సాంప్రదాయ కుండలి
మనకు లభిస్తున్న శ్రీరామచంద్రుని జాతక కుండలి జ్యోతిష పండితులు తయారు చెసినది కాదు. అసలు దీనిని ఎవరు వ్రాసారో కూడా తెలియదు. సాంప్రదాయ బద్దంగా కొందరు అనుకుంటూ ఉన్నది అనుస్యూతంగా వస్తున్నది మాత్రమే. కనుక అది సరియైనదేనా అంటే-- సందేహమే అని చెప్పవచ్చు. సాంప్రదాయ కుండలి ఇంతకు ముందటి పోస్ట్ లో ఇచ్చాను. అసలు సంస్కృత రామాయణంలో వాల్మీకి మహర్షి ఏమి చెప్పాడో కొంచెం జాగ్రత్తగా పరిశీలిద్దాము.
వాల్మీకి రామాయణం ఏమి చెబుతున్నది?
వాల్మీకి మహర్షి "అయిదు గ్రహములు తమ స్వోచ్చ స్థితిలో ఉన్నవి" అని మాత్రమే చెప్పాడు గాని అవి ఏ ఏ గ్రహాలో చెప్పలేదు. ఇక్కడే రెండు సమస్యలు ఉన్నవి.
ఒకటి- అవి ఏఏ గ్రహములో ఆయన చెప్పలేదు.
రెండు-స్వోచ్చ అనుటలో-స్వ+ఉచ్చ అని వాడినాడు గనుక కొన్ని గ్రహములు స్వక్షేత్రములలోనూ, కొన్ని ఉచ్చ స్థితిలోనూ ఉన్నవి అని సూచితం కావచ్చు. కాక పోవచ్చు. వాల్మీకి మహర్షి పంచ గ్రహముల స్థితిని స్పుటంగా చెప్పలేదు.
వాల్మీకి మహర్షి వాక్యాల విశ్లేషణ
"స్వోచ్చ సంస్థేషు పంచసు గ్రహేషు " అన్న మాటల్ని స్వ+ఉచ్చ అని తీసుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది అని కొందరి భావన. అయిదు గ్రహములు ఉచ్చ స్థితులలో ఉన్నవి అనేది వాల్మీకి మహర్షి ఉద్దేశం కాదు, ఆయన అసలు ఉద్దేశం ప్రకారం అయిదు గ్రహములు తమతమ స్వస్థానములలోనూ,ఉచ్చ స్థితులలోనూ ఉన్నవి అని మాత్రమే-అని కొందరంటారు. కనుక అయిదు గ్రహములలో కొన్ని స్వక్షేత్రములలోనూ, కొన్ని ఉచ్చ స్థితిలోనూ ఉండవచ్చు అని ఊహించటం సమంజసమే.
ఈ ప్రకారం చూస్తే, వాల్మీకి మహర్షి "కర్కటే లగ్నే వాక్పతౌ ఇందునా సహ" అని స్పష్టంగా చెప్పటంతో చంద్రుడు స్వక్షేత్రం లో ఉన్నాడు అని తెలుస్తున్నది. రాహు కేతువులను ప్రస్తుతానికి కొంతసేపు పక్కన పెడదాం. సాధారణంగా జ్యోతిష్యంలో పంచ గ్రహములు అనగా రవి చంద్రులు కాని ఇతర, పంచ తారా గ్రహములు అని అర్థం. రవి చంద్రుడు బింబాలుగా కనిపిస్తారు. రాహు కేతువులు చాయా గ్రహములు. ఇక మిగిలిన అయిదు గ్రహములు నక్షత్రముల వలె (తారలవలె) కనిపిస్తాయి. కనుక అవి తారా గ్రహములు. అవి కుజ,బుధ,గురు,శుక్ర,శనులు మాత్రమే. వీనిలో బుధుని ఉచ్చ స్థితి కన్యారాశిలో ఉంది. ఆయన రవికి దగ్గరగా ఉండే గ్రహం కనుక బుధుడు ఉచ్చస్థితిలో ఉంటే రవి కూడా కన్యా రాశి దరి దాపులలో ఉండాలి. అటువంటి గ్రహ స్థితిలో చైత్ర మాసం రాదు. కనుక బుధుడు ఉచ్చ స్థితిలో లేడు అని చెప్పవచ్చు.
