నేడు అత్యంత విశిష్ట దినం.
ధర్మోద్ధరణ కోసం భగవంతుడు భూమికి దిగి వచ్చిన రోజు.
ప్రపంచంలో కోట్లాదిమంది జనులు నేడు భగవంతుని అవతారముగా కొలుస్తున్న శ్రీ రామ కృష్ణుని జననం 1836 వ సంవత్సరంలో ఇదే ఫాల్గుణ శుక్ల తృతీయ రోజున జరిగింది.
ఆయన దివ్య జాతకం మరియు జీవితం లో ముఖ్య ఘట్టములు త్వరలో నా శక్తి మేరకు విశ్లేషణ చేస్తాను.
ఆ దివ్య మూర్తి కి ఇదే ప్రణామాంజలి.
వివేకానంద స్వామి విరచిత శ్రీ రామకృష్ణ స్తోత్రం నుండి
శ్లో|| ఓం స్థాపకాయచ ధర్మస్య సర్వ ధర్మ స్వరూపిణే
అవతార వరిష్టాయ రామకృష్ణాయతే నమః||
తా|| క్షీణించిన ధర్మమును ఉద్దరించిన వాడు, సర్వ మత, ధర్మ స్వరూపుడు, భగవత్ అవతారములలో వరిష్టుడు అయిన శ్రీ రామకృష్ణునికి ప్రణామము.
శ్లో|| అద్వయ తత్వ సమాహిత చిత్తం
ప్రోజ్వల భక్తి పటావ్రుత వృత్తం
కర్మ కళేబర మద్భుత చేష్టం
యామి గురుం శరణం భవ వైద్యం ||
తా || ఒక్కటి యగు పర బ్రహ్మ తత్వమునందు లగ్నమగు చిత్తముకలవాడు, ఉజ్జ్వల భక్తి యనుదానిని మనసున ధరించినవాడు (అనగా భక్తి జ్ఞానముల మూర్తీభావము), తనంత తానుఆరోపించుకొన్న దేహముచేత అద్భుత కార్యములు చేసినవాడు, భవము అనెడి లోక వ్యామోహమునకు వైద్యుడుడునుఅయిన గురుదేవుని శరణు కోరెదను.
అభేదానంద స్వామి విరచిత శ్రీ రామ కృష్ణ స్తోత్రం నుండి
శ్లో|| సర్వ ధర్మ స్థాపకత్వం సర్వ ధర్మ స్వరూపకః
ఆచార్యాణాం మహాచార్యో రామకృష్ణాయతే నమః ||
తా || సర్వ ధర్మములను ఉద్దరించినవాడు, సర్వ ధర్మముల స్వరూపమైనవాడు, ఆచార్యులలో మహాచార్యుడు అయిన రామకృష్ణునికి ప్రణామము.
శ్లో || ఓంకార వేద్యా పురుష పురాణో
బుద్దేశ్చ సాక్షీ నిఖిలశ్చ జంతో
యో వేత్తి సర్వం నచ యస్య వేత్తా
పరాత్మ రూపో భువి రామకృష్ణ ||
తా || ఓంకార జపముచేత తెలియబడు వాడు, పురాణ పురుషుడు, సర్వ ప్రాణుల బుద్ధికి లోపల సాక్షిగా ఉన్నవాడు, సర్వం తెలిసినవాడు, ఎవరిచేతా తెలియబడని వాడు, పరమాత్మ రూపుడు అయిన రామకృష్ణునకు ప్రణామము.
శ్లో || వందే జగద్బీజ మాఖండ మేకం
వందే సురై సేవిత పాద పీఠం
వందే భవేశం భవ రోగ వైద్యం
తమేవ వందే భువి రామకృష్ణం ||
తా || జగత్తు మూలమగు అఖండ బీజమునకు, దేవతలచే పూజించబడు పాద పీఠము కలవానికి, లోకేశ్వరునకు, భవరొగమునకు వైద్యుడైన రామకృష్ణునకు ప్రణామం.
శ్లో || తేజో మయం దర్శయసి స్వరూపం
కోశాంతరస్థం పరమార్థ తత్త్వం
సంస్పర్శ మాత్రేణ నృణాం సమాధిం
విహాయ సద్యో భువి రామకృష్ణ ||
తా || పంచ కోశములకు లోపల గల తేజోమయము, స్వస్వరూపము నగు పరమార్థ తత్వమును దర్శించినవాడు, స్పర్శ మాత్రమున మానవునికి సమాధి స్థితిని అనుగ్రహించగల శక్తిమంతుడు అగు రామకృష్ణునికి ప్రణామం.
అనుభవానంద స్వామి విరచిత శ్రీ రామకృష్ణ స్తోత్రం నుండి
శ్లో|| సర్వ సాధన సంయుక్తం సర్వ ధర్మ సమన్వయం
సకలానుభవ సంపన్నం రామకృష్ణం నమామ్యహం ||
తా || సర్వ సాధనలు తెలిసిన వాడు, సర్వ ధర్మములను సమన్వయ పరచిన వాడు, సకల ఆత్మానుభవములచే సంపన్నుడు అగు రామకృష్ణునికి ప్రణామం.
