Pages - Menu

Pages

30, జూన్ 2009, మంగళవారం

మైకేల్ జాక్సన్ జాతకం


కళా కారులు, లోకంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించే వారు జన్మించే త్రికోణ రాసులు మిథున, తులా, కుంభ రాసులు. వీనిలో ఒకటైన కుంభ రాశిలో మైకేల్ జాక్సన్ జననం జరిగింది. ఆయనే ఒకసారి తన జాతకం చెప్పించుకోడానికి ఒక భారతీయ జ్యోతిష్కునికి తన జనన సమయాన్ని రాత్రి 7.30 ప్రాంతం గా చెప్పాడు. సమయం ప్రకారం వేశిన జాతక చక్రం ఇక్కడ ఇస్తున్నాను


ఈయన శ్రావణ బహుళ పాడ్యమి శుక్రవారం పూర్వాభాద్ర నక్షత్రం ఒకటో పాదం లో రవి హోరలో ధృతి
యోగంలో జన్మించాడు. పూర్ణిమకు దగ్గిరగా జన్మించటం వలన లో ప్రసిద్ది ని పొందాడు. రవి లగ్నానికి సప్తమ స్థానంలో ఉండటం వల్ల తండ్రితో మనస్పర్థలు విరోధం కలిగింది. సప్తమంలో రెండు గ్రహాలు ఉండటం వాటిలో బుధుడు వక్రించి ఉండటంతో రెండు వివాహాలు కలిగాయి. కాని అవి అర్థాంతరంగా పెటాకులయ్యాయి. లగ్నాతిపతి యైన శని దశమంలో ఉండటం మంచి యోగమే కాని అది శత్రు స్థానం కావటం వల్ల తన వృత్తి వల్ల తనకు మంచి పేరు ధనం వచ్చినా అదే చివరకు తనకు శత్రువుగా మారి ప్రాణాంతకం అయింది

తృతీయాధిపతి అయిన కుజుడు స్వస్థానంలో ఉండి కేతువుతో కలిశి ఉండటం వల్ల acrobatic dance skills కలిగాయి. 4,9 స్థానముల అధిపతి శుక్రుడు 6 ఇంటిలో ఉండుట వల్ల తండ్రితో విరోధం, కుటుంబ జీవితంలో శాంతి లేకుండుట కలిగాయి. అష్టమాదిపతి బుధుడు వక్రించి సప్తమంలో ఉండటంతో వివాహ జీవితం చిద్రం అయింది. నవమంలో గురు రాహువుల కలయికతో తన సుఖమే కాని కొడుకు సుఖం పట్టని తండ్రి సంప్రాప్తం అయ్యాడు.

చిన్న తనంలోనే పాటలు పాడటంలో ప్రతిభ కనపరిచాడు. ఇది త్రుతీయంలో కేతు కుజుల వల్ల కలిగింది. 14 ఏళ్ళ నుంచి మొదలైన శని మహర్దశ ఈయన జీవితాన్ని మలుపులు తిప్పింది. అక్కడ నుంచి తనకు 33 ఏళ్ళు వచ్చే వరకు అంటే 1991 వరకు ఎన్నో అవార్డులు సన్మానాలు పొందాడు. ఊహించనంత ధనం సంపాదించాడు. జనవరి 1984 లో ఒక ప్రదర్శన ఇస్తుండగా జరిగిన అగ్ని ప్రమాదంలో ఆయన జుట్టు, తల కాలిపోయాయి. అప్పుడు శనిలో/చంద్రునిలో/రాహువు జరుగుతున్నది. 1986-91 జరిగిన శని/రాహు, గురు అన్తర్దశలలొ అనేక అపవాదులు నిందలు కోర్టు కేసులు ఎదుర్కున్నాడు.

