నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

29, జులై 2009, బుధవారం

ఒక మంచి మాట


గ్రంధం లోదో తెలీని శ్లోకం ఒకటి విన్నాను . చక్కటి అర్థాన్ని కలిగి ఉండి, ఒక మంచి సత్యాన్ని నాలుగు మాటలలోచెప్పింది.

శ్లో||అమంత్రం అక్షరం నాస్తి
నాస్తి మూలం అనౌషధం
అయోగ్యః పురుషో నాస్తి
యోజకా తత్ర దుర్లభా||

అర్థం|| మంత్రం కాని అక్షరం లేదు. ఔషధం కాని చెట్టు వేరు లేదు. పనికి రాని మనిషీ లేడు. వీటిని ఉపయోగించుకునేవాడే లభించటం లేదు.

అక్షరాలు అన్నీ మంత్రాలే. వాటిని సాధన చేసే ప్రయత్న శీలురు కావాలి. సామాన్య మైన " రామ" అనే మంత్రాన్నిజపించి బోయవాడు వాల్మీకి మహర్షి గా మారాడు. మాటలలో మహత్తరమైన శక్తి ఉంది. ఒక మంచి మాట వింటేమనస్సు ఆనంద పడుతుంది. ఇంకొక చెడ్డ మాట వింటే మనస్సుకు బాధ కలుగుతుంది. ఇక్కడ ఉన్న మనసు, మాట-- ఈ రెంటిలో దేనికీ రూపం లెదు. మనసునూ రుజువు చెయ్యలేము, మాటనూ రుజువు చెయ్యలేము. మనసుకు రూపం లెదు. మాటకు శబ్దం ఉంది. కాని క్షణంలో అంతరిస్తుంది.మరి ఇవి చూపే ప్రభావాలు మాత్రంఅనూహ్యం గా ఉంటాయి. 

మాటతో జీవితం మారుతుంది. మాట తేడాతో యుద్ధాలు జరుగుతాయి. మనసులు కలిస్తే జీవితాలు ఆనందమయంగా మారుతాయి. మనసు విరిగితే జీవితాలు చెదిరి పోతాయి. మామూలు గా కనిపించే మాటనే మంత్రం గా సాధన చేసి ఫలితాన్ని పొందవచ్చు. ఇక బీజాక్షర సంయుక్తం అయిన మహా మంత్రముల మహిమ వేరే చెప్ప వలసిన పని లేదు. మంత్రాలకు చింతకాయలు రాలవు అని అంటారు. నిజమే. అది మామూలుగా పుస్తకంలో ఉన్న మంత్రం చదివి పరీక్షించిన వాని సంగతి. మంత్ర సిద్ధి ఉన్న వానికైతే చింత కాయలు రాలుతాయి. ఇంకా అద్భుతాలు కూడా జరుగుతాయి. ఆ మంత్ర సిద్ధి కలగాలంటే ఏళ్ళ కెళ్ళు సాధన చేసి చూడాలి. మంత్రాలు ఉన్నాయి. అలా సాధన చేసే వారే లేరు.

ఇక చెట్ల సంగతి కొస్తే, ప్రతి మొక్కలోనూ ఔషధ లక్షణాలు ఉన్నాయి. కాని దానిని పట్టుదలగా పరిశీలించి కనుగొనే నాదుడే లేదు. బుద్ధుని వ్యక్తిగత వైద్యుడైన జీవకుని గురించి ఒక గాధ ప్రచారం లో ఉంది. ఇదే కథ చరకుని గురించి కూడా చెప్తారు. వైద్య శాస్త్రాన్ని బాగా అభ్యసించిన తరువాత ఈయనకు గురువు గారు ఒక పరీక్ష పెట్టారు. ఒక ఏడాది పాటు దేశమంతా తిరిగి అన్ని మొక్కలనూ పరిశీలించి, వైద్యానికి పనికి రాని మొక్కను ఒక దాన్ని కనుగొని దాన్ని తెచ్చి ఇమ్మని గురువు చెబుతాడు.

జీవకుడు అలాగే సంవత్సరం పాటు పరిశీలించి తిరిగి ఉత్త చేతులతో వస్తాడు. ప్రశ్నార్థకం గా చూచిన గురువుతో- వైద్యానికి పనికి రాని మొక్క తనకు కనిపించలేదని చెబుతాడు. అప్పుడు మాత్రమె ఆయనకు వైద్య శాస్త్రం లో పరిపూర్ణత కలిగినట్లు గురువు భావించి ఇక నీవు వైద్యం చెయ్యటం ప్రారంభం చేయ వచ్చు అని అనుమతి ఇస్తాడు. ఇట్టి పరిశీలన, అధ్యయనం చేసాడు కనుకనే జీవకుడు ఈనాడు కొన్ని బౌద్ధ శాఖలలోవైద్యానికి Patron Saint గా పరిగణించ బడుతున్నాడు.

అదే విధం గా పనికి రాని మనిషి కూడా ఈ ప్రపంచం లో ఉండడు. కొందరిలో తెలివి తేటలు తక్కువగా ఉండొచ్చు. కాని వారు కూడా పరిశ్రమ తో గొప్ప వారు కాగలరు. కొందరిలో తెలివితేటలు ఎక్కువగా ఉండొచ్చు. కాని వీరు బద్ధకానికి లోనైతే జీవితంలో ఏమీ సాధించలేరు. ప్రకృతి అన్నింటినీ మనిషికి ఇచ్చింది. ఒక్క బద్ధకాన్ని, సోమరి తనాన్నిఒదిలించుకో గలిగితే, ధైర్యాన్ని పుంజుకో గలిగితే మనిషి సాధించలేనిది లేదు. ఎన్నెన్నో విద్యలు మానవుని కోసంఎదురు చూస్తూ చీకటిలో ఉన్నాయి. వాటిని అందుకునే వారు, సాధించే వారే లేరు.

ఇంద్రియ వ్యామోహం తో కొందరు, దురహంకారం తో ఇంకొందరు, బద్ధకంతో ఇంకొందరు, పిరికి తనం తో మరి కొందరు పరిస్థితుల ప్రభావం వల్ల కొందరు-- ఇలా రకరకాలుగా ఏమీ సాధించలేని అప్రయోజకులుగా మారుతారు. వీటిని వదిలించుకో గలిగితే మనిషిని విజయ లక్ష్మి ఏదో నాటికి వరిస్తుంది. యోగ వాశిష్టం లో ఒక గొప్ప శ్లోకం ఉంది. దాని అర్థ భాగమే గొప్పఉత్తేజాన్ని కలిగిస్తుంది. "దైవం నిహత్య కురు పౌరుష మాత్మ శక్త్యా" అని శ్రీ రామునికి గురువైన వశిష్ట మహర్షిచెబుతాడు. శ్రీ రామా, పురుష ప్రయత్నానికి మించిన ఉపాయం లేదు. కావున పౌరుషం తోనూ, ఆత్మ శక్తి తోనూ విధిని జయించు. అని ప్రబోధిస్తాడు. 

