“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

20, జూన్ 2009, శనివారం

బ్రూస్ లీ జాతకం

ప్రఖ్యాత కుంగ్ ఫూ స్టార్ బ్రూస్ లీ 27-11-1940 తేదీన 7.12 నిముషాలకు శాన్ ఫ్రాన్సిస్కోలో జన్మించాడు. కుంగ్ ఫు అనే విద్య ఒకటుంది అన్న విషయాన్ని ప్రపంచానికి తనసినిమాలతో పరిచయం చేసాడు. తరువాత ఎందరు కుంగ్ ఫూ స్టార్స్ వచ్చినా ఈయనస్థానం ఈయనదే. ఆయన జాతకాన్ని ఇక్కడ ఇస్తున్నాను.

ఈయన అసలు
పేరు జూన్ ఫాన్ లీ. ఈ పేరులో లీ అనేది వీరి ఇంటి పేరు. ఈయన విక్రమనామ సంవత్సరం కార్తీక బహుళ చతుర్దశి రోజున బుధ వారం బుధ హోరలో స్వాతినక్షత్రం-4 పాదంలో జన్మించాడు. ఈయన జాతకంలో ఆత్మ కారకుడు కూడా బుదుడేకావటం ఒక విశేషం.జన్మ సమయంలో శోభన యోగం, విష్టి కరణం ఉన్నవి.


ఈయన 
తండ్రి చైనా వాడు. కాని తల్లి యొక్క తండ్రి జర్మన్ మరియు తల్లి చైనీస్ వనిత. కనుక జర్మన్ రక్తం ఈయనలోఉన్నది. ఈయన పుట్టినపుడు రాహు/చంద్ర/శుక్రదశ జరుగుతున్నది. రాహుచంద్రుల కలయిక గ్రహణయోగం. కనుక తండ్రివైపు నుంచి ఈయన వంశానికి శాపం ఉన్నదని చెప్పవచ్చు. ఇటువంటి శాపం వీరి వంశానికి ఉన్నదని చెబుతారు. బ్రూస్ లీ తన 32 వ ఏటఅనుమానాస్పద పరిస్థితుల్లో మరణించాడు. అలాగే ఈయన కొడుకైన బ్రాండన్ లీ తన 26 వ ఏట సినిమా షూటింగ్ సమయంలో మరణించాడు. వీరి వంశానికి శాపం ఉన్నది అని బ్రూస్లీ తండ్రి గట్టిగా నమ్మేవాడు. శాపం ఉందా లేదా అనేది జాతక విశ్లేషణలో తరువాత చూద్దాము.

ఈయన తండ్రి చైనీస్ ఒపేరాలో ఆర్టిస్టు గా పని చేసేవాడు. బ్రూస్లీ బాల నటుడిగా కొన్ని సినిమాలలో నటించాడు. చిన్నప్పుడు ఒక గాంగు లీడర్ గా ఉండేవాడు. 13 ఏళ్ళ వయసులో జరిగిన ఒక వీధి కొట్లాటలో బ్రూస్లీ బాగా దెబ్బలుతిన్నాడు. ఆ పౌరుషంతో ప్రఖ్యాత వింగ్ చున్ మాస్టర్ అయిన యిప్ మాన్ వద్ద శిష్యుడిగా చేరి కుంగ్ ఫూ అభ్యాసంమొదలు పెట్టాడు. 1954-57 మధ్య కాలంలో ఈయన యిప్ మాన్ శిష్యుడిగా ఉండి కుంగ్ ఫూ ప్రాక్టీస్ చేసాడు. ఈసమయంలో ఈయనకు గురు దశలో రాహు అన్తర్దశ జరిగింది. మధ్యలోనే వింగ్ చున్ అభ్యాసం వదలి
పెట్టి తిరిగి అమెరికా చేరాడు. గురుఛండాల యోగ దశలో నేర్చుకున్న వింగ్ చున్ ఈయనకు పెద్దగా ఉపయోగపడలేదు.

మార్షల్ ఆర్ట్స్ ను సూచించే గ్రహ స్థితులు:

స్థిరలగ్నమైన వృశ్చికం రాశి, దశాంశలలో ఉదయిస్తున్నది. కుజ సంబంధ లగ్నంతో రవి కలిసి ఉండటం వల్ల వీరవిద్యలలో నైపుణ్యం ఉన్నట్లు తెలియటమే కాక లోకప్రసిద్దుడు అవుతాడని చెప్ప వచ్చు. వీరవిద్యలకు కారకుడైన కుజుడు నవాంశ, దశాంశలలో ఉచ్ఛస్థితిలో ఉండటం వల్ల కుంగ్ ఫూ లో ఆరితేరాడు. కాని కుజుని గ్రహయుద్ధస్థితి వల్ల, ద్వాదశస్థితి వల్ల అదంతా అర్ధాంతరంగా ముగుస్తుందని తెలుస్తున్నది. ఆరింట శని మరియు గురు గ్రహముల కలయిక వల్ల మార్షల్ ఆర్ట్స్ లో గొప్ప ఓర్పుతో సాధన చేసి ఒక స్టార్ అవుతాడని సూచన ఉంది. కానీ శని నీచ వక్ర స్థితులలో ఉండటంతో చివరకు అంతా వృధా అవుతుందని సూచన కూడా ఉంది.

