16, మార్చి 2010, మంగళవారం
వికృతి నామ ఉగాది- దేశ, రాష్ట్ర పరిస్తితి
వికృతి నామ సంవత్సరం చైత్ర శుక్ల పాడ్యమి నాడు సూర్యోదయ సమయానికి రాష్ట్ర రాజధానిలో ఉన్న గ్రహ పరిస్థితి ఇక్కడ ఇస్తున్నాను.
లగ్నాదిపతిగా గురువు వ్యయస్థానం లో ఉన్నాడు. ఇది మంచి సూచన కాదు. రాష్ట్ర పరిస్తితి డెఫిసిట్ లో పడుతుంది. అనవసర ఖర్చులు ఎక్కువ అవుతాయి. నవాంశలో వక్ర శనితో కలిసి మీన రాశిలో ఉన్నాడు. కనుక డెవెలప్మెంట్ యాక్టివిటీస్ కు బ్రేక్ పడుతుంది. ఖర్చులకే డబ్బు చాలక పోవడంతో ప్రజోపయోగ కార్యాలకు ఖర్చు పెట్టటానికి మిగలని పరిస్తితి ఉంటుంది.
ధనాధిపతి కుజుడు అయిదింట నీచ స్తితిలో ఉన్నాడు. కనుక ధనపరంగా పైన చెప్పిన పరిస్తితి తప్పక కలుగుతుంది. ఆ రాశి నాధుడైన చంద్రుడు లగ్నంలో ఉండి నీచభంగం అయినప్పటికీ సూర్యుని దగ్గరగా ఉండి అస్తంగతుడైనాడు. కనుక పెద్దగా ఉపయోగం లేదు. రాష్ట్ర పరిస్తితి ఏమంత బాగుండదు. కుజుని ఈ స్తితి వల్ల ఇంకో ఫలితం ఏమనగా-నాయకులు ప్రజా కార్యక్రమాలు వదలి కుట్రలు కుతంత్రాలలో మునుగుతారు. ఈ కుజుడు ఈ ఏడాది రాజు మరియు సేనాపతి అవ్వటం వల్ల, కుజుని నీచ స్తితి వల్ల రాజులు అధికారులు నీచ మనస్తత్వం కలిగిన వారై రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడతారు.
మూడు/ఎనిమిది అధిపతి అయిన శుక్రుడు లగ్నంలో ఉచ్చ స్తితిలో ఉన్నాడు. కనుక ప్రజల మధ్య కమ్యూనికేషన్లు బాగా ఉంటాయి. కాని అవి మంచి చేసేవి అయి ఉండవు. విక్రమ స్థానాధిపతి లగ్నంలో ఉండటంతో రాష్ట్రం కష్టాలు ఉన్నప్పటికీ ధైర్యం గా ముందుకు పోగలుగుతుంది.
నాలుగు, ఏడు,పది భావాలలో అనగా కేంద్రాలలో పాప గ్రహాల వల్ల రాష్ట్ర పరిస్తితి ఏమంత బాగుండదు అనే చెప్పాలి. సుఖ స్థానంలో కేతు గుళికుల వల్ల జన జీవనం ఏమీ సుఖంగా ఉండదు. నాలుగు, ఏడు స్తానాధిపతి అయిన బుధుడు లగ్నంలో నీచ స్తితి లో ఉన్నాడు. ఈ బుధుడు ఈ ఏడాది మంత్రి అయినాడు. కనుక రాష్ట్ర సుఖాన్ని కాపాడవలసిన మంత్రి వర్గం, ప్రత్యర్ధులను సూచించే ప్రతిపక్షం, ఇతర శక్తులు (వేర్పాటు వాదులు, నక్సలైట్లు వగైరాలు)-- వీరు నీచ మైన ప్లానులతో కేంద్ర నాయకత్వం మీద తీవ్ర వత్తిడి తీసుకొస్తారు. నాయకత్వం వీరికి లొంగి పోతుంది. వీరి డిమాండ్స్ నెరవేర్చవలసిన గతి నాయకత్వానికి కలుగుతుంది. ఈ ఘటనలు బుధ దశ అయిన మే-జూలై, మరియు రవి, చంద్ర దశలైన సెప్టెంబర్ - నవంబర్ మధ్యలో జరుగుతాయి.
సప్తమంలో శని పరిస్తితి వల్ల ప్రతి పక్ష నాయకులకు కూడా మంచి కాలం కాదు. వారికి చిత్తశుద్ధీ ఉండదు. పదింట రాహువు వల్ల, పరిపాలన మోసపూరితంగా ఉంటుంది. లగ్నం లో నాలుగు గ్రహాల వల్ల నాయకులు అధికారులు ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో సతమతమౌతూ ఉంటారు.
ద్వాదశంలోని గురువు దృష్టి నాలుగు లో ఉన్న గుళిక కేతువుల మీద ఉంది. నాయకుల కుట్రలవల్లనే రాష్ట్రంలో పరిస్తితి అద్వాన్నం అవుతుంది. ఇదంతా రాష్ట్ర మంచికే, అంతా మన మంచికే అని వారు నచ్చ చెబుతారు. కాని దీనివల్ల రాష్ట్రానికి చెడు జరుగుతుంది.
విమ్శోత్తరీ దశను ఏడాదికి కుదించగా దశా వివరం ఇలా ఉంటుంది.
