నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

21, సెప్టెంబర్ 2010, మంగళవారం

అడవులదీవి సరదాయాత్ర

రేపల్లె దగ్గర అడవులదీవి అని ఒక ఊరుంది. అది సముద్రానికి చాలా దగ్గరగా ఉన్న ఊరు. అక్కడనుంచి కృష్ణా కాలువలో ఒకగంటన్నర ప్రయాణం చేస్తే అది సముద్రం లో కలిసే చోట ఒక బీచ్ఉంది. మొన్నీమధ్యన బీచ్ కి సరదా ప్రయాణం చేశాము.

రేపల్లెలో మధ్యాహ్నం ఒకటిన్నరకు బయలుదేరి సాయంత్రం ఆరుగంటలకు మళ్లీ సముద్రంలోనుంచి వెనక్కు వచ్చాము.మొత్తంఒక ఇరవై మందిమి బయలుదేరి సరదా యాత్రలోపాల్గొన్నాము. బీచ్ నిర్మానుష్యంగా ప్రశాంతంగా ఉంటుంది.

ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనుమతి లేకపోతే దారిన ఎవరినీ రానివ్వరు. డీఎఫ్వో గారికి ముందే చెప్పాముగనుక ఆయనరెండు పడవలు, సెక్యూరిటీ గార్డ్ లను ఏర్పాటు చేసాడు. అందరం కలిసి రేపల్లెనుంచి కార్లలో బయలుదేరి అక్కడికి ఏడుమైళ్ళ దూరంలోని ఒక పల్లెకు చేరాము. అక్కడనుంచి ముళ్లచెట్లలో, బురదలో కొద్దిదూరం నడచి కృష్ణా కాలువ ఒడ్డు చేరిపడవలెక్కాము.

రెండు మరపడవలలో బయలుదేరి వీఐపీ లందరూ ఒక బోట్ లో, ఇతరులు ఒక బోట్లో దాదాపు గంటన్నర కృష్ణాకాలువలో ప్రయాణించి సముద్రానికి చేరాము. సాయంత్రం మూడున్నర నుంచి నాలుగున్నరవరకు ఒక గంట బీచ్ లోసరదాగా గడిపి మళ్ళీ వెనక్కు వచ్చాము. ఆ రోజంతా మబ్బు పట్టి చాలా ఆహ్లాదంగా ఉంది.

బీచ్ లో చేరి కొంచెం కుదుటపడ్డాక, అందరిలోని చిన్నపిల్లలు బయటకొచ్చారు. ఆటలాడేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, నీళ్ళలో దిగి కేరింతలు కొట్టేవాళ్ళు, నత్తగుల్లలు ఆల్చిప్పలు ఏరేవాళ్ళు - ఇలా రకరకాలుగా పెద్దవాళ్ళలోని చిన్నవాళ్ళుబయటకొచ్చారు.

ఇంతలో మా బాస్ ఒక గొప్ప విషయం కనిపెట్టాడు. అక్కడక్కడా నీళ్లలో బంక మట్టి ముద్దల్లాటివి పడి ఉన్నాయి. మెత్తటిఒండ్రు మట్టి అలల ప్రవాహానికి అలా ముద్దలుగా మారింది. బహుశా నది సముద్రం కలిసే చోటనే ఇలాటివిఉంటాయనుకుంటా. మామూలు బీచ్ లలో అవి కనపడవు. చాలా మెత్తగా పేస్ట్ లాగా ఉంది.

" ఇదే ముల్తానీ మట్టి. దీన్నే బ్యూటీ పార్లర్లలో మొహానికి పూసి వేలకు వేలు గుంజుతారు." అని గట్టిగా ఎనౌన్స్ చేశాడుమా బాస్. అంతే . ఎవరికి వారు ఒక కారీ బ్యాగ్ ఎక్కణ్ణించో బయటకు తీసి పేడముద్దలు ఏరుకున్నట్లు మట్టినిసంచుల్లో సేకరించటం మొదలు పెట్టారు. మా బాస్ గుంభనంగా నవ్వుతున్నాడు. నేను ప్రహసనాలన్నీ గమనిస్తూఅటూ ఇటూ తిరుగుతూ సరదాగా గడిపాను.

