NTR 28-5-1923 తేదీన సాయంత్రం 4-43 నిముషాలకు కృష్ణాజిల్లా లోని నిమ్మకూరు గ్రామంలో పుట్టారు.ఈయన రుధిరోద్గారి నామ సంవత్సరం అధికజ్యేష్ట శుక్ల త్రయోదశి సోమవారం రవి హోరలో జన్మించాడు. ఆయన జాతకచక్రాలు రాశి,నవాంశ,దశాంశలు ఇక్కడ చూడండి. ఈయన జాతకవిశ్లేషణ అంత తేలిక కాదు.
అసలు అన్నిజాతకాలకూ ఒకే పద్దతి పనికి రాదు. ప్రతి మనిషి ఇతరుల కంటే విభిన్నంగా ఎలాగైతే ఉంటాడో అలాగే ప్రతి జాతకమూ దానికది ప్రత్యేకంగానే ఉంటుంది. అన్నింటికీ ఒకేపద్దతి పనికి రాదు.కాని అన్నింటికీ వర్తించే కొన్ని సూత్రాలు ఉంటాయి.అలాగే ఆజాతకానికి మాత్రమె వాడవలసిన ప్రత్యెకసూత్రాలు కొన్నిఉంటాయి. ఆ కోణంలోనించి చూస్తేనే ఆ జాతకం అర్థం అవుతుంది.
ఈయన జాతకంలో బుధుడు,గురువు,శనిమూడు గ్రహాలు వక్రించి ఉన్నాయి.మామూలుగా పైపైన చూస్తె ఈయన జాతకం గొప్పజాతకం అని అనిపించదు.కాని ఈ మూడుగ్రహాల వక్రత్వంవల్ల వాటిని రెక్టిఫై చేస్తేనే ఈజాతకం లోతు అర్థం అవుతుంది. నాడీవిధానం ప్రకారం వక్రగ్రహాలు వెనుక రాశులలో ఉన్నట్లుచూడాలి.ఆ విధంగా వేశిన జాతకం విశ్లేషణ చేస్తే ఈయనజాతకం సరిగ్గా అర్థం అవుతుంది. ఈ విషయం గ్రహించలేక పేరుమోసిన అనేక మంది జ్యోతిష్కులు ఈయన జాతకాన్ని విశ్లేషణ చెయ్యటానికి నానాతంటాలూ పడి ఏవేవో సూత్రాలు అప్ప్లై చేసి మొత్తంమీద ముగించామని అనిపించుకున్నారు. నేను వారినెవరినీ విమర్శించటం లేదు.సందర్భం వచ్చింది గనుక నాకు తోచిన మాటగా పరిశీలనలో నిగ్గుతేలిన సత్యాన్ని వినమ్రతతో చెబుతున్నాను.
