నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

10, జులై 2010, శనివారం

వాడపల్లి ఆలయాలు

నడికూడి దగ్గర కృష్ణాతీరాన వాడపల్లిలో గల అగస్త్యేశ్వరాలయాన్ని, దానికి కొంతదూరంలోగల లక్ష్మీనరసింహాలయాన్నిదర్శించే అవకాశం రోజు కలిగింది. వాడపల్లి అనేది కృష్ణాతీరాన నల్లగొండ జిల్లాలోగల ఒక పల్లెటూరు. ఇది రెండువేలఏళ్ళనాడు ఒక వాణిజ్యకేంద్రం. ఇక్కడికి గ్రీస్,అరేబియా మొదలైన విదేశాలనుంచి వచ్చే నౌకలద్వారా వాణిజ్యం జరిగేది.

ఇక్కడ దాదాపు ఎనిమిది వేల ఏళ్ళనాటి ఆలయాలున్నాయి. ఇక్కడ ఈశ్వరుని, నరసింహస్వామిని అగస్త్య మహర్షి ప్రతిష్ట చేసినట్లు చెబుతారు. పదమూడో శతాబ్దంలో ఇక్కడ ఒక పట్టణాన్ని నిర్మిద్దామని రాజులు తవ్విస్తుంటే ప్రాచీన ఆలయాలు దేవతా మూర్తులు బయటపడ్డాయి.వాటిని తిరిగి పునరుద్దరించి నిర్మించిన ఆలయాలు ప్రస్తుతం మనం చూడవచ్చు.

సంగమేశ్వరాలయం


అనుకోకుండా మాస శివరాత్రి రోజున శివ దర్శన భాగ్యం కలిగింది. మీనాక్షీ సమేత అగస్త్యేశ్వర స్వామి ఆలయాన్ని సంగమేశ్వరాలయం అని కూడా అంటారు. ఇక్కడ కృష్ణా మూసీ నదుల సంగమం జరుగుతుంది. ఎత్తుగా ఉన్న ఆలయం నుంచి సంగమ స్థానానికి, నదిలోనికి మెట్లు ఉన్నాయి. సాయంత్రం వేళ నిర్మానుష్యంగా, నిశ్శబ్దంగా ఉన్న సమయంలో ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది ధ్యానానికి అత్యంత అనుకూల ప్రదేశం. ఇక్కడ తేలికగా మనస్సు ఏకాగ్రం, అంతర్ముఖం అవుతుంది. సాధారణంగా ఇక్కడ భక్తుల సంఖ్య చాలా తక్కువ. ఒకరో ఇద్దరో ఉంటారు. చాలాసార్లు వారూ ఉండరు. ఇక్కడ ఆలయాన్ని కాశీ ఆలయం నమూనాలో కట్టినట్లుగా తోస్తుంది. ప్రధాన ఆలయానికి పక్కనే ఉన్న అన్నపూర్ణ ఆలయం మూతబడి ఉంది. విగ్రహం ఏనాడో మాయమైందని ఆలయ ధర్మకర్త చెప్పారు. అలాగే కొద్ది దూరంలో ఉన్న భద్రకాళీ వీరభద్రుల ఆలయాలు కూడా ధ్వంసం అయ్యాయి. ముస్లిం దండయాత్రలలో నాశనమైన ఆలయాలు పోగా మిగిలినవాటిని గుప్తనిధులు తవ్వేవారు నాశనం చేశారు అని ఆయనే చెప్పాడు.