ఇంతలో మా పెద్ద బాస్ గారు వారి సతీమణి ధ్యానానికి కూచున్నారు. ఆయన వచ్చే నెలలో రిటైర్ కాబోతున్నారు. చాలామంచి వ్యక్తి. గట్టి మిలిటరీ డిసిప్లిన్ మనిషి. బీచ్ ఒడ్డున సముద్రానికి అభిముఖంగా కూచొని ధ్యానం చేస్తున్నారు. వారినిచూచి ఇంకొందరు కూడా పద్మాసనాలు వేసి వారూ బుద్దులవలె కూచున్నారు. కొందరు బాబా రామ్ దేవ్ గారి కపాలభాతి మొదలు పెట్టారు. నేను వారిని తమాషాగా చూస్తున్నాను.

ఇంతలో మా గ్రూపులోని ఒకాయన నన్ను అడిగాడు. " ఏమండీ మీరు ధ్యానం చెయ్యరా?"

నేను అడ్డంగా తలూపాను.

"ధ్యానం ఆరోగ్యానికి చాలా మంచిదండీ. నేర్చుకోండి." ఆయన ఉచిత సలహా ఇచ్చాడు.

నేను నవ్వుతూ "అలాగే" అన్నట్లు తలూపాను.

"చూడండి మన జీఎమ్ గారే వయసులో కూడా ధ్యానం చేస్తున్నారు. మనం చెయ్యకపోతే ఎలా?" ఆయన ఇంకొకప్రశ్న సంధించాడు.

"నిజమే. ఆయన చేస్తున్నపుడు మనం చెయ్యకపోతే ఎలా?" అన్నాను నేను నవ్వుతూ.

"మరి చేద్దాం రండి" ఆయన ఆహ్వానం.

"ధ్యానం చెయ్యటం నాకు రాదే. పైగా ధ్యానం ఎవరికి వాళ్లే చెయ్యాలనుకుంటా." అన్నాను.

నన్నొక వింత జంతువును చూచినట్టు చూచాడు ఆయన.

నేనది పట్టించుకోకుండా అలాగే చూస్తున్నాను.

నాతో అనవసరం అనుకున్నాడేమో, కళ్ళుమూసుకొని కాసేపు ఇసకలోనే చతికిల బడ్డాడు.

ఈలోపల తెచ్చిన బాక్సులు విప్పి కూల్ డ్రింకులు, బిస్కట్లు, పండ్లు బయటకు తీసి అందరికీ పంచుతున్నారు కొందరు. మాటలకు, చప్పుళ్లకు అందరి ధ్యానాలూ ఎగిరిపోయాయి. నాకు ధ్యానం నేర్పుతానన్న ఆయన గభాల్న కళ్ళు తెరిచి లేచి తన ప్లేట్ తీసుకుని స్నాక్స్ లాగించటం మొదలుపెట్టాడు.

"ఏమండీ ధ్యానం అయిందా" అడిగాన్నేను.

". అయింది." అంటూ తలాడించాడు ఆయన. "ధ్యానంలో చాలా ప్రశాంతంగా ఉంటుందండీ" అన్నాడు పైగా.

"మరి ప్రశాంతతలో అలాగే ఉండక, లేచారెందుకు?" అమాయకంగా అడిగాను నేను.

"ఆత్మారాముణ్ణి శాంతింపచేయాలిగా." అన్నాడాయన అది కూడా ఒక డ్యూటీ అయినట్లు.
ఇంతలో అటూ ఇటూ చూచిఏదో రహస్యం చెబుతున్నట్లు గొంతు తగ్గించి "ధ్యానమంటే ఏమీ లేదండీ శ్వాస మీద ధ్యాస. అంతే." అన్నాడు.

"ఓస్ ఇంతేనా. నేనింకా ఏదో అనుకున్నాను కదండీ" అన్నాన్నేను నవ్వాపుకుంటూ.

"అదంత తేలికనుకోకండి మరి. చాలా కష్టం. కూచుంటే తెలుస్తుంది" ఆయన ఉవాచ.

ఇక లాభం లేదనుకుని "సరేగానండీ, నాకొక సందేహం ఎప్పటినుంచో పీడిస్తోంది. మీరే దీనికి జవాబు చెప్పాలి" అన్నా.

". అడగండీ. దాందేముంది" అన్నాడు గురూజీ.

