నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

28, మార్చి 2010, ఆదివారం

శ్రీ రామచంద్రుని జాతకం-వివాదాస్పద అంశాలు

శ్రీ రామచంద్రుని జాతక చక్రం మీద కొన్ని జ్యోతిష పరమైన వివాదాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైన దాన్ని ఇప్పుడు పరిశీలిద్దాము.

రవి మేషరాశిలోనూ చంద్రుడు పునర్వసు నక్షత్రంలోనూ ఉండగా నవమి తిధి రాదు అనే వివాదం చాలా పాతవిషయం. విషయాన్ని కొందరు జ్యోతిష పరిశోధకులు మొదటిసారిగా ఎస్ట్రలాజికల్ మేగజైన్ లో నలభై ఏళ్ళ క్రితంరాశారు.

రవికి మేషరాశిలో 10 డిగ్రీలు పరమోచ్చ. ఒక తిధికి 12 డిగ్రీలు. ఎనిమిది తిధులు పూర్తి అయితే 96 డిగ్రీల దూరం రవిచంద్రులమధ్యన ఉంటుంది. రవి తన పరమోచ్చ బిందువులో ఉంటే వీరు చెప్పినట్లు 10+96= 106 డిగ్రీ అవుతుంది. ఇది పుష్యమి నక్షత్రం ఒకటో పాదంలో పడుతుంది. కనుక ఇది సాధ్యం కాదు.

రామాయణ కాలం కొన్ని వేల సంవత్సరాల క్రితం గడిచింది. అప్పటికి ఇప్పటికి కాల గమనంలో మార్పులు వచ్చాయి. ఋతువుల సమయాలు మారాయి. విషయాలు మనం రామాయణంలోని ఋతువర్ణనలు అప్పటి గ్రహస్థితులనుగమనిస్తె తెలుస్తుంది. దీనిమీద Dr Vartak గారి రీసెర్చి ఇక్కడ చూడవచ్చు. డాక్టర్ వర్తక్ గారు చాలా పరిశోధన చెసి 4-12-7323 BC శ్రీరాముని జనన తేదిగా నిర్ధారించారు. ఆ రోజున రవి మేష రాశిలో రెండు డిగ్రీలలో ఉన్నాడు. కనుక చైత్ర నవమి తిధి సంభవమే.

ప్రస్తుత గ్రహ గతులను స్థితులను బట్టి చూస్తే వాల్మీకి మహర్షి ఇచ్చిన చైత్ర నవమి తిథి అసంభవం అని తోచినా, రామాయణ కాలం నాటి గ్రహస్తితులని గమనిస్తే అది అసంభవం కాకపోవచ్చు.

తరువాత, ఇంకొక విషయం ఏమనగా, నేడు మనం కంప్యూటర్ ద్వారా వేస్తున్న జాతకచక్రాలు దృగ్గణిత రీత్యా గణిస్తున్నాము. ఈ విధానం ఈ మధ్యన వచ్చిన విధానం. ఇది రాక ముందు మన దేశంలో వాక్య పంచాంగముల ఆధారంగా గ్రహ గణితం చేసేవారు. నాడీ గ్రంధాలు అన్నీ వాక్య పంచాంగం ఆధారితములే. అందుకే వారిచ్చె కుండలికీ, కంప్యూటర్ కుండలికీ ముఖ్యంగా బుధుని విషయంలో తేడాలుంటాయి. మహర్షి వాల్మీకి కాలానికి వాక్య పంచాంగముల రీత్యా గణితం జరిగి ఉండవచ్చు. దాన్ని బట్టి ఈ గ్రహస్తితి సాధ్యం కావచ్చు.

ఇదంతా ఊహాగానం అని చెప్పలేము. ఎందుకనగా, మహర్షులు అసత్య వాదులు కారు. కనుక వారి మాటలను బట్టి మన లెక్కలు సవరించుకోవడం సరి అవుతుంది గాని తద్విరుద్ధం సరి కాదు.
read more " శ్రీ రామచంద్రుని జాతకం-వివాదాస్పద అంశాలు "

24, మార్చి 2010, బుధవారం

శ్రీ రామ చంద్రుని దివ్య జాతకం



ఒక జాతకాన్ని చూడటంతోనే అది దివ్య జాతకమా లేక మానవ జాతకమా చెప్పటానికి కొన్ని నియమాలు ఉన్నాయి. పశు స్థాయికి చెందిన వారి జాతకాలు ఒక విధంగా ఉంటాయి. మామూలు మనుషుల జాతకాలు ఇంకొక రకంగా,కొంత మెరుగ్గా ఉంటాయి. మహా పురుషుల జాతకాలు దీనికి భిన్నమైన యోగాలతో, ఉన్నతంగా ఉంటాయి. అవతార మూర్తుల జాతకాలు ఇంకా మహోన్నతమైన యోగాలతో కూడి ఉంటాయి. ఇటువంటి అవతార మూర్తుల కోవకి చెందినదే మన దేశపు ఆరాధ్య దైవం అయిన శ్రీరామచంద్ర ప్రభుని జాతకం. జ్యోతిర్విజ్ఞానం ఏమాత్రం ఉన్నవారైనా జాతకాన్ని చూడటంతోనే ఒకే మాట చెప్పగలరు--" ఇది ఒక మహత్తరమైన దివ్యపురుషుని జాతకం గాని మామూలు మనిషి జాతకం కాదు".

