రెండు రోజులనాడు ఒక స్నేహితుని జాతకం చూస్తూ ఇలా చెప్పాను.
"రాబోయే రెండురోజులలో నీకు ఒక ప్రమాదం జరుగబోతున్నది. కేతువు యొక్కసూక్ష్మ దశ జరుగుతున్నది కనుక ఏదో ఒక ఊహించని ప్రమాదంకలుగుతుంది. జాగ్రత్తగా ఉండు."
అతనికి జ్యోతిష్యాలంటే పెద్ద నమ్మకమూ లేదు. అలాగని అపనమ్మకమూలేదు. చాలామంది లాగే దానితో మనకెందుకు అనుకునే రకం మనిషి. మన పనిమనం చేసుకుంటే ఏ గ్రహమూ ఏమీ చెయ్యదు అని నమ్ముతాడు.
అతను నవ్వాడు.
"అంటే జాగ్రత్తగా ఉంటే జరిగే ప్రమాదం జరగదా? అలాగైతే జ్యోతిష్యం తప్పు అయినట్లే కదా" అన్నాడు.
నాకు ఇలాటి పిల్లకాకి వాదనలు వినీ వినీ విసుగొచ్చింది.
వీళ్ళకున్నపాటి అరికాలి మెదడు లేకుండానే మహర్షులు ఇన్నిన్ని శాస్త్రాలు వ్రాశారా? అని వీళ్ళు ఎందుకు ఆలోచించరోఅనిపిస్తుంది.
ఇంకొడైతే "నీ ఖర్మ" అని ఒదిలేసేవాణ్ని.కాని నాకు మంచి స్నేహితుడు. మా నమ్మకాలలో విభేదాలున్నప్పటికీమేమిద్దరం మంచి స్నేహితులం.
కనుక సరేరా "నీ నమ్మకాలు ప్రస్తుతానికి అలా ఉంచు. నే చెప్పిన మంత్రం స్మరిస్తూ ఉండు". అని చెప్పాను.
వాడు నాస్తికుడు కాదు గాని జాతకాలను గ్రహాలను నమ్మడు. దైవభక్తి ఉన్నవాడు.
ఏ గుణాన ఉన్నాడో "సరేరా" అన్నాడు. అంటూ "ఏ రకమైన ప్రమాదమో అదికూడా చెప్పుమరి" అన్నాడు. నీ జాతకంలోకేతువున్న స్థితిని బట్టి నీ తలకు బలమైన దెబ్బ తగులవచ్చు. జాగ్రత్త అని చెప్పాను.
తరువాత ఆ సంగతి మరిచిపోయాను. ఇద్దరం ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమయ్యాం.
ఈ రోజు ఏం జరిగిందో చూద్దామా?
ఇప్పుడే పనిమీద విజయవాడ వెళ్ళి తిరిగి వచ్చి అలా రిలాక్స్ అవుతున్నాను. ఇంతలో వార్త తెలిసింది. వెంటనే ఫోన్చేయగా తెలిసిన విషయాలివి.
రేపు వినాయక చవితి కనుక చవితి పందిళ్ళు అన్ని చోట్లా వేస్తున్నారు. మన వాడు రోడ్డుపక్కగా నిలబడి ఎవరితోనోమాట్లాడుతున్నాడు.
ఇంతలో ఆ మాట్లాడుతున్న రెండవ వ్యక్తి " ఒరేయ్. ఆ వినాయక విగ్రహం చూడు ఎంత బాగుందో" అన్నాడు. రకరకాలరంగు రంగుల వినాయక విగ్రహాలు రిక్షాలమీదా, ఆటోలలోనూ తీసుకుపోతున్నారు.
మనవాడు తలతిప్పి చూడటం, పక్కనే కడుతున్న పందిరి నుంచి ఒక సర్వి గుంజ (సర్వి బాదు అని కూడా పిలుస్తారు) జారి, వీడి తల పక్కగా తాకుతూ వచ్చి భుజం మీద పడటం బలమైన దెబ్బ తగలటం ఒక్క క్షణం లో జరిగింది. ఇంకేముంది లబలబ మొత్తుకుంటూ దగ్గరలోని హాస్పటల్ కు పరిగెత్తి టెస్ట్ లూ, ఇంజక్షన్లూ అన్నీ మామూలుగాజరిగిపోయాయి.
" మంచి దెబ్బ తగిలిందిరా. మనది ఎక్సర్ సైజ్ బాడీ గనుక తట్టుకున్నాను. అదృష్టం బాగుండి ఫ్రాక్ఛర్ కాలేదు. తలపక్కకి తిప్పక పోయి ఉంటే ఆ గుంజ తలమీద పడి తల పగిలి ఉండేది. నువ్వు చెప్పింది నిజం అయ్యిందిరా. వినాయకవిగ్రహం చూద్దామని తల తిప్పటం నన్ను రక్షించింది. కాదు కాదు వినాయకుడే రక్షించాడు." అని మూలుగుతూ మావాడుఫోన్ లో చెప్పాడు.
ఇలాటి ఘటనలు చాలా చూచాను గనుక, ఆ అనుభవంతో, "నిన్ను పక్కకు చూడమని చెప్పిన ఫ్రెండ్ పేరు ఏమిట్రా" అనిఅడిగాను.
"వాడిపేరు గణేశ్వర్రావు రా. నీకూ తెలుసుగా. మొన్న మీ ఆఫీస్ కు నాతో బాటు వచ్చాడే .అతనే" అని అవతల పక్కనుండి జవాబు.
నాకు అంతా అర్ధమైంది.
"మరి నేను చెప్పిన మంత్రం ఈ రెండు రోజులూ జపిస్తున్నావా?" అని అడిగాను.
"చేస్తున్నానురా బాబూ . లేకపోతే నువ్వు ఊరుకోవుగా." అని వాడి జవాబు
ఇంతకీ నేను మావాణ్ణి స్మరించమని చెప్పింది గణేశ మంత్రమే మరి.
మనం గనుక సరియైన రెమెడీ పాటిస్తే, అదే దేవత పేరుగల ఒక వ్యక్తి నుంచో, లేక ఆ సాకుతోనో ఏదో ఒక అనుకోనిసహాయం అంది మనం రక్షింపబడతాం. వీడి విషయం లో అదే జరిగింది. వినాయక విగ్రహం చూడమని గణేశ్వర్రావు అనేప్రెండ్ చెప్పటం వీడు తల తిప్పటం వల్ల తల పగలకుండా రక్షింపబడ్డాడు. కాని కర్మ ఫలితం తప్పదుగదా మరి. అందుకేభుజం మీద దెబ్బ తగిలింది. గొడ్డలి వేటు పడాల్సిన చోట గోటితో గీరుకుంటుంది అంటే ఇదేగా మరి.
జ్యోతిష్య విజ్ఞానం యొక్క మహత్వానికి ఆశ్చర్య పోవడం విన్నవారి వంతు అయింది. అభినందనలతో మిత్ర బృందం నుంచిఇంకా ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. నేను ఇలాటి సంఘటనలు చాలా చూచాను గనుక నాకేమీ ఆశ్చర్యం కలగలేదు.
ఇదీ జ్యోతిష్యం వల్ల ఉపయోగం.