" పెద్ద గొప్ప డౌటు కాదనుకోండి. చిన్నదే"

"పర్లేదు చెప్పండి సార్" స్నాక్స్ లాగించి కూల్ డ్రింక్ అందుకుంటూ అన్నాడు ఆయన.

"మనమంటే దాహానికి కూల్ డ్రింకులు తాగుతున్నాం కదా. మరి చేపకు దాహం వేస్తే ఎలా?.అదేంతాగుతుంది పాపం?" అన్నాను.

అదోరకంగా చూచాడు ఆయన. నాకు నవ్వాగడం లేదు.

"ఏంటండి? నేను ధ్యానం గురించి చెబుతుంటే మీకొచ్చిన డౌటు ఇదా?" అన్నాడు అసహ్యంగా మొహం పెట్టి.

"ఇది నా డౌటు కాదండీ కబీరుకు కూడా ఇదే డౌటొచ్చిందిట ఒకసారి" అన్నాన్నేను.

"చుట్టూ నీళ్ళుంటే దాహమెందుకండీ" అన్నాడాయన.

"నిజమే కదా. మర్చేపోయాను. చుట్టూతా ఉన్నదానికోసం వెతకటం ఎందుకు? కరెక్ట్ గా చెప్పారు మీరు" అన్నాన్నేను.

ఆయనకు అర్ధం అయిందని నాకనిపించలేదు.

ఇంతలో మా జీఎమ్ గారు వారి సతీమణి ధ్యానం లోంచి లేచారు. వారి స్నాక్స్ అయినాక అందరం కలిసి మళ్లీ పడవలెక్కి వెనక్కు ప్రయాణంకట్టారు. మా గురూజీకి ఇందాకటి చేపదాహం పజిల్ అర్ధం కాక నన్ను అనుమానంగా చూస్తున్నాడు. అందులో ఏదో కిటుకుందని మాత్రం అతనికి తెలుస్తోంది. అదేంటో అర్ధమై చావటం లేదు.

బయలుదేరి వస్తూ పడవలోనుంచి వెనక్కు చూస్తూ మౌనంగా కూచున్నాను. మేమొదిలేసిన బీచి ప్రశాంతంగా మాకువీడ్కోలు చెబుతున్నట్లు అనిపించింది. కళ్ళు తెరిచి చూస్తూనే ఒక్క క్షణం ఏకాగ్రతగా ఈగిల్ విజన్ మోడ్ లోకి వెళ్లాను. క్రమేణా మాకు దూరంగాజరుగుతున్న బీచ్, సముద్రం, ఆకాశం అన్నీ మౌనంగా ధ్యానంలో ఉన్నట్లుగా అకస్మాత్తుగా నాకు ఒక ఫీలింగ్ కలిగింది.
వెంటనే చాందోగ్యోపనిషత్తులోని మంత్రం నాకు స్ఫురించింది.

శ్లో|| ధ్యాయం వావ చిత్తాధ్బూయో ధ్యాయతీవ పృధివీ ధ్యాయతీవాంతరిక్షమ్ ధ్యాయతీవ ద్యౌ ర్ధ్యాయన్తీవాపో ధ్యాయన్తీవపర్వతా...........||

ఆ ఉపనిషద్రుషికి అన్నీ ధ్యానంలో ఉన్నట్లుగా కనిపించాయి. భూమి, అంతరిక్షం, ఆకాశం, జలమూ, పర్వతాలూ అన్నీ ధ్యానంలో మునిగి ఉన్నట్లుగా
మంత్రద్రష్టకు కనిపించాయి. ఎంత అద్భుతమైన భావన? దీనిని భావన అనడం కంటే దర్శనం అనాలేమో? నిజమే. మనం ధ్యానంలో ఉంటే ప్రకృతికూడా ధ్యానంలో ఉన్నట్లే కనిపిస్తుంది. మన లోపలి స్థితి ఏదో అదే బయటకూడా దర్శనమిస్తుంది. లోపల మార్కెట్టును ఉంచుకొని కళ్ళుమూసుకుని బిగదీసుకుని కూచుంటే లాభంలేదు.

