కం|| శ్రీ రామరామ యనియెడి
తారకమే సర్వమంత్ర సారము గలదో
ఆ రామనామ మహిమయె
ఆరామమ్మొసగు; పాపరాశి దహించున్ ||
" శ్రీరామ" అనేటటువంటి తారక మంత్రము సర్వ మంత్రసారము.ఆ రామనామజపమే సాధకునకు రక్షణనూ విశ్రాంతినీ ఇస్తుంది.అతని పాపాలను దహిస్తుంది.
కం|| రామా నీ నామంబున
నేమా రుచి ఎవరికైన నెన్నగదరమా
వ్యామోహహరము సాక్షా
త్కామారీ నిత్యజపము కనుగొని జూడన్ ||
కం|| రామా నీ నామంబున
నేమా రుచి ఎవరికైన నెన్నగదరమా
వ్యామోహహరము సాక్షా
త్కామారీ నిత్యజపము కనుగొని జూడన్ ||
శ్రీరామా ! నీ నామములో ఉన్నట్టి రుచి ఇట్టిది అని ఎన్నగా ఎవరికైనా తరమేనా? మానవుని వ్యామోహాలను అది పోగొడుతుంది. సాక్షాత్తూ పరమశివుడే నీ నామాన్ని జపిస్తున్నాడు కదా.
కం || శ్రీ రామనామ మహిమన్
తరియించిరి సిద్దులైరి తాపసులెల్లన్
తరమా నాకిటులెన్నగ
హరుడే నీ జపము సల్పనను నిత్యంబున్ ||
శ్రీ రామనామ మహిమచేత తపస్వులేందరో సిద్ధత్వాన్ని పొందారు. శివుడే నీ నామాన్ని సదా జపిస్తున్నాడు. ఇక నాబోటి అల్పునకు దాని మహిమ ఎన్నగా తరమా?
కం || ఆలయమున నీ చెంతన్
తలచితి నీనామము మది తన్మయ మొందన్
జలజల గారెను అశ్రులు
పులకాంకితమయ్యె మేను పుణ్యచరిత్రా ||
ఓ పుణ్యచరిత్రా ! నీ ఆలయంలో నీ సమక్షంలో నిలిచి నీ నామాన్ని తన్మయమైన మనస్సుతో తలచాను. ఒళ్ళు ఝల్లుమంది. అశ్రువులు జలజలా కారుతున్నాయి.
కం || నేలనుబడి కట్టె వలెను
బాలకురీతిన్ బొగిలితి భవపరిహారా
చాలును తాపశతంబులు
చేలాంచల ఛాయనిమ్ము చాలదె నాకున్ ||
బాలకురీతిన్ బొగిలితి భవపరిహారా
చాలును తాపశతంబులు
చేలాంచల ఛాయనిమ్ము చాలదె నాకున్ ||
ప్రపంచ తాపాలను తీర్చేవాడా! ఒక కట్టెలాగా నేలనుబడి సాష్టాంగప్రణామమొనర్చి చిన్న పిల్లవాడిలా రోదిస్తున్నాను.ఈ జన్మలో పడిన బాధలు చాలు. నీ కొంగు చాయలో నన్ను చల్లగా ఉండనీ. అదే నాకు చాలు. ఇంకేమీ కోరను.
కం || పలికితి నీ నామంబును
తలచితి నీ దివ్యచరిత తగుమాత్రముగా
తొలగెను తొల్లిటి దొసగులు
కలిగెను ధన్యత నీదగు కరుణాదృష్టిన్ ||
నీ నామాన్ని జపించాను. నీ దివ్య చారిత్రాన్ని చేతనైనంతగా తలచాను. నాలో పూర్వం ఉన్న దోషాలు తొలిగిపోయాయి. నీ కరుణాదృష్టి చేత నాకు ధన్యత్వం కలిగింది.
కం || అంటవు ఏ పాపంబులు
తుంటరినై నేజరిపిన దోషములెల్లన్
మంటను బడు దూదిపగిది
వెంటనె గాలును రాముండింట వసింపన్ ||
తుంటరితనంతో మునుపు నేను చేసిన పాపాలు దోషాలు అన్నీ మంటలో వేసిన దూదిలాగా భస్మం అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు నా హృదయంలో నీవున్నావు కదా.అవన్నీ ఇప్పుడు నాలో ఎలా ఉండగలవు?
కం ||ఝల్లనె ఒడలు గ్రమ్మర
నుల్లము తా ఫుల్లమయ్యె నీ రూపింకన్
చల్లని చందురు వోలెన్
పల్లవపాణిగ దోచిన అల్లదె ఘడియన్ ||
చల్లని చంద్రునిలాగా సుతిమెత్తని అభయహస్తంతో నీవు కనిపించిన క్షణంలో నా ఒళ్ళు ఝల్లుమని పులకరించింది.హృదయంలో గొప్పదైన ఆనందం కలిగింది.
కం || ఏమా దర్శనభాగ్యం
బేమా నా పూర్వపుణ్య బలమది జూడన్
ఏమా చల్లని చూడ్కుల
వేమా శత జన్మకోటి కామహరంబుల్ ||
ఏమీ ఈ దర్శనభాగ్యం? ఏమీ నా పూర్వపుణ్యబలం? ఏమీ నీ చల్లనిచూపులు?అనేకజన్మలనుంచీ నన్ను బాధిస్తున్న కోరికలను నీ చూపులు పోగొడుతున్నాయి కదా.
కం || అమ్మగ నీవెదుట నిలువ
కమ్మెడి భయమేల నాకు సొమ్మగు ఘనమా
యమ్మవు సీతమ్మవు నీ
కమ్మని చల్లని చూపులె కాంచితి తల్లీ ||
అమ్మా.సీతమ్మా.నాతల్లిగా నీవు ఎదుట నిలిస్తే ఇక నాకు భయమేమున్నది తల్లీ? నీవే నా అమ్మవు.నా సంపదవు. నీ చల్లనిచూపులతో నా ఎదుట కనిపించావు కదా.