నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

14, సెప్టెంబర్ 2009, సోమవారం

ప్రశ్న శాస్త్రం


జ్యోతిర్విజ్ఞానం లో ప్రశ్నశాస్త్రం ఒక విడదీయలేని భాగం.జాతకాన్ని బట్టి జాతకుని జీవనగతి,ఒడిదుడుకులు,మంచిచెడు దశలు,తీసుకోవలసిన జాగ్రత్తలు తెలుస్తాయి.కాని రోజువారీ సందేహాలకు,ప్రశ్నలకు ఒకవ్యక్తి జాతకం ఉపయోగపడదు.అటువంటి సమయంలో దైనందిన విషయాలలో ఉపయోగ పడేది ప్రశ్నశాస్త్రం.

మనిషి జీవితం సంక్లిష్టం.ఎన్నో సందేహాలు,అనుమానాలు మనిషికి ఎదురౌతూ ఉంటాయి.అడుగడుగునా విభిన్నదారులు ఎదురౌతాయి.ఏ దారిని ఎంచుకోవాలో తెలియదు.అటువంటి పరిస్థితిలో ప్రశ్నశాస్త్రం ఉపయోగం అమూల్యం. చేతులో ఉన్న దీపంలా ప్రశ్నశాస్త్రం మనిషికి దారి చూపగలదు.

మనిషి పుట్టినపుడు ఉన్న గ్రహస్థితిని బట్టి ఆమనిషి జీవితం ఎలా ఉంటుందో తెలుస్తూంది. అలాగే ఒక సందేహం మనసులో కలిగినపుడు ఉన్న గ్రహస్థితిని బట్టి ఆసందేహం పుట్టుపూర్వోత్తరాలు,అది జరుగుతుందా లేదా మొత్తం వివరాలు తెలుసుకోవచ్చు.

ప్రశ్నశాస్త్రం మన గురించేకాక మన చుట్టూ జరగుతున్న అనేక విషయాల గురించి కూడా సమాధానం చెప్పగలదు.కాని దీనికి కొన్ని పరిమితులున్నాయి.సరదాకు,పరీక్షించటానికి,ఎగతాళికి అడిగే ప్రశ్నలకు జవాబులు రావు.దీనిలోఉన్న ప్రత్యేకత ఏమిటంటే అడగబడిన ప్రశ్న నిజంగా అవసరం ఉండి అడిగిందా లేక సరదాకు/ఎగతాళికి అడిగిందా వెంటనే తెలుసుకొనే సౌలభ్యంకూడా ఇందులో ఉంది.నిజానికి ప్రశ్నలో మొదట చూడవలసింది ఇదే.ఈప్రశ్న సీరియస్గా అడిగినదా లేక సరదాగా అడిగినదా అనే విషయమే ముందుగా చూడాలి.కొన్ని గ్రహస్థితులను బట్టి ఈ విషయం తేలికగా తెలుస్తూంది.

ప్రశ్నవిధానంలో అనేక పద్ధతులున్నాయి. చప్పన్న ప్రశ్నశాస్త్రం పూర్తిగా భారతీయ జ్యోతిష్యవిధానం పైన ఆధారపడినట్టిది.వరాహమిహిరుని పుత్రుడైన పృధుయశస్సు ఇది వ్రాశాడని అంటారు.'తాజికనీలకంఠీ' అనే గ్రంధం నీలకంఠదైవజ్ఞుడు వ్రాసినది.ఇది ప్రస్తుత తజికిస్తాన్లో పుట్టిన తాజిక విధానం ఆధారంగా పనిచేస్తుంది.ఇది పాశ్చాత్యవిధానానికి దగ్గరగా ఉంటుంది.ఇవికాక కేరళ జ్యోతిష్కులు ప్రశ్నశాస్త్రంలో అందేవేసిన దిట్టలు. వారు చెప్పే ఫలితాలు చాలా ఆశ్చర్యజనకములుగా ఉంటాయి.వారికి వచ్చిన సరైన ఫలితాలు మిగిలిన వారికి రాకపోవటానికి ఒక కారణం ఉంది.

కేరళలో ప్రశ్నశాస్త్రం పరిశోధనాస్థాయిని దాటి ఇంకా ముందుకు పోయింది. ప్రశ్నమార్గం అనే గ్రంధం వారికి ప్రామాణిక గ్రంధం.వేరే ఇతర విధానాలలో లేని ప్రత్యేకతలు వారి పద్దతులలో ఉన్నాయి.మాంది,గుళికలను ముఖ్యం గా చూచుట,అష్టమంగళప్రశ్న,ఇంకా అనేక విభిన్నపద్దతులు కేరళప్రశ్న శాస్త్రప్రత్యేకతలు.మనం ఏనాడో మరచి పోయిన విషయాలు,కుటుంబంలో తరతరాలుగా వస్తున్న విషయాలు వారు వివరిస్తుంటే నోరు వెళ్ళబెట్టి వినటం తప్ప మనం ఏమీ చెయ్యలేము.

కేరళప్రశ్నకు కల ఇంకొక ప్రత్యేకత- పెద్దదైన క్రియాకలాపంతో కూడిన పూజా విధానం.వారు ప్రశ్నను ఆషామాషీగాతీసుకోరు.ప్రశ్నచక్రం వేసేముందు చాలా తతంగం ఉంటుంది.విఘ్నేశ్వరపూజ,నవగ్రహపూజ,క్షేత్రపాలక  పూజఇత్యాది తతంగం చాలా వివరంగా ఉంటుంది.ప్రశ్న చెప్పే జ్యోతిష్కుడు ముందురోజు ఉపవాసం ఉండి,నియమసహితంగా ప్రశ్నతతంగాన్ని జరుపుతాడు.ఇది దాదాపు ఒకరోజు పడుతుంది.అందుకే వారివిధానంలో అద్భుతమైన ఫలితాలువస్తాయి.మనం టీలు తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ కంప్యూటర్లో వేసే ప్రశ్నచక్రానికి సరైన జవాబులు రావు. ఇదే వారికీ మనకూ తేడా.

కృష్ణమూర్తి పధ్ధతిని స్మరించకుండా ప్రశ్నశాస్త్రం పరిపూర్ణం కాదు.ప్రొఫెసర్ కృష్ణమూర్తిగారి KPSystem ఒకఅద్భుతమైన విధానం.సామాన్య విధానాలలో pinpointedness ఉండదు. దీనిని అధిగమించటానికి ఆయన సబ్ మరియు సబ్సబ్ అనే సూక్ష్మవిభాగాలను కనిపెట్టి ఫలితాలలో సూక్ష్మీకరణ విధానాన్ని స్పష్టతను తెగలిగాడు. కాని ఇందులోకూడా చెప్పేవాని స్ఫురణ శక్తి యొక్క పాత్ర చాలా ఉంటుంది.అంతేగాని ఉత్తగణితంవల్ల ఎక్కువగా ప్రయోజనం ఉండదు.

ఏ విధానాన్ని పాటించినా దానిలో పరిపూర్ణత రావాలంటే శాస్త్రాన్ని చాలా అధ్యయనం చెయ్యాలి. దానికితొడు నియమయుతమైన జీవితం గడపాలి. అప్పుడే త్రికాలజ్ఞానం,వాక్శుద్ధి కలుగుతాయి.మన మహర్షులు ఇటువంటి త్రికాలజ్ఞానం కలిగినవారే.వారు మనకు అందించిన శాస్త్రమే ప్రశ్నశాస్త్రం.రోజువారీ సందేహాలలో దీని పాత్ర అమోఘం అనిచెప్పవచ్చు.