మార్చి 16 నుంచి మే 12 వరకు --శని దశ: సప్తమ శని వల్ల ప్రతి పక్షాలతో, ఇతర శక్తులతో మిక్కుటమైన బాధలు ఉంటాయి. నవమం మీది దృష్టి వల్ల ఫైనాన్స్ పరంగా రాష్ట్రానికి గడ్డు కాలం. దశమ దృష్టి తో నాలుగింట కేతువును గులికను చూడటం వల్ల రాష్ట్రం లో సుఖ శాంతులు కరువు అవుతాయి.
మే 12 నుంచి జూలై 2 వరకు--బుధ దశ: రాష్ట్రం అనేక వత్తిళ్ళకు ఆటుపోట్లకు గురవుతుంది. అనేక శక్తులు ముఖ్య నాయకత్వాన్ని శాసిస్తాయి. ధైర్యంగా సమస్యలనుంచి బయట పడినప్పటికీ చివరకు నష్టం జరుగుతుంది.
జూలై 2 నుంచి జూలై 23 వరకు--కేతు దశ: సుఖ స్థానంలోని కేతువు వల్ల రాష్ట్రం లో సుఖ శాంతులు తగ్గుతాయి. అనుకోని హటాత్ సంఘటనలు ఉంటాయి. ప్రతి పక్షము యొక్క మోస పూరిత, స్వార్థ పర చర్యల వల్ల రాష్ట్రం లో శాంతి కరువౌతుంది.
జూలై 23 నుంచి సెప్టెంబర్ 22 వరకు--శుక్ర దశ: రాష్ట్ర పరిస్తితి మెరుగు పడుతుంది. యువతలో ప్రేమ వ్యవహారాలూ, ఆత్మ హత్యలు ఎక్కువ అవుతాయి. యువతులకు ప్రేమ పేరుతో మోసాలు ఎక్కువగా జరుగుతాయి. ఫైనాన్స్ పరంగా కుంభకోణాలు జరుగుతాయి. ప్రజాధనం పెద్ద ఎత్తున స్వాహా అవుతుంది.
సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 10 వరకు--రవి దశ: శత్రు పీడ ( ప్రతిపక్షాలు, మరియు ఇతర శక్తులైన నక్సలైట్లు వంటి వారు) అధికంగా ఉంటుంది. నాయకుల ఆరోగ్యాలు మందగిస్తాయి. ఒక ప్రముఖ నాయకుని మరణం ఉండవచ్చు.
అక్టోబర్ 10 నుంచి నవంబర్ 9 వరకు--చంద్ర దశ: నాయకులకు తమ తమ ప్లానులు అమలు పరచటానికి కొంత వెసులు బాటు చిక్కుతుంది. పాలనా యంత్రాంగం కొంతవరకు తమతమ కార్య క్రమాల పైన దృష్టి సారించ గలుగుతుంది. కాని ఆటు పోట్లు తప్పవు.
నవంబర్ 9 నుంచి నవంబర్ 30 వరకు--కుజ దశ: కుట్రలు కుతంత్రాలు ఎక్కువ అవుతాయి. నాయకుల సంతానం పాలనలో ఎక్కువగా జోక్యం చేసుకుంటుంది. సమాజంలో ప్రేమోన్మాదాలు విజ్రుంభిస్తాయి. నాయకులు విందులు విలాసాలకు మితిమీరి ఖర్చు చేసి ప్రజాధనం కొల్ల గొడతారు. నాయకులు ఏక్సిడెంట్ల కు గురవుతారు. ఉత్తర దిక్కున ఉగ్రవాద చర్యలు జరగవచ్చు.
నవంబర్ 30 నుంచి జనవరి 23 వరకు--రాహు దశ: అధికారులు పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడతారు. పాలనా యంత్రాంగం హైజాక్ చెయ్య బడుతుంది. ఎక్కడ చూసినా మోసం తాండవిస్తుంది. స్కాములు కుంభకోణాలు జరుగుతాయి. తూర్పున, నైర్రుతి మూలలో ప్రమాదాలు, బాంబు పేలుళ్లు, ఉగ్రవాద చర్యలు సూచితం.
అప్పటినుంచి ఉగాది వరకు--గురు దశ మిగులు: మళ్ళీ పాలనా యంత్రాగం చేష్టలవల్ల రాష్ట్ర బొక్కసం ఇబ్బందులలో పడుతుంది. నాయకత్వం అసమర్థ స్థితిలో పడుతుంది.
ఇవే ఫలితాలు కేంద్ర రాజ్యానికి కూడా వర్తిస్తాయి. కాని అప్పుడు దిక్కుల విషయంలో రాష్ట్రాలను పరిగణన లోకి తీసుకోవలసి ఉంటుంది. ఉదాహరణకు తూర్పు దిశన అంటే తూర్పు ఈశాన్య రాష్ట్రాలు అనీ, మరియు నైర్రుతి దిక్కున అంటే పాకిస్తాన్ బార్డర్ లో ఉన్న రాష్ట్రాలలో ఉగ్రవాద చర్యలు జరుగుతాయి అనీ అర్థం చేసుకోవాలి.
వెరసి ఈ ఏడాది మంచి పరిస్తితిని సూచిస్తున్న యోగం గాని గ్రహ స్తితి గాని ఒక్కటీ లేదు. కనుక, పరిస్తితి ఏమంత బాగా లేదు. మొత్తం మీద పరిస్తితి ఆశా జనకంగా మాత్రం లేదు అని చెప్ప వచ్చు.
దైవ బలం, ధర్మాచరణలు మాత్రమే మనిషికి కష్ట కాలంలో ఆదుకునే అంతిమ శక్తులు అన్న విషయం గుర్తుంచుకొని తద్వారా ప్రవర్తించటం ద్వారా జనులు శుభాలను పొందవచ్చు.
లేబుళ్లు:
జ్యోతిషం