నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

31, అక్టోబర్ 2010, ఆదివారం

ఉచ్చాటన క్రియ పనిచేస్తుందా?

తాంత్రిక క్రియల్లో ఒకటైన ఉచ్చాటన క్రియకు నిత్యజీవితాలలో జరిగిన కొన్ని ఉదాహరణలు చూద్దామా.

>>పాము మంత్రం వేసేవాళ్ళు మంత్రించిన ఇసుకను ఇంటి చుట్టూ పొయ్యమంటారు. ఇసుకను దాటి సర్పాలు లోపలికి రాలేవు. అక్కడి దాకా వచ్చి వెనక్కు వెళ్ళిపోతాయి. ఇది నిజంగా జరుగుతుంది. పాము మంత్ర సిధ్ది నిజంగా ఉన్నవాళ్ళు ఇది చేసినప్పుడు మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. ఇది ఒక రకమైన ఉచ్చాటన క్రియే. కాని పాము మంత్రగాళ్లమని చెప్పుకునే వారందరికీ నిజమైన మంత్ర సిద్ది ఉండదు. నిజమైన సిద్ధి ఉన్నవారు ఇదిచేస్తే చక్కగా జరుగుతుంది.

>>ప్రేతాత్మలను మనిషి నుంచి వదిలించటమూ (exorcism), భూతగృహం (haunted house) నుంచి దురాత్మను వెళ్లగొట్టే పద్ఢతులూ కూడా ఉచ్చాటన క్రియలే. మహనీయులు సంకల్ప మాత్రం చేత వీటిని చెయ్యగలుగుతారు. మామూలు సాధకులు అయితే ఆ క్రియా విధానం ప్రయోగించి కష్టపడవలసి వస్తుంది. ఆ క్రమంలో కొన్నిసార్లు శక్తి చాలకపోతే ఎదురుదెబ్బలు తినవలసి వస్తుంది కూడా.

>>ఒక భూతపీడితుడైన మనిషి నుంచి ప్రేతాత్మలను జీసస్ తన యోగశక్తితో వెళ్లగొడితే అవి అక్కడే ఉన్న పందుల గుంపులో ప్రవేశించగా, ఆ పందులన్నీ పిచ్చిపిచ్చిగా పరిగెత్తి సముద్రంలో దూకి చచ్చాయని బైబుల్ లో ఉంది. అతను అనేక ఆత్మలచేత ఆవేశించబడిన దురదృష్టవంతుడు. ఇది ఉచ్చాటన క్రియనే.

>>షిరిడీ ఊరిలో కలరా మహమ్మారి ప్రబలుతున్నపుడు బాబా స్వయంగా తిరగలితో పిండి విసిరి ఆ పిండిని దుష్ట శక్తులకు ఆహారంగా విసురుతున్నట్లుగా చేస్తూ ఊరంతా చల్లాడని, తత్ఫలితంగా కలరా ఆ ఊరిని తాకలేదనీ ఆయన జీవిత చరిత్రలో వ్రాసి ఉంది. ఇదీ ఒకరకమైన ఉచ్చాటన క్రియనే.

>>గౌతమబుద్ధుని వద్దకు ఒక ప్రేతాత్మ ఆవేశించిన వ్యక్తిని తీసుకురాగా, ఆయన తన శక్తితో దానిని ఆ వ్యక్తి నుంచి వెళ్లగొట్టినపుడు, ఆ ఆత్మ పోతూ పోతూ తాను పోతున్నందుకు నిదర్శనంగా పక్కనున్న చెట్టుకొమ్మను పేళ్ళున విరిచి వెళ్ళిపోయిందని బుద్దుని జీవితం లో ఉంది. ఇదీ ఉచ్చాటన క్రియే.

>>శ్రీరామకృష్ణుని జీవితంలో ఒక సంఘటన. ఆయన చివరిరోజులలో కాశీపూర్ గార్డెన్ హౌస్ లో ఉన్నపుడు, ఆ ఇంటి ఆవరణలో ఒక మూలన ఉన్న ఈత చెట్టువద్ద
తన శిష్యులను కాటేయటానికి పొంచి ఉన్న విషసర్పాన్ని అక్కడనుంచి పొమ్మని ఆదేశించి దానిని వెళ్లగొట్టాడు. ఇదీ ఒక రకమైన ఉచ్చాటన క్రియనే.

