నాడీ జ్యోతిషం అంటే లోకానికి తెలిసినది చాలా తక్కువ. ఏదో బోర్డు చూచి, లేదా ఎవరో చెబితే విని, నాడీ జ్యోతిష్కుల వద్దకు పోయి, కొంత నచ్చి, కొంత నచ్చక, మోసపోయి, డబ్బు వదుల్చుకుని అంతా మోసం నాడీ జ్యోతిషం లేదు అని ప్రచారం చేసేవారు ఎక్కువ మంది ఉన్నారు.
కాని నాడీ జ్యోతిషం అనేది నూటికి నూరు పాళ్ళు నిజం. అన్ని రంగాలలో ఉన్నట్లే, మోసగాళ్ళు ఈ రంగంలో కూడా ఉండవచ్చు. అంత మాత్రాన శాస్త్రం అసత్యం కాదు. దీని అసలు రహస్యాలు వందల ఏళ్లుగా చీకటిలో ఉండిపోయాయి. ఎందఱో మహానుభావుల కృషి ఫలితంగా దీని స్వరూప స్వభావాలు ఇప్పుడిప్పుడే వెలుగు లోకి వస్తున్నాయి.
బీ వీ రామన్ గారు తన జీవితమంతా నాడీజ్యోతిష రహస్యాలను తెలుసుకోవటానికి కృషి చేసారు. చాలావరకు గ్రహించగలిగారు కూడా. దానిని సమయం వచ్చినపుడు లోకానికి వెల్లడి చేస్తానని వ్రాసారు. కాని ఆ పని చేయకుండా కన్నుమూశారు. బహుశా మార్మిక రహస్యాలు జనసామాన్యానికి తెలియడం ప్రకృతికి ఇష్టం లేదేమో. అందుకని, నేనుకూడా నాకు తెలిసిన అన్ని విషయాలు ఇక్కడ వ్రాయను. స్థూలంగా మరియు సూచనామాత్రంగా చెప్పదలచుకున్నాను.గౌ|| సంతానంగారు, V.A.K. Ayyarగారు నాడీ గ్రంథాలపై పరిశోధన చేసారు. శ్రీనివాసాచారి గారు, R.G.Rao గారు వీటి లోతుపాతులు తెలిసిన పండితులు. పరిశోధన చేసిన ప్రముఖులు, అప్రముఖులు ఇతరులు చాలామంది ఉన్నారు. పాతతరపు తెలుగు హీరోయిన్ భానుమతి కూడా నాడీ గ్రందాలపైన పరిశోధన చేసిందన్న సంగతి చాలామందికి తెలియదు.
నాడీ గ్రంథాలు రెండు రకాలు. ఒకటి :-- మంత్ర నాడి. రెండు :-- తంత్ర నాడి.
మంత్ర నాడీ గ్రంధాలు:
నాడీ గ్రంథాలలో సంస్కృతగ్రంథాలు ఒక కోవకు చెందినవి. వీటిని భ్రుగుసంహితలు అంటారు. తమిళ భాషలో ఉన్నటువంటి గ్రంథాలు ఇంకొక కోవకు చెందినవి. అర్థముకాని ప్రాకృతభాషలో ఉన్న గ్రంథాలు మరికొన్ని ఉంటాయి. ఇది తమిళ, మళయాళ, తెలుగులిపుల కలగలుపుగా, శాసనాల మీద కనిపించే ప్రాచీనలిపికి దగ్గరగా ఉంటుంది.బహుశా ఇది అంతరించిపోయిన గుణాడ్యుని పైశాచికభాష కావచ్చు.
