ఒక చలికాలం ఉదయం.ఇంకా చీకటి తెరలు తొలగలేదు.
ఇద్దరు వ్యక్తులు మౌనంగా నడుస్తున్నారు. ఒక అరగంట నడక తర్వాత ఊరి బయటికి చేరారు. అప్పటికి చీకటి తెరలు తొలగి తెలతెలవారుతున్నది. తూర్పున ఎర్రని సూర్యుడు ఉదయిస్తున్నాడు.చుట్టూ పచ్చని ప్రకృతి మనోహరంగా ఉన్నది. అప్పటిదాకా ఎవరూ మాట్లాడలేదు. ఇంతలో ఒకాయన " సూర్యోదయం ఎంత బాగుంది" అన్నాడు. "నువ్వింత వాగుడుకాయ వని తెలిస్తే నాతో రానిచ్చేవాణ్ణి కాదు. రేపటినుంచి నాతో వాకింగ్‍కి రావద్దు."అన్నాడు రెండో వ్యక్తి. ఆ రెండో వ్యక్తే ఓషో రజనీష్.
ఓషో రజనీష్ యువకునిగా ఉన్నపుడు జబల్‍పూర్ యూనివర్శిటీలో ఫిలాసఫీ ప్రొఫెసర్‍గా పనిచేశాడు. ఆ రోజుల్లో ఆయన చీకటితోనే లేచి, ఊరి బయటికి నడుచుకుంటూ వెళ్ళి ఉషోదయాన్నీ, ప్రకృతినీ ఆస్వాదిస్తూ, సూర్యోదయాన్ని తిలకించి వెనక్కు తిరిగి వచ్చేవాడు.
రజనీష్ కు పరిచయం ఉన్న ఒకాయన తాను కూడా వాకింగ్‍కు వస్తానని కోరాడు. రజనీష్ మొదట్లో ఒద్దన్నాడు. కాని ఆ వ్యక్తి మరీ మరీ కోరినమీదట సరే నన్నాడు. మరుసటిరోజు పైన వివరించిన ఘటన జరిగింది. ఆ తరువాత రోజునుంచీ రజనీష్ ఆయన్ను తనతో వాకింగ్‍కు రానివ్వలేదు.
ధ్యానుల యొక్క రసాస్వాదన చాలా గాఢంగా ఉంటుంది. వాళ్ళు సముద్రపు అడుగున మునిగి ఈత కొట్టేవాని వంటివారు. మామూలు వ్యక్తుల యొక్క ఆస్వాదన పేలవంగా ఉంటుంది. వాళ్ళు పై పైన తేలుతూ ఉండే వాని వంటివారు. గాఢమైన ఏకాగ్రతలో తన్ను తాను మరిచినప్పుడే ఏ అనుభవమైనా అవధులు దాటిస్తుంది. ఆ స్థాయికి తగ్గిన అనుభవం చప్పగా ఉంటుంది.
ప్రాణం రెండు పనులను ఏకకాలంలో చెయ్యలేదు. చేసినా తాను రెండుగా చీలినప్పుడే రెండు పనులు చెయ్యగలదు కాని ఒక్కటిగా ఉండి రెండు పనులు చెయ్యలేదు. ఇది యోగులకు అనుభవ సిద్ధం. యోగులు ప్రకృతికి దూరంగా పోయేవారు కారు. వారిది ప్రకృతితో మమేకమైన జీవితం. నిజం చెప్పాలంటే, జీవితాన్ని ఒక ధ్యాని ఎంజాయ్ చేసినట్లు సామాన్యుడు చెయ్యలేడు. కారణం? ధ్యాని తన శక్తిని పూర్తిగా పణం పెట్టగలడు. తనను తాను పూర్తిగా మరచి ఒక అనుభవంలో లీనం కాగల శక్తి అతనికి సాధన ద్వారా కలుగుతుంది. కాని సామాన్యుడు అనేక భయాలు, ఆందోళనలు, సందేహాల వలలో చిక్కుకుని ఉంటాడు. అతను అమృతాన్ని తాగుతున్నా కూడా, అతని మనస్సు ఎక్కడొ ఉంటుంది కాబట్టి, ఆ రుచిని పూర్తిగా ఆస్వాదించలేడు. కాని ధ్యాని అయినవాడు, ఒకే ఒక్క పనిలో తన సర్వ శక్తులనూ ఇంద్రియాలనూ కేంద్రీకరించ గలడు. కనుక అతని అనుభవం మామూలు వ్యక్తి అనుభవం కంటే ఎన్నో రెట్లు గాఢంగా ఉంటుంది.
ఒక యోగి లేక ధ్యాని సూర్యోదయం వంటి ఒక మామూలు సంఘటనను ఎంతో ఎంజాయ్ చెయ్యగలడు. దానిలో లీనమై అతను ప్రపంచాన్ని దాటి పోగలడు. అటువంటి వాని పక్కన ఉన్న వారు అందుకే ఎంతో జాగరూకతతో ఉండవలసి ఉంటుంది. ఎందుకంటే వారి వేవ్ లెంగ్త్ లు చాలా భిన్నంగా ఉంటాయి. అనవసరంగా వారిని డిస్టర్బ్ చేయని వారే వారితో ఉండగలరు.
