Pages - Menu

Pages

1, సెప్టెంబర్ 2009, మంగళవారం

పునర్జన్మలు-అప్పనాచార్య-తామస్ మన్రో-సుశమీంద్ర తీర్థ స్వామి ఒకరేనా?


కొందరు వ్యక్తులు రోజూ చూస్తున్నా హృదయాన్ని కదిలించలేరు. కాని కొందరు వారెవరో తెలీకపోయినా వారికీ మనకూ వందలఏళ్ళ ఎడంఉన్నా,ఏదో తెలీని అనుబంధం ఉందనిపిస్తుంది. వారిని గూర్చి చదివితే హృదయపు లోతుల్లో ఏదోతెలియని చలనం కలిగి మనసు ఆత్మీయతాభావంతో నిండుతుంది.మనలను పరిపాలించిన తెల్లవాడైనా, వ్యక్తిగతంగా ఎవరో తెలీక పోయినా,హృదయగతంగా ఎందుకో తెలీని అభిమానస్పందనను నాకు కలిగించిన వ్యక్తి మేజర్ జెనరల్ సర్ థామస్ మన్రో.

సర్ థామస్ మన్రో 27-5-1761 న ఇంగ్లాండు లోని గ్లాస్గో నగరంలో పుట్టాడు.6-7-1827న రాయలసీమలోని గుత్తి దగ్గర పత్తికొండలో కలరాతో మరణించాడు. ఆ సమయానికి ఆయన మద్రాస్ ప్రాంతానికి గవర్నర్ గా ఉన్నాడు.ఆయన అంత్యక్రియలు గుంతకల్లు దగ్గరిలోని గుత్తిలో జరిగాయి.అస్తికలను మద్రాసుకు తరలించారు.ఈయన జీవితం వెనుక ఆశ్చర్యపరిచే నిజాలు ఉన్నాయి.చదివితే దిగ్భ్రమ కలిగి ఇదంతా నిజమా అని అనిపిస్తుంది.ఈయనే గతజన్మలో రాఘవేంద్రస్వామి శిష్యుడైన అప్పనాచార్యుడంటే ఎవరైనా నమ్ముతారా? కాని ఇది నిజం అని రాఘవేంద్రస్వామి భక్తులు చాలా మంది నమ్ముతారు.జాతకాన్ని పరిశీలించి కూడా నేను ఇదే నిర్ణయానికి వచ్చాను.అంతేకాదు ఈయనే తరువాతి జన్మలో మొన్నటివరకూ మంత్రాలయపీఠానికి ఆచార్యునిగా ఉంటూ మొన్న ఏప్రియల్లో బెంగుళూరులో పరమపదించిన సుశమీంద్రతీర్థస్వామి అంటే ఎవరన్నా నమ్ముతారా?ఆశ్చర్యపరిచే నిజాలను తెలుసుకోవాలంటే ఇక చదవండి.





















ముందుగా ఈయన గురించి కొంత చెప్పాలి. మంత్రాలయ రాఘవేంద్రస్వామికి అప్పనాచార్యుడనే  శిష్యుడు ఉండేవాడు.తన తరువాత మంత్రాలయ ఆచార్యపీఠాన్ని అధిరోహించవలసిందిగా ఆయనను రాఘవేంద్రస్వామి కోరతారు.కాని అప్పనాచర్యుడు తనకు ఇంకా ప్రాపంచికకోరికలు మిగిలిఉన్నాయని,తాను ఇప్పుడే పీఠాన్ని అధిరోహించలేనని చెప్పి నిరాకరిస్తాడు.తరువాతి జన్మలో ఆయనే సర్ తామస్ మన్రోగా పుట్టి మద్రాస్ గవర్నర్ గా మంత్రాలయమఠాన్ని స్వాధీనం చేసుకోటానికి వస్తాడు. అప్పుడు ఆయనకు రాఘవేంద్రస్వామి తన సమాధిలోనుంచి బయటకువచ్చి దర్శనం ఇచ్చి మాట్లాడాడని సర్ థామస్ మన్రో స్వయంగా వ్రాసుకున్నాడు.మన్రో ఇంగ్లాండ్ పోదామని ఏర్పాట్లు చేసుకొని కూడా ఒక్కసారి తనకు ఇష్టమైన బళ్ళారి ప్రాంతాన్ని చూచి పోదామని వచ్చి పత్తికొండలో కలరాతో మరణిస్తాడు.


తరువాత కర్నాటకలో బ్రాహ్మణ కుటుంబంలో ఇంకొక జన్మఎత్తి ఆ తరువాతి జన్మలో మొన్నటివరకు మంత్రాలయ పీఠానికి అధిపతిగా ఉన్న పరమపూజ్య సుశమీంద్రతీర్థ స్వామిగా పుట్టి తన గురువైన రాఘవేంద్రస్వామి కోరికను తీర్చి మొన్న ఏప్రియల్ నెలలో బెంగుళూరులో పరమపదించాడు.


త్వరలో పత్తికొండలోని ఆయన శిలాప్రతిమ,మంత్రాలయం దగ్గర తుంగభద్రా నదికి ఆవలిపక్కన ఉన్న భిక్షాలయం (నేటి బిచ్చలి గ్రామం)లోని అప్పనాచార్యుడు నివసించిన ఇల్లు-నేను స్వయంగా తీసిన ఫొటోలతో సహా ఇస్తాను. సర్ తామస్ మన్రో జాతకం మరియు స్వామీజీల జాతకాలు తులనాత్మక పరిశోధనలో త్వరలో చూద్దాం. ప్రస్తుతానికి తామస్ మన్రొ మరియు స్వామీజీల ఫోటోలలో వారి మధ్య పోలికలు గమనించండి.