మంత్రగ్రంథాలలో తమిళ, పైశాచిక (?) గ్రంథాలు హెచ్చు. వీటిలో తిరిగి రెండు రకాలున్నాయి. మొదటిరకంలోని తాళపత్రగ్రంథాలలో అర్థంకాని భాష ఉంటుంది. ఇది ప్రాచీనతమిళం (సెందమిళం) అని కొందరు చెబుతారు. మామూలు తమిళం వచ్చినవారు కూడా దీనిని చదువలేరు.అర్ధం చేసుకోలేరు. రెండవరకానికి చెందినవే అసలు మంత్రనాడీగ్రంథాలు. వీటిలో తాళపత్రాలు ఖాళీగా ఉంటాయి. కాని చదివేటప్పుడు విచిత్రభాషలో అక్షరాలు కనిపించి మాయమవుతాయి. దీనికి మంత్రసిద్ధి ఉంటుంది.
బీవీ రామన్ గారు 1938 లో శ్రీనివాసాచారి అనే నాడీజ్యోతిష్కుని కలిసారు. ఆయన వద్ద బుధనాడి అనే గ్రంథం ఉన్నది. ఈయన జీవితం అంతా విషాదంతో నిండి ఉంది. మూడుసార్లు పెళ్లి చేసుకున్నాడు. కానీ మొదటి ఇద్దరు భార్యలు విషాద పరిస్థితులలో చనిపోయారు. శ్రీనివాసాచారి గారి అభిప్రాయం ప్రకారం నాడిగ్రంథం ఇంటిలో ఉండరాదు. ఒకవేళ ఉంటే, ఆ కుటుంబం మీద శాపం ఉంటుంది. చాలా నాడీగ్రంథాలు క్షుద్ర మంత్రములపైన ఆధారపడి ఉంటాయి. ఆయా క్షుద్రదేవతలను ప్రతిరోజూ తృప్తిపరచాలి. తేడా వస్తే ఫలితములు దారుణంగా ఉంటాయి. వాటిని తృప్తిపరిచే విధానాలు వేర్వేరుగా ఉంటాయి.
చిక్క మగులూర్ లో నారాయణశాస్త్రిగారనే జ్యోతిష్కుడు ఉండేవాడు. ఆయన శనిభగవానుని అధిష్టానదేవత అయినట్టి కాలభైరవుని మంత్రసాధన చేసాడు. ఆ సిద్ధివల్ల ఉత్త రాశిచక్రం చూచి ( అంశ చక్రముల పని లేకుండానే) ఒక ఏడాది వరకు ఫలితములు అచ్చుగుద్దినట్లు చెప్పడం సాధ్యపడుతుంది. సాధన చివరదశకు వచ్చింది. సాధన మధ్యలో ఆయన ఒక చెరువులో నిలబడి మంత్రజపం చేస్తుండగా, ఒక అందమైన యువతి బిందె తీసుకుని చెరువులో నీళ్ళకోసం వచ్చింది. ఆమెను చూచి ఈయన మనస్సు చలించింది. మంత్రజపంలో అంతరాయం కలిగింది. దాని దారుణ ఫలితంగా, ఆయనకు పక్షవాతం వచ్చి వెంటనే నోరు, చెయ్యి, కాలు పడిపోయాయి. నియమనిష్టలలో విఘాతం కలిగితే ఫలితాలు అంత దారుణంగా ఉంటాయి.
శశికాంతజైన్ గారు వారి పుత్రులు ఆశ్చర్యకరమైన జ్యోతిష్కులు. ఎదుటి మనిషి ఏమి అడుగ బోతున్నాడో గ్రహించి ముందుగానే వారి మనసులో ప్రశ్నను , దానికి జవాబును చెప్పగలరు. ఈరకంగా ఒకసారి కాదు, కొన్నివందల సార్లు వీరు పరీక్షలకు నిలబడి విజయం సాధించి చూపారు. వీరికి కర్ణపిశాచిని మంత్రసిద్ది ఉందని జనం అనుకునేవారు.