చాలామంది విశ్లేషణ చేసి చెప్పినప్రకారం ఈయన జాతకంలో గజకేసరియోగం వల్లనే ఆయనకు మహాయోగం పట్టింది అంటారు.కాని గజకేసరి యోగం ఒక్కటే అంతటి ఎత్తులకు తీసుకుపోలేదు. మిగిలిన జాతకంకూడా కొంత బలంలేకపోతే ఉత్త గజకేసరియోగం పెద్దగా ఫలితాలు ఇవ్వదు. శని ఆత్మకారకునిగా లాభస్థానంలో రాహువుతో కలిశిఉండటంతో రంగులు వేసుకొని వేషాలు మార్చే సిన్మారంగంలో లాభసాటిగా ధనాన్ని సంపాదించాడు.రాహువుకున్న కారకత్వాలలో వేషాలు మార్చటం ఒకటి.రాహువు వేషంమార్చి దేవతలపంక్తిలో చేరి అమృతం సేవించిన కథ చాలామందికి తెల్సు కదా. సినిమా నటుల జాతకాలలో రాహువుకు ప్రత్యెకపాత్ర ఉంటుంది.ఎందుకంటే రాహువు స్వతహాగా రాక్షసుడు మరియు మాయావి. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు భ్రమింపజేయటం రాహువు కారకత్వాలలో ఒకటి. NTR కూడా రావణుడు, దుర్యోధనుడు మొదలైన పాత్రల్లోనే బాగా రాణించాడు. రాముడు, కృష్ణుడు మొదలైన పాత్రలు మొదట్లో వేసినా తరువాత తరువాత పురాణాలలోని విలన్లను హీరోలుగాను, హీరోలను విలన్లుగాను చూపే ప్రయత్నం చేసాడు.భూకైలాస్ గాని, దానవీరశూరకర్ణ గాని,ఇంద్రజిత్ గాని ఇవే తరహా సినిమాలు. వీటికి కారణం లాభస్థానం లోని రాహువు మరియు ఆత్మకారకుడైన శని యొక్క ప్రభావం. రాహువు యొక్క దేవద్వేషం పరోక్షంగా ఈయనమీద ప్రభావంచూపింది.ఒక గ్రహం మనకు యోగకారకం అయినపుడు దానిలక్షణాలు కూడా మనమీద ప్రభావం చూపుతాయి.
అలాగే రాహువు ఈయనను బాగా ప్రభావితం చేసింది. భాగ్యాధిపతి అయిన బుధుడు సప్తమకేంద్రంలో లగ్నాధిపతి అయిన శుక్రునితో కలిసిఉండి ఇద్దరూ కలిసి లగ్నాన్ని బలంగా చూస్తున్నారు.కనుక అందం, కళాకౌశలం, తెలివి, విలాసవంతమైన జీవితం కలిగాయి. ధనాధిపతి మరియు సప్తమాధిపతి అయిన కుజుడు భాగ్యస్థానంలో ఉండటంవల్ల ధనయోగం కలిగింది. అంతేకాదు, ఈయన జాతకం కంటే ఈయన సతీమణి జాతకం బలంగా ఉందని, ఆ జాతకబలం ఈయనకు తోడై నిలిచిందని తెలుస్తున్నది. అందుకే వివాహం చేసుకున్న తరువాతనే ఈయనకు బాగా కలిసి వచ్చింది. అలాగే ఆమె మరణం తరువాత ఈయనకు చెడుకాలం మొదలైంది. ఈ సంగతి అందరికీ తెలుసు.
NTR జాతకంలో చిక్కుముడి
మూడు గ్రహాలు వక్రించి ఉండటం ఈయన జాతక విశ్లేషణలో పెద్దచిక్కు. కాని ఆ చిక్కుముడి విప్పగలిగితే తర్వాతి జాతకం తేలికగా అర్థం అవుతుంది. వక్రగ్రహాల ఫలితం ఏమిటంటే, స్థూలంగా చెప్పాలంటే, మొదట్లో ఉన్న పరిస్థితి తరువాత మారిపోతుంది. ఎందుకంటే వక్రగ్రహం తానున్న స్థానం నుంచి వెనుకభావంలోకి ప్రయాణం చేస్తుంది కనుక. గురువుగారి వక్రత్వంవల్ల మొదట్లో గజకేసరియోగం ఉన్నప్పటికీ, తరువాత యోగభంగం కలగటం జరుగుతుంది. అలాగే రెండుసార్లు రాజయోగం పట్టి, తరువాత పదవి ఊడింది కదా. శని వక్రతవల్ల, మొదట్లో ఒక మోస్తరు కుటుంబంనుంచి వచ్చినా కాలక్రమేణా రాహువుఉన్న ఏకాదశస్థానానికి శని చేరటంవల్ల సినిమా రంగంలో లాభించి బాగా ధనార్జన చేయటం జరిగింది. కళలను సూచించే సహజ పంచమస్థానం సింహం ఈయన జాతకంలో లాభస్థానం కావటం చూడవచ్చు.పంచమం ఎలా కళలను సూచిస్తుంది అనే అనుమానం రావచ్చు. నాటకరంగాన్ని తృతీయం చూపిస్తుంది. పంచమం దీనికి తృతీయం కనుక భావాత్భావసూత్రం ప్రకారం పంచమం అతి బలీయమై ప్రదర్శకకళలను (Performing Arts) చూపుతుంది. అలాగే బుధుని అష్టమస్థితి సప్తమకేంద్రస్థితిగా మారి, మిత్రుడైన శుక్రునితో కలయికవల్ల, మరియు గజకేసరియోగ దృష్టి వాటిమీద పడటంవల్ల క్రమేణా జీవితంలో ఉన్నతశిఖరాలు అధిరోహించటం సూచింపబడింది. అదికూడా వివాహం తదుపరి యోగం పట్టింది అని సప్తమస్థానం వల్ల తెలుస్తున్నది. కాని వీటికి ఇంకొక అర్థంకూడా ఉన్నది.
