Pages - Menu

Pages

11, మార్చి 2009, బుధవారం

శ్రీ చైతన్య మహాప్రభుని దివ్య జీవితం

27-2-1486 న నేటి బెంగాల్ లోని నవద్వీపం లో ఒక మహాపురుషుని అవతరణజరిగింది. కోట్లాది భక్తులు ఈయనను భగవంతుని అవతారంగా తలుస్తున్నారు. లోకానికి మథుర ప్రేమభక్తిని తన జీవితంలో ఆచరించి చూపిన ఆ మహనీయుడు శ్రీచైతన్య మహాప్రభు.వీరి తలిదండ్రులు శ్రీ జగన్నాథ మిశ్రా, శ్రీమతి శచీదేవి. సత్యధర్మ పరాయణులైన బ్రాహ్మణ దంపతులు.


వీరి జనన సమయంలో చంద్ర గ్రహణం జరుగుతున్నది. శ్రీమతి శచీదేవి తండ్రిగారు మంచి జ్యోతిష్కులు కావటంతో, వారు ముందుగానే తనకుమార్తె లక్షణములనుచూచి ఎవరో ఒక మహాపురుషుడు ఆమె గర్భములో ఉన్నాడని ఊహించినాడు. ఆసమయంలో తల్లి గారికి, తండ్రి గారికి అనేక దివ్యానుభూతులు కలిగాయి.


13 నెలల గర్భ వాసం తరువాత ఫాల్గుణ పౌర్ణమి నాడు గౌరాంగ చంద్రుని జననంజరిగింది. తెల్లగా పౌర్ణమి చంద్రు ని వంటి స్వచ్చమైన కాంతితో ఉన్న బాలునికిగౌరాంగుడని నామకరణం చేసినారు. ఈయనను నిమాయి అనే ముద్దు పేరుతొకూడా పిలుస్తారు. (నిమ్మ చెట్టు కింద జన్మించిన కారణం చేత కావచ్చు)


ఈయన జీవితం శ్రీ కృష్ణ దాస కవిరాజ్ రచించిన " చైతన్య చరితామృతం" మరియుశ్రీ బృందావన్ దాస్ ఠాకూర్ రచించిన " చైతన్య భాగవతం" మరియు లోచన్ దాసఠాకూర్ విరచిత "చైతన్య మంగళం" అనే బెంగాలీ గ్రంథాలలో చూడవచ్చు. ఇవి అనేకభాషలలోకి అనువాదములైనవి. ఇంగ్లీషులో కూడా దొరుకుతున్నవి.

అందరు మహాపురుషుల జీవితముల వలె ఈయన జీవితాన్ని కూడా కొన్ని పుటలలో చెప్పటం కష్టం. ఈయనను రాధాదేవి యొక్క ప్రేమ భావములో మునిగి ఉన్న కృష్ణుని అవతారం గా భక్తులు భావిస్తారు. ప్రేమమయి రాధ మరియు జగన్మోహనుడైన కృష్ణుల సమ్మిలిత స్వరూపముగా ఈయనను భావిస్తారు.

యువకునిగా ఈయన సంస్కృత మరియు వ్యాకరణ తర్క శాస్త్ర అధ్యయనంలో మహా పండితుడు. ఆ రోజులలోనవద్వీపం అంటే పాండిత్యానికి పట్టుకొమ్మ. అచ్చటి పండితులలో మేటి గా ఈయన పేరు పొందాడు. తన తండ్రిగారి పిండప్రదానానికి గయా యాత్ర సమయంలో తన గురువైన ఈశ్వర పురి వద్ద గోపాల కృష్ణ మంత్రాన్ని ఉపదేశం పొందాడు. నడియాకు తిరిగి వచ్చిన ఆయనలో ఆశ్చర్య కరమైన మార్పును ప్రజలు చూచారు. పాండిత్యమును నిస్సారమైన చెత్తగాతలచి, భక్తీ పారవశ్య స్థితులలో మునిగి ఉండేవాడు.

