Pages - Menu

Pages

1, ఆగస్టు 2009, శనివారం

వివేకానందస్వామి దివ్యజాతకం-2


శనిచంద్రుల కలయిక అంతర్ముఖత్వాన్ని ఇస్తుందని ఇంతకూ ముందే చెప్పా కదా. శనిదృష్టి ద్వాదశంలోఉన్న రాహువు మీద ఉంది.ద్వాదశం ఇతర అనేక విషయాలతోబాటు లోతైన ఆధ్యాత్మిక భావనలను సూచిస్తుంది. అంతేకాక రాహువు యొక్క స్థితితో తనదైన మతమేకాక అనేక ఇతరమతాలమీద అనుభవాత్మకమైన అధికారాన్ని చూపుతుంది. వివేకానంద స్వామి తన పరివ్రాజకదశలో గోవాలో మూడురోజులు ఉండి అక్కడి ప్రాచీనచర్చిలో భద్రపరుచబడిఉన్న ఎడిట్ చెయ్యబడని లాటిన్ ప్రతులద్వారా క్రీస్తుయొక్క అసలైన బోధనలు సిద్ధాంతాలను అధ్యయనం చేసారు. వాటికీ వేదాంతానికీ ఏమీ భేదంలేదని ఆయన దీన్నిబట్టి గ్రహించారు.


ఆ మూడురోజుల స్వామియొక్క సాన్నిహిత్యాన్ని పొంది ధన్యులైన క్రైస్తవబిషప్పులు వీడుకోలు సమావేశ సమయంలో ఆయనను వదలలేక బాధతో వీడ్కోలు చెప్పారు. తనతో ఒక్కరోజు కలిసి జీవించినవారిని జీవితాంతం ప్రభావితం చెయ్యగల వ్యక్తిత్వ అయస్కాంతశక్తి (personal magnetism) ఆయనకు ఉండేది. ఈ శక్తి పరిధి లోకి వచ్చినవారు, వారే దేశంవారైనా, ఏ కులమతాలకు చెందినా వారైనా మంత్రముగ్దులయ్యేవారు.

తన ఏకసందాగ్రాహిత్వ శక్తితో క్రైస్తవ మూలసిద్ధాంతాలను ఆయన సులువుగా గ్రహించారు. ఆయనకుగల అఖండ బ్రహ్మచర్యబలంతో ఒకసారి చూచిన విన్న విషయాన్ని యదాతధంగా గుర్తుంచుకొని ఎన్నేళ్ళ తర్వాతైనా మళ్ళీ చెప్పగల అమానుష ప్రజ్ఞాశక్తి ఆయనకు ఉండేది. అందువల్లే అమెరికాలో క్రైస్తవమిషనరీలతో ఆయన మాట్లాడినప్పుడు వారు స్వామికి క్రైస్తవమతంమీద గల అధికారిక అవగాహనకు మంత్రముగ్ధులైనారు.

అంతేకాక తన విద్యార్ధిదశలో ఆయన కాంట్ హెగెల్ మొదలైన పాశ్చాత్యతాత్వికులను క్షుణ్ణంగా అధ్యయనం చేసారు. అరబ్బీ,పర్షియన్ సాహిత్య అధ్యయనం ద్వారా సూఫీతత్వాన్ని కూలంకషంగా ఆయన గ్రహించారు. బౌద్ధమత అధ్యయనంద్వారా ఇంకా లోతైన ధ్యానంద్వారా ఆయన బుద్ధుని హృదయాన్ని గ్రహించారు. చిన్నపిల్లవానిగా ఉన్నపుడు ఆయనకు తనగదిలో ఏకాంత ధ్యానంలో బుద్ధుని తేజోమయ సజీవదర్శనం కలిగింది అన్న విషయం మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఇంకా అనేకానేక గ్రంథాలపఠనంద్వారా ఆయామతాలలో నిజమైన పాండిత్యం కలిగినవారితో సంభాషణలద్వారా స్వామి ప్రపంచమతాలలో లోతైన ప్రజ్ఞను పొందారు.

తన పరివ్రాజకదశలో స్వామి దేశమంతా పర్యటన చేసినపుడు ఆయనవెంట రెండేపుస్తకాలు ఉండేవి. ఒకటి భగవద్గీత,రెండవది ధామస్ అకేంపిస్ రాసిన "The Imitation of Christ".స్వామికి ఇతర మతాలంటే ఏమాత్రం ద్వేషం లేదు.సర్వమత సమన్వయాన్ని బోధించిన శ్రీరామకృష్ణుని ప్రియకుమారునికి సంకుచితదృష్టి ఎలా ఉంటుంది? క్రీస్తుపైన,మహమ్మద్ పైన,బుద్ధునిపైన ఆయన ఇచ్చిన ఉపన్యాసాలు చదివితే వారిలోని కొన్నికొన్ని వ్యక్తిత్వలక్షణాలను స్వామి ఎంతగా మెచ్చుకున్నారో మనం చూడవచ్చు.