బుధుని వక్రస్థితివల్ల జీవితంలో సరియైన నిర్ణయాలు తీసుకోలేకపోవటం జరుగుతుంది. సప్తమంలో శుక్రబుదుల స్థితివల్ల రెండవకళత్రం విషయంలో సరియైన నిర్ణయం తీసుకోలేక ఘోరమైన దెబ్బతినడం జరిగింది. పంచమంలో కేతుస్థితివల్ల మంత్రసిద్ధి త్వరగా కలుగుతుంది. అందుకే మంత్రతంత్రాలలో ఆసక్తి, జాతకాలమీద నమ్మకాలు, పూజలు పునస్కారాలలో ప్రవేశం, నియమనిష్టలను పాటించటం ఉన్నాయి. తెల్లవారుజామున నాలుగుగంటలకే లేచి అరగంటసేపు పూజ ధ్యానం చెయ్యటం అనేది ఈ కేతువు మంత్రస్థానం అయిన పంచమంలో ఉండటం వల్ల వచ్చింది. కాని ఇంకోరకంగా ఇది పుత్రదోషం కనుక కుమారుడు రామకృష్ణ మరణించాడు. గురువు వక్రస్థితివల్ల దేవబ్రాహ్మణులంటే మొదట్లో గౌరవం ఉన్నా, చివరికి ద్వేషంగా మారింది. శని వక్రస్థితివల్ల మొదట్లో తనకు ఓట్లేసి గెలిపించి బ్రహ్మరథం పట్టిన సామాన్యజనమే చివరికి పదవీచ్యుతున్ని చేసారు. బుధుడుబుద్ధికీ, గురువు దేవబ్రాహ్మణులకూ, శని సామాన్యజనానికీ కారకులని జ్యోతిర్వేత్తలకు తెలుసుకదా. దశామ్శలొ కూడా శనివక్రత్వంవల్ల అష్టమంనుంచి సప్తమం అయిన తులాలగ్నానికి వచ్చి Exalted అవుతాడు. అక్కణ్ణించి లగ్నాన్ని అందులోని గజకేసరియోగ కారకులైన గురుచంద్రులను సప్తమద్రుష్టితోను, D-10 చార్ట్ లోదశమం అయిన మకరాన్ని దశమదృష్టి తోనూ బలంగా చూస్తాడు. ఈ శని ఈయన జాతకంలో ఆత్మ కారకుడనేది ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. D-10 లో పట్టిన ఈ అత్యంత శుభయోగం వల్ల ఈయన సినిమారంగాన్ని అన్నిదశాబ్దాలు మకుటం లేని మహారాజులా ఏలాడు. వృత్తిపరంగా ఎదురులేకుండా ఉండటానికి ఈ గ్రహస్థితే కారణం.వర్గచక్రాలు చూడకుండా ఉత్త రాశిచక్రంచూచి మొత్తం ఫలితాలు చెప్పలేము అనటానికి ఇది ఒక ఉదాహరణ. రాశిచక్రంలో లేని ప్రత్యేకతలు వర్గచక్రాలలో కనిపిస్తూ, ఆయా రంగాలలో లోతైన విశ్లేషణ చెయ్యటానికి పనికి వస్తాయి. అందుకేపరాశర మహర్షి వర్గచక్రాల గురించి (Divisional Charts) బృహత్ పరాశరహోరాశాస్త్రం మొదట్లోనే చెబుతాడు. మూడుగ్రహాల వక్రత్వం అనే చిక్కుముడిని ఈ విధంగా విప్పి అర్థంచేసుకుంటే తరువాతి జాతకం సులభంగా అర్థంఅవుతుంది.
