పంచతత్వ సిద్ధాంతం అనేది నాడీజ్యోతిషంలో అత్యంత ముఖ్యమైన సిద్ధాంతములలో ఒకటి.
సాధారణ జ్యోతిష్యవిద్యలో కూడా తత్వవిభజన,తత్వనిర్ణయం,చేస్తేనే లోతైన ఫలితములు చెప్పటానికి వీలవుతుంది.మామూలుగా చేసే గ్రహ/రాశి/భావ విశ్లేషణకు,పంచతత్వ సిద్ధాంతమును తొడు చేసుకుంటే మరిన్ని వివరాలు తేటతెల్లంగా తెలిసే అవకాశం ఉంది.
ఆరోహతత్త్వంలో జన్మించినవారు వయసు పెరిగే కొద్దీ అభివృద్ది సాధిస్తారు. అదే అవరోహతత్త్వంలో జన్మించినవారైతే కాలం గడిచేకొద్దీ భావ కారకత్వాలలో తిరోగమనం కలుగుతుంది.
భూతత్త్వంలో జన్మించిన వారు లౌకికమైన ఆశలు, ఆశయాలు బలంగా ఉన్న వారౌతారు.వారి జీవితంలో భౌతికమైన విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.
జలతత్త్వంలో జన్మించిన వారు, మృదు స్వభావులు, తేలికగా ఏ పరిస్థితిలో నైనా ఇమిడి పోయేవారు అవుతారు.
అగ్నితత్త్వంలో జన్మించిన వారు తీక్ష్ణ స్వభావులు, కోపధారులు,స్థిమితం లేని వారు అవుతారు.
వాయుతత్వంలో జన్మించిన వారు చలనశీలురు, ప్రయాణాలు ఇష్టపడేవారు, ముఖ్యవ్యక్తులు అవుతారు.
ఆకాశతత్త్వంలో జన్మించినవారు ఆలోచనాపరులు,తత్వవేత్తలు,లోతైన మనుషులు,తేలికగా అంతు చిక్కనివారు అవుతారు.
తత్వ అంతర్ తత్వములను బట్టి ఈ ఐదింటిలో రకరకాల కలయికలు కలుగుతాయి.వాటిని బట్టి మళ్ళీ జాతకులస్వభావాలు, జీవిత సంఘటనలు మారిపోతాయి.
ఇవే ఇతర జాతక విషయాలతో కలిపి చూస్తె, చాలా ఆశ్చర్యకరమైన విషయాలు కనిపిస్తాయి.ఉదాహరణకు అగ్నితత్వంలో పుట్టిన వ్యక్తి సింహ/మేష రాశి లేదా లగ్నం అయి ఉండి, ఆ జాతకంలో కుజుడు లేక రవి బలంగా ఉంటే, ఆవ్యక్తి సంఘంలో ఒక ప్రముఖ అధికారి, రాజకీయ నాయకుడు లేక ఉన్నత పదవిలో ఉండే వ్యక్తి అవుతాడు. కాని ఆయా దశలు జీవితంలో సరి అయిన సమయంలో రావాలి.
అలాగే ఇతర తత్వములు,గ్రహముల పరస్పర యోగస్తితులతో రకరకాల మనస్తత్వాలు,జీవితాలు, దశలు, సంఘటనలు పుట్టుకొస్తాయి.
అదే విధంగా, జల తత్వంలోపుట్టిన వారు అగ్నితత్వ రాశులలో/లగ్నాలలో జన్మించి- ఆ జాతకాలలో చంద్రుడు/శుక్రుడు బలహీనులుగా ఉంటే--వీరు బలహీన మనస్కులు, మానసిక రోగాలు,ఇతర రోగాలతో బాధలు పడేవారు,జీవితంలో అభివృద్ది సాధించలేనివారు అవుతారు.
ఈ విధంగా తత్వముల/ గ్రహముల/రాశుల కలయికలతో (యోగములతో) జీవితాన్ని స్థూలంగా అంచనా వేసే విధానం తత్వసిద్ధాంతం ద్వారా మనకు లభిస్తుంది. జ్యోతిర్విద్యలో పరిశోధనకు తత్వసిద్ధాంతంలో బోలెడంత అవకాశం ఉంది.