యోగాన్ని గురించి భగవద్గీతలో ఎన్నోచోట్ల ఉన్నప్పటికీ ముఖ్యంగా ఈ రెండుశ్లోకాలనే యోగమనే పదానికి నిర్వచనానికి ఉదాహరణగా చూపుతారు. రెండూ రెండవ అధ్యాయంలోనివే.
శ్లోకం ౪౮/యోగస్థ కురు కర్మాణి/సంగం త్యక్త్వా ధనంజయ/సిధ్యస్సిధ్యో సమో భూత్వా/సమత్వం యోగ ఉచ్యతే.
శ్లోకం ౫౦/బుద్ధి యుక్తో జహాతీహ/ఉభే సుకృత దుష్క్రుతౌ/తస్మాద్ యోగయా యుజ్యస్వ/యోగః కర్మసు కౌశలం.
ఈ రెంటిమీద అనేకమంది వ్యాఖ్యానించారు. ఎవరికీ తోచినట్టు వారు చెప్పారు. కొందరు మాత్రమే వారి భావాలను చొప్పించకుండా ఉన్నదున్నట్లు చెప్పారు . మొదటి శ్లోకం లోని చివరి పాదం "సమత్వం యోగ ఉచ్యతే" ప్రకారం సమత్వమే యోగం. ఏమిటీ సమత్వమంటే ?
***ఓ ధనంజయా యోగంలో ఉండి కర్మలు చెయ్యి.
సంగమును వదలి పెట్టు.
పని జరిగినా జరుగకున్నా సమంగా తీసుకో
సమత్వమే యోగం.***
ఇక్కడ అనేక విషయాలు అర్ధం చేసుకోవాలి.
ఒకటి - భగవానుడు చెబుతున్నది కర్మ యోగం గురించి కాని ఇతర యోగాల గురించి కాదు.
రెండు-సంగం లేకుండా కర్మ చేయడమెలా? ఫలితం మీద దృష్టి లేకపోతే కర్మ ఎలా సాగుతుంది? కర్మ చేయక తప్పదు కనుక చేయాలి. కర్మ చేయక ఉండలేము కనుక చేయాలి. ఊరుకున్నా ప్రకృతి మనచేత చేయిస్తుంది కనుక చేయాలి. ఫలితం ఎలాగైనా ఉండొచ్చు. ఎందుకంటే ఫలితాన్ని నిర్ణయించేది మన ప్రయత్నం ఒక్కటేకాదు. అనేక ఇతరశక్తులు, పరిస్తితులు, అదృష్టం మొదలైనవి ఇందులో పాలు పంచుకుంటాయి. కనుక ఫలితం ఎలాగైనా ఉండొచ్చు. ఈ విషయం అర్థమైతే సంగం(కోరిక) అనేది ఉండదు. సంగం లేనప్పుడు మనసు సమస్థితిలో ఉంటుంది. జయాపజయాలకు పొంగటం కుంగటం ఉండదు. ఇది యోగస్థితి.
మూడు- పైన చూపినది సాధకుని స్థితి. సిద్ధత్వం కలిగినప్పుడు ఎల్లప్పుడూ ఆత్మస్థితి చెదరకుండా ఉంటుంది కనుక సహజంగానే ఫలితంపైన దృష్టి ఉండదు. చేసేది తానుకాదు అన్న స్పృహ ఉంటుంది కనుక అది సహజయోగస్థితి. జిల్లెళ్ళమూడి అమ్మ చెప్పినట్లు 'అన్నీ అదే చేయిస్తున్నది అనుకో లేదా అన్నీ నేనే చేస్తున్నాను అనుకో.అపుడు ఏ బాధా ఉండదు'.
కనుక కర్మ ఎలా చెయ్యాలి అన్న విషయం ఈ రెండు శ్లోకాలలో చెప్పబడింది. మనం కర్మజీవులం.కర్మ చెయ్యకుండా ఎవరూ ఉండలేరు. కనుక ఆ కర్మను ఎలా చెయ్యాలి అనే విషయం మనం తెలుసుకోవాలి. కర్మను ఏడుస్తూ చెయ్యవచ్చు. నవ్వుతూ కూడా చెయ్యవచ్చు. ఇంతటి మహత్తు ఉంది గనుకే గీత వేల సంవత్సరాలుగా ప్రపంచానికి దిక్సూచిగా ఉంటున్నది.