికూడా
ఈ దేశం కోసం విలపించావు
ఇరవై మూడేళ్ళ వయస్సులో
మహర్షులు పొందలేని
నిర్వికల్ప సమాధి నెట్లా
పొంద
గలిగావు
పుట్టుక తోనే మహాయోగివి
కనులు మూస్తే నీకు
కనిపించేది నుదుటిలో
జ్యోతిర్మయ తేజస్సు
ఆ తేజో లోకం లోనే నీ నిద్ర
ఆరేండ్ల పిల్లవానిగా
పాము వచ్చినా తెలియనంత
ఏకాగ్ర ధ్యానంలో ఉన్నావు.
బుద్ధుడు తనంత తానె నీ
గదిలో నీకు శరీరంతో
దర్శనమిచ్చాడు
అఖండ బుద్ది కుశలత
అగాధ దయా హృదయం
విశాల మయ దృక్పధం
కామ స్పర్స లేని మనస్సు
ఆజన్మాంత బ్రహ్మచర్యం
నీవు మనిషివా లేక దేవతవా
ఎన్సైక్లోపీడియా ఆఫ్ బ్రిట్టానికా
ఇరవై వాల్యూములు వారంలో చదివి
ఉన్నది ఉన్నట్లు ఎక్కడ అడిగితె
అక్కడ ఒప్పగించి
యూరోపియన్లను ఆశ్చర్య చకితులను చేసావు
దివ్య దృష్టితో రాబోయే
వేల సంవత్సరాల చరిత్రను
చూచి నిట్టూర్చావు
ఈ లోకం కుక్క తోక అన్నావు
యూరోప్ అమెరికాలు నీకు
పాదాక్రాన్తమై నిన్ను దేవునిలా
కొలుస్తున్న వేళ
నీ దేశంలోని పేదలను తలచి
కన్నీరు కార్చావు
ఏళ్లకు ఏళ్ళు తపించిన సాధన పరిపక్వమై
నిర్వికల్ప సమాధి హస్తగతమై
సత్ చిత్ ఆనంద సాగరం
దర్శనమిచ్చిన వేళ
నీ గురువు మాట పాటించి
మోక్ష సీమలోకి ప్రవేశించకుండా
లోకం కోసం దిగివచ్చావు
బోధిసత్వుడవు నీవేనా
ప్రపంచాన్ని తల్ల కిందులు చెయ్యగల అష్ట సిద్ధులు
నీకిస్తాన్న గురువుతో, అవి భగవత్ అనుభూతికి
ఆటంకాలని దుమ్ములా తిరస్కరించావు
నేటి దొంగ స్వాములు నీ కాలి గోటికి
సాటి రారు గదా
నీవి యోగి నేత్రాలన్నాడు
దేవేంద్రనాధ్ టాగూర్
నీ పాదాల వద్ద చోటిస్తే
జన్మ ధన్యం
అన్నాడు
సుభాస్ చంద్ర బోస్
రామకృష్ణ వివేకానందులను
చదవకుండా హిందూ మతం
అర్థం కాదన్నాడు
గాంధీ
అమర్నాథ్ గుహలో పరమేశ్వర దర్శనంతోఇచ్చా మరణ వరాన్ని పొందిముప్పై తొమ్మిదవ ఏటశరీరాన్ని తృణ ప్రాయంగా
వదిలి పెట్టావుఏ దివ్య సీమలలో
అగాధ సమాధిలో మునిగి
భగవంతునిలో లీనమై
ఉన్నావో
నీ దేశాన్ని ఒకసారి చూడు
అవినీతితో,అజ్ఞానంతో
అవకాశవాదంతో
రాజులూ అధికారులూ స్వాములూ దొంగలై
ప్రజలు భ్రష్టులై
ఋషి సంతతి నిర్వీర్యమై
పరాయి సంస్కృతీ మత్తులో జోగుతూ
ఉన్న నేటి దురవస్థ
నా దేశం పునర్వైభవాన్ని
పొందుతుంది అన్నావే
ప్రపంచానికే
గురువౌతుంది అన్నావే
చూడు మహాత్మా నేటి దుస్థితి
నువ్వు మమ్మల్ని వదలి నూరు ఏండ్లైనా
కనీసం నిన్ను అర్థం చేసుకోలేక
నిన్ను ఒక సామాన్య
సంఘ సంస్కర్తగా
భావిస్తున్న మూర్ఖ ప్రజల్ని చూడు
నీ కృపా దృష్టిని మాపై
ప్రసరించు
నిన్ను అనుసరించే శక్తిని
మాకివ్వు
ప్రవరలు చదువుకోవటం కాదు
ఋషి రక్తాన్ని నిరూపించగలిగే
బ్రహ్మ తేజస్సును మాకివ్వు
ఇదే నీ పాదాలకు నా ప్రార్థన