శని గురువులు శుక్ర నక్షత్రంలో ఉన్నారు. అదీగాక భరణి అనేది యమునిచే పాలింపబడే నక్షత్రం. కనుక, గర్ల్ ఫ్రెండ్ వల్ల చావు మూడింది.

దశాంశలో లగ్న రవులు వర్గోత్తమాంశ తో ఉండుట వల్ల మార్షల్ ఆర్ట్స్ తో లోక ప్రసిద్దికెక్కుట ద్వారా సంపాదనసూచింపబడుతున్నది. కానీ, లగ్నాదిపతి యగు కుజుడు ద్వాదశ శత్రుస్థానస్థితి మంచిదికాదు. శుక్రునితో మరియు ఆత్మకారకుడగు బుధునితో కలయిక వల్ల ప్రేమ వ్యవహారాలలో చిక్కుకొని తన అధోగతికి తానే కారకుడైనాడు. కుజబుధశుక్రుల కలయికవల్ల మల్లయుద్ధ ప్రావీణ్యం ఏర్పడుతుంది అని పరాశరమహర్షి, జైమినిమహర్షులు చెప్పిన మాట అక్షరాలా నిజంకావటం ఈ జాతకంలో చూడ వచ్చు.

సహజ పంచమాదిపతి అయిన రవి లగ్నంలో మిత్ర క్షేత్రంలో ఉండి ఎక్కువ వర్గ చక్రములో లగ్నంలో ఉండటంతో రంగస్థలనటుడు గాను, నృత్యం లోను  ప్రావీణ్యత కలిగింది. బ్రూస్లీ హాంగ్ కాంగ్ లో చాచా డాన్స్ చాంపియన్ అని చాలామందికి తెలియదు. విక్రమస్థానంపైన కుజ శనుల దృష్టితో ధైర్యం పౌరుషం కలిగాయి. దశమస్థానం పైన గురుదృష్టితో అమెరికాలో కుంగ్ ఫూ స్కూల్ స్థాపించి అనేక మందికి గురువుగా కుంగ్ ఫూ నేర్పించాడు.

కాని ద్వాదశంలో ఉన్న కుజుని మీద శనిదృష్టి రహస్య శత్రువులను ఇవ్వటమే కాక ఇప్పటికీ మిస్టరీ గా మిగిలినమరణాన్ని ఇచ్చింది. ద్వాదశంలో చంద్ర, కుజ, బుధ శుక్రుల కలయిక వల్ల ఈయన మీద అనేక స్కూల్స్ ప్రభావంఉన్నది. పని చేసేవి ఫలితం చూపించేవి అయితే ఏ స్టైల్ నుంచి అయినా టెక్నిక్స్ తీసుకో వచ్చు అంటూ "జీత్ కునే డో" అని ఒక కొత్త స్టైల్ మొదలు పెట్టాడు. దీన్ని "The way of intercepting fist" అంటూ కొన్నాళ్ళు పిలిచి తరువాత ఈపేరును తొలగించాడు.

జీవితంలో ఎటువంటి బంధాలూ ఉండకూడదని నమ్మేవాడు. అలాగే మార్షల్ ఆర్ట్స్ కూడా గిరి గీసుకొని ఇది నా స్టైల్ అంటూ ఉండటం తప్పు అని చెప్పే వాడు. ఈ ధోరణి వల్లనే నేడు అమెరికాలో M.M.A - Mixed Martial Arts అనే ట్రెండ్ వచ్చింది. తాను బతికి ఉన్నప్పుడు ఎంతో మందికి తనదైన స్టైల్ నేర్పించినా ముగ్గురికి మాత్రమె తన స్టైల్ లో బోధించటానికి సర్టిఫికేట్ ఇచ్చాడు. ఓపెన్ మైండ్ తో ఉండటం ముఖ్యం అని చెప్పేవాడు. ఈయన భావాలు జెన్ సిద్ధాంతాలకు దగ్గరిగా ఉంటాయి. సాంప్రదాయంగా వస్తున్న అనేక  కుంగ్ ఫూ అభ్యాసాలను నిరసించాడు. ఉదాహరణకు కరాటేలో కటా ప్రాక్టీస్ లేదా కుంగ్ ఫూ లో ఫాం ప్రాక్టీస్ అనవసరం అని తేల్చి చెప్పాడు. ఎందుకంటే అది వీధి పోరాటంలో పనికిరాదు అని చెప్పాడు. ఇది చాలా వరకు నిజం కూడా.