దశలు - జీవిత విశేషాలు
ఈయన స్వాతినక్షత్రం నాలుగోపాదంలో పుట్టటంతో రాహు మహర్దశ చివరిలో ఇంకా ఒక ఏడాది ఏడు నెలలు మిగిలిఉండగా జననం జరిగింది. అంటే దాదాపు 18 సంవత్సరాలు వచ్చేవరకూ ( అంటే 1941 వరకూ) గురు మహర్దశ జరిగింది. తరువాత 1960 వరకూ శనిమహర్దశ జరిగింది. తరువాత 1977 వరకూ బుధమహర్దశ, 1984 వరకూ కేతుదశ, తరువాత 18-1-1996 వరకూ శుక్రదశ జరిగాయి. ఈయన జీవితంలో మంచి రాజయోగ కాలం శని, బుధ, కేతు దశలు, కొంతభాగం శుక్రదశలలో జరిగింది. మొత్తంమీద జీవితంలో యుక్తవయసు నుంచి యోగకారక దశలు జరిగాయి కనుక గొప్పయోగజాతకం అని తెలుస్తున్నది.
1941-1960 శని మహర్దశ: మే నెల 1942 లో రామారావు గారికి వివాహం జరిగింది. శని ఈ లగ్నానికి యోగ కారకుడు, శుక్రుడు లగ్నాధిపతి వివాహాన్ని సూచించే సప్తమస్థానంలో ఉన్నాడు. వివాహ సమయానికి జాతకంలో శని/శని/శుక్ర దశ జరుగుతున్నది. యోగకారక శనిదశ మొదలుకావటంతోనే వివాహం జరగటం చూడవచ్చు. కనుక యోగజాతకురాలైన భార్య దొరికింది. ఇందాక మనం అనుకున్న విషయం ఇక్కడ మళ్ళీ రుజువు అవుతున్నది. తరువాత బుధ అంతర్దశ మొదలైంది. బుధుడు సహజ విద్యాకారకుడు. వక్రస్థితిలో ఉండటం వల్ల, దశా నాథుడైన శనికి రాహుస్పర్శ వల్ల, శని చతుర్తాదిపత్యం వల్ల ( విద్య), ఇంటర్మీడియేట్ రెండుసార్లు తప్పాడు. గుంటూరు AC కాలేజీలో ఉన్నప్పుడే జగ్గయ్యతో కలిసి నాటకాలేసేవాడు. మే నెల 1947 లో ఈయనకు మొదటి మేకప్ టెస్ట్ జరిగింది. అప్పుడు శని/కేతు/గురు దశ జరుగుతున్నది. శని యోగకారకత్వం, సినిమా రంగానికి సూచకుడు రాహువుతో కలయిక, గురువుగారి గజకేసరియోగం కలిసి అప్పుడు పనిచేశాయి. కేతువు పంచమంలో ఉండటం తృతీయానికి భావాత్భావం కావటం గమనించాలి. భావాత్భావం సూత్రం జ్యోతిర్విజ్ఞానంలో ప్రవేశం ఉన్నవారికి మళ్ళీ వివరించవలసిన పనిలేదు. October 1947 లో శని/శుక్ర దశ జరిగినపుడు గుంటూరులో సబ్ రిజిస్త్రార్ గా ఉద్యోగంలో చేరాడు. సినిమాలలో చేరాలా వద్దా అని ఊగిసలాట ఒకవైపు, ఆఫీసులో అవినీతి భరించలేక ఒక వైపు సంఘర్షణకు లోనయ్యాడు. చివరకు ఉద్యోగం మానేసి మళ్ళీ మద్రాస్ చేరి 1950 వరకూ నానాకష్టాలు పడ్డాడు. 