లగ్నం లో పూర్ణ చంద్రుడు ఉండటం వల్ల మంచి కళాత్మకమైన మనసు వచ్చింది. కాని బుధుని వక్ర స్థితి వల్ల పితృ కారక గ్రహం రవి తో కూడా సప్తమం నుంచి లగ్నాన్ని చూస్తుండటం వల్ల చైల్డ్ అబ్యూస్ కు గురి అయ్యాడు. చిన్న తనంలో తండ్రి పెట్టిన భయం అతన్ని చివరి వరకూ వెంటాడింది. పీడ కలలు అతన్ని వెంటాడేవి. ఇదంతా ఈ గ్రహ స్థితి వల్లనే కలిగింది. చంద్రుడు బాల్యానికి సహజ కారకుడు. అదే చంద్రుడు ఆరవ ఇంటి ఆధిపత్యం వల్ల తన సొంత ఆలోచనలతోనే తన రోగాలను కొని తెచ్చుకున్నాడు.

పన్నెండవ ఇంటిపైన శని దృష్టి తో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కు లోనయ్యాడు. దానికి తోడూ బిగ్ నోస్ అంటూ తండ్రి వెక్కిరింపులు, నల్ల చర్మం అంటూ తెల్ల వాళ్ల వేధింపులు ఇవి అన్నీ కలిశి అతనిలో చిన్న తనంలోనే మానసిక సంఘర్షణ కలిగించాయి. దీని ప్రభావం చివరి వరకూ అతన్ని వెంటాడింది. చర్మం రంగు తెల్లగా మార్చుకోవాలని బ్లీచింగ్ చేయించుకుని అది వికటించి విటిలిగో అనే బొల్లి సంప్రాప్తించింది. నీగ్రో కవళికలు మార్చుకోవాలని ముఖానికి ఎన్నో సర్జరీలు చేయించుకుని కళ గల ముఖాన్ని చివరికి చివరికి దయ్యపు ముఖం గా మార్చుకున్నాడు. నాకు మటుకూ అతను నీగ్రో ముఖంతోనే కళగా ఉన్నట్లు అనిపిస్తాడు. చిన్నతనంలో ఏర్పడిన మానసిక చీలికలు ఎంతగా జీవితాన్ని ప్రభావితం చేస్తాయో అనడానికి ఇతని జాతకం ఒక ఉదాహరణ.

ధన యోగాలు:

రెండు ధన స్థానం, తొమ్మిది భాగ్య స్థానం, పదకొండు లాభ స్థానం. ఈ మూడింటి కలయిక తో ధన యోగాలు కలుగుతాయి. ఇతని జాతకంలో ద్వితీయ లాభ స్థానాధిపతి గురువు. ఈ గురువు నవమ స్థానంలో రాహువు తో కలిశి ఉన్ననాడు. రాహువు శుక్రుణ్ణి సూచిస్తున్నాడు. అనగా స్టేజి షోలు మొదలైన కళాత్మక ప్రదర్శనల ద్వారా ఇతనికి విపరీత ధన లాభం సూచింప బడుతున్నది. జీవితంలో జరిగింది అదే కదా. తృతీయ స్థానం సంగీతానికి సూచిక. ఇతనికి త్రుతీయంలో కుజుడు స్వస్థానంలో బలంగా ఉంది విపరీత ప్రవర్తనను చూపే కేతువుతో కలిశి ఉన్నాడు. అందుకనే ఇతని సంగీతం, నాట్యం లో పిచ్చి కేకలు, అరుపులు, హటాత్ కదలికలు ఉంటాయి. ఇది కేతు ప్రభావం. కేతువు కుజుని సూచిస్తున్నాడు. కనుక తృతీయం డబల్ కుజ ఎఫెక్ట్ తో అతి బలవత్తరం గా మారింది. వీరి ద్రుష్టి భాగ్య స్థానం లో గల గురువు మీద ఉంది. కనుక సంగీతం, నాట్యం, ప్రదర్శనలతో ధన యోగం కలిగింది.