తరువాత సంసారమును త్యజించి శ్రీ కృష్ణ చైతన్య అనే సన్యాస నామమును
స్వీకరించాడు.వీరి సంన్యాసగురువు శ్రీకేశవభారతి.దశనామీ సంప్రదాయములో వీరు భారతీశాఖకు చెందినవారు.మధ్వ సాంప్రదాయములో మంత్రదీక్ష స్వీకరించి శంకర సాంప్రదాయములో సంన్యాసము తీసుకున్నాడు. తన జీవితములోని చివరి 24 సంవత్సరములు పూరి మహాక్షేత్రములో నివసించారు.హరేరామ హరేకృష్ణ మహామంత్రమును గొంతెత్తి బిగ్గరగా పాడుతూ ఆనందనృత్యము చేసే మథురభక్తీ మార్గమును వీరు బోధించారు.

వీరిలో మూడు రకములైన దివ్య అభివ్యక్తి కలదని అంటారు.

1. కృష్ణుని ప్రేమమయ భక్తుని గా ఒక స్థితి.
2. కృష్ణ భక్తీ ని బోధించు జగద్గురువు గా రెండవ స్థితి.
3. రాధా కృష్ణులు కలసి ఒకే ప్రేమ స్వరూపముగా నిలచిన స్వరూప స్థితి.

కృష్ణుడు తానే అను తన నిజస్వరూపమును అద్వైతగోస్వామి, నిత్యానందగోస్వామి అను తన శిష్యులకు దర్శనం ఇచ్చినట్లు ఈయన జీవిత కథలలో ఉన్నది.వీరి సిద్ధాంతమును అచింత్య భేదాభేదము అంటారు. అనగా జీవులు కృష్ణునితో ఏకముగా ఉండికూడా తిరిగి భిన్నులుగా ఉంటారు. ఈ స్థితి చింతనకు అనగా మనస్సుకు అందునది కాదు.

భక్తీ పరిపక్వత చెందినపుడు భావముగా మారుతుంది.భావము పరిపక్వతచెందినపుడు మహాభావముగా మారుతుంది.మహాభావము పరిపక్వత చెందినపుడు ప్రేమగా మారుతుంది.సామాన్యజీవులు భావము వరకు అందుకొనగలరు.అత్యంత శుద్ధ పరిపక్వమనస్సు కల కొందరు జీవులు మాత్రమె మహాభావము అందుకోగలరు.వీరిని ఈశ్వరకోటి అంటారు.వీరు అవతారపురుషుని పరివారంలో ఉంటారు.

ప్రేమ అనే పదాన్ని లోకులు చాలా తేలికభావంతో వాడుతూ ఉంటారు.నిజమైన 'ప్రేమ' అన్నదానిని అనుభవించిన వ్యక్తులు మానవచరిత్రలో ఇప్పటివరకూ ఇద్దరో ముగ్గురో మాత్రమే ఉన్నారు.అది మానవమనస్సుకు అందని అత్యంత ఉన్నతమైన భూమిక.


ప్రేమ అనే స్థితి ఇప్పటివరకు శ్రీమతి రాధాదేవికి, చైతన్య మహాప్రభువుకు,శ్రీరామకృష్ణునకు మాత్రమె అందిన పరమోత్కృష్ట దివ్యస్థితి.ఈ స్థితిని సామాన్య జీవులు ఏనాటికీ అందుకోనలేరు.ఇది దివ్య చైతన్యముతో నిండిన పరమోత్కృష్ట ప్రేమమయ లోకం.మానవఊహకు అందని అత్యంత పవిత్ర ప్రేమమయ దివ్యభూమి.

శ్రీరామకృష్ణులు ఇలా అంటారు.

భక్తి -భావము-మహాభావము-ప్రేమ

ప్రపంచంలో మనుష్యులు అందరూ భక్తిని అందుకోవడంలోనే పల్టీలు కొడుతూ ఉంటారు.పరిపూర్ణభక్తిని అతి కొద్దిమంది మాత్రమె అందుకోగలరు.భక్తి పరిపక్వం అయితే భావం అవుతుంది.