మహర్షి వాల్మీకి కి ప్రపంచం ఎంతగా ఋణపడి ఉన్నదో ఊహించటం కష్టం. అనన్య సామాన్యమైన శ్రీమద్రామాయణ రచన చెయ్యటమే గాక, రామాయణంలో ఆయా సంఘటనలు జరిగినప్పుడు ఆకాశంలో ఉన్నటువంటి గ్రహస్థితులను, నక్షత్ర స్థితులను ఆయన వివరంగా వర్ణించాడు. ఆయా గ్రహస్థితులు కొన్ని వేల వత్సరాలకు గాని రానివి కొన్ని ఉన్నాయి. దానిని బట్టి రామాయణ కాలం దాదాపు క్రీ పూ 7300 అని కొందరు జ్యొతిష్య పరిశోధకులు నిర్ణయించారు. ప్రతి విషయానికీ ఉన్నట్లే, విషయంలో కూడా వాద ప్రతివాదాలున్నాయి. వివరాలు మళ్ళీ చర్చిద్దాం. ప్రస్తుతానికి శ్రీ రామచంద్రుని దివ్య జాతకంలో ఉన్న విశేషాలు మాత్రం చూద్దాం.

వాల్మీకి మహర్షి శ్రీమద్రామాయణ మహాకావ్యంలో శ్రీరామచంద్రుని జన్మ సమయాన్ని ఇలా వర్ణించాడు. బాలకాండ 18 అధ్యాయంలో 8,9,10,11 శ్లోకములు చూద్దాము.

శ్లో|| తతో యజ్ఞే సమాప్తే తు ఋతూనాం షట్ సమాత్యాయు:||
తతశ్చ ద్వాదశే మాసే, చైత్రే,నావమికే తిథౌ ||

నక్షత్రే2దితి దైవత్యే, స్వోచ్చ సంస్థేషు పంచషు||
గ్రహేషు, కర్కటే లగ్నే వాక్పతా ఇందునా సహా ||

ప్రోద్యమానే జగన్నాధమ్, సర్వలోక నమస్కృతమ్||
కౌసల్యా జనయద్రామమ్, సర్వలక్షణ సంయుతమ్ ||

విష్ణోరర్ధమ్ మహాభాగమ్ పుత్రమైక్ష్వాకు నందనమ్ ||
లోహితాక్షమ్ మహాబాహుమ్ రక్తోష్టమ్ దుందుభి స్వనమ్ ||

అర్థము:
యజ్జము సమాప్తి అయ్యిన తదుపరి ఆరు ఋతువులు గడిచాయి. అప్పుడు పన్నెండో మాసమున, చైత్ర నవమి తిథి రోజున, అదితి దేవత అధిపతి అయిన పునర్వసు నక్షత్రమున, అయిదు గ్రహములు తమతమ ఉచ్చ స్థానములలో ఉండగా, కర్కాటక లగ్నమున, వాక్ పతి చంద్రునితో కలసి ఉండగా,జగత్తులకు నాధుడు, సర్వలోకములచే నమస్కరింపబడువాడును, సర్వ శుభ లక్షణ సంయుతుడును, విష్ణువు యొక్క అవతారమైనవాడును, మహనీయుడును, ఇక్ష్వాకు కులమునకు ఆనందకరుడును, ఎర్రని కన్నులు కలవాడును,గొప్ప బాహువులు కలవాడును, ఎర్రని పెదవులు కలవాడును, మంచి కంఠధ్వని కలవాడును అగు రామునకు కౌసల్యాసతి జన్మ ఇచ్చినది.

చిన్న శ్లోకములో వాల్మీకి మహర్షి మహత్తరమైన జ్యోతిష వివరాలనే గాక, సాముద్రిక వివరాలను, ఇస్తూ తద్వారా శ్రీరాముని దివ్యమైన వ్యక్తిత్వాన్ని మనకు చూపిస్తున్నాడు.

