నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

29, సెప్టెంబర్ 2009, మంగళవారం

విశిష్ట సాత్విక ఉపాసన


భక్తిమార్గంలో భగవంతుని పంచవిధమైన భావాలతో సమీపించటం ఆరాధించటం ఉంటుంది. ఇవి శాంతభావము,దాస్య భావము,సఖ్యభావము,వాత్సల్యభావము, మధుర భావము. ఈ పంచవిధ భావముల గురించి మరొకసారి తెలుసుకుందాం. 

వాత్సల్య భావములోని ఒక శాఖ భగవంతుని తల్లిగా ఆరాధించటం. ఇది అతి ఉత్తమమార్గం. మన హైందవమతానికి ప్రత్యేకమైన అనేక మార్గాలలో ఇదీ ఒకటి. ఈ విధానంలో భగవంతుని శక్తిగా ఉపాసించటం ఉంటుంది. సమస్త జగత్తుకూ భగవంతుని త్రిగుణాత్మిక అయిన శక్తి స్వరూపమే తల్లి. 

లలితా సహస్రనామస్తోత్రం అని చాలామందికి తెలుసు. కాని దాని అసలు పేరు లలితా రహస్యనామస్తోత్రం. ఎందుకనగా జగన్మాత యొక్క ఈ వెయ్యి నామములకు రహస్యమైన అర్థములు ఉన్నాయి. ఈ నామములు మానవ కల్పితములు కావు,కవి విరచితములు కావు.ఇవి స్వయానా జగన్మాత యొక్క పరివారశక్తులైన వశిన్యాది వాగ్దేవతలచే చెప్పబడినట్టి దివ్య నామములు మరియు మంత్రములు.



లలితా సహస్రనామ పారాయణ మహాత్యం ఇంతా అంతా కాదు.భక్తితో పారాయణ చేస్తే సద్యోఫలితం ప్రాప్తించటం మనం నిదర్శనంగా చూడవచ్చు. సాక్షాత్తూ జగన్మాత అనుగ్రహం పొందగలిగితే ఇక మానవజన్మకు అంతకు మించిన పరమప్రయోజనం ఉండదు.ఈ సహస్రనామములలో ఎన్నో ఆరాధనావిధానాలు,ఉపాసనాపద్దతులు,యోగతంత్ర రహస్యాలు సూక్ష్మంగా ఇమిడి ఉన్నాయి.


ఏ శక్తి చరాచర ప్రపంచము యొక్క సృష్టి స్థితి లయములను చేస్తూ ఉన్నదో ఆ శక్తియే జగన్మాత అనగా పరాశక్తి. ఈ ప్రక్రియతో సంబందంలేని నిశ్చల మైన స్థితిలో ఉన్న అదే శక్తిని పరమశివుడు అని తంత్రములు పిలిచాయి. కనుక శివుడు శక్తి అభేదములు. రక రకాలయిన మతాలు రక రకాలయిన పేర్లతో పిలుస్తున్నది ఈ శక్తినే గాని వేరొకటి కాదు.

ఆ జగన్మాత యొక్క వెయ్యి దివ్య నామములే లలితా సహస్ర నామములు. 'లలితా' అనే నామమే అత్యంత మనోహరమైనట్టిది.సమస్త చరాచర సృష్టికి ఆధారమైనట్టి శక్తి 'లలిత'.అనగా లలితమైన స్వరూపం కలిగినట్టిది. ఆర్ద్రమైనట్టి తత్వము కలిగినట్టిది.భయంకరమైన శక్తి కాదు.శరత్కాల చంద్రుని వలె లలితమైనట్టి శక్తి. చల్లని చూపులతో తన బిడ్డలను కాపాడుతూ ఉండే ఆధారశక్తి. భగవంతుని తల్లిగా భావించటం భారతీయ మతంలోని విశిష్టత.

ఈ రహస్య నామములలోని రహస్య ప్రక్రియలను తెలుసుకోలేక పోయినా ఆచరించలేక పోయినా, కనీసం సాత్వికమైన భక్తితో పారాయణ చేసి ఆ జగన్మాతను ప్రార్ధిస్తే తప్పక మన గమ్యాన్ని చేరగలం. ఇక ఆ రహస్యములు తెలిసి ఆచరించే వారి పని వేరే చెప్ప వలసిన పని లేదు. ఈ భూమిపైన వారే నడిచే దేవతలని చెప్ప వచ్చు.


