నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

27, జనవరి 2009, మంగళవారం

జ్యోతిష్కుని లక్షణాలు

ప్రామాణిక గ్రంథాల నుండి సేకరించిన సమాచారం ప్రకారం జ్యోతిష్కునికి ఉండవలసిన లక్షణాలు ఇవి:

పరాశర మహర్షి ప్రణీత బృహత్ పరాశర హోరాశాస్త్రం ప్రకారం:

1 .వినయము 2 .సత్య సంథత 3 .శ్రద్ధ 4 . పాండిత్యము 5 .గ్రహ నక్షత్ర పరిజ్ఞానము 6 .హోరా శాస్త్ర సంపూర్ణ జ్ఞానము 7 .వేద శాస్త్ర జ్ఞానము 8 .గ్రహ యజన పటుత్వము.

వరాహ మిహిరుని బృహత్ సంహిత ప్రకారం:

1 .శుచిత్వం 2 .పాండిత్యం 3 .నిజాయితీ 4 . ధైర్యం 5 .పరిహార క్రియలలో నిపుణత.

ఏతా వాతా తేలేదేమంటే, త్రిస్కంధములైన సిద్ధాంతము, హోర ,సంహిత అనబడే మూడు భాగములు అతనికి క్షుణ్ణముగా తెలిసి ఉండాలి. పరిహార క్రియల్లో నిపుణత ఉండాలి. వేద శాస్త్ర జ్ఞానము ఉండాలి. శుచి, శీలము, సత్య సంధత, నిజాయితీ కలిగి ఉండాలి. ప్రసన్న వదనము, మధుర వాక్కు, నియమయుతమైన జీవితము ఉండాలి. అటువంటి వాడు చెప్పినదే సత్యమౌతుంది.

ఇకపొతే ఇటువంటి లక్షణాలు ఉన్న జ్యోతిష్కుడు ఎక్కడ దొరుకుతాడు? అంటే దానికి సమాధానం లేదు. అది మన అదృష్టాన్ని బట్టి ఉంటుంది. మంచి వైద్యుడు ఎక్కడ దొరుకుతాడు అంటే ఎం చెబుతాం? ఒక్కో సారి కేర్ హాస్పిటల్లో కూడా కేర్ ఉండక పోవచ్చు. పల్లెటూరి ఆర్ ఎం పీ ఒక్కోసారి మంచి వైద్యం చెయ్యవచ్చు. కనుక నిర్ధారణగా చెప్పలేం.

కాని మనం ఒక్క పరీక్ష పెట్టి చూడవచ్చు. మీరు ఏమీ చెప్ప కుండానే మీ మనసులో గల ప్రశ్నను చెప్పగలిగితే అతనికి జ్యోతిష్య శాస్త్రంలో మంచి నిపుణత ఉన్నట్లు లెక్క. కానీ ఆ తర్వాత మాత్రం వేలూ లక్షలూ హోమాలకు ఇతర వస్తువులకు డిమాండ్ చేస్తే పరీక్ష ఫెయిలు అయినట్టే.

అటువంటి జ్యోతిష్కులకు దూరంగా ఉండటం మంచిది.