ఈ విధం గా ఉత్సాహంతో ప్రయత్నం చేసే వారికి ప్రకృతిలో అన్నీలభిస్తాయి. అది బాహ్యం గా కావచ్చు, అంతరికంగా కావచ్చు. ప్రయత్నశీలుడు ఏదోనాటికి తప్పక విజయాన్నిపొందగలడు.ప్రకృతిలో అన్నీ ఉన్నాయి. వాటిని అందుకునే వారే అరుదు. ఇంకొక్క మాట. ఈనాడు మనం Positive Thinking అని పేరు పెట్టి విదేశీయుల సాహిత్యాన్ని కాపీకొట్టి ఏదో సాధించి నట్టు చెప్పు కుంటున్నాం.నిజమైన Positive Thinking యొక్క మూలాలు యోగ వాసిష్టాది ప్రాచీన గ్రంధాలలో లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. ఈ అర్థ శ్లోకం ఒక చిన్న ఉదాహరణ మాత్రమె.మనం విదేశీయులను కాపీ కొట్ట నక్కర లేదు. మన పెద్దల వారసత్వాన్ని సరిగ్గా అందుకోగలిగితే అదే చాలు. దానిని మించిన సంపద ఈ ప్రపంచం లో మరే దేశంలోనూ లేదు.
read more " ఒక మంచి మాట "

27, జులై 2009, సోమవారం

భయాన్ని జయించటం ఎలా?

భయం లేని మనిషి ఉండడు. ఏదో ఒక రకమైన భయం ప్రతి వానిని వెంటాడుతూ ఉంటుంది. భయం లేకపోతే మృత్యు భయం ఉండనే ఉంటుంది. నాకు చావంటే భయం లేదు అని బీరాలు పలికే వారు చివరి దశలో గజ గజా వణికి పోవటం నేను చూచాను. అలాగే, అతి మామూలు మనుషులు అని లోకం దృష్టిలో కనిపించేవాళ్ళు ఇంకో పది నిమిషాల్లో చనిపోతున్నాను అని తెలిసినా, ధైర్యంగా నవ్వుతూ పోవటమూ చూచాను.

భయం పోవటానికి నాకు తెలిసిన ప్రక్రియ చెబుతాను. మనకు భయాన్ని కలిగించే పరిస్థితిని తప్పించుకోవటానికి ఎట్టి పరిస్థితిలోనూ ప్రయత్నం చెయ్యరాదు. పరిస్తితిలోనే ఉండి భయం ఎందుకు కలుగుతున్నది, ఎక్కణ్ణించి వస్తున్నది గమనించాలి. ఒక ఉదాహరణతో చెప్తాను. నాకు చీకటిగా ఉన్న ఇంటిలో ఒక్కడినే ఉండాలి అంటే భయం అనుకుందాం. అటువంటప్పుడు ఎవరినో తోడూ తెచ్చుకోవటం లేదా చుట్టాల ఇంటికిపోయి రాత్రికి అక్కడ పడుకోవటం మొదలైన పనులు చెయ్యరాదు. ఒక్కడే అదే ఇంటిలో ఉండాలి. మనసు పీచు పీచు మంటున్నా మొండిగా ఉండాలి. భయం ఎందుకు, ఎలా, ఎక్కణ్ణించి మనసులో తలెత్తుతున్నదో గమనిస్తూ తనను తానె తరచి చూచుకుంటూ అవసరమైతే రాత్రంతా గడపాలి. ఇలా ఒక్క సారి చెయ్య గలిగితే భయం పటాపంచలౌతుంది. చెయ్యలేకపోతే జీవితాంతం భయం వెంటాడుతూనే ఉంటుంది.

కొందరికి కుక్కలంటే, ఇంకొందరికి చీకటంటే, దయ్యాలంటే, కొందరికి ఎత్తైన ప్రదేశాలంటే, ఇంకొందరికి ఒంటరిగా బయటకు పోవటం అంటే, కొందరికి స్టేజి మీద ఉపన్యాసం చెప్పాలంటే, ఇంకొందరికి పరీక్షలంటే ఇలా రకరకాల భయాలుంటాయి. వీటన్నిటికీ ఇదొక్కటే మందు. బుద్ధుడు ఆరేళ్ళపాటు ఒంటరిగా సాధన చేసాడు. అప్పుడు అడవులలో ఒక్కడే తిరిగేవాడు. సమయంలో తనలో కలిగిన భయాన్ని గురించి దానిని తాను ఎలా అధిగామించాడనే దాని గురించి తరువాతి వివరం గా చెప్పాడు. అడవిలో రాత్రిపూట ఒంటరిగా తిరిగేటప్పుడు ఒక్కొక్క ప్రదేశం లో ఒళ్ళు జల్లుమని భయం పుడుతుంది. అప్పుడు అదే చోట నిలిచి ఎందుకు భయం కలుగుతున్నది, అసలు మనసులోకి ఎలా ప్రవేశిస్తున్నది, కారణం ఏమిటి అని ధ్యానిస్తూ భయం పోయేవరకూ అక్కడే ఉండేవాడుట. విధంగా తాను భయాన్ని జయించానని ఆనందునితో సంభాషణల లో చెప్తాడు.

చాలా మందికి చీకటిలో ఒంటరిగా నడిచేటప్పుడు, ముఖ్యం గా నిర్మానుష్య మైన ప్రదేశాలలో, ఉన్నట్టుండి ఒళ్ళు ఝల్లు మన్నట్లు అనిపిస్తుంది. మన వెనక ఎవరో వస్తున్నట్టు అనిపిస్తుంది. తల తిప్పి చూద్దామన్నా ధైర్యం చాలదు. ఇట్టి పరిస్తితి నాకూ చాలా సార్లు ఎదురైంది. అప్పుడు బుద్ధుని మాటలు గుర్తు తెచ్చుకొని అదే ప్రదేశం లో నిలిచి ధ్యానించేవాడిని. ఎక్కడైతే భయం కలుగుతున్నదో అక్కడే మొండిగా నిలిచి, వీలైతే కూర్చొని ధ్యానం చేసేవాడిని. కొద్ది సేపటికి భయం పటాపంచలయ్యేది. నా స్థితికి నాకే నవ్వొచ్చేది. మళ్ళీ బుద్ధ భగవానుని తలచి ప్రణామాలు అర్పించి ముందుకు పోయేవాడిని.

