Pages - Menu

Pages

4, జనవరి 2009, ఆదివారం

యోగస్య ప్రథమం ద్వారం

ఈరోజుల్లో  యోగాన్ని రోగాలు తగ్గించుకోడానికి వాడుతున్నామేగాని దాని అసలు ప్రయోజనం అదికాదు. ఆత్మానుభూతి కలిగించడమే దాని అసలు ఉద్దేశ్యం. 


ఆసనములు కొంత ప్రాణాయామం కలిపి యోగంగా నేడు చెలామణీ అవుతోంది. కాని యమ నియమాల గురించి ఎవ్వరూ పట్టించుకున్నట్లు కనపడదు.  పతంజలి మహర్షి తన యోగసూత్రాలలో యమనియమాల గురించి మొదటగా చెప్పారు. దాని తరువాత మెట్లైన ప్రత్యాహార ధ్యానాది సాధనాలను తరువాత చెప్పుకొచ్చారు. వీటినే శంకరులు ఒక్క శ్లోకంలో ఇమిడ్చి చెప్పారు.

శంకరులు వివేక చూడామణిలో యోగాన్నిగురించి చెబుతూ

"యోగస్య ప్రథమం ద్వారం వాగ్నిరోధో అపరిగ్రహః
నిరాశాచ నిరీహాచ నిత్యమేకాంత శీలతా
" అన్నారు.

శంకరుల బోధ ప్రకారం, యోగమునందు మొదటి మెట్లు ఏవనగా

1.వాక్కును నిరోధించుట :-- మాట మీద అదుపు, మితంగా మాట్లాడటం
2. అపరిగ్రహము:--ఇతరుల నుంచి ఏదీ తీసుకోకపోవడం
3. నిరాశ:--ఆశలు కోరికలు లేకపోవడం
4.నిరీహ:-- పేరు ప్రతిష్టలు, ధనం  మొదలైనవాటిమీద పాకులాట లేకపోవటం 
5. నిత్యం ఏకాన్తశీలతా:--ఎప్పుడూ ఏకాంతంగా ఉండడం
 
ఇవి యోగానికి పునాదులు అనబడే లక్షణాలు. ఈ పునాదులు లేకుండా ఇతరములైన అభ్యాసాలు ఎన్ని చేసినా అవి నిష్ప్రయోజనములే అవుతాయి.

వీటిని అభ్యాసం చెయ్యకుండా ఉత్త ఆసనాలు మాత్రమె చేస్తే అది యోగం  అనిపించుకోదు. మిగతా వ్యాయామాలలాగే ఇదీ  ఇంకొక వ్యాయామం అవుతుంది. దాని వల్ల ఆరోగ్యం వస్తుంది కాని ఆత్మోన్నతి రాదు. 

ఉన్నతమైన ఉద్దేశ్యం కలిగిన యోగాన్ని ఒక వ్యాయామస్థాయికి దిగజార్చి ఉపయోగించడం ఎంతవరకు సబబో మనమే ఆలోచించుకోవాలి.