ఈ జ్యోతిష్కులలో కొందరికి పంచాంగుళీ మంత్రసిద్ధి ఉంటుంది. పంచాంగుళీమాత హస్తసాముద్రిక విధానానికి అధిదేవత. ఈ దేవతాకటాక్షం వల్ల ఫలితములు ఎక్కువ కష్టపడకుండా తేలికగా చెప్పవచ్చు. ఈమె అంత ప్రమాదకారి కాదు. కొంచం సాత్వికదేవత. అసలు వీరందరూ దేవతలు కారు. దేవతలకంటే కొంచం స్థాయి తక్కువవారు. Demi Gods and Goddesses అని చెప్పవచ్చు. కాని మానవాతీతశక్తులు ప్రసాదించగలిగిన వారు. వీరిలో ఎక్కువ మంది భయంకరమైన ఆకారం కలిగి ఉంటారు. భయాన్ని జయించిన సాధకుడు మాత్రమె వీరి దర్శనాన్ని తట్టుకోగలుగుతాడు. లేకపోతే వీరి దర్శనం వల్ల మతిభ్రమణం వంటి చేదు పరిణామాలు కలుగుతాయి.
మంత్రనాడి తెలిసిన వారికి సాంప్రదాయజ్యోతిష్యం కూడా కొంత తెలిసి ఉంటుంది. కొందరికి అసలు తెలియదు. రెండవరకానికి చెందిన వారు పైశాచిక భాష చదవటం నేర్చుకొని ఉంటారు. తాళపత్రంలో ఉన్న భాషను, లేక అప్పటికప్పుడు కనిపించి మాయం అయ్యే మాటలను చదివి చెప్పగలరు. అంతవరకే వారి ప్రజ్ఞాపాటవాలు పని చేస్తాయి. దానిని మించి వారికి జ్యోతిష్యజ్ఞానం ఉండదు.
తమిళనాడీ జ్యోతిష్కులలో చాలామంది క్షుద్రమంత్రములు తెలిసినవారు ఉంటారు. వారు కొన్నిరోజులు బాగా ధనం సంపాదిస్తారు. కాని చివరకు, వీరి జీవితములు విషాదంగా ముగుస్తాయి. దిక్కులేని మరణం వీరిని వరిస్తుంది. దానికి కారణం పేరాశ. ఆశతో ఉన్నవీ లేనివీ చెప్పి పృచ్చకుల వద్ద ధనం గుంజుతారు. తెలిసీ తెలియని రెమెడీస్ చెప్పి
పృచ్చకుని కర్మలో వీరూ భాగం మూటగట్టుకుంటారు.కనుక లోకులకర్మ వీరి నెత్తిన పడుతుంది. అందుకే మంత్రనాడీ గ్రంథముల జోలికి పోవడం శ్రేయస్కరం కాదు. వాటిని ఇంటిలో ఉంచుకొనుట దోషప్రదం. ఏ రకంగా చూచినా ఈ విధానం మంచిది కాదు. ఒకవేళ ఈ విధానాన్ని అనుసరించాలంటే ఆ వ్యక్తీ సంసారజీవితానికి దూరంగా ఉంటూ, అనేక నియమనిష్టలు పాటిస్తూ ఒక బికారిలా బతకాలి. అప్పుడే లోకుల కర్మ అతనికి సోకకుండా ఉంటుంది. అలా కాకపోతే అతని జీవితంలో భయంకరమైన ఎదురుదెబ్బలు తగలటం ఖాయం. నాలుగుడబ్బుల కోసం అహంకారులైన లోకుల కర్మను తలకెత్తుకోవడం కంటే తెలివితక్కువతనం ఇంకోటి ఉండదు.
ఈ విషయాలు ఇంతకంటే లోతుగా వ్రాయడం అనుమతి లేదు గనుక వ్రాయడం లేదు. వచ్చే వ్యాసంలో తంత్ర నాడి గ్రంథాల గురించి చూద్దాము.
ఈ విషయాలు ఇంతకంటే లోతుగా వ్రాయడం అనుమతి లేదు గనుక వ్రాయడం లేదు. వచ్చే వ్యాసంలో తంత్ర నాడి గ్రంథాల గురించి చూద్దాము.