మనిషి గొడవ చెయ్యకుండా మౌనంగా ఉంటే చాలు. ప్రత్యేక ధ్యానాలు అక్కర్లేదు. సమస్తప్రకృతి ఎల్లపుడూ ధ్యానంలోనేఉంది. మనమే గందరగోళంలో ఉన్నాము. మన అంతరంగ కల్లోలాలు శాంతిస్తే చాలు. మన ఆవేశాలు చల్లారితే చాలు. ఎల్లప్పుడూ ఉన్నది ధ్యానమే.
తన్ను తాను మరచి ప్రకృతితో మౌనంగా మమేకం కాగిలిగితే చాలు. తాను అదృశ్యుడై ప్రకృతిని దానిమానాన ఉండనిస్తే చాలు. అదే ధ్యానం. అని ప్రకృతి నాతో చెబుతున్నట్లు అనిపించింది. భావాన్ని ఆస్వాదిస్తూ ఏకాగ్రతను చెదిరిపోనివ్వకుండా నిమిషనిమిషానికీ దూరమౌతున్న బీచ్ వైపు చిరునవ్వుతో చూస్తున్నాను.

బీచ్ చాలా దూరం వెళ్ళిపోయింది. చేప గురూజీ ఇంకా ఆ పజిల్ మీదే ఉన్నాడు.

"సారు బలే విచిత్రమైన మనిషండీ. చేపకు దాహం వేస్తే ఎలా అని ఆలోచిస్తున్నట్లున్నారు" అంటూ జోకేస్తున్నాడు గురూజీ.

అందరి నవ్వులతో నెనూ శృతి కలిపాను.
read more " అడవులదీవి సరదాయాత్ర "

18, సెప్టెంబర్ 2010, శనివారం

జైమినీయ కారకాంశ- ఒక పాత జ్ఞాపకం

1998 ప్రాంతాలలో నాకొక స్నేహితుడుండేవాడు. అతని పేరు శ్రీనివాస్ అప్పటికే అతను.మంచి జ్యోతిష్య జ్ఞానం ఉన్నవాడు. అప్పట్లోనే పదివేలు పెట్టి ఒక పామ్ టాప్ కంప్యూటర్ లాటిది కొని దాన్ని వాడుతూ జాతక చక్రాలు వేసి చూస్తుండేవాడు. ఒక రూం నిండా అతని లైబ్రరీ ఉండేది. వాళ్ళుబ్రాహ్మణులు కారు. పద్మ శాలీలని ఒకసారి చెప్పినట్లు లీలగా గుర్తుంది. రాత్రింబగళ్ళు జ్యోతిష్య శాస్త్రాన్ని శోధిస్తుండేవాడు. అతనికి జ్యోతిష్య శాస్త్రం మీద అంతటి నిమగ్నత ఎలా వచ్చిందో నాకు ఆశ్చర్యం వేసేది. నేను నా స్నేహితుల కులాలని ఎప్పుడూ అడగను. కొంతమంది నా కాలేజి స్నేహితుల కులాలు ఈ మధ్యనే నాకు ఒక వివాహ మూలకంగా తెలిశాయి. మా స్నేహాలు, ఆ విధంగా కులాలకు అతీతంగా సబ్జెక్ట్ పరంగా ఉండేవి.

