4, మే 2009, సోమవారం
హోమియో కేస్ స్టడీస్
తరుణ వ్యాదులలో హోమియోపతి ఎంత అద్భుతం గా పని చేస్తుందో నా కేస్ ఫైల్స్ లోనుంచి ఒక ఉదాహరణ ఇస్తాను.
ఒక పదేళ్ళ అమ్మాయికి అమ్మవారు పోసింది. ముఖం మీద మరియు వంటి మీద పొక్కులుఉన్నాయి. ఇంట్లోని వారు మంచం మీద వేపాకులు పరచి పడుకోపెట్టారు. నేను వెళ్లి చూచే సరికి ఉన్న పరిస్థితి ఏమిటంటే అమ్మాయి చాలా చికాకుగా ఉన్నది. మంచం మీద పడుకొని ఉన్నప్పటికీ చాలా అస్థిమితంగా ఉన్నది. వదలకుండా దగ్గు వస్తున్నది. దగ్గిన ప్రతి సారీ తెల్లని కఫం పడుతున్నది. దానికోసం మంచం పక్కన ఒక ప్లాస్టిక్ మగ్గు పెట్టి కొన్ని నీళ్లు పోసి దానిలో ఉమ్మి వేస్తున్నది. నిముషానికి రెండు సార్లు ఇట్లా దగ్గుతూ ఉమ్మి వేస్తూ ఉంది. చల్లని నీరు త్రాగాలని కోరిక ఉంది. చల్లని గాలి కావాలని గొడవ చేస్తున్నది. తన రూములో ఎవరో ఒకరు ఎప్పుడూ తన ప్రక్కనే కూర్చొని ఉండాలి అని గొడవ చేస్తున్నది. ఒంటరిగా ఉండటానికి ఇష్ట పడటం లేదు.జ్వరం నూట మూడు డిగ్రీలు ఉన్నది.
లక్షణాలు పరిశీలించిన మీదట బొంగురు దగ్గు, చల్ల నీళ్ళను ఇష్టపడటం, ప్రక్కన ఎవరో ఒకరు ఉండాలని కోరటం, ఈ లక్షణాలు striking and peculiar symptoms గా కనిపించాయి. ఫాస్ఫరస్ 30 పోటేన్సీలో పావుగంటకు ఒక డోసు చొప్పున మూడు డోసులు వేసాను. గంటలో దగ్గు పూర్తిగా మాయం అయి, స్థిమితం గా పడుకుంది. అన్ని లక్షణాలు తగ్గు ముఖం పట్టాయి.
తరువాత ఫాస్ఫరస్ 200 పోటేన్సీలో ఉదయం సాయంత్రం ఇవ్వటంతో పూర్తిగా తగ్గి మూడు రోజులలో మామూలు మనిషి అయింది. ముఖం మీద గుంటలు పడలేదు. నీరసం లేదు. హోమియోపతి వైద్యం తో చక్కని క్యూర్ కు నా అనుభవంలో ఇది ఒక ఉదాహరణ.
లేబుళ్లు:
హోమియోపతి