ఇక మిగిలింది కుజ గురు శుక్ర శనులు. వీరిలో వాక్పతి యగు గురువు లగ్నంలో ఉచ్చ స్తితిలో ఉన్నాడు. చైత్ర మాసంలో శుక్రుడు మీన రాశిలో ఉంటాడు కనుక అది ఆయనకు ఉచ్చ రాశి కనుక సరిపోతుంది. కుజుడు,శని తమ తమ ఉచ్చ స్తితులలో ఉండటానికి అభ్యంతరం లేదు. కనుక కుజ గురు శుక్ర శనులు ఉచ్చ స్తితిలోనూ చంద్రుడు స్వక్షేత్రమగు కర్కాటకంలోనూ ఉంటే, వాల్మీకి మహర్షి చెప్పినట్లు-"స్వోచ్చ సంస్థేషు పంచసు గ్రహేషు" అన్న వాక్యం సరిపోతుంది- ఎందుకనగా నాలుగు గ్రహములు ఉచ్చ స్తితిలోనూ, ఒక గ్రహం స్వక్షేత్రంలోనూ ఉన్నవి కాబట్టి.
అసలు సమస్య
కాని సాంప్రదాయ వాదులు వేసే కుండలి లో చూపినట్లుగా, రవి మేషంలో ఉచ్చ స్థితిలో ఉండటం సంభవం కాదు. ఎందుకనగా, ఇంతకు ముందు పోస్ట్ లో వ్రాసినట్లుగా, డిగ్రీల దూరాన్ని బట్టి, చైత్ర నవమి తిధి+పునర్వసు నక్షత్రం రావాలంటే రవి మీనరాశిలోనూ, చంద్రుడు కర్కాటక రాశిలో మొదటి పాదంలోనూ ( పునర్వసు నాలుగో పాదం) ఉన్నపుడే అది సాధ్యం అవుతుంది. కనుక రవి మీన రాశిలో ఉండటమే తార్కికం. కనుక 90-93.20 డిగ్రీలైన పునర్వసు నాలుగో పాదం నుంచి 12x8=96 డిగ్రీలు వెనక్కు పోతే రవి స్థితి వస్తుంది. అనగా మీన రాశి 27.20 నుంచి ౩౦.౦౦ డిగ్రీల లోపు రవి ఉండి ఉండ వచ్చు. రవి మీన రాశిలో ఉన్నంత మాత్రాన బలహీనుడు అని చెప్పటానికి లేదు. తన ఉచ్చ స్థితికి దగ్గిరగా ఉన్నాడు , మిత్ర క్షేత్రంలో ఉన్నాడు, మరియు తొమ్మిదో నవాంశలో ఉంటూ వర్గోత్తమాంశ అవుతుంది కనుక పూర్ణ బలవంతుడే అని చెప్పవచ్చు. కనుక శ్రీరాముడు చక్రవర్తి, సూర్య వంశములో జన్మించినవాడూ కనుక ఆయన జాతకంలో రవి ఉచ్చ స్థితిలో ఉండే తీరాలి అన్న సంప్రదాయ వాదుల వాదన, రవి మీన రాశిలో ఉన్నంతమాత్రాన బలహీనుడు కాదు అన్న రుజువుతో చక్కగా పరిష్కారం అవుతుంది. రవి మీన రాశిలో ఉండటం వలన, ఉచ్చ శుక్రునితో కలసి ఉండటం వలన, బలవంతులు,సంపన్నులూ, ధర్మాత్ములూ అయిన రఘువంశ పూర్వీకులను సూచిస్తున్నాడు. కనుక రవి మీన స్థితి సమంజసమే. పిత్రుకారకుడైన రవి ఉచ్చ శుక్రునితో కలసి ద్విస్వభావ రాశిలో ఉంటూ-తండ్రికి బహుభార్యలున్న విషయాన్ని సూచనాప్రాయంగా తెలియజేస్తుండటంతో దశరధ మహారాజు జాతక పరంగా కూడా సరిపోతున్నది.