>>తన చెల్లెలి వెంట పడుతున్న ఒక వ్యక్తి బారినుంచి తన చెల్లెలిని కాపాడమని ఒక వ్యక్తి నన్ను అడిగాడు. అతనికి ఈ క్రియ ఎలా చెయ్యాలో చెప్పాను. అతను దాన్ని తూచా తప్పకుండా ఆచరించాడు. దాని ఫలితంగా ఆ యువకుడు హఠాత్తుగా ఆ ఊరినుంచి దూరంగా వెళ్ళిపోయాడు. తర్వాత మళ్లీ ఆ అమ్మాయివైపు చూడలేదు.

>>> ఒక ఆఫీసర్ తన క్రింది ఉద్యోగి అయిన నా మిత్రుని అనవసరంగా తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాడు. నా మిత్రుడు తట్టుకోలేని స్థితిలో నన్ను సంప్రదించాడు. అతనికి ఈ క్రియ ఎలా చెయ్యాలో చెప్పాను. దాని ఫలితంగా ఆ ఆఫీసర్ ఉన్నట్టుండి ఒక కేసులో ఇరుక్కుని ట్రాన్స్ ఫర్ కాబడి ఆ ఊరినుంచి వెళ్ళిపోయాడు. సామాన్యంగా టర్మ్ పూర్తికాకుండా అలా ట్రాన్స్ ఫర్ కావటం జరుగదు.

>>>ఒకసారి నేను నడుస్తూ వెళుతుంటే ఒక బర్రె కొమ్ములు విసురుతూ నాకే ఎదురొచ్చింది. నెను దానిపైన ఉచ్చాటనక్రియను మౌనంగా ప్రయోగించాను. విచిత్రంగా ఆ బర్రె సడన్ గా ఆగిపోయి ఎవరో తరుముతున్నట్లు వేరే దిక్కులో పారిపోయింది.

>>>కావ్యకంఠ గణపతి ముని జీవితంలో జరిగిన సంఘటన. ఆయన కర్ణాటకలో ఉన్నప్పుడు ఒక పొలంలో తన శిష్యులతోకూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు. వారి చుట్టూ ఉన్న గడ్డివాములను మంటలు ఆక్రమించి వాళ్ళు తగలబడే పరిస్థితి వచ్చింది. అప్పుడాయన ఒక వైదిక మంత్రాన్ని ప్రయోగించగా హఠాత్తుగా సుడిగాలి చెలరేగి గడ్డివాములను దూరంగా చెదరగొట్టింది. వైదిక మంత్రాలకున్న శక్తిని ఆయన ఆ విధంగా చూపించాడు. ఇదీ ఉచ్చాటనా క్రియనే.

>>>వదలకుండా తనను వేధిస్తున్న ఒక ఆలోచన (obsessive thought) గురించి అరవిందులకు ఒక శిష్యుడు వివరించి సాయం చెయ్యమన్నాడు. ఆయన అతని తలదగ్గరగా చెయ్యిపెట్టి ఒక పురుగును తీసి విసిరినట్లుగా చెయ్యిని దూరంగా విదిలించాడు. తరువాత ఆలోచన తిరిగి శిష్యుడి మనసులో తలెత్తలేదు.మదర్ ను విషయమై అడిగితే అరవిందులు తన చర్య ద్వారా ఆలోచనను దూరంగా శూన్యాకాశంలోకి విసిరేశారని చెప్పారు. ఇదీ ఒక ఉచ్చాటనక్రియనే.

అధర్వణ వేదంలో ఇలాటి విధానాలు ఎన్నెన్నో ఇవ్వబడ్డాయి. సాధన చెయ్యగలిగితే వీటిని సాధించవచ్చు.
ఈ విధంగా ఉచ్చాటన క్రియను మంచిపనులకు కూడా చక్కగా వాడవచ్చు.
read more " ఉచ్చాటన క్రియ పనిచేస్తుందా? "

30, అక్టోబర్ 2010, శనివారం

ఇండోనేషియా సునామీ అగ్నిపర్వత పేలుళ్లు- జ్యోతిష పరిశీలన

26-10-10 సోమవారం నాడు ఇండోనేషియాలోని సుమత్రా దీవిని భూకంపం, సునామీ రెండూ దెబ్బతీశాయి. మర్నాడు అగ్నిప్రళయాలకు కారకుడైన కుజునిదైన మంగళవారంనాడు మేరాపీ అగ్నిపర్వతం బద్దలై విలయం సృష్టించింది. దీనికివెనుక కొన్ని జ్యోతిష కారణాలు కనిపిస్తున్నాయి. అవేమిటోచూద్దాం.

రోజున ఉన్న గ్రహస్థితి ఇక్కడ ఇస్తున్నాను. రోజు పూర్ణిమకు మూడురోజుల దూరంలో ఉంది. అప్పుడే బహుళ చవితి మొదలైంది.