అదలా ఉంచితే, అతను సాయంత్రానికి స్నానం చేసి గణపతి మంత్రం జపించేవాడు. ఎవరిదగ్గర ఉపదేశం పొందాడో నేనూ అడుగలేదు అతనూ చెప్పలేదు. అతను కృష్ణమూర్తి పద్దతి ఫాలో అయ్యేవాడు. కృష్ణమూర్తి గారు ఉచ్చిష్ట గణపతిఉపాసకుడు కనుక విధానం ఫాలో అయ్యేవారు చాలామంది మంత్రాన్ని జపిస్తారని నాకు తెలుసు. అందుకనినేనూ అడుగలేదు. కాని రాత్రి కాగానే మద్య మాంసాలు స్వీకరించేవాడు. అతనికి ఇలాటి అలవాట్లు ఉన్నాయని అప్పటిదాకా నాకు తెలియదు. కాని ఒక జ్యోతిష్య కాన్పరెన్స్ కు కలకత్తా వెళ్ళినపుడు అతనూ నేనూ ఒకే గదిలో ఉన్నాము. అప్పుడు ఇదంతా చూచాను. ఒకపక్క జ్యోతిష్య సాధన చేస్తూ, మంత్ర సాధన చేస్తూ, పనులేమిటి అని మాత్రం అడిగాను. దానికి సమాధానం చెప్పలేదు గాని "తాంత్రికసాధనలో మద్య మాంసాలు తీసుకోవచ్చుగా" అని చెప్పాడు. నాకప్పటికే తంత్రసాధనలో గట్టి అనుభవం ఉంది. చాలామంది తమ నిగ్రహలేమికి తంత్రం అని పేరుపెట్టుకుని సరిపుచ్చుకోవటం నాకు తెలుసు. అతను అర్ధం చేసుకునేస్థితిలో లేడని గ్రహించి, వాదనెందుకని నేను నవ్వి ఊరుకున్నాను. కాని ఒకటి మాత్రం చెప్పాను. "జ్యోతిష్య సాధన చేసేవారు నియమ నిష్టలు పాటించాలి. ఇలాటి అలవాట్లు ఉండరాదు.లేకపోతే ఈ జ్ఞానం పట్టుబడదు. ఒకవేళ పూర్వకర్మప్రభావం వల్ల గట్టి ఇంట్రెస్టు ఉన్నా సరిగా ఉపయోగపడదు. దానికి తోడు రెమెడీలు పని చెయ్యవు. ఇతరుల కర్మవిపాక విధానాలను చెప్పేమాట అటుంచి, తన కర్మ తానే తీర్చుకోలేడు " అన్నాను. అతను నవ్వి ఊరుకున్నాడు. అతను వినడని, అలవాట్లు మానుకునే స్థాయి దాటిపోయాడని నేను గ్రహించాను.

ఒకరోజు అతని జాతకం చూస్తూ చర్చిస్తుండగా జైమిని సూత్రాల ప్రకారం "ఆత్మాధిక కలాధిభి:" అని జైమిని మహర్షిచెప్పినదానిని బట్టి, " భవేద్రాశి కలయో రాధిక్యా దాత్మకారక:" అని పరాశరులు చెప్పినదానినిబట్టి అతని ఆత్మకారకుని నిర్ధారించి పరిశీలిస్తున్నాము. అతనికి జైమిని విధానం తెలియదు. కనుక దానిగురించి నన్ను అడిగేవాడు. అప్పట్లో మేము రకరకాల జ్యోతిషవిధానాలను తీవ్రంగా పరిశీలిస్తూ వాటిని వివిధ జాతకాలకు అప్లై చేసి చర్చిస్తూ ఉండేవాళ్లం. కాని అతను సాంప్రదాయ రెమెడీలు పాటించేవాడు కాదు. ఏవో పిరమిడ్స్ అని, డాలర్స్ అని, రుద్రాక్షలని ఇంకా ఏవేవో తనకు తోచిన వాటిని, బజారులోని పుస్తకాలలో వచ్చేవాటిని రోజుకొకటి చొప్పున రెమెడీల క్రింద ట్రై చేస్తుండేవాడు. మాయలో పడవద్దని నేను చెప్పేవాణ్ణి కాని అతను వినేవాడుకాదు. సాంప్రదాయం గా వస్తున్న రెమెడీలు పాటించేవాడు కాదు. అతని జాతకంలోని కారకాంశను చూడటం తోనే "సమే వాహనా దుచ్చాచ్చ క్రమాత్పతనం " అన్న జైమిని సూత్రం నాకు స్ఫురణకు వచ్చింది. కారకాంశ ధనుస్సుగనుక అయితే వాహనాలనుంచి పడటంవల్ల గాని ఎత్తైన ప్రదేశాలనుంచిపడటం వల్ల గాని ప్రమాదం ఉంటుంది. అతని జాతకంలో అదే కాంబినేషన్ కనిపించింది. వెంటనే జైమినీయ చరదశను, గోచారాన్ని పరిశీలించాము. అప్పుడు జరుగుతున్న దశ చూడగానే నా గుండె గుభిల్లుమంది. ఎలా చెప్పాలా అనిచాలాసేపు ఆలోచించి, " ఏది ఏమైనా సరే, వాహనాలు స్పీడుగా నడపకు" అని మాత్రం చెప్పాను. సరే అనితలూపాడు.