ఒకసారి దెయ్యాల కొంపగా పేరు పడ్డ ఒక పాడుబడిన ఇంట్లో రాత్రి పదకొండు గంటల సమయంలో ధ్యానం చేశాను. శరీరం మనసు రెండూ బలవంతంగా వ్యతిరేకిస్తున్నాయి.లేచి బయటకు పారిపోదామని బలంగా అనిపిస్తున్నది. గుండె పీచు పీచు మంటున్నది. చెమటలు పడుతున్నాయి. నా మనస్సు రెండుగా చీలిపోయి ఒక భాగం ఉండు అని ఒక భాగం లేచి పారిపో అని చెబుతున్నాయి. అయినా మొండిగా అలాగే కూర్చొని ఒక గంటసేపు ధ్యానం చేశాను. ఏం జరుగుతుంది మహా అయితే ప్రాణం పోతుంది. అంతేగా. అదీ చూద్దాం ఎలా ఉంటుందో అనుకుంటూ కూచున్నాను. నాకు ఏమీ దెయ్యాలు కనిపించలేదు. మన మనస్సులో ఎప్పుడో విన్న కథలు, చదివిన పుస్తకాలు, చూచిన సినిమాలే జ్ఞాపకాలుగా గుర్తొచ్చి భయపెడతాయి తప్ప ఇంకేమీ లేదు. దయ్యాలు లేవా అంటే అది వేరే సబ్జెక్టు. ఖచ్చితంగా ఉన్నాయి. అందులో మాత్రం అనుమానం లేదు. కాని నూటికి తొంభై శాతం మన మనసే మనలను భయపెడుతుంది.

భయాన్ని అనేక విధాలుగా జయించవచ్చు. కొందరు తమ ఇష్ట దైవం మీద విశ్వాస బలంతోనూ, ఇంకొందరు నామ జపం లేదా మంత్ర జపం తోనూ, ఇంకొందరు మనో బలం తోనూ, ఇంకొందరు బుద్ధుని మార్గమైన విపస్సాన విధానంతోనూ అధిగమించ వచ్చు. వీటిలో బుద్ధుని మార్గం కష్టతరమైనది. ఎందుకంటే దీనిలో దేవుని వంటి బాహ్యమైన ఇంకొకరిపైన ఆధార పడటం ఉండదు. ఉన్న సమస్యను లోతుగా తరచి చూచి దాని మెకానిజం అర్థం చేసుకొని, మనస్సులో మార్పులు ఎలా కలుగుతున్నవో లోతుగా గమనించి చూచి సమస్యను అధిగమించటం ఉంటుంది. కాని చెయ్యగలిగితే ఇది అద్భుతమైన విధానం. దీనిని మించిన పధ్ధతి లేదు అని చెప్పవచ్చు. కాని సాహసం ధైర్యం ఉన్నవారే దీనిని అమలులో పెట్ట గలుగుతారు. ధైర్యం లేని వారికి ఇది కష్టం గా ఉంటుంది.

ఉపనిషత్తుల ముఖ్యమైన బోధన ఏమిటి అని ఒకరు మహాయోగి, మహా జ్ఞాని అయిన వివేకానంద స్వామిని అడిగారు. ఆయన దానికి సమాధానమిస్తూ. అభీహి, అభీహి ( భయ రహితుడవై ఉండు, భయ రహితుడవై ఉండు) అనేదే ఉపనిషత్తుల ముఖ్య బోధన అని చెప్పారు. తనను అనుసరించే వారికి కూడా ఉండవలసిన ముఖ్య లక్షణం ఇదే అని ఆయన నొక్కి చెప్పారు. తనను అన్ని జీవులలోను, అన్ని జీవులను తనలోను చూస్తున్న వానికి భయమేక్కడిది? అసహ్య మేక్కడిది? అని చెప్పే మంత్రాలు ఉపనిషత్తులలోను భగవత్ గీతలోను ఉన్నాయి. ఇట్టి స్థితి ఆధ్యాత్మిక సాధనలో అత్యున్నత భూమిక అయిన బ్రాహ్మీ భూత స్థితి. మనకు స్థాయి లేకపోయినా, మన చేతనైనంతలో ధైర్యాన్ని కలిగి ఉండటం ముఖ్యం. నిర్భయత్వం అనేది సాధనా మార్గంలో సాధించ వలసిన ఒక ముఖ్యమైన లక్షణాలలో ఒకటి. సాధన చేసే వారు తనలోని భయాలను గుర్తించి వాటిని అధిగమించవలసి ఉంటుంది. దానిని సాధించటంలో బుద్ధుని విపస్సాన ధ్యాన మార్గం అత్యుత్తమం.
read more " భయాన్ని జయించటం ఎలా? "

25, జులై 2009, శనివారం

వీర విద్యలు-అభ్యాస విధానాలు


ప్రపంచంలోని ముఖ్యమైన వీర విద్యలన్నీ పరిశీలిస్తే కొన్ని ముఖ్య విషయాలు అన్నింటిలో ఒకటిగానే ఉంటాయి. స్వల్పమైన తేడాల వల్లే వేరు వేరు విద్యలుగా గుర్తించ బడుతున్నా, నిజానికి ఇవన్నీ వేర్వేరు కావు. అతి ప్రాచీన మైనకలారి పాయట్టు, మర్మ అడి, వజ్ర ముష్టి, ఇంకా చైనీస్ కుంగ్ ఫూ విద్యలలో ఓపెన్ హేండ్ మరియు వెపన్స్ రెండూకలిపి నేర్పే పద్ధతులు ఉండేవి. కాని తరువాత తరువాత టెక్నిక్స్ ను బట్టి వేరు వేరు విద్యలుగా చీలిపోయాయి.

ఉదాహరణకు-- మనిషిని ఎత్తి విసిరి పారవేసే బాడీ త్రోస్ ఎక్కువగా ఉండటం జూడో ప్రత్యేకత. అలాగే జాయింట్ లివరేజి టెక్నిక్స్ ఉపయోగించి కాళ్ళు చేతులు విరిచేయటం, మనిషిని కదలకుండా బంధించటం జుజుత్సు ప్రత్యేకత. ఇక కుంగ్ఫూ లోని విభిన్న శాఖలలో- ప్రత్యర్థిని హాని చేయకుండా కంట్రోల్ చేయటం నుంచి, ప్రాణాంతక టెక్నిక్స్ వరకూ అన్నిస్థాయిలు ఉన్నాయి. ప్రత్యర్థి బలాన్ని తిప్పి అతని మీదే ప్రయోగించి ఓడించటం అయికిడో ప్రత్యేకత. ఇక తాయిఛి విషయానికొస్తే అతి తేలికగా కనిపించే టెక్నిక్స్ తో ప్రాణశక్తిని ఉపయోగించి నాడీకేంద్రముల మీద ప్రత్యెకమైన దెబ్బలతో ప్రత్యర్థిని మట్టి కరిపించటం దీని లక్షణం. కరాటేలో మనిషిని భయంకరమైన ప్రాణాంతక దెబ్బలతో పడగొట్టటం ఉంటుంది.

కరాటే లోని విభిన్న స్టైల్స్ లో కొన్ని ఎక్కువ హేండ్ మూవ్మెంట్స్ కు మరికొన్ని స్టైల్స్ కిక్స్ కు ఎక్కువ గా ప్రాధాన్యతనిస్తాయి. సదరన్ షావులిన్ కుంగ్ ఫూ లో ఎక్కువగా హేండ్ టెక్నిక్స్ వాడకం ఉంటుంది. అదే నార్తర్న్ షావులిన్ కుంగ్ఫూ లో కిక్స్ కు ప్రాధాన్యత ఎక్కువ. ఒక్క కుంగ్ఫూ లో మాత్రమె 50 రకాల ఆయుధాలు వాడటం నేర్చుకోవచ్చు. జపనీస్ కరాటే స్టైల్స్ లో ఆయుధాలు ఉండవు. కరాటే అంటేనే ఎంప్టీ హేండ్ కనుక ఆయుధాల అభ్యాసానికి "కొబుడో" అనే జపనీస్ మార్షల్ ఆర్ట్ విడిగా ఉంది. దీనిలో నన్ చాకు, సాయి, టోంగ్ఫా, కాలి మొదలైన ఆయుధాల వాడకంనేర్చుకోవచ్చు.