చంద్రుడు, శనీ ఇద్దరూ ఖచ్చితంగా 16 డిగ్రీలమీదున్నారు. చంద్రుడు రోహిణిలో ఉంటే శని హస్తలో ఉన్నాడు. రెండూ చంద్ర నక్షత్రాలే. చంద్రుడు ఉచ్చ స్థితిలో ఉండి భూమిమీదతనయొక్క అసాధారణమైన ప్రభావాన్ని సూచిస్తున్నాడు. ఇద్దరూ భూతత్వరాశులలో ఉండి భూమిలోని తీవ్రచలనాన్ని సూచిస్తున్నారు. సముద్రంలో ఏర్పడిన భూకంపంవల్లనే సునామీ వచ్చిందని శాస్త్రవేత్తలంటున్నారు.

భూతత్వగ్రహమైన బుధుడు 14 డిగ్రీలలోనూ, జలతత్వ గ్రహమైన శుక్రుడు 13 డిగ్రీలలోనూ రాహువుయొక్క స్వాతీనక్షత్రంలో దగ్గరగా ఉన్నారు. పశ్చిమాన్ని సూచిస్తున్న తులారాశిలో ఉన్నారు. గురువు సున్నా డిగ్రీలలో అతి బలహీనుడుగా ఉన్నాడు. రాహువు కేతు నక్షత్రంలోనూ కేతువు రాహునక్షత్రంలోనూ ఉన్నారు. ఇండోనేషియాలోని పశ్చిమతీరంలోనే ఈ ప్రమాదం జరిగింది.

ఇండోనేషియాను సూచించే ధనూరాశిలోనే ప్రమాదాలకు కారకుడైన రాహువు ఉండటమూ, బుధుడూ శుక్రుడూ రాహునక్షత్రంలోనే ఉండటమూ గమనించవచ్చు.

అసాధారణ శక్తితో ఉన్న చంద్రుని దృష్టి అగ్నిపర్వత ప్రేలుళ్ళకు కారకుడైన కుజునిపైన ఉండటం చూడండి. మంగళవారం నాడే అగ్నిపర్వతం పేలింది.

read more " ఇండోనేషియా సునామీ అగ్నిపర్వత పేలుళ్లు- జ్యోతిష పరిశీలన "

28, అక్టోబర్ 2010, గురువారం

మీ వాహనం యొక్క జాతకం

నేను వ్రాయబోతున్నది వినడానికి విచిత్రంగా ఉంటుంది. నవ్వు కూడా వస్తుంది. కాని ఇది నిజం. మనుష్యులకే కాదు జంతువులకూ జాతకాలు ఉంటాయని ప్రఖ్యాత జ్యోతిశ్శాస్త్రవేత్త వరాహమిహిరుడు తన బృహజ్జాతకంలోని వియోని జన్మాధ్యాయము లో వివరించాడు. ఇదే కాన్సెప్ట్ ను కొంత పొడిగించి దీనిని వాహనాలకూ వర్తించి చూశాను. ఆశ్చర్య పరిచే ఫలితాలు వచ్చాయి.

జాతకుని కుండలిలో చతుర్ధ స్థానం వాహనయోగాన్ని సూచిస్తుంది అని మనకు తెలుసు.ఈ రాశి ద్విపాద రాశి అయితే అతనికి టూ వీలర్ యోగం ఉంటుంది. అది చతుష్పాద రాశి అయితే అతనికి ఫోర్ వీలర్ యోగం ఉంటుంది. వాయుతత్వరాశి అయితే వాయుయానం (ఎయిర్ ట్రావెల్) ఎక్కువగా జరుగుతుంది. భూతత్వ రాశి అయితే భూమిమీద ప్రయాణం సాగుతుంది. జలతత్వ రాశి అయినవారికి సముద్ర ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి.

ఇదే లాజిక్ ను ఇంకొంచం ముందుకు పొడిగించి రీసెర్చి చేశాను. గ్రహాలకు మన దేహంలోని వివిధ అవయవాలమీద అధిపత్యం ఉన్నదని మనకు తెలుసు. ఒక వాహనం కూడా మన దేహం వంటిదే. మన దేహంలోని వ్యవస్ఠ లాగే వాహనంలో కూడా ఒక వ్యవస్థ ఉంటుంది. ఎలాగో చూద్దామా?