రజనీష్ పక్కన ఉన్న వ్యక్తి కూడా సూర్యోదయాన్ని ఎంజాయ్ చేద్దామనే ఆయనతో అంతదూరం కలసి వచ్చాడు. కాని అతనికి దాన్ని ఎలా ఎంజాయ్ చెయ్యాలో తెలియదు. "సూర్యోదయం ఎంత బాగుంది?" అన్న మాట అతను అనవలసిన పని లేదు. అలా అంటున్న క్షణంలోనే ఆ అనుభవం నుంచి అతను దూరమౌతాడు. ఆ సున్నిత అనుభవం అతని నుంచి జారిపోతుంది.
బాహ్యంగా తన అనుభవాన్ని వ్యక్తపరచాలనే కోరిక ఆ అనుభవాన్ని అంతం చేస్తుంది. ఇది ఒక అంతరిక నియమం. నీకు సూర్యోదయం నచ్చితే దాన్ని మౌనంగా ఎంజాయ్ చెయ్యి. కాని అది ఎలా ఉందో ఎందుకు వ్యక్తపరుస్తున్నావు? నీ వ్యక్తీకరణ ఎవరికి కావాలి? అలా వ్యక్త పరచడం వల్ల నీవా అనుభవం నుంచి ఆ క్షణం లోనే దూరమౌతున్నావు. పక్కవాణ్ణి కూడా నీ స్థాయికి దిగలాగుతున్నావు.
ఇటువంటి మామూలు మనుషుల సాహచర్యం ధ్యానులు భరించలేరు. అది వారి నిమగ్నతను భంగపరుస్తుంది. మామూలుగా చూస్తే అతను అన్న మాట తప్పేం కాదు. కాని ఒక ధ్యానానుభవం లో ఉన్న వాని ఏకాగ్రతకు అది విసుగును కలిగిస్తుంది.కారణం? వారి అనుభవం యొక్క క్వాలిటీ భిన్నంగా ఉంటుంది. అది వీరికి అర్ధం కాదు. అందుకే, ధ్యానుల సాహచర్యం కోరేవారు వారి స్థాయిని అర్ధం చేసుకుని తదనుగుణంగా ఉండవలసి ఉంటుంది. అందుకోసం తన మనస్తత్వాన్ని ఎంతో మార్చుకోవలసి వస్తుంది. అందుకే అటువంటివారితో ఉండటం చాలా కష్టమైన పని.
రజనీష్ అతనికి "వాగుడుకాయ" అన్నాడు. మామూలు దృష్టికి ఈ మాట క్రూరంగా కనిపిస్తుంది. అతను అన్నమాటలో తప్పేముంది? అనిపిస్తుంది. కాని ధ్యానికి "సూర్యోదయం ఎంత బాగుంది" అనే చిన్న మాటకూడా ఆ క్షణంలో విసుగును పుట్టిస్తుంది. తానున్న హిమాలయ శిఖరాలనుంచి పాతాళానికి పడినట్లు అనిపిస్తుంది.
సతోరి అనేది ఒక సున్నితమైన అనుభవం. ప్రపంచం లోని అన్ని సున్నిత అనుభవాలలాగానే, ఇది కూడా చాలా సులభంగా జారిపోతుంది. దానిని చేరుకోవడం ఒక ఎత్తు అయితే దానిని నిలబెట్టుకోవడం ఇంకొక ఎత్తు. ఆ పనికి కొన్ని ప్రత్యేక పరిస్థితులు అవసరం అవుతాయి. పూర్తిగా వర్తమానం లో ఉండి తనను తాను మరచిపోగలిగిన వానికి సతోరి అందుబాటులోకి వస్తుంది. "నేను" అనేది తలెత్తిన క్షణంలో అది జారిపోతుంది.
కనిపిస్తున్న సూర్యోదయాన్ని ఎంజాయ్ చెయ్యకుండా దానిని బయటకు చెప్పాలనుకున్న క్షణంలోనే ఆ వ్యక్తి మనస్సునుంచి ఆ సున్నిత అనుభవం జారిపోయింది. అప్పుడా మనసు వర్తమానాన్ని ఒదిలి బయటి ప్రపంచంలోకి అడుగు పెడుతుంది. అంతేగాక పక్కవానికి కూడా ఏకాగ్రతను భంగపరుస్తుంది.
ఏ అనుభవమైనా మౌనంలోనే గాఢతను పొందుతుంది. అనుభవి మాయమవ్వగలిగితే అనుభవం హిమాలయ శిఖరాలను అందుకుంటుంది. ప్రపంచపు అవధులను దాటించగలుగుతుంది. అది ఒక గొప్ప అనుభవం కానక్కరలేదు. సూర్యోదయం వంటి అతి మామూలు, సామాన్య అనుభవం కూడా ధ్యానికి స్వర్గాన్ని చూపించగలదు. కాని దానిని ఎలా అందుకోవాలో తెలియాలి. ఎలా ఆస్వాదించాలో తెలియాలి.
అందుకే ధ్యానులు, జ్ఞానులు మౌనాన్ని ఆశ్రయిస్తారు. మౌనంలో, ఏకాంతంలో ఉన్న ఆనందం విలువ వారికి తెలుస్తుంది.