భావమును అందుకొనిన సాధకుడు సవికల్పసమాధిని పొందుతాడు. ఆనందములో మునిగి ఉంటాడు.ఈస్థితిలో శరీరం రోమాంచమౌతుంది. ఆనందబాష్పములు ధారలుగా కారుతాయి. శరీరములో గగుర్పాటు కలుగుతుంది.కుండలినీప్రకోపం తనంతట తాను కలుగుతుంది.అలౌకిక దర్శనాలు కలుగుతవి.దివ్యనాదములు వినబడుతవి. దివ్యసుగంధములు అనుభూతిలోకి వస్తవి.ఇష్టదేవతా దర్శనం కలుగుతుంది. చాలామంది సాధకులు ఇంతవరకు చేరేసరికి వారి జీవితం పరిసమాప్తి అవుతుంది. ఇంతవరకు రాగలిగితే అది ధన్యమైన జీవితం క్రింద లెక్కకు వస్తుంది.

దీనిని మించిన అలౌకిక స్థితి మహాభావము. దీనిని సాధారణ జీవులు అందుకోలేరు.ఈశ్వరకోటికి చెందిన వారే దీనిని భరించగలరు.మహాభావమును అందుకొన్న సాధకుని శరీరము ఆ అమిత ఆనందమును తట్టుకోలేదు.21 రోజుల నిరంతర సమాధిస్థితి తరువాత పండుటాకువలె శరీరము రాలిపోతుంది అని శ్రీ రామకృష్ణులంటారు.

దీనిని మించిన స్థితి ప్రేమ.ఇది ఊహాతీతమైన దివ్య స్థితి. చైతన్య మహాప్రభు కృష్ణుని అవతారము కనుక ప్రేమోన్మత్తస్థితిని అందుకోనగలిగాడు.

ఈయన రచించిన శిక్షాష్టకము ప్రసిద్ధమైనది. "నామ్నామకారి బహుధా తవ సర్వశక్తి స్తత్రార్పితా" అంటూ భగవన్నామము సర్వ శక్తివంతమని బోధించాడు. ప్రేమభావముతో నామసంకీర్తన సర్వశ్రేష్టసాధనగా ఉపదేశించాడు.

మహనీయులైన ఆరుగురు గోస్వాములు ఈయన శిష్యులు. పవిత్ర జీవనం, ప్రేమమయ సంకీర్తనం,భక్తితో నామజపం అనే సూత్రములపైన ఏర్పడిన బెంగాల్ వైష్ణవ సాంప్రదాయమునకు ఈయన ఆద్యుడు. దీనినే గౌడీయశాఖ అంటారు. నవీన కాలములో ఇదే సాంప్రదాయమునకు చెందిన శ్రీల భక్తీ వేదాంత ప్రభుపాదగోస్వామి హరేరామ హరేకృష్ణ సంఘాన్ని అన్ని దేశాలలో వ్యాపింప చేసాడు.

ఈయన శరీరమును వదలిన తీరు పైన అనేక అనుమానములున్నవి. ప్రేమ భక్తిలో ఒళ్ళుతెలియక పూరీలో సము ద్రములో మునిగి శరీర త్యాగము చేసినాడని ఒక గాధ. పూరీజగన్నాధుని విగ్రహములో ఐక్యమైనాడని ఒక గాధ. పూరి జగన్నాధ ఆలయపూజారులు ఈయనను చంపి పూరీ ఆలయములోనే పూడ్చి పెట్టారని ఒక నమ్మకంఉన్నాయి. వీరి జీవితంపైన మూడేండ్ల క్రితం జ్యోతిష శాస్త్ర రీత్యా నేను వ్రాసిన రీసెర్చి వ్యాసం, వీలయితే త్వరలో ప్రచురిస్తాను. ఈయన దక్షిణ దేశ యాత్ర చేసినపుడు మంగళగిరి కొండనెక్కి నరసింహస్వామిని అర్చించాడు. కొండనెక్కె దారిలో ఈయన పాదముద్రలను చూడవచ్చు. ఇక్కడ ISKCON వారు ఒక చిన్న ఆలయం కట్టారు.

ఏది ఏమైనప్పటికీ, ప్రేమమయ దివ్యొన్మాద పవిత్ర జీవితము గడపి భూమిని పవిత్రంచేసిన ఇట్టి అవతార మూర్తుల స్మరణే పాప నాశనం. వారి దివ్యచైతన్యముతో అనుసంధానం కావటానికి ప్రయత్నం చేద్దామా?