Pages - Menu

Pages

22, మార్చి 2009, ఆదివారం

నాడీ జ్యోతిషం-జనన కాల సంస్కరణ

జాతకమైనా ముందు జన్మ కాలాన్ని సంస్కరించాలి. తరువాతే ఫలిత విశ్లేషణకు పూనుకోవాలి. కొంత గడచిన జీవితమైతే పని సులభం అవుతుంది. ఎందుకంటే గడచిన సంఘటనలతో పోల్చి జనన కాలమును సరి చేయ వచ్చు.

అసలు జన్మ సమయం తెలియని వారికి నష్ట జాతక విధానములో గుణించి జనన సమయమును రాబట్టవచ్చు. ఇది ప్రశ్న విధానానికి దగ్గరగా ఉన్న పధ్ధతి. ఒక అరగంట లేదా గంట తేడాతో సమయం తెలిసిన వారికి ఇతర పద్ధతుల ద్వారా సంస్కరణ చెయ్యాలి.

జనన కాల సంస్కరణలో చాలా పద్ధతులున్నాయి. వాటిలో ముఖ్యముగా మూడు పద్ధతులు చాలావరకు సరియైన ఫలితాలు ఇస్తాయి.

1.
పంచ తత్వ సిద్ధాంతము.
2.
వర్గ చతుష్టయ విధానము. (దీనిలో కుంద విధానము అంతర్గతం గా ఉంటుంది)
3.
గుళిక పధ్ధతి.

నాడీ జ్యోతిషానికి సంబంధించి నంత వరకు, నాడీ అంశ కావాలి. కనుక నాడీ విదానములోనే సంస్కరణ కూడా జరగాలి. పంచ తత్వ సిద్దాన్తముతో విధానం ముడిపడి ఉంటుంది.

ప్రపంచమంతా పంచ భూతములతో నిండి ఉంది. పృధ్వి( భూమి), ఆపస్సు(జలము), తేజము(అగ్ని), వాయువు(గాలి), ఆకాశము అనబడే అయిదు తత్వములు ప్రపంచానికి పునాదులు. సమస్త జీవ రాసిని ఇవే నియంత్రిస్తూ ఉన్నాయి. మన పూర్వులైన మహర్షులు, ముఖ్యముగా సిద్ధులు, దీనిని ఒక శాస్త్రముగా మలచి ఉన్నారు. దీనిని స్వర శాస్త్రం అంటారు.

ఏడు గ్రహములు, పంచ భూతముల నియంత్రణలో ఉన్నాయి. రాహు కేతువులు చాయా గ్రహములు గనుక వాటికి స్వయం ప్రతిపత్తి లేదు.

పృధ్వి- బుధ గ్రహం-పురుష జన్మ
జలము- చంద్ర, శుక్ర గ్రహములు-స్త్రీ జన్మ
అగ్ని- రవి, కుజ గ్రహములు-పురుష జన్మ
వాయు- శని గ్రహము-స్త్రీ జన్మ
ఆకాశము- గురు గ్రహం- పురుష జన్మ

ఏడు వారముల లో సూర్యోదయం నుండి యా తత్వములు ప్రారంభం అవుతాయి. ఒక దినమునకు లేదా రాత్రికి నాలుగు జాములు. అనగా జాముకు మూడు గంటలు లేదా నూట ఎనభై నిముషాలు. ఒక జాములో పంచ తత్వములు ఒక ఆరోహణ ఒక అవరోహణ పూర్తీ చేస్తాయి.

పృధ్వి = 30 నిమిషాలు, జలం= 24 నిముషాలు, అగ్ని = 18 నిముషాలు, వాయు = 12 నిముషాలు, ఆకాశం=6 నిముషాలు మొత్తం 90 నిముషాలు ఆరోహణ క్రమం, తిరిగి 90 నిముషాలు అవరోహణ క్రమంలో, మొత్తం 180 నిముషాలు పూర్తీ అవుతాయి.

దశలలో అన్తర్దశల వలె వీనిలో అంతర్ తత్వముల సమయం ఉంటుంది. తత్వములో అంతర్ తత్వము మొదలౌతుంది. తరువాత క్రమేణా ఇతర అంతర్ తత్వములు ఇదే వరుసలో వస్తాయి. ఉదాహరణకు, పృధ్వి తత్వములో పృది వ్యాపస్ తేజో వాయు రాకాశాత్ అనే వరుసలో అంతర్ తత్వములు వస్తాయి.

కేరళ జ్యోతిష్కులలో వాడుక విధానాన్ని బట్టి వాయు తత్వ/వాయు అంతరములోనే జన్మ జరుగుతుంది. తమిళ నాడులో కూడా పంచ పక్షి శాస్త్రం దీనిని పరిగనిస్తుంది. దీనికి ప్రమాణం గా వారు సారావళి, ఫల దీపిక, ఇంకా ప్రాచీన గ్రంధముల నుంచి శ్లోకాలను చూపుతారు. సూతి వాయువు అనే బహిర్గత శక్తి వల్ల ప్రసవం జరుగు తుంది కనుక వాయు తత్వ ప్రాబల్యం సమయంలో ఉంటుంది అని వారంటారు. కాని కొందరు ఇతర తత్వములో కూడా జన్మ జరుగుతుంది అంటారు.

సంవత్సరములో రెండు రోజులు మాత్రమె రాత్రి పగలు సమానంగా ఉంటాయి. అవి మార్చ్ 21 మరియు సెప్టెంబర్ 23. వీటిని ఈక్వినాక్టియాల్ రోజులు అంటారు. రోజులలో మాత్రమె మన జాముకు 3 గంటలు అనే లెక్క సరిపోతుంది. మిగతా రోజులలో సూర్యోదయ అస్తమయాలలో తేడాను బట్టి జాము సమయాలను సరి చేసుకోవాలి. అలాగే తత్వ సమయాలు కూడా ఎక్కువ తక్కువలు అవుతాయి.

మొదటగా, పంచ తత్వ సిద్ధాంత ప్రకారం జన్మ సమయం సరి చేసుకొని, తరువాత వర్గ చతుష్టయ , గుళిక విదానములతో సరి చేసుకొనుట ద్వారా చాలా వరకు సరియగు జన్మ సమయమును సాధించవచ్చు. దీనిని దశ/అంతర్దశ/ప్రత్యంతర్ దశ లతో గతించిన ముఖ్య సంఘటనలను పోల్చి చూచుట ద్వారా సవరించి చాలా వరకు సరియగు జన్మ సమయమును రాబట్టవచ్చు.

దీనిని ఒక ఉదాహరణతో నిరూపిస్తే సరిగ్గా అర్థం అవుతుంది. అది రాబోయే వ్యాసంలో చూద్దాము. నేను విజువల్ బేసిక్ లో వ్రాసిన Rectification of Birth Time Software త్వరలో విడుదల చేస్తాను. పని అంతా అది సులభంగా చేస్తుంది. జ్యోతిషంలో పెద్దగా అనుభవం లేని వారు కూడా దీని ద్వారా జనన కాల సంస్కరణ తేలికగా చెయ్య వచ్చు.