అన్ని మార్షల్ ఆర్ట్స్ ను పరిశీలించిన మీదట నా సొంత స్టైల్ లో నేను ఈ క్రింది అభ్యాసాలు ముఖ్యంగా తీసుకున్నాను.

>>Body Conditioning: దీనిలో ఒంటిని దృడం గా చేసే అభ్యాసాలు, ఎటు కావాలంటే అటు విల్లులా వంచేఅభ్యాసాలు ముఖ్యమైనవి

(Strength and Flexibility Improving Exercises) ఇవి కాక శరీరంలోని పిడికిలిమొదలైన ముఖ్య సహజ ఆయుధాలను ఉక్కులా గట్టి పరిచే ప్రక్రియలు. కలారి పయట్టులోని "మైప్పత్తు" విభాగం లోనుంచి కొన్ని అభ్యాసాలు తీసుకున్నాను.

>>Offense Techniques: దీనిలో చేతి వెళ్ళు, కణుపులు, పిడికిలి, అరచెయ్యి, ముంజేయి, మోచేయి, భుజం, తల, ఉపయోగించి కొట్టే 24 రకాల దెబ్బలు ఉంటాయి. అలాగే మోకాలు, పాదం, మడమ, పాదం పక్కన కత్తి లాంటి భాగం ఉపయోగించి చేసే ముఖ్యమైన 12 రకాలైన కిక్స్ ఉన్నాయి. ఇవి కాక జాయింట్ లాక్స్, బాడిత్రోస్ తో బాటు నాడీకేంద్రాలను దెబ్బ తీసే ప్రాణాంతకమైన మర్మవిద్యా విధానాలు ఉంటాయి.

>>Defense Techniques: వీటిలో లాఘవంగా తప్పుకొనే విధానాలు, చేతులు కాళ్ళు ఉపయోగించి చేసే 24 రకాల బ్లాకింగ్ పద్ధతులు ఉన్నాయి.ఒకేసారిగా ఈ రెండు విభాగాలలో ఫుట్ వర్క్ కూడా కలిసే అభ్యాసం చేయటం జరుగుతుంది.ఎనిమిది రకాలైన ఫుట్ వర్క్ వాడటం దీనిలో ఉంటుంది.

>>Weapons: ముఖ్యమైన 6 రకాల ఆయుధాలు వాడే విధానాలు ఇందులో ఉంటాయి. ప్రాచీన కాలంలో ఉపయోగించిన ఆయుధాలు ఇప్పుడు ఉపయోగపడవు. ఉదాహరణకు సమురాయి స్వోర్డ్ భుజానికి తగిలించుకుని తిరగటం ఈ రోజులలో నేరం. అందుకని లాంగ్ స్టిక్, డబుల్ షార్ట్ స్టిక్స్, శికిబో, చేతిలో ఇమిడిపోయే యావార స్టిక్, బెల్ట్ అండ్ టవల్, షార్ట్ నైఫ్-- మొదలైన ఆయుదాలకే ప్రాధాన్యత నిచ్చాను.
 
రెండునెలల క్రితం ఒకసారి ఆదోని కొండమీద రణమండల ఆంజనేయస్వామి గుడికి పోదామని కొండ ఒంటరిగా ఎక్కుతుంటే కొండముచ్చుల గుంపు ఎటాక్ చేసింది.అప్పుడు నడుముకున్న బెల్టుని బాణాకర్రలా తిప్పి వాటిని పారదోలటం జరిగింది.
 
>>Breathing and Meditation: వీర విద్యలకు అవసరమైన ప్రాణాయామ, ధ్యాన విధానాలు ఈ విభాగంలో పొందుపరచాను.

ఈ విధంగా ముఖ్యమైన అన్ని అభ్యాసాలు క్రోడీకరించి నా పర్సనల్ స్టైల్ ను ఒక పరిపూర్ణమైన విధానంగా తయారుచేశాను.
read more " వీర విద్యలు-అభ్యాస విధానాలు "

18, జులై 2009, శనివారం

ఉత్తర కాలామృతం-ఇందులగ్నం

ధన మూల మిదం జగత్. ప్రపంచం డబ్బుతో నడుస్తున్నది. ప్రతివారికీ తనకెంత ధనయోగం ఉందో తెలుసుకోవాలనిఉంటుంది. జీవితంలో తనకు ధనయోగం ఉందా లేదా తెలుసుకోవాలని ఉంటుంది. ఇది తెలియాలంటే,ధనయోగాలు జాతకంలో ఉన్నవా లేవా చూడటం ఒక పధ్ధతి.

అయితే, కాళిదాసు తన ఉత్తర కాలామృతం గ్రంధం లో నాలుగోఅధ్యాయం లో ఇరవై ఏడవ శ్లోకంలో ఇందు లగ్నం అనే ఒక కొత్త పద్ధతిని ఇచ్చి ఉన్నాడు.
ఈ విశేష విధానం ఇతర గ్రంధాలలో కనిపించదు. దీని ద్వారా ధనయోగం ఉందా లేదా? ఉంటే దశలో అది ఫలిస్తుంది? అనేది తెలుసుకోవచ్చు. తద్వారా సమయంలో ప్రయత్నాలు బలం గా చెయ్యటం ద్వారా ధన సంపాదన చెయ్య వచ్చు.

శ్లోకం||అర్కాన్నాగ చటస్తనుర్జన నట ఖేటాయనం స్యుస్తనో||శ్చంద్రా ద్భాగ్యపయో కలైక్య మిన హ్రుచ్చిష్టంవిదోర్యద్గృహం||
తద్రాశౌతు విపాప శోభన ఖగే కోటీశ్వరం తన్వతే ||చేత్ పాపేతు సహస్రశః ఖల ఖగే తుంగేతు కోటీశ్వరం||

అర్థం|| అర్కాత్= సూర్యుడు మొదలు; నాగ=30; చట=16; తను=6; జన=8; నట=10; ఖేట=12; అయనం=1; స్యు= అగుచున్నవి.
స్తనోశ్చంద్రా ద్భాగ్యపయో కలైక్య మిన హ్రుచ్చిష్టం విదోర్యద్గృహం= లగ్న చంద్రులనుంచి భాగ్యాదిపతులకళలను పన్నెండుచే భాగించి, మిగిలిన సంఖ్య చంద్రునినుంచి ఎన్నవ రాశియగునో; తద్రాశౌతు విపాప శోభన ఖగే కోటీశ్వరం తన్వతే= రాశి పాపుల స్పర్శ లేక శుభ గ్రహముల తో కలసి ఉంటే కోటీశ్వరుడగును. పాపేతు సహస్రశః= పాప గ్రహ మున్నను వేలాదికారిని చేయును. ఖల ఖగే తుంగేతు కోటీశ్వరం= పాప గ్రహమైనను ఉచ్చ స్థితి యందున్న యెడల కోటీశ్వరుడగును.

