Pages - Menu

Pages

9, మార్చి 2009, సోమవారం

జెన్ కథలు- దేవుడున్నాడా?

ఒకనాడు ఉదయం, ఒక వ్యక్తి బుద్ధుని దర్శించాడు

దేవుడున్నాడా? అని సూటిగా ప్రశ్నించాడు.
"లేడు" బుద్ధుడు జవాబు చెప్పాడు.
వ్యక్తి అసంతృప్తితో వెళ్ళిపోయాడు.

అదేరోజు మధ్యాహ్నం, ఇంకొక వ్యక్తి బుద్ధుని దర్శించాడు.
దేవుడున్నాడా? అని సూటిగా ప్రశ్నించాడు.
"ఉన్నాడు" బుద్ధుడు జవాబు చెప్పాడు.
ఆ వ్యక్తి కూడా అసంతృప్తితో వెళ్ళిపోయాడు.

సాయంత్రం, మరొక వ్యక్తి బుద్ధుని దర్శించాడు.

ఇతడు ఏమీ అడుగలేదు. బుద్ధుడు కూడా ఏమీ మాట్లాడలేదు.
ఇద్దరూ మౌనంగా కూర్చున్నారు.కొంతసేపటి తరువాత,వ్యక్తి లేచి ఆనందంతో బుద్ధుని పాదములు తాకి మౌనంగా నిష్క్రమించాడు.

దేవుడున్నాడా? ఇది చిరకాలం నుంచి కొందరు మనుషులను వేధిస్తున్న ప్రశ్న.ఉన్నాడని నమ్మేవాడు ఆస్తికుడు. లేడని వాదించేవాడు నాస్తికుడు. ఎవరికీ వారే మా వాదన సరైనది అని చెబుతారు.ఎవరి కారణాలు, తర్కాలు, వాదనలు వారికుంటాయి.చివరికి ఇది నమ్మకానికి సంబంధించిన విషయము కనుక ఎవరి ఇష్టం వారిది అని తేలుస్తారు.


సత్యమేమిటంటే, వీరిద్దరూ కూడా పొరపాటు పడుతున్నారు. ఆస్తికుడు చెప్పేదీ నిజం కాదు. నాస్తికుడు చెప్పేదీ నిజం కాదు. ఎందువల్ల?

ఎందుకంటే, వీరు ప్రాధమికంగా నమ్మకం అనే నేల పైన నుంచుని మాట్లాడుతున్న వారు. ఆస్తికుడు తన తల్లిదండ్రులో, గురువులో, స్నేహితులో, లేక ఇతరులో చెప్పిన మాటలు విని దేవుడున్నాడు అని నమ్ముతున్నాడు. అంతే కాని నిజముగా దేవుడున్నాడా? ఉంటే అతనిని/ఆమెను తెలుసుకోవడం ఎలా? అనే అన్వేషణ చెయ్యడు. తన స్వానుభవము తో సత్యమును తెలుసుకుందామని అనుకోడు.

తన మతాచారములను గుడ్డిగా పాటిస్తూ, తానూ సరియైన మార్గములో ఉన్నానని భ్రమిస్తుంటాడు.ఏ మతమైనా ఇంతే. జీవితాంతం ఇదే గుడ్డి నమ్మకంలో బ్రతుకుతూ జీవితం చివరికి కూడా సత్యాన్ని తెలుసుకోలేడు. అతనికి చివరికి గుడ్డి నమ్మకమే మిగులుతుంది. సత్య సాక్షాత్కారం కలుగదు.

ఇక నాస్తికుని వంతు. ఇతడు కూడా ఆస్తికుని వంటి వాడే. నిజానికి వీరిద్దరికీ పెద్ద తేడా లేదు. ఎందుకంటే ఇద్దరికీ నమ్మకమే ఆధారం. నాస్తికుడు కూడా గుడ్డిగా దేవుడు లేదు అని వాదిస్తాడే గాని, పరిశీలించి పరీక్షించి, దారిలో నడచి, తనంత తాను తెలుసుకుందామని అనుకోడు. ప్రయత్నం చెయ్యడు. జీవితం చివరి వరకూ ఇదే గుడ్డి నమ్మకంలో బ్రతికి కన్ను మూస్తాడు. ఇరువురూ తమ తమ వాదనలతో అనుచరులను కూడగడతారు. ఎందుకంటే, వారి మీద వారికే నమ్మకం లేదు. కనుక గుంపులో ఉంటే కలిగే భద్రతా భావన కోసం సంఘాలు తయారు చేసుకుంటారు.

మనకు కనిపించే నాస్తిక,ఆస్తికసంఘాలూ,సేవాసమితులూ అన్నీ ఇటువంటివే.వీరెవరికీ సత్యజ్ఞానం లేదు,ఉండదు,కలుగబోదు కూడా.కారణం సుస్పష్టం.వీరు నమ్మకాలతో తృప్తి పడినవారు.ప్రయత్నించి సత్యమును తెలుసుకుందామని వీరిలో ఒక్కరికీ తోచదు.ఇంకొందరు ఇటునించి అటూ, అటునుంచి ఇటూ మారుతుంటారు.తరచి చూస్తె ఆ మారటానికి గట్టి కారణాలు కనిపించవు.బాబాలను నమ్మే సైంటిస్టులూ, నాస్తికవాదులైన డాక్టర్లూ ప్రొఫెసర్లూ అందరూ ఇటువంటి అజ్ఞానులే. వీరు వారి వారి లౌకిక విద్యలలో ప్రవీణులు కావచ్చు. కాని ఆంతరిక సత్య జ్ఞానం వీరికి ఉండదు.


