Pages - Menu

Pages

20, ఆగస్టు 2009, గురువారం

యోగః కర్మసు కౌశలం

శ్రీ మద్ భగవత్ గీతలో రెండవ అధ్యాయంలో 50 శ్లోకం ఇది. యోగాన్ని అనేకమంది ఆచార్యులు అనేక విధాలుగా నిర్వచనం ఇచ్చినారు. కాని సాక్షాత్తు భగవంతుని ముఖతా వచ్చిన మాట కావటంతో దీనికి అర్థ గాంభీర్యత, నిర్వచనా స్పష్టత హెచ్చు.

||బుద్ధి యుక్తో జహాతీహ/ఉభే సుకృత దుష్క్రుతౌ/తస్మాద్ యోగయా యుజ్యస్వ/యోగః కర్మసు కౌశలం||

అర్థం: బుద్ధి యుక్తుడైనవాడు ఇక్కడనే మంచి చెడు కర్మలను జయిస్తున్నాడు. కనుక నీవు యోగాన్ని అభ్యసించు. కర్మలయందు కౌశలమే యోగం.

యోగానికి భగవంతుడే చెప్పిన చక్కనైన నిర్వచనం ఇది. చూడటానికి స్వల్పమైనదైనా లోతైనట్టి అర్థం కలిగినట్టిది.

మనిషిని అతడు చేసిన కర్మలు బందిస్తున్నాయి. అవి మంచివైనా చెడ్డవైనా ఆయా ఫలితాలకు అతడు బద్దుడే. ఒక కర్మ చేసిన తర్వాత ఫలితం నాకు వద్దు అంటే పోదు. ఈ విధంగా మంచి చెడు కర్మలు, పాప పుణ్యాలకు కారణాలౌతూ వాటికి తగిన ఫలితాన్ని అతని చేత అనుభవింప చేస్తూ తద్వారా మళ్ళీ తదను గుణములైన కర్మలను అతనిచే చేయిస్తూ మళ్ళీ మళ్ళీ జన్మ పరంపరలకు కారణాలు అవుతున్నవి. ఈ కర్మ పరంపరనుంచి విడిపడే మార్గమే యోగం.

కర్మల యందు కౌశలమే యోగం అని భగవానుని ఉవాచ. అంటే ఏ పనినైనా కుశలంగా చక్కగా చేస్తే అది యోగం అవుతుందా? ఉదాహరణకు దొంగతనం కూడా ఒక కర్మయే, దానిని చక్కగా చేస్తే అది యోగం అవుతుందా? అనేది ప్రశ్న. ఇక్కడ భగవంతుడు- మంచి పనిని చక్కగా చేస్తే అది యోగం అవుతుంది అని చెప్పలేదు. కర్మను కుశలంగా చేస్తే అది యోగం అవుతుంది అన్నాడు. బుద్ధి మంతుడైన వాడు కర్మను దాటిపోతాడు అని కూడా ఆయన చెప్పాడు. కనుక ఇక్కడ చక్కగా అర్థం చేసుకోవాలి.

మనిషి బ్రతికినంత వరకూ కర్మను చెయ్యక తప్పదు. కర్మను చెయ్యకుండా ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండలేరు. కర్మ తిరిగి ఫలితాన్ని ఇవ్వక తప్పదు. కనుక ఈ చక్రం నుంచి విముక్తి ఎలా? తాదాత్మ్యత నుండి విడివడటమే దీనికి మార్గం. ఇంద్రియములు తమతమ విషయముల యందు ప్రవర్తిల్లుతూ ఉండగా, ఇదంతయూ ప్రక్రుతి లీల అన్న విషయాన్ని అనుభవం ద్వారా చక్కగా తెలిసికొని, వాటి వ్యాపారములలో చిక్కక, తనను ఈ లీలకు భిన్నుడైన, నిత్యుడైన సాక్షిగా తెలిసికోవటమే దీనికి మార్గం.

ఈ రహస్యమును అనుభవము ద్వారా తెలిసికొన్న వాడే, కర్మ బంధములో చిక్కకుండా ఉండగలదు. బుద్ధి పరంగా అర్థం చేసుకుంటే చాలదు. అనుభవం లో కి అది రావాలి. అనుక్షణం ఈ స్పృహలో ఉంటూ సమస్త ఇంద్రియ వ్యాపారమును తనకంటే భిన్నమైనదిగా చూస్తూ ఉండగలిగితే ఇది సాధ్యం అవుతుంది. అట్టివాడే కుశల కర్మ చెయ్య గలడు.

ఇక్కడ కుశల కర్మ అంటే పనిని చక్కగా చెయ్యటం అని మాత్రమె అర్థం కాదు. కుశాలమైన కర్మ అంటే తిరిగి ప్రతికర్మను సృష్టి చెయ్యనిది అని అర్థం. ప్రతి కర్మా తిరిగి ఇంకొక కర్మకు కారణం అవుతుంది. కాని కుశలం గా చెయ్యబడిన కర్మ తిరిగి ఇంకొక కర్మకు కారణం కాదు. ఆ కర్మ అంతటితో అంతరిస్తుంది. ఇదెలా జరుగుతుంది?