అనగా, రవి చంద్ర కుజ బుధ గురు శుక్ర శనులకు వరుసగా 30,16,6,8,10,12,1 అనే (Units) కళలున్నవి. మనకుకావలసింది భాగ్య భావ విషయం కాబట్టి లగ్న చంద్రులనుంచి భాగ్యాదిపతుల కళలను కూడి పన్నెండుచే భాగించివచ్చిన సంఖ్యా ప్రమాణ రాశి చంద్రుని నుంచి లెక్కించగా రాశి లేదా రాశ్యాదిపతి స్థితిని బట్టి ధన యోగం ఊహించమని శ్లోకార్థం.

ఉదాహరణకు మధ్యనే వ్రాసిన NTR జాతకం తో చూద్దాం. ఈయనకు లగ్నం చంద్ర లగ్నం రెండూ తుల కనుక భాగ్యభావం మిథునం అధిపతి బుధుడు అవుతాడు. బుధుని కళ 8+8=16/12=4 శేషం. కనుక చంద్రుని నుంచి నాలుగుఅయిన మకరం అధిపతి శని. శని భగవానుడు దశామ్షలో ఉచ్చ స్థితి లో ఉండటంతో. లాభ స్థానం లో రాహువుతోకలిశి ఉండటంతో, శని దశలో విపరీత భాగ్య వృద్ధి ఉంది అని చెప్ప వచ్చు. తరువాత వచ్చిన బుధ దశ భాగ్యదిపతి దశకనుక ఇదీ యోగిస్తుంది అని చెప్ప వచ్చు. నిజంగా జరిగింది కూడా ఇదే కదా. ఈయనకు శని దశ, బుధ దశలలోవిపరీత ధన యోగం కలిగింది.

ఈ విధానం ప్రపంచంలో గొప్ప కోటీశ్వరులైన బిల్ గేట్స్, అంబానీ సోదరులు, వారెన్ బఫెట్, లక్ష్మి మిట్టల్ మొదలైన వారి జాతకాలలో పరీక్షించగా ఆశ్చర్య కరమైన ఫలితాలు కనిపించాయి.

ఇంకొక జాతకానికి లగ్నం మకరం, చంద్ర లగ్నం మీనం. కనుక భాగ్యదిపతులు వరుసగా బుధుడు, కుజుడు అవుతారు. వీరితో లెక్క వేయగా,8+6=14/12=2 శేషం అవుతుంది. కనుక మీనాత్ రెండు అయిన మేషం. మేషం లో ఎవరూ లేరు. కాని కుజుడు సింహ రాశిలో బలంగా ఉన్నాడు. కనుక 2017 నుంచి మొదలయ్యే కుజ దశ ధన పరంగా బాగాయోగిస్తుంది అని చెప్ప వచ్చు.

ఇంకొక జాతకానికి లగ్నం వృషభం, చంద్ర లగ్నం ధనుస్సు. భాగ్యాదిపతులు వరుసగా శని, రావులు. కనుక లెక్కించగా 1+30=31/12=7
కనుక ధనుస్సు నుంచి ఏడవది మిథునం. బుధుడు గురువు తో కలిశి మేషంలో చంద్ర లగ్నాత్పంచమంలో ఉన్నందున 2013 నుంచి వచ్చే గురు దశ ధన పరంగా యోగిస్తుంది అని చెప్ప వచ్చు.

ఇలా లగ్న చంద్ర లగ్నాల వల్ల ధన యోగాన్ని లెక్కించే విధానం కాళిదాసు మనకు ఇచ్చాడు. ఇది జాతకంలోచూచినా సరిగా సరిపోయే ఒక ఖచ్చితమైన పద్దతి. ఆధారంతో గ్రహాలకు కళలు (Units) కేటాయించారోమనకు తెలియదు. కాని దీనికి తప్పక ఒక లెక్క ఉండే ఉంటుంది. ఆయా గ్రంధాలు ధ్వంసం అవటం వల్ల అనేక missing links
ఏర్పడ్డాయి. ప్రస్తుతం మనం ఊహించవలసిందే. చంద్రునికి కళలు పదహారు అని అంటారు కదా. బహుశా అందుకనే ఇక్కడ పదహారు కళలు ఇచ్చి ఉండవచ్చు. శుభ ఫలితాలు ఇచ్చే రీత్యా ఈ కళలు కేటాయించారు అనిపిస్తుంది. అందుకనే రవికి 30 మరియు శనికి 1 ఇచ్చినట్లుంది. మొత్తంమీద కళలు ఎలా కేటాయించారో తెలియనప్పటికీ విధానం విశ్లేషణలో చక్కగా పని చేస్తుంది. జ్యోతిర్విజ్ఞానం లో పరిశ్రమ చేస్తున్నమిత్రులు పరీక్షించి చూడండి.
read more " ఉత్తర కాలామృతం-ఇందులగ్నం "

16, జులై 2009, గురువారం

NTR జాతకం

NTR 28-5-1923 తేదీన సాయంత్రం 4-43 నిముషాలకు కృష్ణాజిల్లా లోని నిమ్మకూరు గ్రామంలో పుట్టారు.ఈయన రుధిరోద్గారి నామ సంవత్సరం అధికజ్యేష్ట శుక్ల త్రయోదశి సోమవారం రవి హోరలో జన్మించాడు. ఆయన జాతకచక్రాలు రాశి,నవాంశ,దశాంశలు ఇక్కడ చూడండి. ఈయన జాతకవిశ్లేషణ అంత తేలిక కాదు. 

అసలు అన్నిజాతకాలకూ ఒకే పద్దతి పనికి రాదు. ప్రతి మనిషి ఇతరుల కంటే విభిన్నంగా ఎలాగైతే ఉంటాడో అలాగే ప్రతి జాతకమూ దానికది ప్రత్యేకంగానే ఉంటుంది. అన్నింటికీ ఒకేపద్దతి పనికి రాదు.కాని అన్నింటికీ వర్తించే కొన్ని సూత్రాలు ఉంటాయి.అలాగే ఆజాతకానికి మాత్రమె వాడవలసిన ప్రత్యెకసూత్రాలు కొన్నిఉంటాయి. ఆ కోణంలోనించి చూస్తేనే ఆ జాతకం అర్థం అవుతుంది. 