ఇది జరిగిన నెల రోజులకనుకుంటాను. రాత్రి పదకొండు గంటలకు విజయవాడ నుంచి మోటార్ సైకిల్ మీద తాడేపల్లికి వస్తుండగా, సాయిబాబా గుడి టర్నింగ్ వద్ద స్పీడు గా ఎదురునుంచి వస్తున్న ఒక కారు అదుపుతప్పి ఇతన్ని గుద్దేసింది. వాహనం మీదనుంచి పడి దొర్లుకుంటూ రోడ్డుపక్కన డౌన్ లో పడిపోయాడు. కాలుప్రాక్చర్ అయింది. ఒక వారం హాస్పటల్ లో ఉండి, ఆపరేషన్ టేబుల్ మీద హార్ట్ ఎటాక్ తో చనిపోయాడు. అప్పుడతనికి 33 సంవత్సరాలు మాత్రమే. "వాహనా దుచ్చాచ్చ క్రమాత్పతనం" --"వాహనం మీద నుంచి పడి ఎత్తునుండి కిందకు దొర్లుటద్వారా ప్రమాదం జరుగును" అని జైమిని మహర్షి వేల సంవత్సరాల క్రితం చెప్పిన సూత్రం అక్షరాలా అతని విషయం లో జరిగింది. కాని అన్ని వేల ఏళ్ళ క్రితమే ఇలాటి కాంబినేషన్స్ ను పరిశోధనలో నిగ్గు తేల్చి వాటిని సూత్రాలుగా వ్రాసిపెట్టిన మహర్షుల మేధాశక్తి ఎంతటిదో అల్పజ్ఞులమైన మన ఆలోచనకు అందదు. విషయం నన్ను చాలాఆశ్చర్యానికి గురిచేసింది. శాస్త్రంలో ఇంకా లోతైన పరిశీలన చెయ్యాలన్న ఆసక్తిని పురికొల్పింది. చాలా బాధాకరమైన విషయం అయినప్పటికీ, మరువలేని కొన్ని పాత ప్రిడిక్షన్స్ లో ఇదొకటి.
read more " జైమినీయ కారకాంశ- ఒక పాత జ్ఞాపకం "

10, సెప్టెంబర్ 2010, శుక్రవారం

నిజమైన ఇంకో జోస్యం (వ్యక్తి జాతకంలో)

రెండు రోజులనాడు ఒక స్నేహితుని జాతకం చూస్తూ ఇలా చెప్పాను.

"రాబోయే రెండురోజులలో నీకు ఒక ప్రమాదం జరుగబోతున్నది. కేతువు యొక్కసూక్ష్మ దశ జరుగుతున్నది కనుక ఏదో ఒక ఊహించని ప్రమాదంకలుగుతుంది. జాగ్రత్తగా ఉండు."

అతనికి జ్యోతిష్యాలంటే పెద్ద నమ్మకమూ లేదు. అలాగని అపనమ్మకమూలేదు. చాలామంది లాగే దానితో మనకెందుకు అనుకునే రకం మనిషి. మన పనిమనం చేసుకుంటే గ్రహమూ ఏమీ చెయ్యదు అని నమ్ముతాడు.

అతను నవ్వాడు.

"అంటే జాగ్రత్తగా ఉంటే జరిగే ప్రమాదం జరగదా? అలాగైతే జ్యోతిష్యం తప్పు అయినట్లే కదా" అన్నాడు.

నాకు ఇలాటి పిల్లకాకి వాదనలు వినీ వినీ విసుగొచ్చింది.

వీళ్ళకున్నపాటి అరికాలి మెదడు లేకుండానే మహర్షులు ఇన్నిన్ని శాస్త్రాలు వ్రాశారా? అని వీళ్ళు ఎందుకు ఆలోచించరోఅనిపిస్తుంది.

ఇంకొడైతే "నీ ఖర్మ" అని ఒదిలేసేవాణ్ని.కాని నాకు మంచి స్నేహితుడు. మా నమ్మకాలలో విభేదాలున్నప్పటికీమేమిద్దరం మంచి స్నేహితులం.

కనుక సరేరా "నీ నమ్మకాలు ప్రస్తుతానికి అలా ఉంచు. నే చెప్పిన మంత్రం స్మరిస్తూ ఉండు". అని చెప్పాను.

వాడు నాస్తికుడు కాదు గాని జాతకాలను గ్రహాలను నమ్మడు. దైవభక్తి ఉన్నవాడు.