శ్రీరామచంద్రుని జాతకమున, అయిదు గ్రహములు-అనగా-రవి,కుజ,శుక్ర,గురు,శని గ్రహములు- ఉచ్చ స్తితిలొ ఉన్నాయి. లగ్నమున లగ్నాధిపతియగు చంద్రునితో కలసి గురువు ఉచ్చ స్తితిలో ఉండి గజకేసరీ యోగాన్ని ఇస్తున్నాడు. ఇతర స్వల్ప యోగములను అటు ఉంచితే, కుజుడు, గురువు, శనులు వరుసగా ఇచ్చేటటువంటి రుచక, హంస,శశ మహాపురుష యోగాలను జాతకంలో చూడవచ్చు. వీటిలో ఒక్కటి ఉంటే జాతకుడు గొప్పవాడు అని చెప్పవచ్చు. అటువంటి మూడు మహాపురుష యోగాలు కలసి ఇక్కడ ఉన్నాయి. అయిదు గ్రహాలు ఉచ్చ స్తితిలో ఉన్నాయి. ఒక్క రాహు కేతువులు మాత్రం ఒక సిద్ధాంతం ప్రకారం నీచలో ఉన్నాయి. బహుశా అందువల్లనే ఆయన జీవితం కష్టాల పరంపరలో గడిచింది.

లగ్నంలోని హంస గజకేసరీ యోగాలవల్ల, మహాపురుషుడును, మంచి ఖ్యాతి గలవాడు,మంచి మనస్సు, మంచి వాక్కు,మంచి ప్రవర్తన కలవాడు జాతకుడు అని సూచిస్తున్నాయి.

నాలుగింట శని ఉచ్చ స్థితివల్ల,మంచి ధార్మికమైన మనస్సు, నీతి నియమ పూర్వక ప్రవర్తన కలవాడని తెలుస్తున్నది. ధర్మపరమైన సుఖాలను మాత్రమే అనుభవించువాడు అని సూచితం. తల్లికి భోగ భాగ్యాలతో కూడిన జీవితం ఉన్నప్పటికీ మనశ్శాంతి మాత్రం ఉండదు అని తెలుస్తున్నది.

ఏడింట ఉచ్చ యోగకారక కుజునివల్ల, బలవంతులైన శత్రువులు, పతివ్రత యగు మహా సాధ్వి భార్యగా లభించుట, వివాహ జీవితంలో సుఖం లోపించుట కలిగాయి.

పదింట ఉచ్చ రవి వల్ల ధర్మ పరిపాలన చేసే న్యాయమూర్తి అని, రాచ కుటుంబానికి చెందినవాడని, సూర్య వంశమనీ సూచింపబడుతున్నది.

తొమ్మిదింట ఉచ్చ శుక్రునివల్ల, ఆయన మీద లగ్న గురుని దృష్టివల్ల, ధర్మంతో కూడిన భోగ జీవితం గడపిన గొప్ప పూర్వీకులు కలిగినవాడని, దాన ధర్మాదుల యందు ఆసక్తి కలిగిన ఉదార స్వభావుడని, ధార్మిక జీవితం గడుపుతాడని, అవతార మూర్తి యని సూచింపబడుతున్నది.

మహర్షి వాల్మీకి తన శ్లోకాలలో, కొన్ని సాముద్రిక లక్షణాలను చెప్పి ఉన్నాడు. శరీర లక్షణాలను బట్టి మనస్తత్వాన్ని, భవిష్యత్తునూ అంచనా వేసే శాస్త్రమే సాముద్రిక శాస్త్రం. ఎర్రని కండ్లు,ఎర్రని పెదవులు,మంచి కంఠధ్వని ఈ మూడూ మంచి రక్తపుష్టికి, మంచి ఆరోగ్యానికి, చక్కని శరీర ధాతువులకు సూచికలు. గొప్ప బాహువులు అని చెప్పటంలో ఆజానుబాహువులు అని అర్థం కావచ్చు. ఎందుకనగా చిన్నపిల్లవానికి వీరులకుండే గొప్ప బాహువులు ఉండవు. ఆజానుబాహువులు గొప్ప కార్య శూరత్వానికి సూచికలు. కోతుల సాయంతో మహా రాక్షసులచేత రక్షింపబడుతున్న వైభవ పూరిత లంకా నగరాన్ని జయించటం కార్య శూరత్వం కాక మరేమిటి?

రామాయణంలోని జ్యోతిష సూచనలను, ఆయా ఘట్టాలను, శ్రీరాముని జీవితంలోని దశలను తులనాత్మక పరిశీలన చేస్తూ ఒక గ్రంధమే వ్రాయవచ్చు.

అవతార మూర్తులను సూచించే గ్రహస్థితులు, యోగాలు శ్రీరాముని జాతకంలోనూ, శ్రీ కృష్ణుని జాతకంలోనూ, శ్రీ రామకృష్ణుని జాతకంలోనూ మాత్రమే నేను పరిశీలించగలిగాను. మిగిలిన మహాపురుషుల జాతకాలలో గొప్ప యోగాలు ఉన్నాయి కాని, అవతార పురుషుల జాతకాల స్థాయిలో లేవు.