విరజానంద స్వామి విరచిత శ్రీ రామకృష్ణ స్తోత్రం నుండి
శ్లో|| బ్రహ్మ రూప మాది మధ్య శేష సర్వ భాసకం
భావ శక్త హీన రూప నిత్య సత్య మద్వయం
వాన్మనోతి గోచరంచ నేతి నేతి భావితం
తం నమామి దేవ దేవ రామకృష్ణ మీశ్వరం ||
తా || పరబ్రహ్మ రూపుడు, ఆది మధ్య అంతములలో నిండి సర్వత్రా భాసించువాడు, కామ క్రోధాది షడ్వర్గములు లేనివాడు, నిత్యము, సత్యము అగు ఏకాత్మ రూపుడు, వాక్కుకు మనస్సుకు అందని వాడు, ఇది కాదు ఇది కాదు అనెడి జ్ఞాన మార్గ సాధన చేత తెలియబడు వాడు, దేవ దేవుడు, ఈశ్వరుడు అగు రామకృష్ణునికి ప్రణామం.
కేశవ తీర్థ స్వామి విరచిత శ్రీ రామకృష్ణ స్తోత్రం నుండి
శ్లో ||స్వాన్తములో వెలుంగు పరమాత్మ దలంపకా కామ కాంచన
భ్రాంతికి వశ్యమై వెతల పాలై పోయిన మర్త్యకోటి
హృద్వాంతము బాపి కావ వసుధా తలిపై ఉదయించినట్టి శ్రీ
కాంతుని రామకృష్ణ జగద్గురు నెంతు నితాంత మాత్మలో ||
తా || తమలోనే ఉన్న పరమాత్మను దర్శింపలేక కామ కాంచన భ్రాంతికి వశులై బాధల పాలగుచున్న మానవుల హృదయ అంధకారము పోగొట్టుటకు భూమిపైన అవతరించిన విష్ణు అవతారమగు రామకృష్ణ జగద్గురుని ఎల్లప్పుడూ ఆత్మలో ధ్యానించేదను.
ఒట్టూర్ బాల భట్టు విరచిత శ్రీ రామకృష్ణ కర్ణామృతం నుండి
శ్లో|| ఆబద్దాంజలి సంపుటం వినయినం సౌఖ్యాసనే సంస్థితం
మీలత్ స్నిగ్ధ విలోచనం స్మితల సద్వక్త్రం సమాధౌ రతం
సమ్యక్ కుమ్భిత మారుతం స్థిరవపుర్యోగీంద్ర విస్మాపనం
వందే పావన దక్షినేస్వర గతం తేజో జగన్మంగళం.
తా || అంజలి ముద్రతో చక్కని సుఖాసనమున కూర్చొని ఉన్నవాడును, నిమీలిత నేత్రుడు, చిరునవ్వుతో వెలుగు మోముకలవాడు, సమాధి స్థితి యందు ఆనందించు వాడు, వాయువు ను చక్కగా కుంభించిన వాడు, స్థిరమైన దేహముగలవాడు, యోగీంద్రుడు, పావనుడు, దక్షినేశ్వర వాసియు, జగత్తుకు శుభము చేకూర్చువాడు అగు తేజో మూర్తికి ప్రణామం.
శ్లో || నిత్యం నమోస్తు గురవే పరదేవతాయై
విశ్వాత్మనే భగవతే కరుణార్ణవాయ
శ్రీ శారదా ప్రియతమాయ గదాధరాయ
చంద్రాత్మజాయ క్షుదిరామ సుతాయ తుభ్యం
తా || పరదేవతా స్వరూపుడు, గురుదేవుడు, విశ్వాత్మకుడు, భగవంతుడు, కరుణా సముద్రుడు, శ్రీ శారదా ప్రియతముడు, చంద్రమణీ క్షుదిరాముల తనయుడు అగు గదాధరునికి ప్రణామం.
శ్లో || సచ్చిద్ ప్రమోద ఘన సౌహృద మేరుశైల
కారుణ్య దుగ్ధ జలదేఖిల ధర్మమూర్తే
ముక్తి ప్రభాకర సమాధి సుధా మయూఖ
శ్రీ రామకృష్ణ భగవాన్ సతతం నమస్తే ||
తా || సచ్చిదానందము ఘనీభవించిన మేరుపర్వతమువలె, కరుణతో నిండిన పాల సముద్రమువలె, అఖిల ధర్మముల స్వరూపమువలె , ముక్తి సూర్యుని వలె , అమృత సమాధి స్థితుల పుష్ప గుచ్చము వలె ప్రకాశించుచున్న శ్రీ రామకృష్ణునకు ప్రణామం.
శ్లో|| విస్మారకం భవరుజా మఖిలాభిరామం
విస్మాపకం సుమనసాం సుకృతైక దృశ్యం
ఆనంద మత్త మతిముగ్ధ విదగ్ధ నృత్తం
శ్రీ రామకృష్ణ పదాయో రనుసంధదామి ||
తా || నాశములేని ఆత్మ స్వరూపములా! భవ రోగమును పోగొట్ట సమర్థములా ! ఆనందముతో మత్తెక్కి, భక్తిపారవశ్యములో అతి మనోహరముగా నృత్యము చేయుచున్న శ్రీ రామకృష్ణ పాదములను ధ్యానించేదను. ఇది మంచిమనస్సు, మంచి సుకర్మలు కలిగినవారికి మాత్రమే ప్రాప్తించు దృశ్యము.
శ్లో || నిరంజనం నిత్య మనంత రూపం
భక్తానుకంపార్చిత విగ్రహం వై
ఈశావతారం పరమేశ రూపం
శ్రీ రామకృష్ణం శిరసా నమామి ||
తా || మాలిన్యము లేనివాడు, నిత్యుడు, అనంత రూపుడు, భక్తులకు ఆనందమును ప్రసాదించు రూపము గలవాడు, పరమేశ్వరుడు, అవతార మూర్తి యగు శ్రీ రామకృష్ణునికి ప్రణామం.