నిజమైన జ్ఞాని నమ్మకమును ప్రోత్సహించడు. ప్రయత్నించి సత్యమును తెలుసుకో అంటాడు. ఈ ప్రపంచములో ఇంతవరకు బుద్ధుని వంటి జ్ఞాని జన్మించలేదనే చెప్పవచ్చు. పై కథలో బుద్ధుని వద్దకు ముగ్గురు వ్యక్తులు వరుసగా వచ్చి ఒకే ప్రశ్న వేసారు. కాని వారికి మూడు భిన్నమైన జవాబులు వచ్చాయి. కారణం? జ్ఞాని పై పై మాటలను చూడడు. మనిషి అంతరంగాన్ని చూస్తాడు. మనిషి లోపలి జిజ్ఞాసకు అతడు స్పందిస్తాడు. పై మెరుగులు,వేషాలు అతన్ని తాకలేవు. స్పందింప చేయలేవు.

బుద్ధుని వద్దకు వచ్చిన మొదటి వ్యక్తి ఒక ఆస్తికుడు. దేవుడు ఉన్నాడు అన్న గుడ్డి నమ్మకంతో వచ్చిన వాడు. కాని అతని నమ్మకం స్వానుభవం మీద ఆధార పడినట్టిది కాదు గనుక అతనికి బుద్ధుని ప్రమాణ పత్రం అవసరమైంది. బుద్దుడు తనను మెచ్చుకుని, ప్రోత్సహిస్తాడని ఆశతో వచ్చాడు. బుద్ధునికి అతని అంతరంగం స్పష్టంగా అర్థమైంది. బుద్దునికి అతని గుడ్డి నమ్మకాన్ని ప్రోత్సహించవలసిన అవసరం లేదు. నేటి కుహనా గురువుల వలె బుద్ధుడు తన శిష్యులనుంచి మెప్పులను ఆశించలేదు. సద్గురువు యొక్క మొదటి బాధ్యత శిష్యుని మనసును ధ్వంసం చేయటం మరియు అతని గుడ్డి నమ్మకాలనుంచి అతన్ని విముక్తున్ని చేయటం. కావున బుద్ధుడు ఇతనికి దేవుడు లేడు అని జవాబు చెప్పాడు.

ఇది ఆ వ్యక్తిలో ఆలోచనలనూ రేకెత్తించి అతన్ని కార్యోన్ముఖున్ని చేయాలి. అన్వేషణకు పురికోల్పాలి. తద్వారా స్వానుభవం అతనికి కలగాలి. ఆ స్వానుభవమే అతని ప్రశ్నకు సరియగు జవాబును ఇస్తుంది.

ప్రశ్నించిన రెండవ వ్యక్తి కూడా ఇటువంటి వాడే. కాకపొతే ఇతడు నాస్తికుడు. ఇతడు కూడా బుద్ధుని నుంచి తనకు నచ్చిన జవాబును, అనగా దేవుడు లేడు అనే జవాబును ఆశించాడు. ఇతడు కూడా అన్వేషి కాడు. గుడ్డి నమ్మకంతో వచ్చినవాడు. కనుక బుద్దుడు ఇతనిని ఆచరణా మార్గంలో పెట్టటానికి దేవుడు ఉన్నాడు అని జవాబు చెప్పాడు.

ఇక సాయంత్రం వచ్చిన మూడవ వ్యక్తి, నిజమైన అన్వేషి. ఇతనికి ముందస్తు అభిప్రాయాలు, నమ్మకాలు లేవు. కాని అన్వేషణ ఉంది. ఆంతరిక జీవితంలో నిజముగా కావలసింది ఇదే. సత్యం కొరకు ఇతడు అన్వేషిస్తున్నాడు. అది మాటలతో దొరికేది కాదన్న జ్ఞానం ఇతనికి ఉంది. కనుక మౌన ధ్యానంలో తన అన్వేషణ బుద్ధుని సమక్షంలో కొనసాగించాడు.

మహనీయుల సన్నిధి అయస్కాంత తరంగాలను కలిగి ఉంటుంది. స్పందించ గలిగితే ఇవి అనుభూతిలో తెలుస్తవి. వారి సమక్షానికి దైవానుభూతిని సూటిగా ఇవ్వగలిగే శక్తి ఉంటుంది. దానిని స్వీకరించటానికి అన్ని అభిప్రాయాలూ ఖాళీ అయిన మనసు కావాలి.అట్టి మనస్సుతో ఇతడు వచ్చాడు.మౌన ధ్యానములో తన అన్వేషణ గమ్యాన్ని చేరాడు.ఆంతరిక అనుభవం ద్వారా దేవుడు ఉన్నాడో లేదో తెలిసింది.కృతజ్ఞతతో బుద్ధుని పాదములు తాకి, ఆనందంతో నిష్క్రమించాడు.

దేవుడు ఉన్నాడో లేడో ఎవరికి వారు స్వానుభవంతో తెలుసుకోవాలి.ఎవరో చెప్పిన మాటలపైన ఏర్పరచుకున్న నమ్మకాలతో ఈ ప్రశ్నకు జవాబు ఏ నాటికీ దొరకదు.ఇది సృష్టి నియమం.

(రజనీష్ కు ప్రణామాలతో)