లక్షణాలను క్రోడీకరించి ఒక మందును సరైన పోటేన్సీలో ఇచ్చినపుడు ఏమి జరిగితే రోగం తగ్గుతున్నట్లు? ఏమి జరిగితేరోగం తగ్గనట్లు? అనేది హోమియో చికిత్సలో చాలా ముఖ్యమైన అంశం.
మందు ఇచ్చిన వెంటనే రోగికి మానసికంగా తేలికగా అనిపించాలి. ఇది అత్యంత ప్రధానం. తరుణ వ్యాదులలో ఇది వెంటనే కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. దీనిని బట్టి మందు వెంటనే పని చేస్తున్నదా లేదా తెలుసుకోవచ్చు. దీనికి కారణం మందు మొదటగా సూక్ష్మ స్థాయిలలో పని చెయ్యటం మొదలు పెడుతుంది. కనుక వైటల్ లెవెల్ లో ముందు రిలీఫ్ కలుగుతుంది. రోగికి హాయిగా ఉన్నట్లు అనిపిస్తుంది.
దీర్ఘ వ్యాధిలో అయితే రోగం వెంటనే తగ్గినట్లు లక్షణాలు అపుడే కనిపించవు. నిదానంగా మార్పులు వస్తాయి. కాని తరుణవ్యాధిలో అయితే వ్యాధి లక్షణాలు కూడా వెంటనే తగ్గుతూ కనిపిస్తాయి.
ఈ ముఖ్య విషయాన్ని, హోమియో దిగ్గజాలలో ఒకడైన డాక్టర్ హెరింగ్ తన పరిశోధన ద్వారా సూత్రీకరణ చేసాడు.
1. లోపలనుంచి బయటకు లక్షణాలు తగ్గాలి. అంటే అంతర్గత అవయవాల బాధలు తగ్గి రోగం చర్మం పైకి రావటం చూడవచ్చు. లేదా రోగం స్రావాల రూపంలో ప్రాణ శక్తి చేత విసర్జింప బడ వచ్చు.
2. పైనుంచి క్రిందకు లక్షణాలు తగ్గుతూ రావటం చూడ వచ్చు. శరీరంలో పై భాగాలైన తల, ముఖము, మెడ, చాతీ ఈవరుసలో లక్షణాలు తగ్గుతూ వస్తాయి.
3. ముఖ్య అవయవాల బాధలు మొదట తగ్గి తరువాత అంతకంటే వరుసలో తరువాతి అవయవాల బాధలు తగ్గటం చూడవచ్చు. గుండె, మెదడు, ఊపిరితిత్తులు, కిడ్నీలు మొదలైన ప్రాణాధారా అవయవాల బాధలు ముందు తగ్గి, అంతకంటే ప్రాముఖ్యతలో తరువాతివి అయిన అవయవాల బాధలు తరువాత తగ్గడం కనిపిస్తుంది.
4. వ్యాధి మొదలై, వ్యాపించి పెరిగిన క్రమంలోనే వెనుకకు తగ్గుతూ వస్తుంది.
ఈ క్రమంలో లక్షణాలు కనిపిస్తే వ్యాధి తగ్గు ముఖం పడుతున్నట్లు సూచన. దీనికి వ్యతిరేక దిశలో లక్షణాలు ఉంటే, వ్యాధి తగ్గనట్లు తెలుస్తూంది. అపుడు కేసును మళ్ళీ పరీక్షించి ఎందుకు ఇలాజరుగుతున్నదో చూడాలి.
అపుడు అవసరమైతే మందును మార్చటం లేక పోటేన్సీని మార్చటం చేయ వలసి ఉంటుంది.