“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

2, జూన్ 2010, బుధవారం

భూత వైద్యుల దగాకోరు వైద్యాలు

మొన్నీ మధ్యన మాకు తెలిసిన ఒక పెద్దాయనకు ఎడమ అరచేతికి పక్షవాతం వచ్చింది. ఆయన ఒక రిటైర్డు సీనియర్ అయ్యేఎస్ ఆఫీసర్. వెంటనే సిటీలో ఉన్న పెద్ద పేరుగాంచిన మూడు నక్షత్రాల నరాల వైద్య శాలలో చేర్చారు.స్కానింగులు గట్రా చేసారు. ఆయనకు పక్షవాతం ట్రీట్మెంట్ ఇచ్చారు. జమ్మూ లో ఉంటున్న బంధువులు మూడు రోజులు కష్టపడి ప్రయాణాలు చేసి వచ్చారు.

బ్లడ్ లో గడ్డకట్టి ఎంబోలస్ ఫాం అయింది. అది రక్తంలో తిరుగుతూ బ్రెయిన్ లో ఒకచోట ఇరుక్కుని పక్షవాతం వచ్చింది అని తేల్చారు. వారంరోజులు ఏసీరూం లో ఉంచి అతి ఖరీదైన ట్రీట్మెంట్ ఇచ్చారు. రక్తం గడ్డ కట్టకుండా హెపారిన్ డోసులిచ్చారు. దానికి సైడ్ ఎఫెక్ట్ గా నిద్ర ముంచుకోస్తుంటే నిద్ర పోనివ్వకుండా ఒక నర్సును పెట్టి మాట మాటకి ఆయన్ను కొట్టటం, గిచ్చడం చేశారు. హింస భరించిన ఆయనకు ఒక వారానికి నయం అయ్యింది అని చెప్పి ఇంటికిపంపారు.

ఆయన నాకు మిత్రుడు అని చెప్పలేను గాని, నేనంటే ఆయనకు వాత్సల్యం అని మాత్రం చెప్పగలను. నేనుగుంటూరుకు వచ్చానని ఆయనకు తెలిసి నాకు కబురు చేశాడు. ఒక సాయంత్రం వెళ్ళి కలిశాను. మాటల మధ్యలోస్కానింగ్ రిపోర్ట్ చూపించాడు. బ్రెయిన్ లో ఎడమవైపున ఎంబోలస్ ఇరుక్కున్నట్లు స్కానింగ్ లో చూపిస్తున్నారు. కానిఈయనకు పక్షవాతం వచ్చింది అని చెబుతున్న చెయ్యికూడా ఎడమచెయ్యే. నేను వెళ్ళి చూచేసరికి ఆయనకు చెయ్యిచాలావరకు స్వాధీనంలోకి వచ్చింది. కాని వాడిన మందుల ప్రభావం వల్ల బాగా మగతగా ఉన్నది అంటున్నాడు. మాట్లాడుతూనే మగతలోకి పోతున్నాడు. వాళ్ళిచ్చిన రిపోర్టులు ట్రీట్మెంట్ అంతా అనవసర షో మాత్రమే అని చెప్పివెనక్కు వచ్చాను. ఎడమవైపున ఎంబోలస్ ఇరుక్కుంటే ఎడమ వైపు పెరాలిసిస్ రాదు. కుడివైపు వస్తుంది. ఇదిఆయనకు తెలీక కాదు. ఇంత చిన్న విషయం ఆయనకు తట్టకపోడానికి కారణం హెపారిన్ డోస్ వల్ల కలిగిన మత్తు. నేనావిషయం చెప్పినపుడు ఆయనకూడా ఆశ్చర్యపోయాడు.

తరువాత కొన్నాళ్ళకు ఇంకొక డాక్టర్ రిపోర్ట్ లు పరిశీలించి అది పెరాలిసిస్ కాదు ఉత్త రిస్ట్ డ్రాప్ మాత్రమే. మామూలుమందులతో అది నయం అవుతుంది. కాని ఇప్పటివరకూ వాడినవి అతి ఖరీదైన మందులు మాత్రమే గాక తీవ్ర సైడ్ ఎఫెక్ట్ వచ్చే పవర్ ఫుల్ మందులు, ఇవన్నీ అనవసరంగా వాడారు అని తేల్చాడు. 75 ఏళ్ళ మనిషిమీద సరైన డయాగ్నసిస్ చెయ్యకుండా అటువంటి ట్రీట్‍మెంట్ ఇచ్చిన త్రీస్టార్ మల్టీస్పెషాలిటీ భూతవైద్యాన్ని చూచి నివ్వెరపోయాను.

అటువంటి విద్యావంతుడు, ఉన్నతాధికారిపైనే అలాటి ప్రయోగం చేసిన డాక్టర్లు ఇక చదువురాని వాళ్ళతో ఎలాఆడుకుంటారో అన్న సందేహం కలిగింది. స్పెషలిష్టు డాక్టర్లు ఎలా భూతవైద్యం చేస్తారో చెప్పటానికి ఇది ఒక ఉదాహరణమాత్రమే. ఇటువంటి వైద్యులు హోమియోపతిని వైద్యం కాదు అనడం ఎలా ఉంటుంది? చిలకలూరిపేట బస్సు దహనంకేసు నిందితులు వేదికలెక్కి మత ప్రచారాలు, నీతి ఉపన్యాసాలు చెప్పినట్లు ఉంటుంది. Ignorance is bliss అన్న సామెత ఎక్కడైనా పనికొస్తుందేమోగాని డాక్టర్ల వద్ద మాత్రం పనికిరాదు. మీకెంత తెలీకపోతే నేటి డాక్టర్లకు అంత మంచిది. చక్కగా మనతో ఆడుకోవచ్చు. మనమీద ప్రయోగాలుచేసుకోవచ్చు. కిరాణా కొట్టు వాడిలాగా బోలెడంత బిల్లు వేసి మళ్ళీ మీకోసం తగ్గిస్తున్నాం అని పోజు కొడుతూ డబ్బులువసూలు చేసుకోవచ్చు.
ఏం జరిగినా మన కర్మ సిద్ధాంతం మనకు అండగా నిలుస్తుంది. వాళ్ళను కాపాడుతుంది.

శ్మశానంలో చేతబడి చేసే భూత మాంత్రికుడికీ ఇటువంటి డాక్టర్లకూ పెద్ద భేదం ఉండదు. కాకపోతే భూత మాంత్రికుడికి డిగ్రీలుండవు. వీళ్ళకు చాంతాడంత డిగ్రీలుంటాయి. అంతే తేడా. ఇంకా చెప్పాలంటే, వీళ్ళకంటే భూత మాంత్రికులే నయం. కనీసం వాళ్ళు ఇతరులను మోసం చెయ్యరు. మన దేశంలో కూడా అమెరికాలోలాగా డాక్టర్లు చేసిన తప్పులకు లీగల్ గా శిక్షలు పడినప్పుడే, డిగ్రీలు లైసెన్సులు కాన్సిల్ అయినప్పుడే, వీళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని వైద్యం చేస్తారు. అంతవరకూ ఎవరి ఖర్మ వారిది. కనుక స్పెషలిస్ట్ భూత డాక్టర్లతో తస్మాత్ జాగ్రత. ఎందుకైనా మంచిది ఈరోజునుంచే ఫిజియాలజీ, ఎనాటమీ టెక్స్ట్ బుక్కులు కొనుక్కుని చదువుకుందాం !!!