జ్యోతిష విజ్ఞాన రీత్యా, నేడు భగవంతుని అవతారాలుగా కొలవబడుతున్న మహనీయులు చాలామంది నిజానికి మహనీయులే కాని అవతార మూర్తులు కారు అని చెప్పటం సాహసం అనిపించుకోదు. కనుక వారిని మహాపురుషులని అనవచ్చు గాని అవతార మూర్తులని అనకూడదు.

ఇంకా కొన్ని వివరాలు వచ్చె వ్యాసంలో చూద్దాము.
read more " శ్రీ రామ చంద్రుని దివ్య జాతకం "

22, మార్చి 2010, సోమవారం

సూర్యోదయ, తిథి ప్రవేశ కుండలుల సామ్యం

ఉగాది నాడు తిథి ప్రవేశానికి, సూర్యోదయానికి మధ్య దాదాపు నాలుగు గంటల సమయం ఉన్నది. కనుక గ్రహపరిస్థితిలో పెద్ద మార్పు లేదు. లగ్నం మాత్రమే మారింది.

సూర్యోదయ కుండలిలో సహజంగా మీన లగ్నమేఅవుతుంది. కారణం సూర్యుడు మీన రాశిలో ఉండటమే. ప్రతి ఉగాదికి ఇదే లగ్నం ఉంటుంది. దాదాపుగా ప్రతిసారిఉగాదికి రవి చంద్రులు బుధ శుక్రులు ఇక్కడే ఉంటారు. ఇతర గ్రహాల స్తితిగతులు మాత్రమే మారుతాయి. కనుక విధానం అంత సరియైనది కాకపోవచ్చు. కాని బీవీ రామన్ లాటి ఉద్దండులు విధానాన్నే అనుసరించారు. నాలుగుగ్రహాలు అదే లగ్నంలో ఉన్నప్పటికీ, నక్షత్ర పాదాలను బట్టి నవాంశ చక్రంలో మార్పులు ఉండవచ్చు. బహుశా వారు విధానాన్ని అనుసరించటానికి ఇదే కారణం అయి ఉండవచ్చు.


పోస్ట్ లో పైన చెప్పిన రెండు చార్టుల మధ్య సామ్యాలు చూద్దాము.

>>తిథి ప్రవేశ కుండలిలో ధనుర్ లగ్నం అయింది. సూర్యోదయ కుండలిలో మీన లగ్నం అయింది. రెండు చార్టులలో కేంద్ర స్థానాలు నాలుగూ పాపాక్రాంతములయ్యాయి. ఇదొక గమనించదగిన సూచన. పంచభూతములలో ఆకాశ తత్వం మినహా మిగిలిన నాలుగు రాశులూ పాప గ్రహాల ఆధీనంలో ఉన్నాయి. ఇది మంచి సూచన కాదు.

>>తిథి ప్రవేశ కుండలిలో గురువు యొక్క రాశిలో లగ్న రాహువు వల్ల గురు చండాల యోగం కలిగింది. ఇదినాయకుల మరియు మత నాయకుల మోసాలకు సూచిక. సూర్యోదయ కుండలిలో లగ్నంలోని నాలుగు గ్రహాల వల్లఅనేక ఆటు పోట్లు ఎదురౌతాయి. దాదాపు ఫలితాలు ఒకేలా ఉన్నాయి.

>>తిథి ప్రవేశ కుండలిలో సుఖ స్థానంలో నాలుగు గ్రహాలు-అందులో బుధుడు నీచ, శుక్రుడు ఉచ్చ స్తితులలోఉన్నారు.శుక్ల పాడ్యమి కనుక అమావాస్య ప్రభావం సుఖ స్థానం మీద ఉంటుంది. వెరసి ప్రజాజీవనంలో సుఖంలోపించింది. ఒక్క శుక్ర దశ మాత్రమే బాగుంటుంది. సూర్యోదయ కుండలిలో-సుఖ స్థానంలో కేతువు స్థితివల్ల ఇదేఫలితం ఉంటుంది. కేతు దశలో హటాత్ సంఘటనలవల్ల జన జీవనంలో సుఖం లోపిస్తుంది. ఇక్కడ కూడా రెండు చక్రములూ దాదాపు ఒకె ఫలితాన్ని సూచిస్తున్నాయి.

>>తిథి ప్రవేశ కుండలి లో-దశమంలో వక్ర శని వల్ల పరిపాలన లోపాలు, ఆలస్యాలు, అనుకున్న సమయానికిప్రాజెక్టులు పూర్తి కాకపోవటం, పనులు జరగక పోవటం ఉంటాయి.ప్రభుత్వం మీద ప్రజల వత్తిడి తీవ్రమ్ అవుతుంది. సూర్యోదయ కుండలిలో- దశమంలో రాహువు ఉన్నాడు. శనివత్ రాహు అనే సూత్రమ్ ప్రకారం తిరిగి అదే ఫలితాలు ఉంటాయి. ఒక రకంగా చూస్తే రాహువే ఇంకా ప్రమాదకారి. కనుక రెండు చార్టులూ మళ్ళీ అవే ఫలితాలను చూపుతున్నాయి.