సాప్ట్ వేర్ లు ఈ సమస్యకు పరిష్కారం చూపుతున్నాయా?
ప్రస్తుతం దొరుకుతున్న జ్యోతిష సాప్ట్ వేర్ లు ఏవీ కూడా BC 7000 ప్రాంతంలో గ్రహస్థితులను చూపే విధంగా లేవు. "ప్లానెటేరియం సాప్ట్ వేర్" నేను చూడలేదు. కనుక దాని గురించి నేను ఏమీ చెప్పలేను. సరియైన గణన సామగ్రి లేకుండా నిర్ణయాలు తీసుకోవటం సరి కాదు. ఇకపోతే, యుగాలు, మన్వంతరాల లెక్కలు తీసుకుంటే గందరగోళ స్థితిలో పడిఫోతాము. అవి లక్షల కోట్ల సంవత్స రాల వరకు వ్యాపించి ఉంటాయి. ఏ యుగంలో ఏ మన్వంతరంలో రామావతారం వచ్చింది అన్న వివరాలు ఇంకొక సబ్జెక్ట్. అది ప్రస్తుతానికి వద్దు.
అక్కరకొచ్చిన ప్రశ్న శాస్త్రం
ప్రస్తుతానికి మన సమస్య శ్రీ రామచంద్రుని జాతకంలో రవి మేషంలో ఉన్నాడా, లేక మీనంలో ఉన్నాడా అనేదే కాబట్టి, దీనికి నాకు అందుబాటులో ఉన్న ప్రశ్న శాస్త్ర సహాయం తీసుకున్నాను. మొన్న 24-3-2010 రాత్రి రైల్లో చెన్నైకి పోతూ ఇదే విషయం తీవ్రంగా ఆలోచిస్తున్నాను. సమయం రాత్రి 9-55 అయింది. రైలు కడప స్టేషనును కొంత సేపటి క్రితమె వదిలింది. శ్రీరామ క్షేత్రమైన ఒంటిమిట్ట కు దగ్గరగా పోతుండవచ్చు. ప్రశ్న సహాయం తీసుకుని చూద్దామని బలంగా అనిపించింది. బలమైన ఇచ్చ కలిగినప్పుడు చూచిన ప్రశ్న మాత్రమే సత్పలితాలను ఇస్తుంది అని ప్రొ|| కృష్ణమూర్తిగారు చెప్పారు. వెంటనే మనసులో తల్లితండ్రులను, గురువులను,నవగ్రహాలను, గాయత్రీ మాతను,పరమేశ్వరుని, శ్రీరామచంద్రుని స్మరించి, అప్పటి రూలింగ్ ప్లానెట్స్ ను గమనించాను.
లగ్నం-0.35 వృశ్చికం -- లగ్నాధిపతి కుజుడు
లగ్న నక్షత్రాధిపతి: విశాఖ - గురువు
చంద్ర రాశి-మిధునం-బుధుడు
చంద్ర నక్షత్రాధిపతి- 25.47 -పునర్వసు-గురువు
వారాధిపతి-బుధ వారం -బుధుడు
హోరాధిపతి-చంద్ర హోర-చంద్రుడు.