గుండె, కళ్ళు = ఇంజన్, హెడ్ లైట్= రవి
రక్తం= పెట్రోల్/డీజిల్/ఫ్యూయల్= చంద్రుడు
కండబలం, ఆకలి= కంబషన్ చాంబర్/పిస్టన్/మొబిలిటీ= కుజుడు
బుద్ది, చర్మం= టైర్లు, బాడీ= బుధుడు
జీర్ణశక్తి,బైల్ సెక్రీషన్= ఇంజన్ ఆయిల్= గురువు
శరీరానికి సుఖమైన స్తితి=మెత్తని సీటు, వాహనం రిపేర్ లేకుండా ఉండటం= శుక్రుడు
నరాలు, బాధలు, బద్ధకం=వాహనం లోని వైరింగ్, టైర్లలోని గాలి, తరచూ రిపేర్లు, స్టార్టింగ్ ట్రబుల్= శని
శరీరంలో తరచూ మార్పులు, అర్ధంకాని రోగాలు= మాటమాటకీ రిపేర్లు, వాహనాన్ని కొత్త కొత్త మార్పులు చెయ్యవలసి రావటం, వాహనాలు తరచూ మార్చటం= రాహువు
శరీరంలో హఠాత్తుగా వచ్చే మార్పులు, ప్రమాదాలు= అనుకోకుండా వాహనం ట్రబుల్ ఇవ్వటం, ఏక్సిడేంట్లు= కేతువు

మన వాహనం కొన్న తేదీ, డెలివరీ తీసుకున్న టైమ్ కు జాతకం వెస్తే అది ఆ వాహనం యొక్క జాతకం అవుతుంది. ఆ జాతకాన్ని బట్టి, పైన ఇచ్చిన కారకత్వాలను బట్టి, గ్రహాల యోగాలను బట్టి, ఆ వాహనానికి ఏ సమయంలో రిపేర్ వస్తుంది? ఏ పార్ట్ పాడౌతుంది? ఏక్సిడెంట్ ఎప్పుడు అవుతుంది? దాని ఆయుష్షు ఎంత ఉంది? ఈ వాహనం ఏ కార్యక్రమాలకు వాడబడుతుంది? మొదలైన వివరాలు ముందుగానే తెలుసుకోవచ్చు. వ్యక్తి జాతకానికి వలెనే వాహన జాతకం కూడా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ఇది నేను అనుభవంలో పరిశీలించి చూచాను.

>>>కొన్ని వాహనాలు కొనిన కొద్ది రోజులలోనే ఏక్సిడెంట్ లో తుక్కు తుక్కు అవుతాయి. ఇలాటి వాహనాలకు బాలారిష్టాలు కనిపిస్తాయి. లేదా లగ్నం మీద షష్ట అష్టమాధిపతుల ప్రబావం ఖచ్చితంగా ఉంటుంది. చ చ ఈ కారు కొన్న తర్వాత అన్నీ అపశకునాలే. ఏక్సిడెంట్లే అని ఎందరో తిట్టుకోటం నాకు తెలుసు.

>>>కొన్ని వాహనాలు కొన్న తరువాత యజమానికి బాగా కలిసి వస్తుంది. ఇలాటి వాహనాలకు రాజయోగాలు ఉంటాయి. లగ్న, పంచమ, నవమాధిపతుల సంబంధం చతుర్ధ దశమాలతో ఖచ్చితంగా ఉంటుంది. అందుకే కొత్త వాహనం కొన్నా కూడా పాత వాహనం అమ్మకుండా ఉంచుకుంటారు. దానికి కారణం సెంటిమెంట్ మరియు అది కొన్న తరువాత కలిసి రావటం. దీని జాతకంలో ఆయుశ్షు కూడా పూర్ణాయుష్షుగా ఉంటుంది.

>>> జాతకంలో ద్వికళత్ర యోగం ఉంటే రెండో భార్య వస్తుంది అని మనకు తెలుసు. అలాగే వాహన జాతకంలో ద్వియజమాని యోగం ఉంటే ఆ వాహనం అమ్ముడు పోయి ఇంకొకరి చేతిలోకి పోతుంది. ఇది ఎప్పుడు జరుగుతుందో ఆయా దశలవల్ల తెలుసుకోవచ్చు.

>>>అల్పాయుష్షు ఉన్న వాహనాలు స్క్రాప్ గా మారి గారేజీలలో పడి ఉంటాయి. అంగచ్చేదన యోగం ఉన్న వాహనాలు పార్ట్ లు గా విడదీయబడి అమ్మబడతాయి. గురుచండాలయోగం గాని, షష్టాష్టమాధిపతుల యోగాలు గాని ఉన్న వాహనాలు కేసుల్లో ఇరుక్కుని పోలీస్ స్టేషన్లలోగాని, స్కూటర్ స్టాండ్ లలో గాని నెలల తరబడి పడి ఉంటాయి. లేదా దొంగ సొమ్ముగా విక్రయించబడతాయి.

