బుద్దుని లోకులు అహింసా మూర్తిగా భావిస్తున్నారు. కాని అది మౌలికంగా నిజం కాదు. బుద్ధుని ముఖ్య బోధన అహింస కాదు. బుద్ధుడు మానవుని దుఃఖ నాశన మార్గాన్ని బోధించాడు. ఈ మార్గంలో పయనించిన మానవుడు నిర్వాణము అనే గమ్యాన్ని చేరతాడు. నిర్వాణ సిద్ధి కలిగినపుడు అహింస మొదలైన గుణాలు వాటంతట అవే అనుసరించి వస్తాయి.
జీవిత రహస్యాన్ని చేదించిన వానికి అహింసాది గుణాలను ప్రత్యేకంగా అభ్యాసం చేయవలసిన అవసరం ఉండదు. అప్రయత్నంగానే అన్ని సద్గుణాలు వాని ఊపిరిగా మారుతాయి. బుద్ధుడు జ్ఞాన మూర్తి. మానవ ఊర్ధ్వ పరిణామంలో అత్యున్నత స్థాయికి చేరినవాడే బుద్ధుడు. దుఃఖ నాశన మార్గాన్నే బుద్ధుడు అనుసరించాడు. దానినే లోకానికి బోధించాడు.
కాని బౌద్ధం భారత దేశాన్ని విడచి ఇతర దేశాలకు వలస పోయింది. ఇది మన జాతి దౌర్భాగ్యం. పోయిన చోటల్లా సక్రమమైన రీతిలో ఉందా అంటే అదీ లేదు. అసలైన బౌద్ధం అనేక మార్పులకు లోనై దాదాపు అంతరించి పోయింది. హీన యానం, థేరావాదం మొదలైన పేర్లతో అక్కడక్కడా మిగిలి ఉంది.
దీనిని బట్టి ఒక విషయం తేట తెల్లం అవుతున్నది. జన సామాన్యం అందరూ అత్యున్నత జ్ఞాన భూమికను అందుకోలేరు. బుద్ధుని వంటి వారు దానిని విడమర్చి బోధించినా, అనుసరించగల సాహసులు అతి కొద్ది మందే ఉంటారు. జనులకు వారి స్థాయిలో మాయ మాటలు చెప్పేవారే నచ్చుతారు. అంతే కాని సత్యం ఉన్నది ఉన్నట్లు బోధిస్తే స్వీకరించే వారు ఎవరూ ఉండరు. అందుకనే మహనీయుల బోధనలు కాల గర్భం లో కలసిపోతాయి. నూతన బోధనలు అవసరం అవుతాయి. దీనికి కారణం మానవుల అనర్హత. మార్పును స్వాగతించే ధైర్యం లేకపోవటం,అత్యున్నత సత్యాలను ఆచరణలో పెట్టగలిగే సత్తా లేక పోవటం దీనికి కారణాలు.
కాల క్రమేణా మహనీయుల బోధనలు ఆచరించక పోవటం అట్లుంచి, వాటిని సరిగా అర్థం చేసుకునే వారు కూడా కరువు అవుతారు. బుద్ధుని అహింసా మూర్తిగా ముద్ర వెయ్యటం కూడా అటువంటిదే. జ్ఞానాన్ని పొందిన ప్రతి వాడూ అహింసా మూర్తిగానే అవుతాడు. అది ప్రత్యెక లక్షణం ఏమీ కాదు. వారిది నిజమైన జ్ఞానము, భక్తీ అయితే ప్రతి జ్ఞానీ, ప్రతి భక్తుడూ అహింసా వాదే.
బుద్ధుని మౌలిక బోధన జ్ఞానం. దుఃఖ నాశన మార్గం. నిర్వాణ పధం. ఈ పథాన నడిచే వానిని సద్గుణాలు అవే అనుసరిస్తాయి. ప్రత్యేకించి ఒక్కొక్క గుణాన్ని అభ్యాసం చేయవలసిన పని లేదు. బుద్ధుని మౌలిక జ్ఞాన బోధను వదలిపెట్టి ఆయనను ఉత్త అహింసా మూర్తిగా భావించటం సరి యైన భావన కాదు.