>>తిథి ప్రవేశ కుండలిలో- సప్తమంలో కేతువు ఉన్నాడు. అదే సూర్యోదయ కుండలిలో అయితే - సప్తమంలో వక్ర శని ఉన్నాడు. ఏ రకంగా చూచినా పరిపాలనా యంత్రాంగానికి, ప్రతిపక్షాలకూ మంచిది కాదు. కేతువు వల్ల హఠాత్ సంఘటనలు, శని వల్ల ఆలస్యం, పనులు కాక చికాకులు పెట్టటం, పరిపాలనలో సామాన్య ప్రజల అతి జోక్యం జరుగుతాయి. పరిపాలనా పరంగ ఇవి మంచివి కావు.

>> ఇక పోతే, జలతత్వ రాశిలొ నీచ కుజుని వల్ల- మొదటి చార్ట్ ప్రకారం- ఫైనాన్స్ రంగం నష్టపోవటం, నాయకుల మరణం, అగ్ని,జల ప్రమాదాలు జరుగుతాయి. రెండవ చార్ట్ ప్రకారం కూడా ఇవే మళ్ళీ సూచింపబడుతున్నాయి. అయితే కుజ దశ తేదీలు కొద్దిగా మారుతాయి. ఆ సమయంలో వచ్చె అమావాస్య, పౌర్ణమి రోజులకు రెండు మూడు రోజులు అటూ ఇటూ గా ఇవి జరుగుతాయి.

ఏతా వాతా, రెండు చక్రములూ దాదాపు ఒకే ఫలితాలను సూచిస్తున్నాయి కనుక ఈ ఏడాది బాగ లేదని చెప్పవచ్చు.
read more " సూర్యోదయ, తిథి ప్రవేశ కుండలుల సామ్యం "

21, మార్చి 2010, ఆదివారం

వికృతి నామ సంవత్సరం-తిథి ప్రవేశ కుండలి

మన వైదిక పంచాంగంలో రోజు అనేది సూర్యోదయంతో మొదలౌతుంది. కనుక ముందటి పోస్ట్ లొ సూర్యోదయ కాలపు గ్రహ స్తితిని పరిగణనలోకి తీసుకున్నాను. బీవీ రామన్ గారు కూడా దేశ జాతకాలను ఇలాగే వివరించేవారు.

కొన్ని ఇతర పద్ధతులలో తిధి ప్రవేశ కుండలి ప్రామాణికంగా తీసుకుంటారు. ఇది కూడా ఒక సరియైన విధానమే. తిథి అనేది సూర్య చంద్రుల మధ్య దూరం.కొత్త సంవత్సరం చైత్ర శుక్ల పాడ్యమి తో మొదలౌతుంది. సమయం ఎప్పుడైనా మొదలు కావచ్చు. సూర్యోదయంతోనే మొదలు కావాలని నియమం లేదు. ప్రస్తుతం, పదిహేనో తేదీ రాత్రి తెల్లవారితే పదహారో తేదీన 2.31.45 గం-ని-సెకన్లకు హైదరాబాదులో కొత్త తిథి మొదలైంది. సమయానికి గ్రహస్తితి ఇక్కడ ఇచ్చాను.

ఏడాదికి కుదించిన వింశోత్తరీ దశ ఇలా ఉంది.

మార్చి 16 నుంచి మార్చి 23 వరకు --గురు/రాహు దశ: దశాచిద్రం కనుక నాయకులు మోసాలు చెయ్యటం,మోసగించబడటం ఉంటుంది. ఉగ్రవాదులు రాజధానిలో తిష్ట వెయ్యవచ్చు.

మార్చ్ 23 నుంచి మే 23 వరకు--శని దశ: దశమంలోని వక్ర శని వల్ల పరిపాలన కుంటుపడుతుంది. నిమ్న వర్గాలు,ప్రజలు ప్రభుత్వం మీద తీవ్ర వత్తిడులు తెస్తారు. అంటే తెలంగాణా ఆందోళన మళ్ళీ ఉధృతం కావచ్చు. మూడో దృష్టివల్ల విపరీత ఖర్చులు ఉంటాయి. సప్తమ దృష్టివల్ల, సుఖ స్థానంలో ఉన్న నాలుగు గ్రహాల కూటమి బాధింపబడుతుంది. బుధుని నీచ వల్ల,అధికారుల ప్లానింగ్ దెబ్బతింటుంది. కొన్ని వర్గాల ప్రజలకు అమితానందం కలుగుతుంది. పదో దృష్టివల్ల లగ్న సప్తమ రాహు కేతు ఇరుసు బాధింపబడుతుంది. కుండలి రెండుగా చీలిపోతుంది. అంటే తెలంగాణా వచ్చే సమయం ఇదేనా? ఏప్రియల్ 14 అమావాస్య, 28పూర్ణిమ,మే14అమావాస్యలకు కొంచం అటూఇటూగా ఈ సంఘటనలు జరుగవచ్చు.