గుణాన ఉన్నాడో "సరేరా" అన్నాడు. అంటూ " రకమైన ప్రమాదమో అదికూడా చెప్పుమరి" అన్నాడు. నీ జాతకంలోకేతువున్న స్థితిని బట్టి నీ తలకు బలమైన దెబ్బ తగులవచ్చు. జాగ్రత్త అని చెప్పాను.

తరువాత సంగతి మరిచిపోయాను. ఇద్దరం ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమయ్యాం.

రోజు ఏం జరిగిందో చూద్దామా?

ఇప్పుడే పనిమీద విజయవాడ వెళ్ళి తిరిగి వచ్చి అలా రిలాక్స్ అవుతున్నాను. ఇంతలో వార్త తెలిసింది. వెంటనే ఫోన్చేయగా తెలిసిన విషయాలివి.

రేపు వినాయక చవితి కనుక చవితి పందిళ్ళు అన్ని చోట్లా వేస్తున్నారు. మన వాడు రోడ్డుపక్కగా నిలబడి ఎవరితోనోమాట్లాడుతున్నాడు.

ఇంతలో మాట్లాడుతున్న
రెండవ వ్యక్తి " ఒరేయ్. వినాయక విగ్రహం చూడు ఎంత బాగుందో" అన్నాడు. రకరకాలరంగు రంగుల వినాయక విగ్రహాలు రిక్షాలమీదా, ఆటోలలోనూ తీసుకుపోతున్నారు.

మనవాడు తలతిప్పి చూడటం, పక్కనే కడుతున్న పందిరి నుంచి ఒక సర్వి గుంజ (సర్వి బాదు అని కూడా పిలుస్తారు) జారి, వీడి తల పక్కగా తాకుతూ వచ్చి భుజం మీద పడటం బలమైన దెబ్బ తగలటం ఒక్క క్షణం లో జరిగింది. ఇంకేముంది లబలబ మొత్తుకుంటూ దగ్గరలోని హాస్పటల్ కు పరిగెత్తి టెస్ట్ లూ, ఇంజక్షన్లూ అన్నీ మామూలుగాజరిగిపోయాయి.

" మంచి దెబ్బ తగిలిందిరా. మనది ఎక్సర్ సైజ్ బాడీ గనుక తట్టుకున్నాను. అదృష్టం బాగుండి ఫ్రాక్ఛర్ కాలేదు. తలపక్కకి తిప్పక పోయి ఉంటే గుంజ తలమీద పడి తల పగిలి ఉండేది. నువ్వు చెప్పింది నిజం అయ్యిందిరా. వినాయకవిగ్రహం చూద్దామని తల తిప్పటం నన్ను రక్షించింది. కాదు కాదు వినాయకుడే రక్షించాడు." అని మూలుగుతూ మావాడుఫోన్ లో చెప్పాడు.

ఇలాటి ఘటనలు చాలా చూచాను గనుక, అనుభవంతో, "నిన్ను పక్కకు చూడమని చెప్పిన ఫ్రెండ్ పేరు ఏమిట్రా" అనిఅడిగాను.

"వాడిపేరు గణేశ్వర్రావు రా. నీకూ తెలుసుగా. మొన్న మీ ఆఫీస్ కు నాతో బాటు వచ్చాడే .అతనే" అని అవతల పక్కనుండి జవాబు.

నాకు అంతా అర్ధమైంది.

"మరి నేను చెప్పిన మంత్రం రెండు రోజులూ జపిస్తున్నావా?" అని అడిగాను.

"చేస్తున్నానురా బాబూ . లేకపోతే నువ్వు ఊరుకోవుగా." అని వాడి జవాబు

ఇంతకీ నేను మావాణ్ణి స్మరించమని చెప్పింది గణేశ మంత్రమే మరి.

మనం గనుక సరియైన రెమెడీ పాటిస్తే, అదే దేవత పేరుగల ఒక వ్యక్తి నుంచో, లేక సాకుతోనో ఏదో ఒక అనుకోనిసహాయం అంది మనం రక్షింపబడతాం. వీడి విషయం లో అదే జరిగింది. వినాయక విగ్రహం చూడమని గణేశ్వర్రావు అనేప్రెండ్ చెప్పటం వీడు తల తిప్పటం వల్ల తల పగలకుండా రక్షింపబడ్డాడు. కాని కర్మ ఫలితం తప్పదుగదా మరి. అందుకేభుజం మీద దెబ్బ తగిలింది. గొడ్డలి వేటు పడాల్సిన చోట గోటితో గీరుకుంటుంది అంటే ఇదేగా మరి.