రోగాలు-స్వయం క్రుతాపరాధాలు:
1980 నుంచి ఈయనకు శ్వేత కుష్టు అని పిలువబడే బొల్లి వచ్చింది. అప్పుడు శనిలో శుక్ర అంతర్దశ జరిగింది. శని శుక్రులు యోగ కారకులైతే జాతకంలో శని/శుక్ర దశలో రాజును కూడా బిచ్చ గాన్ని చేస్తారని ఉత్తర కాలామృతం లో కాళిదాసు చెప్పే ఉన్నాడు. దాదాపు అదే ఈయనకు జరిగింది. ఎంత డబ్బు ఉండి కూడా చర్మ వ్యాధి తగ్గే మార్గం కనిపించలేదు. నల్ల చర్మాన్ని రంగు మార్చుకోటానికి ఈయనే బ్లీచింగ్ చేయించుకున్నాడని అంటారు.

అది నిజమే అని జాతకం చెబుతున్నది. ఎలా? శని/శుక్ర దశలో ఇది జరిగింది. శని లగ్నాధిపతి, దశమంలో ఉన్నాడు. అంటే తన సొంత చర్యలను చూపిస్తున్నాడు. అది కూడా వృత్తి కోసం అని తెలుస్తున్నది. ఇక శుక్రుడు సౌందర్యానికి కారకుడు. రోగ స్థానమైన ఆరవ ఇంటిలో ఉన్నాడు. ఇదంతా కలిపి చూస్తె తెలుస్తున్నది? వృత్తి పరమైన ఆశల వల్ల, తన సొంత ఆలోచనతోనే, నలుగురిలో ఇంకా అందంగా కనిపించాలన్న తపనతో, సౌందర్యం కోసం రోగం తెచ్చుకున్నాడు అని స్పష్టం గా జ్యోతిషం చెబుతున్నది. కనుక ఇది స్వయంక్రుతాపరాధమే.

1993 కల్లా అతను మత్తు మందులకు పెయిన్ కిల్లర్ డ్రగ్స్ కు అలవాటు పడ్డాడు. అష్టమాదిపతి గా బుధుడు వక్రించి సప్తమంలో ఉండటం చూడవచ్చు. ఇక్కడి నుంచే ఈయన ఆరోగ్యం క్షీణించటం మొదలైంది. వక్ర బుద్ది( బుధుని వక్ర స్థితి) వల్ల అనగా సరియగు ఆలోచన లేని స్థితి వల్ల పిచ్చి పిచ్చి మందులు వాడి చేజేతులా చావు కొని తెచ్చుకోవటం ( ఆరోగ్య కారకుడగు రవి మారక స్థానంలో ఉండటం) జాతకంలో స్పష్టం గా చూడ వచ్చు. అప్పుడు శని మహర్దశ అంతమై సరిగా బుధ మహర్దశ మొదలైంది.

బుధుడు సప్తమ స్థానంలో ఉండటంతో అపుడే ఈయనకు వివాహం జరిగింది. కాని రెండేళ్ళు తిరగకుండానే 1996 లో విడాకులు తీసుకుని విడిపోయారు. అపుడు సరిగా బుదునిలో/ శుక్రునిలో/కుజ దశ జరిగింది. కళత్ర కారకుడైన శుక్రుడు బుధునికి 12 స్థానంలో ఉండటం అది లగ్నాత్ గొడవలు చిక్కులు ఇచ్చే షష్ఠ స్థానం కావటం శుక్రుని మీద కుజ దృష్టి ఉండటం చూడ వచ్చు. ఇవన్నీ కలిశి ఆయా దశలలో మొదటి పెళ్లి పెటాకులైంది. తిరిగి 1997 లో రెండవ పెళ్లి తన నర్సుతోనే జరిగింది. శుక్రుని మీద కుజ దృష్టి, సప్తమంలో రెండు గ్రహాలు ఇత్యాది కారణాల వల్ల రెండవ వివాహం బుధ/శుక్ర/బుధ దశలో జరిగింది. 1999 లో ఇది కూడా విడాకుల పాలైంది. ఇప్పుడు జరిగిన బుధ/చంద్ర దశలో ఇతను చాలా దాన ధర్మాలు చేసాడు. కారణం చంద్ర బుదుల సమ సప్తకం.