మే 23 నుంచి జూలై 14 వరకు--బుధ దశ: నీచ బుధుని వల్ల, అధికారుల,ప్రతిపక్షాల, నాయకుల నీచపు ప్లానులు అమలవుతాయి.

జూలై 14 నుంచి ఆగష్టు 5 వరకు--కేతు దశ: ప్రతిపక్షాలు ఇబ్బందికర స్తితిలో పడతాయి. అనుకోని హటాత్ సంఘటనలు,ప్రమాదాలు జరుగుతాయి.

ఆగష్టు 5 నుంచి అక్టోబర్ 5 వరకు--శుక్ర దశ: ఉచ్చ శుక్రుని వల్ల, ప్రజా జీవనం కుదుట పడుతుంది. సమాజంలో ప్రెమ వ్యవహారాలు, అక్రమ సంబంధాలు ఊపందుకుంటాయి.విలాసాలు,విందులు,వృధా ఖర్చులు ఎక్కువ అవుతాయి. మార్కెట్ పరిస్తితి బాగుంటుంది.

అక్టోబర్ 5 నుంచి అక్టోబర్ 23 వరకు--రవి దశ: ఒక ప్రముఖ నాయకుని ఆరోగ్యం దెబ్బతినటం, లేదా మరణం సంభవిస్తుంది. అది జలప్రమాదం వల్ల, లెదా ఊపిరితిత్తుల వ్యాధివల్ల కావచ్చు.

అక్టోబర్ 23 నుంచి నవంబర్ 23 వరకు--చంద్ర దశ:ప్రజాజీవనంలో సుఖం లోపిస్తుంది. అనేక ఆటుపోట్లకు సమాజం గురవుతుంది.

నవంబర్ 23 నుంచి డిశెంబర్ 14 వరకు--కుజ దశ: అగ్ని ప్రమాదాలు,జల ప్రమాదాలు జరుగుతాయి. ఉత్తరాన రహస్య కుట్రలు,ఉగ్ర వాద చర్యలు జరుగవచ్చు.

డిశెంబర్ 14 నుంచి ఫిబ్రవరి 8 వరకు--రాహు దశ:మళ్ళీ నాయకుల, అధికారుల కుట్రలు కుతంత్రాలు ఊపందుకుంటాయి.సమాజంలో మోసాలు తాండవిస్తాయి.

ఫిబ్రవరి 8 నుంచి మళ్ళీ ఉగాది వరకు: గురుదశా శేషం: ప్రజల్తో నాయకుల సంబంధాలు మెరుగు పడతాయి. కాని నాయకత్వంలో నిరాశా నిస్పృహలు ఆవరిస్తాయి.

పైన సూచించిన ఘటనలు ఆయా నెలలలో అమావాస్య,పౌర్ణమి లకు అటూ ఇటూగా జరుగవచ్చు.
read more " వికృతి నామ సంవత్సరం-తిథి ప్రవేశ కుండలి "

16, మార్చి 2010, మంగళవారం

వికృతి నామ ఉగాది- దేశ, రాష్ట్ర పరిస్తితి


వికృతి నామ సంవత్సరం చైత్ర శుక్ల పాడ్యమి నాడు సూర్యోదయ సమయానికి రాష్ట్ర రాజధానిలో ఉన్న గ్రహ పరిస్థితి ఇక్కడ ఇస్తున్నాను.

లగ్నాదిపతిగా గురువు వ్యయస్థానం లో ఉన్నాడు. ఇది మంచి సూచన కాదు. రాష్ట్ర పరిస్తితి డెఫిసిట్ లో పడుతుంది. అనవసర ఖర్చులు ఎక్కువ అవుతాయి. నవాంశలో వక్ర శనితో కలిసి మీన రాశిలో ఉన్నాడు. కనుక డెవెలప్మెంట్ యాక్టివిటీస్ కు బ్రేక్ పడుతుంది. ఖర్చులకే డబ్బు చాలక పోవడంతో ప్రజోపయోగ కార్యాలకు ఖర్చు పెట్టటానికి మిగలని పరిస్తితి ఉంటుంది.

