31, డిసెంబర్ 2009, గురువారం
పన్నెండు పద్యాలలో రామాయణం
అవతార సంకల్పం
కం || అలపాల కడలి యందున
చెలువంబున లక్ష్మి చెంత నలరుచు నుండన్
తిలకించుచు సురలెల్లరు
నిలలో దుష్టుల దునుమగ నిను బిలువగనే ||
రఘువంశమున జననం
కం || ఇనకులమున నింపారగ
ఘన కీర్తిని బుట్టినావు గణముల తోడన్
అనవరతము ప్రీతి గొనుచు
తనయుల బెంచగ నధిపుడు కొనగొని సతులున్ ||
యాగ రక్షణం - సీతా పరిణయం
కం || వీక్షిం పుచు యాగంమును
రక్షించితి వీవు దాని రాక్షస వధచే
దీక్షగ శివు విల్లు విరచి
దక్షత వరియించినావు ధరణీ జాతన్ ||
అరణ్య వాసం
కం || పితరుం డొసగిన మాటల
నతి దీక్షగ నిలుప నీవు నడవుల కేగన్
మతి మీరగ నా భరతుడు
గతి నీ పాదుకల దాల్చి గాచెను ధరణిన్ ||
కం || ఘోరాటవులం దిరుగుచు
వీరత నా రక్కసులను జీరుచు నిలలో
నారాధించేడి మునులను
వారించుచు నిచ్చినావు వరములు వడిగా ||
సీతాపహరణం
ఆ || అనుజ కబ్బినట్టి యవమానముం గాంచి
రాక్ష సేశ్వరుండు రోష మొంది
సీత నపహ రించె నీతి దూరుం డౌచు
లవణ సంద్ర మందు లంక దాచె ||
మిత్ర లాభం
ఆ || పక్షి రాజు వల్ల పరగ గుర్తులెరిగి
వానరోత్తములను వాశి గాంచి
వాలి జంపి నీవు వానరున్ సుగ్రీవు
గద్దె నిల్పి నావు గౌర వించి ||
సీతా సందర్శనం
ఆ || వానరాదు లెల్ల వన్నె మీరగనేగి
వెదకి రవనిలోన బెదరు లేక
ఆంజనేయు డంత ఆర్ణవంబును దాటి
లంకలోన సీత నింక గనియె ||
లంకా విధ్వంసనం
ఆ || మాత ఎదుట నిల్చి మన్ననల్ తానంది
అంగులీక మిచ్చి అవనిజకును
వీర విక్రమమున విధ్వంస మొనరించి
లంక గాల్చె రామ కింక రుండు ||
రావణాది రాక్షస సంహారం
ఆ || సేతు బంధ గతిని సంద్రమంతయు మించి
రావణాది సకల రాక్షసులను
సంహరించి నీవు సార్ధకుం డైనావు
సీత కరము బట్టి సంతసమున ||
రామ రాజ్య స్థాపనం
ఆ || చక్ర వర్తి వగుచు చరియించి ధర్మంబు
రాజ్యమేలి సర్వ రక్ష యొసగి
భక్త జనుల మదిని భవ్యంపు మూర్తివై
దైవ మగుచు నిల్చి ధరణి లోన ||
అవతార సమాప్తి
ఆ ||కర్మ లన్ని యపుడు కడతేర గానింక
తనదు దివ్య సీమ జనగ నెంచి
నీదు ధామమునకు నింపార నేగుచున్
నిల్చి నావు నిత్య రూపు డగుచు ||
లేబుళ్లు:
మనోవీధిలో మెరుపులు