శక్తి ఆరాధన మనదేశంలో అతి ప్రాచీనకాలం నుంచి ఉన్నది. తల్లిని దేవతగా ఆరాధించే "మాతృదేవో భవ" మొదలైన వేదవాక్యాల ఆచరణ శక్తి ఆరాధన గా మన దేశమంతటా వ్యాపించి ఉంది. మన దేశంలో తల్లికి దేవతా స్థానాన్ని ఇచ్చి గౌరవించడం అతి ప్రాచీనకాలము నుంచి ఉన్న అద్భుత మైన విశిష్టత. అవతారమూర్తులైన రాముడు,కృష్ణుడు,మొదలైనవారు కూడా శక్తిని పూజించారు.సామాన్యజీవి నుండి అవతారమూర్తి వరకు ఆ జగన్మాత యొక్క బిడ్డలే.


శ్రీ రామకృష్ణుడు వివేకానందునికి ఒక కధ చెప్పాడు.

అర్జునుడు శ్రీకృష్ణుని విశ్వరూపాన్ని చూచి న తదుపరి ఆయనను ఎక్కువగా పొగిడేవాడట. అర్జునునికి సరియైన అవగాహన కలిగించదలచి కృష్ణుడు ఒకనాడు వ్యాహ్యాళికి పోతూ అర్జునుని తనతో రమ్మని పిలిచాడు.వారిద్దరూ ఒక మహావృక్షం దగ్గరకు చేరుకున్నారు. ఆ వృక్షానికి గుత్తులు గుత్తులుగా నేరేడుపండ్ల వంటి పండ్లు వేలాడుతున్నాయి.

శ్రీకృష్ణుని ఆదేశం ప్రకారం అర్జునుడు ఒక కొమ్మకు ఉన్న అనేక గుత్తులలో ఒక గుత్తి వద్దకు పోయి చూడగా ఒక్కొక్క పండులో ఒక్కొక్క కృష్ణరూపం కనిపించిందట. అపుడు విస్మయం చెందిన అర్జునునితో శ్రీ కృష్ణుడు " అర్జునా చూచావు కదా.కాలమనే మహాశక్తిలో నా వంటి అవతారమూర్తులు ఎందఱో ఉంటారు.జగన్మాత అనబడే కాళికాశక్తి లీలావిలాసంలో అవతారమూర్తులు ఎందఱో పుట్టి వారివారి పని పూర్తిచేసి మళ్ళీ ఆ శక్తిలోనే లయం అవుతుంటారు.ఇది సత్యం.దీన్ని బాగా తెలుసుకో "అని చెప్పాడట.

నిన్నటితో ముగిసిన నవరాత్రులలో భగవంతుని తల్లిగా జగన్మాతగా ఆరాధించాము.ఎవరో కొందరు ఉత్తమ సాధకులు, సాత్విక ఉపాసకులు అక్కడక్కడా ఉన్నారు.కాని చాలా ప్రదేశాలలో బలులు,వృధాపూజలు మొదలైన నిమ్న స్థాయికి చెందిన ఆరాధనలు ఇంకా కొనసాగుతున్నాయి. కోరికలతో చేసే పూజలు,అర్చనలు ఎక్కువగా సాగుతున్నాయి.

పూజలు మంచివే. కాని ఉత్తమమైన పూజ, ఆరాధన, ఉపాసన కావాలి. జగన్మాతకు మనము ఇచ్చే జంతుబలులు,కుంకుమపూజలు అవసరంలేదు.మనలోని పశుత్వాన్ని బలి ఇవ్వగలిగితే అది అత్యున్నతమైన పూజ అవుతుంది. మనలోని రాక్షసుణ్ణి చంపగలిగితే అది ఉత్తమమైన ఆరాధన అవుతుంది.అహంకార రూపుడైన దున్నపోతును( మహిషాసురుణ్ణి) సంహరించకుండా ఆ తల్లికి తృప్తి కలుగదు.