>>>విధవాయోగం ఉన్న వాహనాలు వాటి సీ బుక్/ఇతర సర్టిఫికెట్లు పోగొట్టుకుని అనాధలుగా మారుతాయి. మాటిమాటికీ చేతులుమారి అనేక మందిచేత వాడబడతాయి.

>>>శని ప్రబావం అధికంగా ఉన్న వాహనాలు లగేజి కారియర్లుగా, కార్గో కారియర్లుగా వాడబడతాయి. అంతేగాక పెయింట్స్ పోయి, కళావిహీనంగా, పాత వాహనాలలాగా కనిపిస్తుంటాయి. వీల్ ఎలైన్ మెంట్ తప్పి ఊగుతూ నడుస్తుంటాయి.

>>> రాహు/కేతు ప్రభావం అధికంగా ఉన్న వాహనాలు అంబులెన్సులుగా, శవయాత్ర వాహనాలుగా వాడబడతాయి. కిడ్నాప్ వాహనాలుగా, క్రిమినల్స్ వాడే వాహనాలుగా, నేరస్తులను జైలుకు తరిలించే వాహనాలుగా రూపాంతరం చెందుతాయి.

>>>దుర్మరణయోగం ఉన్న వాహనాలు ప్రమాదంలో చిక్కుకుని పూర్తిగా ముక్కలు ముక్కలు అవుతాయి. తమలో ప్రయాణం చేస్తున్న వారిని కూడా అంతం చేస్తాయి.

>>>గురు బలం ఉన్న వాహనాలు రెలిజియస్ పనులకు, దేవాలయాల పనులకు, విగ్రహాల ఊరేగింపులకు వాహనాలుగా, శుభ కార్యాలకు, పెళ్ళిళ్ళకు వాహనాలుగా వాడబడతాయి.

>>>కుజ ప్రభావం ఉన్న వాహనాలు అతి వేగంగా రాష్ గా నడుపబడతాయి. ఎక్కువ ధ్వని కలిగి ఉంటాయి. అదే శని ప్రభావం ఉన్న వాహనాలు స్పీడ్ కంట్రోల్ చేయబడి నిదానంగా స్లో లేన్ లో పోతుంటాయి. వాటి హారన్లు నెమ్మదిగా మోగుతాయి.వీటిలో సీట్లు కంపు కొడుతూ ఉంటాయి. సీట్ కవర్లు మురికిగా ఉంటాయి.

>>>రాహు/శుక్ర ప్రభావం అధికంగా ఉన్న వాహనాలలో తాగుడు మొదలైన వ్యవహారాలు ఇంకా ఇతర అనైతిక కార్యక్రమాలు జరుగుతాయి. విలాసవంతంగా ఉంటాయి. మంచి పెర్ ఫ్యూమ్ వీటిలో వాడబడుతుంది. సువాసనగా ఉంటాయి.

>>> ప్రమాధాలలో కూడా వాహనానికి ఎక్కడ దెబ్బలు తగులుతాయో ఇదే లాజిక్ వల్ల చెప్పవచ్చు. లగ్నానికి, ద్వితీయ, తృతీయాలకు చెడుయోగాలుంటే ముందుభాగంలో సొట్టలు పడటం, దెబ్బలు తగలటం జరుగుతుంది. అదే దశమం నుంచి ద్వాధశం వరకూ ఈ యోగాలుంటే వాహనం వెనుక భాగానికి దెబ్భలు తగులుతాయి.

>>>ఎప్పుడూ తళతళ లాడె వాహనాలకు శుక్రబలం ఎక్కువగా ఉన్నట్లు లెక్క. అదే దుమ్ము కొట్టుకుని ఉంటే శని/రాహువుల ప్రబావం వాటిమీద ఎక్కువగా ఉన్నట్లు లెక్క.

>>>మాటమాటకీ ఎలక్ట్రికల్ రిపేర్లు, బాటరీ రిపేర్లు వస్తుంటే కుజుని దుష్ట ప్రబావం ఉన్నట్లు లెక్క.

రంగులను బట్టి కూడా ఆ వాహనం మీద ఏ గ్రహం ప్రభావం అధికమో చెప్పవచ్చు. గ్రహాల రంగులు మనకు తెలుసు. వాటిని బట్టి ఈ పరిశీలన జరుగుతుంది. జాతకుని త్రికస్థానాధిపతుల రంగులలో వాహనం ఉంటే అతనికి యాక్సిడెంట్ ఖచ్చితంగా జరుగుతుంది.