2003-07 మధ్యలో చిన్న పిల్లలతో లైంగిక కార్య కలాపాలలో పాల్గొన్నాడని అనేక కోర్టు కేసులు ఎదుర్కున్నాడు. కాని అవి రుజువు కాలేదు. అప్పుడు బుధ/గురు, శని దశలు జరిగాయి. బుధుడు జ్యోతిషంలో చిన్న పిల్లలకు కారకుడని అందరికీ తెలిసిందే. గురువు రాహువుతో కలిశి ఉండటం వల్ల అపవాదులు, నమ్మిన వారి మోసం, అప కీర్తి కలిగాయి. బుధుని పైన శని దృష్టి వల్ల ఇదంతా వృత్తి పరమైన అసూయ వల్ల పెట్టిన కేసులు అని తెలుస్తున్నది. ఇదే సమయంలో ఈయన డ్రగ్స్ కు, పెయిన్ కిల్లర్స్ కు బాగా అలవాటు పడ్డాడు.

25-6-2009 1-14 to 1.30 PM మధ్యలో గుండె పని చెయ్యక పోవటం వల్ల చని పోయినట్టు చెబుతున్నారు. సమయంలో కేతు/శుక్ర/రవి దశ జరుగుతున్నది. రాహు కేతువులు గండాత స్థితిలో ఉండుట గమనించాలి. కేతువు ఆయుస్తానంలో గండాంత స్థితిలో ఉండుట వల్ల అయుస్సుకు గండం ఏర్పడింది. శుక్రుడు రోగ స్థానమైన షష్ఠం లో ఉన్నాడు. అదీ కూడా సౌందర్య కారకుడుగా ఉన్నాడు. రవి మారక స్థానమైన సప్తమంలో ఉన్నాడు. గుండె కు కారకుడు. కనుక గ్రహాల కాంబినేషన్ ప్రకారం సౌందర్య పోషణ కోసం పిచ్చి సర్జరీలు చేయించుకొని, అనవసర మందులు అతి మోతాదులో వాడి దాని దుష్ఫలితాల వల్ల అకస్మాత్తుగా గుండె ఆగి చనిపోయాడని జాతకం ద్వారా తెలుస్తున్నది. మరణ సమయానికి చంద్ర లగ్నాత్ శని మారక స్థానమైన సప్తమంలో ఉండటం చూడ వచ్చు.

ఫలదీపికాది గ్రంధాల ప్రకారం మరణ కారణాన్ని అష్టమ స్థానం నుంచి చూడాలి. ఈయన జాతకంలో అష్టమం ఖాళీ గా ఉంది. ఎవరి దృష్టీ లేదు. కాని ఒకవైపు రవి బుదుల చేత ఇంకొక వైపు గురు రాహువుల చేత అర్గలం కలిగింది. పాపుల సహవాసి యైన బుధుడు పాపి అవుతాడు. కనుక రవి బుధులు పాపులు. ఇక గురువు సుభ గ్రహం అయినప్పటికీ రాహువు పాపి. కనుక ఇతని అష్టమ స్థానం నాలుగు గ్రహాల ప్రభావానికి లోనయింది. వీటిలో, గురువు= లివర్ చెడి పోవటం, జీర్ణక్రియ చెడిపోవటం, తిన్నది అరుగక పోవటం, పస్తులుండటం సూచిస్తుంది. రాహువు=అనవసర పిచ్చి మందులు అతిగా వాడటం చూపుతుంది. ఇక రవి= గుండె జబ్బులు,రక్త దోషాలు, ఆరోగ్య భంగం సూచన. వక్ర బుధుడు= సరియగు ఆలోచన కొరవడటం, నరాల జబ్బులు, అసాధ్య చర్మ రోగాలు చూపుతుంది. ఇవన్నీ క్రోడీకరించి చూడండి. ఆయన మరణం ఎందువల్ల జరిగిందో చక్కగా కనిపిస్తుంది. చిన్న పిల్లవాడికి కూడా అర్థం అవుతుంది.