ఈయన జాతకంలో బుధుడు,గురువు,శనిమూడు గ్రహాలు వక్రించి ఉన్నాయి.మామూలుగా పైపైన చూస్తె ఈయన జాతకం గొప్పజాతకం అని అనిపించదు.కాని ఈ మూడుగ్రహాల వక్రత్వంవల్ల వాటిని రెక్టిఫై చేస్తేనే ఈజాతకం లోతు అర్థం అవుతుంది. నాడీవిధానం ప్రకారం వక్రగ్రహాలు వెనుక రాశులలో ఉన్నట్లుచూడాలి.ఆ విధంగా వేశిన జాతకం విశ్లేషణ చేస్తే ఈయనజాతకం సరిగ్గా అర్థం అవుతుంది. ఈ విషయం గ్రహించలేక పేరుమోసిన అనేక మంది జ్యోతిష్కులు ఈయన జాతకాన్ని విశ్లేషణ చెయ్యటానికి నానాతంటాలూ పడి ఏవేవో సూత్రాలు అప్ప్లై చేసి మొత్తంమీద ముగించామని అనిపించుకున్నారు. నేను వారినెవరినీ విమర్శించటం లేదు.సందర్భం వచ్చింది గనుక నాకు తోచిన మాటగా పరిశీలనలో నిగ్గుతేలిన సత్యాన్ని వినమ్రతతో చెబుతున్నాను. 

చాలామంది విశ్లేషణ చేసి చెప్పినప్రకారం ఈయన జాతకంలో గజకేసరియోగం వల్లనే ఆయనకు మహాయోగం పట్టింది అంటారు.కాని గజకేసరి యోగం ఒక్కటే అంతటి ఎత్తులకు తీసుకుపోలేదు. మిగిలిన జాతకంకూడా కొంత బలంలేకపోతే ఉత్త గజకేసరియోగం పెద్దగా ఫలితాలు ఇవ్వదు. శని ఆత్మకారకునిగా లాభస్థానంలో రాహువుతో కలిశిఉండటంతో రంగులు వేసుకొని వేషాలు మార్చే సిన్మారంగంలో లాభసాటిగా ధనాన్ని సంపాదించాడు.రాహువుకున్న కారకత్వాలలో వేషాలు మార్చటం ఒకటి.రాహువు వేషంమార్చి దేవతలపంక్తిలో చేరి అమృతం సేవించిన కథ చాలామందికి తెల్సు కదా. సినిమా నటుల జాతకాలలో రాహువుకు ప్రత్యెకపాత్ర ఉంటుంది.ఎందుకంటే రాహువు స్వతహాగా రాక్షసుడు మరియు మాయావి. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు భ్రమింపజేయటం రాహువు కారకత్వాలలో ఒకటి. NTR కూడా రావణుడు, దుర్యోధనుడు మొదలైన పాత్రల్లోనే బాగా రాణించాడు. రాముడు, కృష్ణుడు మొదలైన పాత్రలు మొదట్లో వేసినా తరువాత తరువాత పురాణాలలోని విలన్లను హీరోలుగాను, హీరోలను విలన్లుగాను చూపే ప్రయత్నం చేసాడు.భూకైలాస్ గాని, దానవీరశూరకర్ణ గాని,ఇంద్రజిత్ గాని ఇవే తరహా సినిమాలు. వీటికి కారణం లాభస్థానం లోని రాహువు మరియు ఆత్మకారకుడైన శని యొక్క ప్రభావం. రాహువు యొక్క దేవద్వేషం పరోక్షంగా ఈయనమీద ప్రభావంచూపింది.ఒక గ్రహం మనకు యోగకారకం అయినపుడు దానిలక్షణాలు కూడా మనమీద ప్రభావం చూపుతాయి. 

అలాగే రాహువు ఈయనను బాగా ప్రభావితం చేసింది. భాగ్యాధిపతి అయిన బుధుడు సప్తమకేంద్రంలో లగ్నాధిపతి అయిన శుక్రునితో కలిసిఉండి ఇద్దరూ కలిసి లగ్నాన్ని బలంగా చూస్తున్నారు.కనుక అందం, కళాకౌశలం, తెలివి, విలాసవంతమైన జీవితం కలిగాయి. ధనాధిపతి మరియు సప్తమాధిపతి అయిన కుజుడు భాగ్యస్థానంలో ఉండటంవల్ల ధనయోగం కలిగింది. అంతేకాదు, ఈయన జాతకం కంటే ఈయన సతీమణి జాతకం బలంగా ఉందని, ఆ జాతకబలం ఈయనకు తోడై నిలిచిందని తెలుస్తున్నది. అందుకే వివాహం చేసుకున్న తరువాతనే ఈయనకు బాగా కలిసి వచ్చింది. అలాగే ఆమె మరణం తరువాత ఈయనకు చెడుకాలం మొదలైంది. ఈ సంగతి అందరికీ తెలుసు. 

NTR జాతకంలో చిక్కుముడి

మూడు గ్రహాలు వక్రించి ఉండటం ఈయన జాతక విశ్లేషణలో పెద్దచిక్కు. కాని చిక్కుముడి విప్పగలిగితే తర్వాతి జాతకం తేలికగా అర్థం అవుతుంది. వక్రగ్రహాల ఫలితం ఏమిటంటే, స్థూలంగా చెప్పాలంటే, మొదట్లో ఉన్న పరిస్థితి తరువాత మారిపోతుంది. ఎందుకంటే వక్రగ్రహం తానున్న స్థానం నుంచి వెనుకభావంలోకి ప్రయాణం చేస్తుంది కనుక. గురువుగారి వక్రత్వంవల్ల మొదట్లో గజకేసరియోగం ఉన్నప్పటికీ, తరువాత యోగభంగం కలగటం జరుగుతుంది. అలాగే రెండుసార్లు రాజయోగం పట్టి, తరువాత పదవి ఊడింది కదా. శని వక్రతవల్ల, మొదట్లో ఒక మోస్తరు కుటుంబంనుంచి వచ్చినా కాలక్రమేణా రాహువుఉన్న ఏకాదశస్థానానికి శని చేరటంవల్ల సినిమా రంగంలో లాభించి బాగా ధనార్జన చేయటం జరిగింది. కళలను సూచించే సహజ పంచమస్థానం సింహం ఈయన జాతకంలో లాభస్థానం కావటం చూడవచ్చు.పంచమం ఎలా కళలను సూచిస్తుంది అనే అనుమానం రావచ్చు. నాటకరంగాన్ని తృతీయం చూపిస్తుంది. పంచమం దీనికి తృతీయం కనుక భావాత్భావసూత్రం ప్రకారం పంచమం అతి బలీయమై ప్రదర్శకకళలను (Performing Arts) చూపుతుంది. అలాగే బుధుని అష్టమస్థితి సప్తమకేంద్రస్థితిగా మారి, మిత్రుడైన శుక్రునితో కలయికవల్ల, మరియు గజకేసరియోగ దృష్టి వాటిమీద పడటంవల్ల క్రమేణా జీవితంలో ఉన్నతశిఖరాలు అధిరోహించటం సూచింపబడింది. అదికూడా వివాహం తదుపరి యోగం పట్టింది అని సప్తమస్థానం వల్ల తెలుస్తున్నది. కాని వీటికి ఇంకొక అర్థంకూడా ఉన్నది.