ఈ విధంగా వ్రాస్తూ పోతే ఇది ఒక పుస్తకం అవుతుంది. ఊరకే ఔట్ లైన్స్ ఇక్కడ ఇచ్చాను. ఇది ఒక నావెల్ మెధడ్. ప్రాక్టికల్ గా కూడా బాగా పనిచేస్తుంది. దీన్ని నేను కొంత కాలం నుంచీ గమనిస్తూ వచ్చి, ఇవన్నీ నిజాలేనని నిర్ధారించుకున్న తర్వాతనే వ్రాస్తున్నాను.
read more " మీ వాహనం యొక్క జాతకం "

26, అక్టోబర్ 2010, మంగళవారం

ఒక చిన్న దీపం చాలు

"ఒక చిన్న దీపం చాలు యుగాల చీకటిని తొలగించడానికి"

మొన్న ఒకరోజు ట్రెయిన్ లో ప్రయాణిస్తున్నాను. సామాన్యంగా ఏసీ బోగీలో ప్రయాణీకులు ఒకరు ఇంకొకరితో మాట్లాడుకోరు. లాప్ టాప్ లో సినిమా చూడటమో, లేక పాటలు వింటూ పడుకోటమో, లేకుంటే ఏదైనా పుస్తకం చదువుకోటమో చేస్తారు. ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం మోటుగా భావిస్తారేమో నాకర్ధం కాదు. కాని ఆరోజు నేను ఎక్కేసరికి అక్కడ కూచున్న వారిమధ్యన మంచి చర్చ జరుగుతున్నది. బహుశా వాళ్ళు స్నేహితులనుకుంటాను.

ఒకాయన జ్యోతిష్యాన్ని సమర్ధిస్తున్నాడు. ఇంకొకాయన విమర్శిస్తున్నాడు. నేను మధ్యలో ఎక్కాను కనుక మౌనంగా నా సీట్లో కూచుని కిటికీ లోంచి చూస్తూ వాళ్ల సంభాషణ వింటున్నాను. చర్చ చాలా సేపు జరిగింది. ఇద్దరూ బాగా చదువుకున్నవాళ్ళే.

సమర్ధిస్తున్న వ్యక్తికి కొన్ని అనుభవాలున్నాయి. వాటి ఆధారంగా అతను జ్యోతిష్యాన్ని నమ్ముతున్నాడు అని నాకు అర్ధమైంది. విమర్శిస్తున్న వ్యక్తికి అనుభవం లేదు. సైన్సు ఒప్పుకోదు కనుక జ్యోతిష్యం బూటకం అని వాదిస్తున్నాడు. ఎక్కడో ఉన్న గ్రహాలు మన మీద ఎలా పని చేస్తాయి మొదలైన వాదనలు నడుస్తున్నాయి.

చాలాసేపు వారి వాదనలు జరిగినా విషయం ఎటూ తేలేటట్లు కనిపించడం లేదు. ఈ లోపల విమర్శిస్తున్న వ్యక్తి చేతులు ఊపుతూ మాట్లాడేటప్పుడు అతని చేతి రేఖలు కొన్ని నాకు కనిపించాయి. మళ్లీ ఒకటి రెండు సార్లు పరీక్షగా చూచి నిర్ధారించుకున్న తరువాత ఇలా అడిగాను.

మీ మాటల్లో కల్పించుకుంటున్నందుకు క్షమించాలి. ఒక చిన్న మాట అడగనా? అన్నాను.

శ్యూర్. శ్యూర్. అన్నారు వాళ్ళు.

మీరు చిన్నప్పుడు మీ ఇంటికి దూరంగా పెరిగారు. అవునా కాదా? జ్యోతిష్య విమర్శకుణ్ణి అడిగాను.

అతను ఆశ్చర్యంగా చూచాడు.

డు యు నో మి? అన్నాడు అనుమానంగా.

ఆఫ్ కోర్స్ ఐ నో యు. బట్ ఐ డోంట్ నో యు ఇన్ ది వే యు సపోజ్. అన్నాను.

అవును. నేను చిన్నప్పుడు హాస్టల్లో ఉండి చదువుకున్నాను. అన్నాడు.

మీరేమనుకోకపోతే ఇంకొకటి అడగనా? అన్నాను.

చెప్పండి.

మీ తల్లిదండ్రులు గొడవపడి విడిపోయారా? మీకు ఇబ్బంది లేకుంటెనే చెప్పండి. అన్నాను.

అతని ముఖంలో బాధ కదలాడింది.

అవును. మా నాన్న మా అమ్మను వదిలేశాడు. ఆమె పల్లెటూళ్ళొ తాతయ్య ఇంట్లోనే ఉండి చనిపోయింది. అన్నాడు విచారంగా.