1947-50 మధ్యలో జరిగిన శని/శుక్ర దశలో ఒకసారి చేతిలో ఎనిమిది అణాలు లేక మూడురోజులు పస్తులున్నాడు. కనీసం సైకిలుకూడా లేక మైళ్ళకు మైళ్ళు మద్రాసులో నడిచి పోయేవాడు. రాహువు యొక్క బలీయమైన స్థితితో కలిగిన ఆత్మాభిమానంవల్ల ఈ సంగతి రూంమేట్స్ తో కూడా చెప్పలేదు. ఇదీ ఉత్తరకాలామృతంలో కాళిదాసు చెప్పిన దశాప్రభావం!!! నేను ఇంతకూ ముందే వ్రాసినట్లు- ఉత్తరకాలామృతంలో కాళిదాసు కొన్ని వందలఏళ్ళనాడే చెప్పాడు, శని శుక్రుడు ఇద్దరూ యోగ కారకులైతే శనిలో/శుక్ర దశ లేదా శుక్ర లో/శని దశ రాజును కూడా బిచ్చగాణ్ణి చేస్తుంది అని. అది అక్షరాలా రుజువు కావటం ఇక్కడ చూడ వచ్చు. ఎంత పరిశోధనతో ఈ సూత్రాలు రూపొందించారో ఆ మహానుభావులు అని ఆశ్చర్యం కలుగుతుంది. మళ్ళీమళ్ళీ ఎన్ని జాతకాలు చూచినా ఈ సూత్రాలు తిరిగితిరిగి నిజం అవుతుంటాయి. ఇటువంటి ఋజువులు చూచినపుడు, మహర్షుల జ్ఞానసంపదకు ఆశ్చర్యం కలుగుతుంది. ఇంకోవైపు మన వారసత్వ సంపదను తెలుసుకోకుండా, మన సంస్కృతిని చెడగొడుతున్న హేతువాద, నాస్తిక, కమ్యూనిస్టు చెత్త సాహిత్యం చదివి, తెలిసీతెలియని మాటలు మాట్లాడుతూ విమర్శించేవారి అజ్ఞానానికి జాలి కలుగుతుంది. 1950 ప్రాంతాలలో వచ్చిన సంసారం, షావుకారు మొదలైన చిత్రాలలో నటించినా, 1951 లో విడుదల అయిన పాతాలభైరవితో ఈయన జీవితం మలుపుతిరిగింది. అప్పటినుంచి 1981 వరకూ 30 ఏళ్ళు సినిమాలలో నటించాడు. మధ్యమధ్యలో అపజయాలు ఎదురైనా తిరిగి నిలదొక్కుకుంటూ విజయవంతమైన చిత్రాలలో నటించాడు. శనిలో/రవిదశనుంచి ఈయనకు ఎదురు లేకుండా జరిగింది. కారణం రవి రాశి, దశామ్శలలొ వర్గోత్తమస్థితిలో ఉండటం. అప్పటినుంచి కేతుదశ చివరివరకూ సినిమాజేవితం జరిగింది. శుక్రదశ ప్రారంభంలో రాజకీయజీవితం ప్రారంభంఅయింది. 29th of March 1982 at 2.30PM తెలుగుదేశంపార్టీ మొదలైంది. కేతువులో/శని, బుధ అన్తర్దశలలొ తెలుగుదేశంపార్టీ పెట్టటం ప్రభుత్వం ఏర్పాటు చెయ్యటం జరిగాయి. కేతువు గురునక్షత్రంలో ఉండటం, గురు, బుధ, శనులు యోగకారకులు కావటం గమనించ వచ్చు. ఈయనకు మార్చి 1983 నుంచి శుక్రమహర్దశ మొదలైంది. రాజయోగం పట్టింది. 