బుధుని వక్రస్థితివల్ల జీవితంలో సరియైన నిర్ణయాలు తీసుకోలేకపోవటం జరుగుతుంది. సప్తమంలో శుక్రబుదుల స్థితివల్ల రెండవకళత్రం విషయంలో సరియైన నిర్ణయం తీసుకోలేక ఘోరమైన దెబ్బతినడం జరిగింది. పంచమంలో కేతుస్థితివల్ల మంత్రసిద్ధి త్వరగా కలుగుతుంది. అందుకే మంత్రతంత్రాలలో ఆసక్తి, జాతకాలమీద నమ్మకాలు, పూజలు పునస్కారాలలో ప్రవేశం, నియమనిష్టలను పాటించటం ఉన్నాయి. తెల్లవారుజామున నాలుగుగంటలకే లేచి అరగంటసేపు పూజ ధ్యానం చెయ్యటం అనేది ఈ కేతువు మంత్రస్థానం అయిన పంచమంలో ఉండటం వల్ల వచ్చింది. కాని ఇంకోరకంగా ఇది పుత్రదోషం కనుక కుమారుడు రామకృష్ణ మరణించాడు. గురువు వక్రస్థితివల్ల దేవబ్రాహ్మణులంటే మొదట్లో గౌరవం ఉన్నా, చివరికి ద్వేషంగా మారింది. శని వక్రస్థితివల్ల మొదట్లో తనకు ఓట్లేసి గెలిపించి బ్రహ్మరథం పట్టిన సామాన్యజనమే చివరికి పదవీచ్యుతున్ని చేసారు. బుధుడుబుద్ధికీ, గురువు దేవబ్రాహ్మణులకూ, శని సామాన్యజనానికీ కారకులని జ్యోతిర్వేత్తలకు తెలుసుకదా. దశామ్శలొ కూడా శనివక్రత్వంవల్ల అష్టమంనుంచి సప్తమం అయిన తులాలగ్నానికి వచ్చి Exalted అవుతాడు. అక్కణ్ణించి లగ్నాన్ని అందులోని గజకేసరియోగ కారకులైన గురుచంద్రులను సప్తమద్రుష్టితోను, D-10 చార్ట్ లోదశమం అయిన మకరాన్ని దశమదృష్టి తోనూ బలంగా చూస్తాడు. ఈ శని ఈయన జాతకంలో ఆత్మ కారకుడనేది ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. D-10 లో పట్టిన ఈ అత్యంత శుభయోగం వల్ల ఈయన సినిమారంగాన్ని అన్నిదశాబ్దాలు మకుటం లేని మహారాజులా ఏలాడు. వృత్తిపరంగా ఎదురులేకుండా ఉండటానికి గ్రహస్థితే కారణం.వర్గచక్రాలు చూడకుండా ఉత్త రాశిచక్రంచూచి మొత్తం ఫలితాలు చెప్పలేము అనటానికి ఇది ఒక ఉదాహరణ. రాశిచక్రంలో లేని ప్రత్యేకతలు వర్గచక్రాలలో కనిపిస్తూ, ఆయా రంగాలలో లోతైన విశ్లేషణ చెయ్యటానికి పనికి వస్తాయి. అందుకేపరాశర మహర్షి వర్గచక్రాల గురించి (Divisional Charts) బృహత్ పరాశరహోరాశాస్త్రం మొదట్లోనే చెబుతాడు. మూడుగ్రహాల వక్రత్వం అనే చిక్కుముడిని ఈ విధంగా విప్పి అర్థంచేసుకుంటే తరువాతి జాతకం సులభంగా అర్థంఅవుతుంది.  

దశలు - జీవిత విశేషాలు 

ఈయన స్వాతినక్షత్రం నాలుగోపాదంలో పుట్టటంతో రాహు మహర్దశ చివరిలో ఇంకా ఒక ఏడాది ఏడు నెలలు మిగిలిఉండగా జననం జరిగింది. అంటే దాదాపు 18 సంవత్సరాలు వచ్చేవరకూ ( అంటే 1941 వరకూ) గురు మహర్దశ జరిగింది. తరువాత 1960 వరకూ శనిమహర్దశ జరిగింది. తరువాత 1977 వరకూ బుధమహర్దశ, 1984 వరకూ కేతుదశ, తరువాత 18-1-1996 వరకూ శుక్రదశ జరిగాయి. ఈయన జీవితంలో మంచి రాజయోగ కాలం శని, బుధ, కేతు దశలు, కొంతభాగం శుక్రదశలలో జరిగింది. మొత్తంమీద జీవితంలో యుక్తవయసు నుంచి యోగకారక దశలు జరిగాయి కనుక గొప్పయోగజాతకం అని తెలుస్తున్నది.  