కర్మ కొనసాగింప బడటానికి కారణం దాని వెనుక ఉన్న సంగం- ద్వేషం. ఈ రెండు ఒకే నాణానికి బొమ్మ బొరుసూ వంటివి. ఆత్మకు అన్యమైన ఏ వస్తువుతోనైనా ఈ రెండు రకాలైన బంధాలు కలిగి ఉండవచ్చు. ఒకటి ప్రేమతో ఉండే బంధం దీన్ని రాగం అంటుంది వేదాంతము. రెండవది ద్వేషంతో ఉండే బంధం. మనం ఒక వస్తువును గాని మనిషిని గాని ప్రేమించినా ద్వేశించినా ఎల్లప్పుడూ దాని గురించే ఆలోచిస్తాము. అంటే పాజిటివ్ గానో నెగటివ్ గానో ఆ వ్యక్తి to గాని వస్తువుతో గాని సంబంధం కలిగి ఉంటాము. ఈ రాగ ద్వేషములే, కర్మ ఫలితంతో కర్తకు సంబంధాన్ని కలుగ జేసే తాళ్ళు.

ఎవరైతే ఈ రాగ ద్వేషాలు లేక ఉండగలడో , అతడు కర్మ చేసినా దానికి కట్టు పడడు. మరి ఈ రాగ ద్వేషాదులు ప్రపంచాన్ని మొత్తాన్ని నడుపుతున్నాయే? వీటి చిక్కులో పడకుండా ఉండటం ఎలా? అంటే దీనికి ఉపాయం యోగమే. బుద్ధి యుక్తుడవై ఈ రహస్యాన్ని తెలుసుకో. ఇంద్రియములకు బాహ్య విషయములయందు గల ఆకర్షణ చేత వాటియందు ప్రవర్తిల్లుతూ ఉన్నాయి. ఇది ప్రక్రుతి లీల అన్న విషయాన్ని తన శరీరంలో జరుగుతున్నా క్రీడగా ఎవడైతే ధ్యాన సాధనలో గమనించి, అర్థం చేసుకొని, తనను ఈ ఆటకు సాక్షియైన చిత్ స్వరూపునిగా అనుభవ పూర్వకంగా తెలుసుకొన గలడో అతడు కర్మ బంధాలకు చిక్కు బడదు. కారణం అతన్ని బంధించే రాగ ద్వేషాల వల్ల అతని ఇంద్రియ వ్యాపారాలు జరుగవు. ప్రకృతి నిమిత్తం గా జరుగుతుంటాయి. తానూ సాక్షీ మాత్రునిగా ఈ ఆటను గమనించాలి.

ఎప్పుడైతే ఇట్టి స్థితిలో ఉండగలుగుతాడో, అప్పుడు రాగ ద్వేషాలు అనబడే తాళ్ళు అతన్ని బంధించలేవు. కనుక కర్మ ఫలం అతనికి అంటదు. కనుక మంచి చేసినా, చెడు చేసినా ఆయా కర్మలకు అతడు అతీతుడు అవుతాడు. శ్రీ కృష్ణ భగవానుడు ఇట్టి స్థితిలో ఉండే లీలా నాటకంగా తన జీవితాన్ని గడిపాడు. కనుక ఆయనకు ఏ కర్మ ఫలమూ అంటలేదు. అంతే గాదు, జనక మహారాజు, జడ భరతుడు, అస్తావక్రుడు మొదలైన జ్ఞానులు ఇట్టి స్థితిలో ఉండే కర్మాతీతులైనారు.

ఇట్టి స్థితిలో ఉంది చేసిన కర్మ తిరిగి ఇంకొక కర్మను సృష్టి చెయ్యలేదు. ఎందుకంటే దానికి మరొక అడుగు ముందుకు వేశే చోదక శక్తులైన రాగ ద్వేషాలు ఉండవు. కనుక ఇట్టి కర్మ కుశల కర్మ అనిపించుకుంటుంది. ఇట్టి స్థితిలో ఉండి చేసిన కర్మయే యోగం అనిపించుకుంటుంది. ఇట్టి కర్మ వల్లనే మనిషి పుణ్య పాపములను దాటి పోగలడు.

కనుక బుద్ధి మంతుడైన వాడు ఇట్టి కుశల కర్మను ఆచరించి కర్మాతీతుడు కావాలని భగవానుడు గీతలో లోకానికి అమృత బోధ చేశాడు. తద్వారా జీవన్ముక్త స్థితిని అందుకొని జననమరణాలకు అతీతుడు, ముక్త పురుషుడు కావచ్చు. కాని ఇది చెప్పినంత తేలికా అంటే కానే కాదు. తెలికైతే, కోటిలో ఒకడు మాత్రమె దీనిని పొందగలడు అని మళ్ళీ తానె ఎందుకు చెబుతాడు? ఆధ్యాత్మిక సాధన ఏదైనా చాలా కష్టం తో కూడుకున్నదే. ఇది తనతో తానె చేసే పోరాటం. ఇందులో బయట శత్రువులు ఎవ్వరూ ఉండరు. తన మనసే తనకు శత్రువు, తన మనసే తనకు మిత్రుడు.

బుద్ధి ప్రస్తావన ఎందుకు వచ్చింది? బుద్ధి మనస్సుకు పై మెట్టు. కనుక మనస్సును దాటి, అనగా మనో వ్యాపారములను గమనిస్తూ, బుద్ధి స్థాయిలో స్థితుడై ఉండగలిగితే, ఈ యోగం సాధ్యం అవుతుంది అని అన్యాపదేశం గా చెప్ప బడింది.

ఈ శ్లోకానికి ఇంకా నిగూఢములైన యోగార్ధాలు ఉన్నాయి. ఇప్పుడు వ్రాసింది అందరికీ తెలిసిన అర్థం మాత్రమె. యోగులకు మాత్రమె తెలిసిన నిగూఢ అర్థాలు మరోసారి ముచ్చటించుకుందాం.