ప్రశ్న విధానంలో రూలింగ్ ప్లానెట్స్ విశ్లేషణ
లగ్నం సున్నా డిగ్రీలలో లగ్న సంధిలో పడి- మామూలుగా జనులు అనుకుంటున్నది తప్పు అన్న సూచన ఇస్తున్నది. రూలింగ్ ప్లానెట్స్ గా బుధుడు, గురువు వచాయి. బుధ రాశులలోని గురు నక్షత్రాలు గాని , గురు రాసులలోని బుధ నక్షత్రాలు గాని రవి ఉన్న ప్రాంతాలు కావాలి. రవి బుధ రాశులైన మిధున, కన్యలలో ఉండే పరిస్తితి లేదు. ఇక మిగిలిన గురు రాశి అయిన ధనుస్సులో అవకాశం లేదు ఎందుకనగా చైత్రమాస పరిధిలోనికి ధనూరాశి రాదు. పోతే మిగిలిన మీన రాశిలోని బుధ నక్షత్రం అయిన రేవతిలో రవి ఉండి ఉండవచ్చు. మన పై లెక్క ప్రకారం మీనరాశి చివరి నవాంశ అయిన 357.20 నుంచి 360.00 లోపు రేవతి నక్షత్రం నాలుగో పాదం అవుతుంది. కనుక ఇక్కడ రవి ఉండి ఉండవచ్చు అని ప్రశ్న శాస్త్రమ్ చెబుతున్నది. లగ్నం సున్నా డిగ్రీలలో ఉండటమూ, కుజ రాశి అవడమూ-రవి స్థితి కుజ రాశి సున్నా డిగ్రీల దగ్గరలో ఉండి ఉండవచ్చు అని ఇంకొక సూచనను ఇస్తున్నది. ఈ పరిస్థితికూడా మీన రాశి చివరి డిగ్రీలనే సూచిస్తున్నాయి. కనుక పైన ఇచ్చిన రేవతి నక్షత్రం నాలుగో పాదం లో రవి ఉన్నాడు అన్న విషయం రూఢిగా తేలుతున్నది. చంద్రుడు ప్రశ్న సమయంలో కూడా పునర్వసు నక్షత్రంలోనే ఉండటం ఒక విచిత్రం. శ్రీరామచంద్రుని నక్షత్రం పునర్వసు అని దీనివల్ల రూడిగా తెలుస్తున్నది. పునర్వసు నక్షత్రం జరుగుతున్నపుడే ఈ ప్రశ్న నా మనసులో బలంగా తలెత్తడం చూస్తే జ్యోతిష-యోగ-తంత్ర సాధకుల మీద నక్షత్ర ప్రభావాలు బలంగా ఉంటాయి అన్నవిషయం మళ్ళీ రుజువైంది. ఈ విధంగా చాలా సార్లు జరగడం గమనించాను. అదలా ఉంచితే, రవి ఈ డిగ్రీలలో ఉంటే, చైత్ర మాసం- నవమి తిధి- పునర్వసు నక్షత్రం- అవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు.
కనుక సూర్య గ్రహం, శ్రీరామ చంద్రుని జాతకంలో మేష రాశిలో లేడు, మీన రాశిలోనే ఉన్నాడు- కాని రాశి సంధికి దగ్గరలో ఉండి ఉండవచ్చు అని ప్రశ్నను బట్టి నేను నమ్ముతున్నాను. ఇక మిగిలిన గ్రహాల విషయం-అనగా రాహు కేతు గ్రహాల విషయం- ఈ గ్రహాలు ప్రస్తుతం వరుసగా ధనుస్సు, మిధున రాశులలో ఉన్నాయి. కనుక శ్రీ రామ చంద్రుని జాతకంలో కూడా ఇదె స్థితిలో ఉన్నాయా? ఎందుకనగా చాలాసార్లు గ్రహ స్థితులు ప్రశ్న -జనన కుండలులలో ఒకే విధంగా ఉండటం గమనించిన విషయం. పైగా, సాంప్రదాయ కుండలిలో ఈ గ్రహాలు ఇదే స్తితిలో, అనగా ధనుస్సు-మిథునాలలోనే కనిపిస్తున్నాయి. కాని ఈ విషయంలో త్వరపడి ఒక నిర్ణయానికి రాకూడదు. ఇంకొంత పరిశోధన అవసరమ్ అని నా అభిప్రాయం.