జ్యోతిష్య విజ్ఞానం యొక్క మహత్వానికి ఆశ్చర్య పోవడం విన్నవారి వంతు అయింది. అభినందనలతో మిత్ర బృందం నుంచిఇంకా ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. నేను ఇలాటి సంఘటనలు చాలా చూచాను గనుక నాకేమీ ఆశ్చర్యం కలగలేదు.

ఇదీ జ్యోతిష్యం వల్ల ఉపయోగం.
read more " నిజమైన ఇంకో జోస్యం (వ్యక్తి జాతకంలో) "

4, సెప్టెంబర్ 2010, శనివారం

తొలగిన శుక్రుని కరుణ-2

నిన్న శుక్రవారం నాడు ప్రమాదాలు జరిగాయి.

పాకిస్తాన్ లోని క్వెట్టా నగరం లో షియాల ర్యాలీ గొడవల్లో మానవ బాంబు పేలుడు, తరువాత ఉగ్రవాదుల కాల్పుల వల్ల రక్తపాతం జరిగి కనీసం ఏభై మంది తుక్కు తుక్కుగా చనిపోయారు.

రష్యాలో షార్ట్ సర్క్యూట్ వల్ల అడవులు అంటుకుని కార్చిచ్చు వ్యాపించి కనీసం 500 ఇళ్ళు తగల బడ్డాయి. కనీసం 1000 మంది రోడ్ల పాలయ్యారు.

బ్రిటన్ లో హరే కృష్ణ ఆలయంలో గ్యాస్ సిలిండర్లు పేలి తీవ్ర అగ్ని ప్రమాదం జరిగి భవనం దాదాపు ద్వంస మైంది.

ఈ రోజు తెల్లవారు జామున న్యూజిలాండ్ లోని క్రీస్ట్ చర్చి సిటీలో పెద్ద భూకంపం వచ్చి సివిల్ ఎమర్జెన్సీ విధించారు. రిచ్టార్ స్కేల్ మీద 7.4 గా నమోదైంది. జన జీవనం అతలా కుతలం అయింది.

దుబాయి లో కార్గో విమానం ఒక బిజీ హైవె దగ్గర కూలింది. సిబ్బంది చనిపోయారు.

ఒకటో తేదీన మనం ఊహించినదే ఈనాడు జరుగుతున్నది. మానవ జీవితం మీద గ్రహ ప్రభావానికి ఇదొక నిదర్శనం.
read more " తొలగిన శుక్రుని కరుణ-2 "

1, సెప్టెంబర్ 2010, బుధవారం

తొలగిన శుక్రుని కరుణ

శుక్రుడు ఈ రోజు కన్యారాశిని వదలి తులా రాశిలో ప్రవేశించాడు.

దీనివల్ల కొన్ని సంఘటనలు జరుగుతాయి.

కుజుడు అగ్నితత్వ గ్రహం. శని వాయు తత్వ గ్రహం. వీరి కలయిక వల్ల అగ్నికి వాయువు తోడైనట్లుగా ఉంటుంది. కనుక కుజ శనుల కలయిక అగ్ని ప్రమాదాలకు పేలుళ్ళకు దారితీస్తుంది.
శుక్రుడు జలగ్రహం. కనుక శుక్రుని జలప్రభావం వల్ల ఆ ప్రమాదాలు జరుగవు. లేదా ఒకవేళ జరిగినా తక్కువ స్థాయిలో జరుగుతాయి. నిప్పును నీరు ఆర్పినట్లు శుక్రుని ప్రభావం పనిచేస్తుంది.

కాని నేడు శుక్రుడు, కన్యారాశిలో ఉన్న కుజశనులను వదలి తనదైన తులా రాశిలో ప్రవేశించాడు.

కనుక శుక్రుని జలప్రభావం వారిమీదనుంచి తొలగి పోతుంది. నీరు దూరమైతే అగ్ని మళ్లీ మండటం మొదలు పెడుతుంది. అప్పుడు మళ్లీ అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు, భవన ప్రమాదాలు, బాంబు పేలుళ్ళు విజృంభిస్తాయి.

చూద్దాం ఏం జరుగుతుందో?
read more " తొలగిన శుక్రుని కరుణ "