1941-1960 శని మహర్దశ: మే నెల 1942 లో రామారావు గారికి వివాహం జరిగింది. శని ఈ లగ్నానికి యోగ కారకుడు, శుక్రుడు లగ్నాధిపతి వివాహాన్ని సూచించే సప్తమస్థానంలో ఉన్నాడు. వివాహ సమయానికి జాతకంలో శని/శని/శుక్ర దశ జరుగుతున్నది. యోగకారక శనిదశ మొదలుకావటంతోనే వివాహం జరగటం చూడవచ్చు. కనుక యోగజాతకురాలైన భార్య దొరికింది. ఇందాక మనం అనుకున్న విషయం ఇక్కడ మళ్ళీ రుజువు అవుతున్నది. తరువాత బుధ అంతర్దశ మొదలైంది. బుధుడు సహజ విద్యాకారకుడు. వక్రస్థితిలో ఉండటం వల్ల, దశా నాథుడైన శనికి రాహుస్పర్శ వల్ల, శని చతుర్తాదిపత్యం వల్ల ( విద్య), ఇంటర్మీడియేట్ రెండుసార్లు తప్పాడు. గుంటూరు AC కాలేజీలో ఉన్నప్పుడే జగ్గయ్యతో కలిసి నాటకాలేసేవాడు. మే నెల 1947 లో ఈయనకు మొదటి మేకప్ టెస్ట్ జరిగింది. అప్పుడు శని/కేతు/గురు దశ జరుగుతున్నది. శని యోగకారకత్వం, సినిమా రంగానికి సూచకుడు రాహువుతో కలయిక, గురువుగారి గజకేసరియోగం కలిసి అప్పుడు పనిచేశాయి. కేతువు పంచమంలో ఉండటం తృతీయానికి భావాత్భావం కావటం గమనించాలి. భావాత్భావం సూత్రం జ్యోతిర్విజ్ఞానంలో ప్రవేశం ఉన్నవారికి మళ్ళీ వివరించవలసిన పనిలేదు. October 1947 లో శని/శుక్ర దశ జరిగినపుడు గుంటూరులో సబ్ రిజిస్త్రార్ గా ఉద్యోగంలో చేరాడు. సినిమాలలో చేరాలా వద్దా అని ఊగిసలాట ఒకవైపు, ఆఫీసులో అవినీతి భరించలేక ఒక వైపు సంఘర్షణకు లోనయ్యాడు. చివరకు ఉద్యోగం మానేసి మళ్ళీ మద్రాస్ చేరి 1950 వరకూ నానాకష్టాలు పడ్డాడు. 1947-50 మధ్యలో జరిగిన శని/శుక్ర దశలో ఒకసారి చేతిలో ఎనిమిది అణాలు లేక మూడురోజులు పస్తులున్నాడు. కనీసం సైకిలుకూడా లేక మైళ్ళకు మైళ్ళు మద్రాసులో నడిచి పోయేవాడు. రాహువు యొక్క బలీయమైన స్థితితో కలిగిన ఆత్మాభిమానంవల్ల ఈ సంగతి రూంమేట్స్ తో కూడా చెప్పలేదు. ఇదీ ఉత్తరకాలామృతంలో కాళిదాసు చెప్పిన దశాప్రభావం!!! నేను ఇంతకూ ముందే వ్రాసినట్లు- ఉత్తరకాలామృతంలో కాళిదాసు కొన్ని వందలఏళ్ళనాడే చెప్పాడు, శని శుక్రుడు ఇద్దరూ యోగ కారకులైతే శనిలో/శుక్ర దశ లేదా శుక్ర లో/శని దశ రాజును కూడా బిచ్చగాణ్ణి చేస్తుంది అనిఅది అక్షరాలా రుజువు కావటం ఇక్కడ చూడ వచ్చు. ఎంత పరిశోధనతో ఈ సూత్రాలు రూపొందించారో ఆ మహానుభావులు అని ఆశ్చర్యం కలుగుతుంది. మళ్ళీమళ్ళీ ఎన్ని జాతకాలు చూచినా ఈ సూత్రాలు తిరిగితిరిగి నిజం అవుతుంటాయి. ఇటువంటి ఋజువులు చూచినపుడు, మహర్షుల జ్ఞానసంపదకు ఆశ్చర్యం కలుగుతుంది. ఇంకోవైపు మన వారసత్వ సంపదను తెలుసుకోకుండా, మన సంస్కృతిని చెడగొడుతున్న హేతువాద, నాస్తిక, కమ్యూనిస్టు చెత్త సాహిత్యం చదివి, తెలిసీతెలియని మాటలు మాట్లాడుతూ విమర్శించేవారి అజ్ఞానానికి జాలి కలుగుతుంది. 1950 ప్రాంతాలలో వచ్చిన సంసారం, షావుకారు మొదలైన చిత్రాలలో నటించినా, 1951 లో విడుదల అయిన పాతాలభైరవితో ఈయన జీవితం మలుపుతిరిగింది. అప్పటినుంచి 1981 వరకూ 30 ఏళ్ళు సినిమాలలో నటించాడు. మధ్యమధ్యలో అపజయాలు ఎదురైనా తిరిగి నిలదొక్కుకుంటూ విజయవంతమైన చిత్రాలలో నటించాడు. శనిలో/రవిదశనుంచి ఈయనకు ఎదురు లేకుండా జరిగింది. కారణం రవి రాశి, దశామ్శలలొ వర్గోత్తమస్థితిలో ఉండటం. అప్పటినుంచి కేతుదశ చివరివరకూ సినిమాజేవితం జరిగింది. శుక్రదశ ప్రారంభంలో రాజకీయజీవితం ప్రారంభంఅయింది. 29th of March 1982 at 2.30PM తెలుగుదేశంపార్టీ మొదలైంది. కేతువులో/శని, బుధ అన్తర్దశలలొ తెలుగుదేశంపార్టీ పెట్టటం ప్రభుత్వం ఏర్పాటు చెయ్యటం జరిగాయి. కేతువు గురునక్షత్రంలో ఉండటం, గురు, బుధ, శనులు యోగకారకులు కావటం గమనించ వచ్చు. ఈయనకు మార్చి 1983 నుంచి శుక్రమహర్దశ మొదలైంది. రాజయోగం పట్టింది. 1989 లో శుక్రలో/కుజదశ జరుగుతున్నపుడు పార్టీ ఓడిపోయింది. కుజుడు దశామ్శలొ నీచస్థితిలో ఉండుట గమనించండి. తిరిగి 1994 లో అధికారంలోకి వచ్చింది. అప్పుడు శుక్ర దశలో చెడు చేసిన కుజ/ రాహు అన్తర్దశలు అయిపోయి, గురుఅంతర్దశమొదలైంది. శుక్రదశలో/ గురు అంతర్దశలో /చంద్ర విదశలో 18-1-1996 ఈయన మరణించాడు. అప్పటివరకూ మంచిచేసిన కుజుడు, రాహువు పూర్తిగా విపరీతఫలితాలు ఇవ్వటం ఇక్కడ చూడవచ్చు. జీవితం ముగియబోతున్నదని, పుణ్యబలం మరియు ఆయుస్సు అయిపోవస్తున్నాయని తెలుసుకోవటానికి ఇదొక సూచన. అప్పటివరకూ సపోర్టు చేసిన పంచభూతాలు, విరమించుకోవటమే మరణం. అలాగే అప్పటివరకూ యోగాన్ని ఇచ్చిన గ్రహాలు వెనుకకు తగ్గి పూర్తిగా వ్యతిరేక ఫలితాలు ఇవ్వటం జీవితం ఆఖరుకు ఒకసూచన. 1991 ప్రారంభంలో సుఖస్థానమైన మకరంలోకి శనిభగవానుని ప్రవేశంతో ఈయనకు అర్థఅష్టమశని మొదలయ్యింది. అప్పటినుంచే కుటుంబంలో కలతలు ప్రారంభం. 1993 మార్చిలో శని భగవానుడు కుంభరాశిలో ప్రవేశించాడు. పంచమంలో శనిప్రవేశంతో సంతానంతో మానసికఅగాథం ఏర్పడింది. కుటుంబచికాకులు ఎక్కువయ్యాయి. అక్కడ నుంచి తృతీయదృష్టితో సప్తమస్థానం అయిన మేషాన్ని వీక్షించాడు. 1994 లొ గురువు తులారాశి ప్రవేశంతో ఆయన సప్తమదృష్టి మేషంమీద పడింది. అందుకే 1994 లొ ద్వితీయవివాహం చేసుకున్నాడు. 1995 డిసెంబర్ లొ గురువుగారు ధనూరాశిలో ప్రవేశంతో పంచమద్రుష్టి మళ్ళీ మేషంమీద పడింది. మొదటిసారి వివాహకారకత్వాన్ని చూపిన సప్తమస్థానం ఈసారి మారక కారకత్వం Activate అయింది. జనవరి 1996 లో మరణం సంభవించింది. మరణం 22వ ద్రేక్కాణం నుంచి చూడవచ్చు. లగ్న, చంద్రుల నుంచి 22వ ద్రేక్కాణం వృషభం రెండవ ద్రేక్కాణంఅవుతుంది. వరాహమిహిరుని "బృహజ్జాతకం" ప్రకారం వృషభం రెండవద్రేక్కాణం ఇలా ఉంటుంది. "The 2nd Drekkana of sign Taurus is a man skilled in works connected with agriculture, grain, cows, music, dance, painting, writing and the like, skilled at the plough and in works connected with a conveyance, with a neck bent like that of the bullock, thirsty, with a face like that of the ram and dressed in dirty garments."
read more " NTR జాతకం "