ధనాధిపతి కుజుడు అయిదింట నీచ స్తితిలో ఉన్నాడు. కనుక ధనపరంగా పైన చెప్పిన పరిస్తితి తప్పక కలుగుతుంది. రాశి నాధుడైన చంద్రుడు లగ్నంలో ఉండి నీచభంగం అయినప్పటికీ సూర్యుని దగ్గరగా ఉండి అస్తంగతుడైనాడు. కనుక పెద్దగా ఉపయోగం లేదు. రాష్ట్ర పరిస్తితి ఏమంత బాగుండదు. కుజుని స్తితి వల్ల ఇంకో ఫలితం ఏమనగా-నాయకులు ప్రజా కార్యక్రమాలు వదలి కుట్రలు కుతంత్రాలలో మునుగుతారు. కుజుడు ఏడాది రాజు మరియు సేనాపతి అవ్వటం వల్ల, కుజుని నీచ స్తితి వల్ల రాజులు అధికారులు నీచ మనస్తత్వం కలిగిన వారై రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడతారు.

మూడు/ఎనిమిది అధిపతి అయిన శుక్రుడు లగ్నంలో ఉచ్చ స్తితిలో ఉన్నాడు. కనుక ప్రజల మధ్య కమ్యూనికేషన్లు బాగా ఉంటాయి. కాని అవి మంచి చేసేవి అయి ఉండవు. విక్రమ స్థానాధిపతి లగ్నంలో ఉండటంతో రాష్ట్రం కష్టాలు ఉన్నప్పటికీ ధైర్యం గా ముందుకు పోగలుగుతుంది.

నాలుగు, ఏడు,పది భావాలలో అనగా కేంద్రాలలో పాప గ్రహాల వల్ల రాష్ట్ర పరిస్తితి ఏమంత బాగుండదు అనే చెప్పాలి. సుఖ స్థానంలో కేతు గుళికుల వల్ల జన జీవనం ఏమీ సుఖంగా ఉండదు. నాలుగు, ఏడు స్తానాధిపతి అయిన బుధుడు లగ్నంలో నీచ స్తితి లో ఉన్నాడు. బుధుడు ఏడాది మంత్రి అయినాడు. కనుక రాష్ట్ర సుఖాన్ని కాపాడవలసిన మంత్రి వర్గం, ప్రత్యర్ధులను సూచించే ప్రతిపక్షం, ఇతర శక్తులు (వేర్పాటు వాదులు, నక్సలైట్లు వగైరాలు)-- వీరు నీచ మైన ప్లానులతో కేంద్ర నాయకత్వం మీద తీవ్ర వత్తిడి తీసుకొస్తారు. నాయకత్వం వీరికి లొంగి పోతుంది. వీరి డిమాండ్స్ నెరవేర్చవలసిన గతి నాయకత్వానికి కలుగుతుంది. ఘటనలు బుధ దశ అయిన మే-జూలై, మరియు రవి, చంద్ర దశలైన సెప్టెంబర్ - నవంబర్ మధ్యలో జరుగుతాయి.

సప్తమంలో శని పరిస్తితి వల్ల ప్రతి పక్ష నాయకులకు కూడా మంచి కాలం కాదు. వారికి చిత్తశుద్ధీ ఉండదు. పదింట రాహువు వల్ల, పరిపాలన మోసపూరితంగా ఉంటుంది. లగ్నం లో నాలుగు గ్రహాల వల్ల నాయకులు అధికారులు ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో సతమతమౌతూ ఉంటారు.

ద్వాదశంలోని గురువు దృష్టి నాలుగు లో ఉన్న గుళిక కేతువుల మీద ఉంది. నాయకుల కుట్రలవల్లనే రాష్ట్రంలో పరిస్తితి అద్వాన్నం అవుతుంది. ఇదంతా రాష్ట్ర మంచికే, అంతా మన మంచికే అని వారు నచ్చ చెబుతారు. కాని దీనివల్ల రాష్ట్రానికి చెడు జరుగుతుంది.

విమ్శోత్తరీ దశను ఏడాదికి కుదించగా దశా వివరం ఇలా ఉంటుంది.

మార్చి 16 నుంచి మే 12 వరకు --శని దశ: సప్తమ శని వల్ల ప్రతి పక్షాలతో, ఇతర శక్తులతో మిక్కుటమైన బాధలు ఉంటాయి. నవమం మీది దృష్టి వల్ల ఫైనాన్స్ పరంగా రాష్ట్రానికి గడ్డు కాలం. దశమ దృష్టి తో నాలుగింట కేతువును గులికను చూడటం వల్ల రాష్ట్రం లో సుఖ శాంతులు కరువు అవుతాయి.

మే 12 నుంచి జూలై 2 వరకు--బుధ దశ: రాష్ట్రం అనేక వత్తిళ్ళకు ఆటుపోట్లకు గురవుతుంది. అనేక శక్తులు ముఖ్య నాయకత్వాన్ని శాసిస్తాయి. ధైర్యంగా సమస్యలనుంచి బయట పడినప్పటికీ చివరకు నష్టం జరుగుతుంది.