మనమిచ్చే కొబ్బరికాయలు, నైవేద్యాలు, బలులు ఆ తల్లికి అవసరం లేదు. ఆ అసురుడు అహంకారరూపంలో మన అందరిలో ఉన్నాడు.అతన్ని బలి ఇవ్వాలి.అది చెయ్యకుండా ఎన్ని పారాయణాలు,పూజలు చేసినా మన స్వభావం యధాప్రకారం కొనసాగుతూ ఉంటుంది తప్ప ప్రయోజనం శూన్యం. ఇటువంటి పూజల వల్ల ఏవో కొన్ని లౌకిక ప్రయోజనాలు పొందవచ్చు అంతే కాని అసలైన ప్రయోజనం అయిన ఆత్మ సాక్షాత్కారాన్ని పొందలేము.అది పొందాలంటే రహస్యమైన సాత్విక ఉపాసన ఎలా చేయాలో తెలుసుకోవాలి. ఆచరించాలి. ఫలితాన్ని పొందాలి.

ఉపాసన అనేది పార్ట్ టైం దీక్షల వంటిది కాదు. మనిషి జన్మ మొత్తం ఒక దీక్షగా సాగాలి.ఆత్మజ్ఞానం అనబడే గమ్యాన్ని చేరినపుడే దీక్షావిరమణ. అట్టి దీక్షను మనిషి ఆచరించాలి. దానికి మన మతం ఎన్నో మహత్తరములైన మార్గాలను, ఉపాసనా విధానాలను అందించింది. ఏ ఒక్కదాన్ని చక్కగా ఆచరించిన గమ్యాన్ని చేరగలం. కాని ఆచరించే వారేరీ?అనుష్టించేవారేరీ? మొక్కవోని ఋషిరక్తం ఈనాడు మూగబోయిందా?ప్రపంచాన్ని ఒక్క చూపుతో శాసించగలిగే బ్రహ్మతేజం ఈనాడు ఏదీ?ఏ విలాసాలు సుఖాల కోసమైతే ప్రపంచ ప్రజలు అర్రులు చాస్తూ నానా రకాల ఊడిగాలు చేస్తున్నారో ఆ సమస్తసుఖాలనూ,గడ్డిపోచలాగా తిరస్కరించి,ఒక్క బ్రహ్మజ్ఞానమే వాంచనీయం,జీవిత పరమగమ్యం అది ఒక్కటి మాత్రమె అని ఆచరించి చూపగలిగిన వైరాగ్యపూరిత బ్రహ్మ తేజస్సు ఎక్కడా కనపడదే?

ప్రజలు అజ్ఞానంలో తెలియనితనంలో కొట్టుమిట్టాడుతూ అమితమైన జ్ఞాన సంపదను తమ చుట్టూ పెట్టుకొని కూడా చూడలేని వారై, నిమ్న తరగతికి చెందిన పూజలలో ఆరాధనలలో సమయాన్ని గడుపుతుంటే,వారికి నిజమైన ఉపాసనా మార్గాలను అందించి జాతిని జాగృత పరచవలసిన ఆచార్యులేరీ?ఆచరించే సాధకులేరీ?మనకెంతటి దుర్గతి పట్టింది? మహోత్తమమైన మతాన్ని,జ్ఞానసంపదను మన వారసత్వంగా పొందికూడా గుడ్డివాళ్ల వలె ప్రవర్తిస్తున్నాము.

వేదోపనిషత్తులు ప్రతిపాదించిన అత్యుత్తమ జ్ఞానాన్ని తెలుసుకోండి. ఆచరించండి.నిజమైన ఋషిసంతతి వారమని మనం ప్రపంచానికి నిరూపించాలి.

"శ్రుణ్వంతు విశ్వే అమృతస్య పుత్రాః ఆయే ధామాని తవాని తస్యుః వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే తమేవ జ్ఞాత్వా అతిమృత్యు మేతి నాన్యపంధా విద్యతే అయనాయ"--అన్న దివ్యమైన వేదవాణి వినండి.నిద్ర లేవండి. కార్యోన్ముఖులు కండి. జీవితం స్వల్పం. ఆత్మజ్ఞానం పొందలేకపొతే జన్మ వృధా అవుతుంది.ఈ సత్యాన్ని విస్మరించకండి.

విశిష్ట సాత్విక ఉపాసనను ఆచరించి మహోన్నతమైన ఫలితాన్ని పొందండి.