Pages - Menu

Pages

7, ఫిబ్రవరి 2009, శనివారం

భీష్మ అష్టమి రోజున దేహ త్యాగం


ప్రపంచంలో ముఖ్యమైన సంఘటనలు నిశ్సబ్దంగా జరుగుతాయి. అని ఒక వేదాంతి అన్నాడు. ఫిబ్రవరి 3 వ తేది భీష్మ అష్టమి. ఇదే రోజున పవిత్రాత్ముడు భీష్ముడు నిర్యాణం చెందాడు. మొన్న ఇదే రోజున శారదా మఠం ప్రెసిడెంట్ పరమ పూజ్య శ్రద్దా ప్రాణ మాతాజీ దేహ త్యాగం చేసారు. దేహ త్యాగం నాటికి వీరి వయస్సు 90 సంవత్సరాలు. వీరి పేరు ఆంధ్రాలో శ్రీ రామకృష్ణ భక్తులకు కొంత తెలుసు. కాని అందరికీ తెలియదు. వీరి కేంద్ర కార్యాలయం కలకత్తా లో దక్షినేశ్వరం లో గంగా నది వొడ్డున ఉంది.

పరమ పూజ్య శ్రద్ధా ప్రాణ మాత,15-10-2008 నుంచి మంచంలో అస్వస్తులు గా ఉన్నారు. వీరు 108 రోజులు అస్వస్థతతో బాధపడి 3-2-2009 న సరిగా భీష్మ అష్టమి రోజున ఉత్తరాయణ పుణ్య కాలం లో శరీరాన్ని వదిలారు.

వీరు అంతర్జాతీయ శారదా మఠానికి మూడవ ప్రెసిడెంట్ గా ఉన్నారు. 1948 వరకు వీరు అనీ బిసంట్ కాలేజీ, కలకత్తా లో లెక్చరర్ గా పని చేసారు. 1948 నుంచి 1955 వరకు సిస్టర్ నివేదిత గరల్స్ హైస్కూల్, కలకత్తా లో అసిస్టెంట్ హెడ్ మిస్ట్రెస్ గా పని చేసారు.1955 నుంచి 1968 వరకు అదే చోట హెడ్ మిస్ట్రెస్ గా పని చేసారు. 1953 లో అప్పటి రామకృష్ణ మఠ సర్వ అధ్యక్షులైన పరమ పూజ్య శంకరానంద స్వామి వద్ద బ్రహ్మ చర్య దీక్షను, తిరిగి,1959 లో సన్యాస దీక్షను గ్రహించారు. వీరు దేశంలోనే, శారదా మటం లో మొదటగా సన్యాస దీక్షను పొందిన స్త్రీలలో ఒకరు. వీరు మంత్ర దీక్షను పరమ పూజ్య విరజానంద స్వామి వద్ద గ్రహించారు. విరజానంద స్వామి పేరు నేటి వారికి తెలియదు. ఈయన శ్రీ రామకృష్ణుల ప్రత్యక్ష శిష్యుడైన వివేకానంద కు శిష్యుడు.

వివేకానంద స్వామి, స్త్రీలలో కూడా పూర్వ కాలపు బ్రహ్మ వాదినులైన గార్గి, మైత్రేయి, విస్వవార వంటి మహా యోగినులు ఉద్భవించాలని, వారికి ఒక సంస్థ ఉండాలని కలలు కన్నారు. దీనిని నిజం చేయడానికే శ్రీ శారదా మటం ఆవిర్భవించింది. విద్యా వంతులు, వైరాగ్య సంపన్నులు అయిన స్త్రీలు ఇందులో చేరి సంన్యాసినులై పవిత్ర జీవనాన్ని గడిపి జగద్ గురువు లౌతున్నారు.

అహంకార త్యాగము, మనిషిలో దేవుని చూస్తూ ఆర్తులకు సేవ అన్న రెండు సూత్రాలపైన వివేకానంద స్వామి చేత నిర్మాణం చేయబడిన సంస్థ ఇది. ఆత్మనో మోక్షార్థం, జగత్ హితాయ అనేవే ఆ సూత్రాలు. శ్రీ రామకృష్ణ, శారదా మాత, వివేకానందుల అడుగు జాడల్లో నడిచి, బ్రహ్మచర్య-సన్యాస జీవితాన్ని చివరి వరకూ జీవించి పవిత్ర మూర్తులై భారత జాతికే గాక యావత్ జగత్తుకే సద్గురువులై భాసిల్లిన ఇట్టి తల్లుల జీవితం ధన్యం. వారి స్మరణమే పాప హరణం. మోక్ష దాయకం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నవారి శిష్యులకు నా సంతాపం. ఆ తల్లి శ్రీ రామకృష్ణ శారదా చరణములను చేరినందుకు సంతోషం. అదీ పవిత్ర ఉత్తరాయణ కాలం లో భీష్మ అష్టమి రోజున కావటం ఒక విశేషం. ఆ తల్లి పవిత్ర చరణాలకు భక్తి పూర్వక ప్రణామం.

మరిన్ని వివరాలకు ఈ వెబ్ సైట్ చూడండి: http://www.srisaradamath.org