అతని విషాదగతాన్ని గుర్తు చేసినందుకు నాకు బాధ కలిగింది. కాని తప్పదు మరి. సామాన్యంగా ఇలాటి విమర్శలు చేశేవారి జీవితాలలో బాధామయ విషయాలుంటాయి. ఇలాటి శాస్త్రాలు ఉండికూడా ఎవరూ తమకు సాయం చెయ్యలేదన్న బాధ వాళ్ళను అలా మాట్లాడేందుకు పురికొల్పుతుంది.

ఇప్పుడు జ్యోతిష్యాన్ని నమ్ముతారా? నవ్వుతూ అడిగాను.

అతను నివ్వెరపోయినట్లు ఉండిపోయాడు. చాలాసేపు ఏం మాట్లాడలేదు.

హౌ ఈస్ ఇట్ పాసిబుల్? అడిగాడు

ఇట్ ఈస్ పాసిబుల్. యు హావ్ సీన్ ఇట్. హావెన్ట్ యు? అన్నాను నేను.

అతను తలూపాడు.

కెన్ యు టెల్ మి సంతింగ్ మోర్? అన్నాడు.

ఐ కెన్. బట్ ఐ డోన్ట్ వాన్ట్ టు. అన్నాను నేను.

వాళ్ల వాదన అంతటితో ఆగిపోయింది. ఇద్దరూ నాతో చర్చ మొదలు పెట్టారు. ఈ రెండు విషయాలూ ఎలా చెప్పానో తెలుసుకుందామని వారి ప్రయత్నం. జ్యోతిషం మీదా మార్మిక శాస్త్రాలమీదా మా చర్చ సాగింది.

ఒక గంట ప్రయాణం తర్వాత ముగ్గురం స్నేహితులమయ్యాము. ఈలోపల నేను దిగాల్సిన స్టేషన్ వచ్చింది.

థాంక్ యు సో మచ్ ఫర్ కన్విన్సింగ్ మై ఫ్రెండ్.అన్నాడు రెండో వ్యక్తి. వి విల్ చెరిష్ థిస్ మెమొరబుల్ డే ఫరెవర్. అన్నాడు విమర్శకుడు.
నా ఫోన్ నంబర్ తీసుకుని గుంటూరు స్టేషన్ రాగానే నాకు వీడ్కోలు చెప్పారు.

ఒక చిన్న దీపం చాలు యుగాల చీకటిని తొలగించడానికి.
read more " ఒక చిన్న దీపం చాలు "

24, అక్టోబర్ 2010, ఆదివారం

అంబేద్కర్ జాతకం-కొన్ని ఆలోచనలు












డా|| అంబేద్కర్ స్వాతంత్ర్య పోరాటంలో ముఖ్యమైన నాయకుడేగాక, సమాజంలో అట్టడుగున ఉండి బాధలు పడుతున్న దళితులను ఉద్ధరించిన కారణ జన్ముడని చెప్పవచ్చు. ఆయన జాతకాన్ని విశ్లేషించమని కొందరు మిత్రులు నన్ను చాలా కాలం నుంచి కోరుతున్నారు. నెట్ లో వెతుకగా, ఆయన జననతేది దొరికింది గాని ఆయన జన్మ సమయం దొరకలేదు. ఆయన 14-4-1891 న మధ్యప్రదేశ్ లో మహో అనే ఊళ్ళో జన్మించాడు.ఖచ్చితమైన జనన సమయం దొరకనందున చంద్రలగ్నం నుంచి ఆత్మ కారకుని నుంచీ కొన్ని పాయింట్స్ చూద్దాం.

ఈయన మేష సంక్రాంతి రోజున జన్మించాడు. రవి ఉఛ్ఛ స్థితిలో ఉన్నాడు. గురువు దశాంశలో ఉఛ్చ స్థితిలో ఉన్నాడు. కనుక ఈయన ఒక కారణ జన్ముడని చెప్పవచ్చు.

ఈయన జాతకంలో ముఖ్యమైన యోగం రవి ఉఛ్ఛ స్తితి. ఈ రవి మేషం ఒకటవ డిగ్రీలో ఉండి దాదాపుగా పరాశరుని షోడశ వర్గ చక్రాలన్నింటిలోనూ ఉఛ్చ స్థితిలో ఉన్నాడు. కనుక ఈయన ఉత్తమమైన ఆత్మశక్తి కలవాడని తెలుస్తున్నది. బుదాధిత్య యోగం వల్లనూ, రవి తృతీయాధిపతిగా ఉఛ్చస్థితివల్ల భారత రాజ్యాంగ డ్రాప్టింగ్ కమిటీ చైర్మన్ అయ్యే యోగం కలిగింది. అనేక పుస్తకాలు ఆర్టికిల్సూ ఈ సూర్యభగవానుని యోగం వల్లనే ఆయన వ్రాయగలిగాడు. రవి రాజులకు సూచకుడు. కనుకనే బరొడా మహారాజిచ్చిన స్కాలర్ షిప్ వల్ల కొలంబియా యూనివర్శిటీలో చదువుకునే సహాయం వచ్చింది.

