నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

20, జులై 2010, మంగళవారం

కన్యా రాశిలో కుజ శనుల యుతి- ప్రమాద ఘంటికలు

రోజునుంచీ అంగారకుడు (కుజుడు) కన్యా రాశిలో ప్రవేశిస్తున్నాడు. కన్యారాశిలో శనీశ్వరుడు ఇప్పటికే స్థితుడై దాదాపుగా ఆరు డిగ్రీలలో ఉత్తరా నక్షత్రంలో ఉన్నాడు. శని కుజుల యుతి విస్ఫోటనాలకు ప్రమాదాలకు దారితీస్తుంది అని ఇంతకు ముందు పోస్ట్ లలో కూడా వ్రాశాను.

రాబోయే 25 తేదీన ఆదివారం నాడు పౌర్ణమి తిధి వస్తుంది. రోజుకు కుజుడు ఉత్తర ఫల్గుణి రెండవ పాదంలో ప్రవేశిస్తూ శనీశ్వరునికి దగ్గరగా వస్తున్నాడు. సామాన్యంగా ఎనిమిది డిగ్రీల ఆర్బ్ రెండు గ్రహాల మధ్యన ఉంటే అవి ఒకదాని ప్రభావానికి ఒకటి లోనవటం జరుగుతుంది. తద్వారా ఆయా గ్రహాలచే సూచింపబడే ఘటనలు జరుగుతాయి.

గత రెండు మూడు రోజులుగా కుజ శనుల మధ్యన దూరం 8 డిగ్రీలకు వచ్చింది. జరుగుతున్న సంఘటనలు గమనిస్తే రాబోయే అయిదు రోజులలో ఏమేం జరుగబోతున్నాయో ఊహించవచ్చు. ఇరాన్ ఇరాక్ లో పేలుళ్ళు ప్రజల సామూహిక మరణాలు జరిగాయి. మొన్న రాత్రి బెంగాల్ లో ఘోర రైల్ ప్రమాదం జరిగి మళ్లీ సామూహిక జన నష్టం జరిగింది.

రాబోయే పౌర్ణమికి, అనగా 25-7-2010 కి రెండు మూడు రోజులు అటూ ఇటూగా ప్రమాదాలు జరుగుతాయి.అగ్నికి ఆజ్యం పోసినట్లుగా 25 తేదీనుంచి గురువు వక్రిస్తున్నాడు. కనుక ఆయన యొక్క రక్షణ ఉపసంహరింపబడుతుంది. ప్రమాదాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అవుతుంది.

కుజశనుల యుతి భూతత్వరాశి యగు కన్యలో జరుగుబోతున్నది. రవి యొక్క నక్షత్రమైన ఉత్తర ఫల్గునీలో జరుగుతున్నది. కనుక భూమి అగ్ని కలయికలతో ప్రమాదాలు సూచితం అవుతున్నాయి. కన్యారాశి దక్షిణ దిక్కుకు సూచిక.కుజుడు కూడా దక్షిణ దిక్కుకే సూచకుడు. రవి తూర్పు దిక్కుకు అధిపతి.శని పశ్చిమ దిక్కుకు అధిపతి. తూర్పు పడమరలు కలవవు. కాని రెండింటితో దక్షిణ దిక్కు కలుస్తుంది. కనుక తూర్పు దక్షిణ దిక్కులలోనూ, ఇవి రెండూ కలిసిన ఆగ్నేయ దిక్కులోనూ, లేక దక్షిణ పశ్చిమ దిక్కులు కలిసే నైరృతి దిక్కులోనూ భూ ప్రమాదాలు, వాహన ప్రమాదాలు, భూకంపాలు,అగ్ని ప్రమాదాలు జరుగవచ్చు. ఇండోనేషియా, అండమాన్, భారత తూర్పు తీరం వెంబడి ఉన్న భూకంప ప్రభావిత ప్రమాద స్థలాలు మళ్లీ జాగృతం కావచ్చు.

కుజుడు కన్యారాశిలో సెప్టెంబర్ ఏడవ తేదీవరకు ఉంటాడు. అప్పటివరకూ గడ్డుకాలమే. ముఖ్యంగా జూలై 26 కుజ శనులు ఒకే నక్షత్ర పాదంలోకి వస్తున్నారు. అనగా నవాంశ చక్రంలో కుంభరాశిలో కలిశి ఉంటారు. 27, 28 తేదీలలో వీరితో కేతువు కూడా కలుస్తున్నాడు.

కనుక
రేపటినుంచి, 28 తేదీలోపల ప్రమాద సూచక కాలం అనిపిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రమాదాలు పైనసూచించిన దిక్కులలో జరుగవచ్చు. వ్యక్తిగతజాతకాలలో కుజ శనులు బాగా లేనివారు వారం రోజులు జాగ్రత్తగాఉండాలి. ముఖ్యంగా కన్యారాశి,ఉత్తరఫల్గునీ నక్షత్రంలో పుట్టినవారికి అనారోగ్యం,యాక్సిడెంట్స్ కావడం, శరీరానికి దెబ్బలు తగలడం,ఉత్తపుణ్యానికి ఇతరులతో తగాదాలు జరుగవచ్చు. ఎందుకనగా వారి నక్షత్రంలోనే ఈ గ్రహకలయిక జరుగుతున్నందున ఫలితాలు వీరిమీద ఎక్కువగా ఉంటాయి. కాని భయపడవలసిన పని లేదు. మంత్ర జపం, దైవ స్మరణ చేసుకుంటూ, అతి జాగరూకతతో, రాగ ద్వేషాలకు లోనుకాకుండా ఉండాలి. లేనిచో ప్రమాదాలకు లోనవుతారు. తస్మాత్ జాగ్రత.

P.S: ఒక్క విషయం మరిచాను. ప్రమాదాలు జరిగే ప్రదేశాలు,వాహనాలు etc, క, గ, ప, బ, మ అనే అక్షరాలతో మొదలౌతాయి లేదా ఈ అక్షరాలతో సంబంధం కలిగి ఉంటాయి. వ్యక్తులలో కూడా ఆ అక్షరాలతో మొదలయ్యే పేర్లు గలవారికి (ముద్దుపేర్లకు కూడా) ఎక్కువగా ఈ ఫలితాలు వర్తిస్తాయి. వీరిలో కన్యా లగ్నం గాని, కన్యా రాశిగాని ఉన్నవారికి ఈ సరికే ఫలితాలు కనిపించడం మొదలయ్యి ఉంటుంది (గత రెండు మూడు రోజులనుంచి).