సప్తమద్రుష్టితో శని,లగ్నాత్ చతుర్థస్థానాన్ని చూస్తున్నాడు. ఈ యోగంవల్ల ఆయన మనస్సు ఎల్లప్పుడూ ఆధ్యాత్మికభావాలతో నిండిఉండేదని తెలుస్తున్నది. అంతేకాక ఆయన పుట్టిపెరిగిన ఇంటి వాతావరణం ఉన్నతములైన ఆధ్యాత్మికభావాలతో నిండి ఉండేదని తెలుస్తున్నది. ఇక సప్తమంమీద శనియొక్క దశమద్రుష్టితో, వివాహ విముఖత్వం,ఆజన్మ బ్రహ్మచర్యం పాటించటం జరిగాయి. వాక్స్థానంలో రెండు శుభగ్రహాల స్థితివల్ల శ్రోతలను సమ్మోహపరిచే వాక్శక్తి కలిగింది. ద్వితీయ దశమ అధిపతులైన శనిబుదులపరివర్తన దీనికి బలాన్ని చేకూరుస్తూ ఆ ప్రసంగాలు ఆధ్యాత్మికశక్తితో నిండి ఉండేవని చెబుతున్నది.

ఆత్మకారకుడిగా ఉన్న సూర్యుడు లగ్నసంధిలో పడటంతో చిన్నవయసులో శరీరాన్ని విడిచి పెట్టాడు. లగ్నాధిపతి గురువు లాభస్థానంలో మరియు శనిచంద్రులు వృత్తిస్థానంలో ఉండటంతో ఆధ్యాత్మిక గురుత్వం వహించాడు.కాలస్వరూపాలైన రాహుకేతువులు నీచలలో ఉండుటవల్ల జీవితాన్ని కాలాన్ని తన లాభంకోసం కాకుండా లోకంకోసం వెచ్చించి నిస్వార్థపూరితజీవితాన్ని గడిపాడు.

గురువుయొక్క పంచమద్రుష్టి, తృతీయం మీద ఉంది. కనుక ధార్మికమైన ఉపన్యాసాలతో ప్రపంచాన్ని మంత్రముగ్దులను చేసే ప్రజ్ఞ కలిగింది. తృతీయం వాగ్ధాటికి కారకం అని జ్యోతిర్వేత్తలకు వేరే చెప్పవలసిన పనిలేదు. సప్తమద్రుష్టి మంత్రస్థానం అయిన పంచమంలోని స్వక్షేత్ర కుజునిమీద ఉంది. పంచమకుజునివల్ల మంత్రస్థానానికి విపరీతమైన శక్తి వస్తుంది. దానిపైన గురుద్రుష్టితో, గురువు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మంత్రస్థానానికి కలిగి త్వరితంగా మంత్రసిద్ధి నిచ్చింది. 

సాక్షాత్తు భగవంతుడే ఆయనకు గురువుగా నిలిచాడంటే ఇంక అంతకంటే అదృష్టం ఎవరికైనా ఏముంటుంది? గురువు యొక్క నవమద్రుష్టి, సమాజంతో సంబంధాలను చూపే సప్తమంమీద ఉంది. కనుక గురుదశ ప్రారంభం కావటంతోనే అమెరికావెళ్లి వేదాంతభేరి మ్రోగించి భారతదేశ ఆధ్యాత్మిక ఔన్నత్యాన్నిలోకానికి చాటాడు. అంతేగాక సప్తమం మారకస్థానం కావటంతో గురువు లగ్నకారకత్వంతో-- లోకంలో తనపని అయిపొయింది అని తెలియటంతోనే, స్వయానా తన ఇచ్చాబలంతో యోగశక్తిద్వారా బ్రహ్మరంద్రభేదనం చేసుకొని తన స్వస్థానమైన సప్తర్షిమండలానికి ఊర్ధ్వముఖంగా మెరుపులా సాగిపోయాడు. ఇదికూడా గురుదశలోనే జరిగింది అన్న సంగతి గుర్తుంచుకోవాలి.

మంత్రస్థానంనుంచి శక్తిస్వరూపుడైన కుజుని చతుర్ధదృష్టి మార్మిక మోక్షత్రికోణములలో ఒకటైన అష్టమస్థానం పైనఉంది. దీని అర్థం వివరించవలసిన పనిలేదు. గురునిపైన కుజద్రుష్టివల్ల తనశక్తితో గురువుగా శిష్యులకు ఆత్మికఔన్నత్యాన్ని ఇవ్వగల సామర్థ్యం కనిపిస్తున్నది. ఇంకొక మోక్షత్రికోణంలో ఉన్న రాహువుమీద కుజుని అష్టమద్రుష్టివల్ల బయటకు కనిపించని గూఢమైన మార్మిక ఆత్మికఅనుభవాలు కలిగిన సిద్ధపురుషుడు అని, మానవాతీత యోగశక్తులు కలిగినవాడని తెలుస్తున్నది. 

శరీరంతో ఎక్కువగా మమేకం అయ్యి, దాని తోడే లోకంగా గడిపేవారికి లగ్నంనుంచి విశ్లేషణ బాగా సరిపోతుంది. కాని మనోజీవులకు, ఆధ్యాత్మికపరులకు, ఆలోచనా భూమికలో ఎక్కువగా కాలం గడిపేవారికి చంద్రలగ్నం నుంచి విశ్లేషణ ఇంకాబాగా సరిపోతుంది.వివేకానందస్వామి జీవితంలో కూడా, చంద్రలగ్నంనుంచి చూస్తె అధ్బుతమైన విశ్లేషణ వస్తుంది. అది మూడోభాగంలో చూద్దాం.