ఇంకొంచం లోతుగా పరిశీలిద్దామా? లగ్న చంద్రుల నుండి ఇరవై రెండవ ద్రేక్కాణం మృత్యు సూచకం. లగ్నం కుంభం రెండవ ద్రేకానం. కనుక కన్య రెండవ ద్రేక్కాణం లో ఇరవై రెండవ ద్రేక్కాణం ఉంటుంది. అంటే అక్కణ్ణించి అయిదవది అయిన మకరం. ఇది లగ్నాత్ ద్వాదశం. మృత్యు స్థానం. దీని అధిపతి శని తన ఏడవ దృష్టి తో లగ్నాత్ చతుర్తాన్ని (గుండె) చూస్తున్నాడు. కనుక పై కారణాలన్నీ కలిశి గుండె ఆగి మరణించాడు.

చంద్రుడు కుంభం మూడవ ద్రేకానం లో ఉన్నాడు. కనుక కన్య మూడవ ద్రేకానం ఇరవై రెండవ ద్రేక్కాణం అవుతుంది. అంటే అక్కడినుంచి తొమ్మిది అయిన వృషభం అనగా మళ్ళీ ఇందాకటి లగ్నాత్ చతుర్థం అవుతుంది. అంటే మళ్ళీ హృదయం సూచింప బడుతున్నది. కనుక చతుర్ధం( గుండె)+శని(ఆగి పోవటం) వెరసి హార్ట్ ఫెయిల్యూర్ వల్ల మరణం కలిగింది. 

ఇతని జీవితం ఏమైనా, ఈయన్ని ఈయన డాన్సులని కాపీ కొట్టి మన చిరంజీవి, ప్రభు దేవా, లారెన్స్ మొదలైన వారు జీవితం లో బాగా స్థిర పడ్డారు. బహుశా వీరి గురించి ఆయనకు తెలుసో లేదో దేవునికే తెలియాలి.ఒక రకంగా మైకేల్ జాక్సన్ మరణం నేటి యువతకు కనువిప్పు కావాలి. సౌందర్య పోషణకోసం టీ వీ లలో కనిపించే ప్రతి చెత్తనూ వాడి ఒళ్ళు గుల్ల చేసుకోవద్దు. బహుళ జాతి కంపెనీలను పోషించ వద్దు. ముఖ్యం గా నేటి ఆడ పిల్లలు దీనిని గుణ పాఠం గా తీసుకోవాలి.

సంతులిత ఆహారం, యోగా వంటి సాంప్రదాయ బద్దమైన వ్యాయామం చేయటాన్ని మించినది లేదు. కాస్మెటిక్స్ వాడకం, కాస్మెటిక్ సర్జరీలు, పెయిన్ కిల్లర్స్ వాడకం, బ్రాడ్ స్పెక్ట్రం ఏంటీ బయోటిక్స్ వాడకం ఎంతటి అనర్థాలను తెచ్చి పెడుతుందో మైకేల్ జాక్సన్ జాతకం ఉదాహరణ. అన్నింటి కన్నా మించి భగవంతుడు మనకు ఇచ్చిన ఆకారాన్ని ఏవేవో సర్జరీలు చేయించుకొని అందం గా మార్చుకోవాలన్న భ్రమ వీడండి. అందం ఆకారంలో లేదు. అది వ్యక్తిత్వం లో ఉంటుంది అన్న సత్యం మరువకండి. అని మైకేల్ జాక్సన్ విషాద కథ లోకానికి చెబుతోంది. వినిపించటం లేదూ?