1989 లో శుక్రలో/కుజదశ జరుగుతున్నపుడు పార్టీ ఓడిపోయింది. కుజుడు దశామ్శలొ నీచస్థితిలో ఉండుట గమనించండి. తిరిగి 1994 లో అధికారంలోకి వచ్చింది. అప్పుడు శుక్ర దశలో చెడు చేసిన కుజ/ రాహు అన్తర్దశలు అయిపోయి, గురుఅంతర్దశమొదలైంది. శుక్రదశలో/ గురు అంతర్దశలో /చంద్ర విదశలో 18-1-1996 ఈయన మరణించాడు. అప్పటివరకూ మంచిచేసిన కుజుడు, రాహువు పూర్తిగా విపరీతఫలితాలు ఇవ్వటం ఇక్కడ చూడవచ్చు. జీవితం ముగియబోతున్నదని, పుణ్యబలం మరియు ఆయుస్సు అయిపోవస్తున్నాయని తెలుసుకోవటానికి ఇదొక సూచన. అప్పటివరకూ సపోర్టు చేసిన పంచభూతాలు, విరమించుకోవటమే మరణం. అలాగే అప్పటివరకూ యోగాన్ని ఇచ్చిన గ్రహాలు వెనుకకు తగ్గి పూర్తిగా వ్యతిరేక ఫలితాలు ఇవ్వటం జీవితం ఆఖరుకు ఒకసూచన. 1991 ప్రారంభంలో సుఖస్థానమైన మకరంలోకి శనిభగవానుని ప్రవేశంతో ఈయనకు అర్థఅష్టమశని మొదలయ్యింది. అప్పటినుంచే కుటుంబంలో కలతలు ప్రారంభం. 1993 మార్చిలో శని భగవానుడు కుంభరాశిలో ప్రవేశించాడు. పంచమంలో శనిప్రవేశంతో సంతానంతో మానసికఅగాథం ఏర్పడింది. కుటుంబచికాకులు ఎక్కువయ్యాయి. అక్కడ నుంచి తృతీయదృష్టితో సప్తమస్థానం అయిన మేషాన్ని వీక్షించాడు. 1994 లొ గురువు తులారాశి ప్రవేశంతో ఆయన సప్తమదృష్టి మేషంమీద పడింది. అందుకే 1994 లొ ద్వితీయవివాహం చేసుకున్నాడు. 1995 డిసెంబర్ లొ గురువుగారు ధనూరాశిలో ప్రవేశంతో పంచమద్రుష్టి మళ్ళీ మేషంమీద పడింది. మొదటిసారి వివాహకారకత్వాన్ని చూపిన సప్తమస్థానం ఈసారి మారక కారకత్వం Activate అయింది. జనవరి 1996 లో మరణం సంభవించింది. మరణం 22వ ద్రేక్కాణం నుంచి చూడవచ్చు. లగ్న, చంద్రుల నుంచి 22వ ద్రేక్కాణం వృషభం రెండవ ద్రేక్కాణంఅవుతుంది. వరాహమిహిరుని "బృహజ్జాతకం" ప్రకారం వృషభం రెండవద్రేక్కాణం ఇలా ఉంటుంది. "The 2nd Drekkana of sign Taurus is a man skilled in works connected with agriculture, grain, cows, music, dance, painting, writing and the like, skilled at the plough and in works connected with a conveyance, with a neck bent like that of the bullock, thirsty, with a face like that of the ram and dressed in dirty garments."