శివుని జటాజూటంలో గంగామాత ఉంటుందని మనకు తెలుసు. ఈ లక్షణాన్ని ఇక్కడ ప్రత్యక్షంగా చూడవచ్చు. ఇక్కడి శివలింగం పెద్దది. మనిషి నిలబడితే ఇంకా కొంచెం ఎత్తు ఉంటుంది. శివలింగం పైభాగం ఒక దొన్నెలాగా ఉంటుంది. అందులోనుంచి ఎప్పుడూ నీరు ఉబుకుతూ ఉంటుంది. కాని బయటకు కారిపోదు. తీర్ధంగా ఆ జలాన్నే వాడతారు. భక్తులపైన జల్లటానికీ ఆ జలాన్నే వాడతారు. ఇది గంగా జలంతో సమానం అని అంటారు. ఎక్కడనుంచి ఆ నీరు వస్తుందో తెలియదు. కొండపక్కనే రెండు నదులున్నాయిగనుక నీరు భూగర్భంలోనుంచి పైకి ఉబికి వస్తున్నది అనుకుందాం. కాని కారిపోకుండా ఆ లెవెల్ వరకే ఎలా నిలబడి ఉంటుందో అర్ధం కాదు. దీన్ని బట్టి శివలింగం పునాది చాలా లోతుకు కొండలోపలికి ఉన్నదని అనిపిస్తుంది. లేదా సహజమైన రాతినే శివలింగంగా మలిచారని అనిపిస్తుంది. కాని, శివుని శిరస్సుమీద గంగామాత ఉన్నదనే భావనను ఇలా మలిచినవారి ఆలోచన అద్భుతంగా ఉన్నది. ఈ ఆలయంలో ఇది గొప్ప విశేషం అని చెప్పవచ్చు. ఇది కూడా ఒక సివిల్ ఇంజనీరింగ్ మార్వెల్ అనిపిస్తుంది.


పంచ నారసింహ క్షేత్రాలు

ఇక్కడకు కొద్ది దూరంలో ఉన్న లక్ష్మీనరసింహ స్వామి ఆలయం కూడా పురాతనమైనదే. ఇది పంచ నారసింహ క్షేత్రాలలో ఒకటి. వాడపల్లి, మట్టుపల్లి, కేతవరం, వేదాద్రి, మంగళగిరి అనేవి పంచ నారసింహ క్షేత్రాలు. ఇవన్నీ కృష్ణా తీరాన ఉన్న నారసింహ క్షేత్రాలు. ఈ ఆలయంలోకి ప్రవేశిస్తే అసలైన అనుభూతి కలుగుతుంది. చిమ్మచీకటిలో చాలా దూరం నడచినట్లు అనిపిస్తుంది. గర్భగుడిలో కూడా చీకటిగా ఉంటుంది. ఒకే దీపపు సెమ్మెకు రెండు దీపాలు వెలుగుతుంటాయి. స్వామి ముఖం ఎత్తులో ఉన్న దీపం కొద్దిగా గాలి తగిలినట్లు చలిస్తూ ఉంటుంది. నడుము ఎత్తులో ఉన్న ఇంకొక దీపం నిశ్చలంగా ఉంటుంది. స్వామి ఉఛ్చ్వాస నిశ్వాసాలకు ప్రతీకగా పై దీపం చలిస్తూ ఉంటుందని ఇక్కడ నమ్మకం. గర్భ గుడిలోకి గాలి ప్రవేశించే సందులు ఎక్కడా కనిపించవు. కాని ఏదో ప్రాచీన ఇంజనీరింగ్ ప్రక్రియ వల్ల అలా కట్టుబడి చెయ్యటం సాధ్యపడినట్లు నాకనిపించింది. సామాన్య భక్తులలో భగవంతుని ఉనికి పట్ల విశ్వాసాన్ని పెంపొందించడానికి ఇటువంటి ప్రక్రియలు వాడారేమో అనిపించింది. ఈ ఆలయంలో యోగాంజనేయ స్వామి విగ్రహం ఉన్నది. యోగానికి నరసింహస్వామికి సంబంధం ఉన్నది. తిరుమలలో కూడా యోగనరసింహ స్వామి ఆలయం మనం చూడవచ్చు. పశుత్వం మానవత్వం కలిసి ఉన్న మానవుడు దైవత్వం వైపు చేసే ప్రయాణమే కదా యోగమంటే.

ఈ ఆలయాలను పదిహేను ఏళ్ళక్రితం నేను దర్శించాను. కాని ఇరవై అయిదేళ్ల క్రితం వచ్చిన కృష్ణా పుష్కరాల సమయంలో మొదటిసారి ఈ ప్రాంతానికి వచ్చి కృష్ణా నదిలో స్నానం చేశాను. అప్పటికి ఇప్పటికి చాలా అభివృద్ధి కనిపించింది. భక్తుల ఆదరణ కూడా పెరిగినట్లు కనిపించింది. వైష్ణవాన్ని శైవాన్ని సమంగా పోషించిన రాజుల కాలంలో ఈ ఆలయాలు జీర్ణోద్దరణ గావించబడ్డాయి. జనుల తాకిడికి దూరంగా ఉన్న ప్రశాంత ఆలయాలలో ఉండే ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఇక్కడ అనుభూతి చెందవచ్చు.