జూలై 2 నుంచి జూలై 23 వరకు--కేతు దశ: సుఖ స్థానంలోని కేతువు వల్ల రాష్ట్రం లో సుఖ శాంతులు తగ్గుతాయి. అనుకోని హటాత్ సంఘటనలు ఉంటాయి. ప్రతి పక్షము యొక్క మోస పూరిత, స్వార్థ పర చర్యల వల్ల రాష్ట్రం లో శాంతి కరువౌతుంది.

జూలై 23 నుంచి సెప్టెంబర్ 22 వరకు--శుక్ర దశ: రాష్ట్ర పరిస్తితి మెరుగు పడుతుంది. యువతలో ప్రేమ వ్యవహారాలూ, ఆత్మ హత్యలు ఎక్కువ అవుతాయి. యువతులకు ప్రేమ పేరుతో మోసాలు ఎక్కువగా జరుగుతాయి. ఫైనాన్స్ పరంగా కుంభకోణాలు జరుగుతాయి. ప్రజాధనం పెద్ద ఎత్తున స్వాహా అవుతుంది.

సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 10 వరకు--రవి దశ: శత్రు పీడ ( ప్రతిపక్షాలు, మరియు ఇతర శక్తులైన నక్సలైట్లు వంటి వారు) అధికంగా ఉంటుంది. నాయకుల ఆరోగ్యాలు మందగిస్తాయి. ఒక ప్రముఖ నాయకుని మరణం ఉండవచ్చు.

అక్టోబర్ 10 నుంచి నవంబర్ 9 వరకు--చంద్ర దశ: నాయకులకు తమ తమ ప్లానులు అమలు పరచటానికి కొంత వెసులు బాటు చిక్కుతుంది. పాలనా యంత్రాంగం కొంతవరకు తమతమ కార్య క్రమాల పైన దృష్టి సారించ గలుగుతుంది. కాని ఆటు పోట్లు తప్పవు.

నవంబర్ 9 నుంచి నవంబర్ 30 వరకు--కుజ దశ: కుట్రలు కుతంత్రాలు ఎక్కువ అవుతాయి. నాయకుల సంతానం పాలనలో ఎక్కువగా జోక్యం చేసుకుంటుంది. సమాజంలో ప్రేమోన్మాదాలు విజ్రుంభిస్తాయి. నాయకులు విందులు విలాసాలకు మితిమీరి ఖర్చు చేసి ప్రజాధనం కొల్ల గొడతారు. నాయకులు ఏక్సిడెంట్ల కు గురవుతారు. ఉత్తర దిక్కున ఉగ్రవాద చర్యలు జరగవచ్చు.

నవంబర్ 30 నుంచి జనవరి 23 వరకు--రాహు దశ: అధికారులు పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడతారు. పాలనా యంత్రాంగం హైజాక్ చెయ్య బడుతుంది. ఎక్కడ చూసినా మోసం తాండవిస్తుంది. స్కాములు కుంభకోణాలు జరుగుతాయి. తూర్పున, నైర్రుతి మూలలో ప్రమాదాలు, బాంబు పేలుళ్లు, ఉగ్రవాద చర్యలు సూచితం.

అప్పటినుంచి ఉగాది వరకు--గురు దశ మిగులు: మళ్ళీ పాలనా యంత్రాగం చేష్టలవల్ల రాష్ట్ర బొక్కసం ఇబ్బందులలో పడుతుంది. నాయకత్వం అసమర్థ స్థితిలో పడుతుంది.

ఇవే
ఫలితాలు కేంద్ర రాజ్యానికి కూడా వర్తిస్తాయి. కాని అప్పుడు దిక్కుల విషయంలో రాష్ట్రాలను పరిగణన లోకి తీసుకోవలసి ఉంటుంది. ఉదాహరణకు తూర్పు దిశన అంటే తూర్పు ఈశాన్య రాష్ట్రాలు అనీ, మరియు నైర్రుతి దిక్కున అంటే పాకిస్తాన్ బార్డర్ లో ఉన్న రాష్ట్రాలలో ఉగ్రవాద చర్యలు జరుగుతాయి అనీ అర్థం చేసుకోవాలి.

వెరసి ఏడాది మంచి పరిస్తితిని సూచిస్తున్న యోగం గాని గ్రహ స్తితి గాని ఒక్కటీ లేదు. కనుక, పరిస్తితి ఏమంత బాగా
లేదు. మొత్తం మీద పరిస్తితి ఆశా జనకంగా మాత్రం లేదు అని చెప్ప వచ్చు.

దైవ
బలం, ధర్మాచరణలు మాత్రమే మనిషికి కష్ట కాలంలో ఆదుకునే అంతిమ శక్తులు అన్న విషయం గుర్తుంచుకొని తద్వారా ప్రవర్తించటం ద్వారా జనులు శుభాలను పొందవచ్చు.
read more " వికృతి నామ ఉగాది- దేశ, రాష్ట్ర పరిస్తితి "