ఈయనకు దశాంశ చక్రములో గురువు ఉఛ్ఛ స్థితిలో ఉన్నాడు. దేవగురువైన బృహస్పతి ఈయన జాతకంలో ఉఛ్ఛ స్థితివల్ల ఉన్నత పదవులు, మంచి మేధాశక్తి, వాక్పటిమ ఈయనకు వచ్చాయి.అయితే ఇదే చక్రంలో శుక్రుని నీచ స్థితివల్ల ఇవన్నీ ఆయనకు అనేక కష్టాల తర్వాతా, ఎదురుదెబ్బల తర్వాతా మాత్రమే లభించాయి.

గాంధీగారి లగ్నాధిపతి అయిన శుక్రుడు ఈయన జాతకంలో దశాంశలో నీచ స్థితిలో ఉండటం చూడవచ్చు. ఈయనకు గాంధీగారంటే ఏమంత గొప్ప అభిప్రాయం ఉండేది కాదు. ఈ విషయాన్ని ఆయన తన ఇంటర్వ్యూ లో కూడా చెప్పాడు. ఈ ఇంటర్వ్యూ యూట్యూబ్ లో కూడా లభిస్తున్నది.

పంచమ దశమాధిపతులైన శుక్ర గురువులు నవమ స్థానంలో కలసి ఒక రాజయోగాన్ని ఈయనకు ఇచ్చారు. కాని వారిద్దరూ శత్రువులైనందున ఆ యోగం సునాయాసంగా అందలేదు. జీవితంలో ఎన్నో కష్టాలు పడిన తర్వాతనే అది లభించింది.

శని వక్ర స్థితివల్ల ఈయన సమాజంలోని బలహీన వర్గాలకు మేలు చేయటానికి జన్మించాడని సూచింపబడుతున్నది. అది సూర్యుని దైన సింహరాశిలో జరగడం వల్ల సమాజంలో ఉన్నత పదవులలో, ఉన్నత స్థాయిలో ఉన్నవారితో పోరాటం వల్ల అది సాధిస్తాడని కూడా సూచింపబడుతున్నది.

ఈయన జాతకం లోని మరొక గొప్ప అనుకూల యోగం రాహు కేతువుల ఉఛ్చ స్థితి. అది ద్వాధశ, షష్ట స్థానములలో ఉండటం వల్ల ఆయనకు శత్రువిజయాన్ని ఈ గ్రహాలు ఇస్తాయని , కాలం చక్కగా అనుకూలిస్తుందని తెలుస్తున్నది.

గాంధీగారి లగ్నమైన తులకు, ఈయన యొక్క రవి సప్తమస్థానంలో ఉంటూ వీరిద్దరి భావాలూ ఎప్పుడూ విభేదించేవని తెలుపుతున్నాడు.

వింశాంశలో తులారాశిలో రాహు, గురు, కేతువులు కలసి ఉన్నారు. వీరి కలయిక బౌద్ధ మతాన్ని సూచిస్తుందని మనకు తెలుసు. కనుకనే ఆయన జీవిత చరమాంకంలో బుద్ధుని అనుయాయిగా మారాడు. అన్ని దేశాలు తిరిగీ, క్రైస్తవంలో బాగా పాండిత్యం ఉండి కూడా, ఆయన మనదేశపు మతమే అయిన బౌద్దాన్ని ప్రేమించటం ఆయనలోని ఒక గొప్ప ఆలోచనాపరుని సూచిస్తున్నదని నా నమ్మకం. కొన్ని కొన్ని కోణాలలో బౌద్దమతం అనేది నేడు మనం ఆచరిస్తున్న హిందూమతం కంటే ఎన్నో రెట్లు ఉన్నతమైనదని నా నమ్మకం మాత్రమే గాక సత్యం కూడా.

ఆత్మ శక్తి కారకుడైన సూర్యుని పరిపూర్ణ అనుగ్రహం ఈయనకు ఉంది. దానికి సూచనగానే, షోడశ వర్గ చక్రాలలోనూ సూర్యుడు ఉఛ్ఛ స్థితిలో దర్శనం ఇస్తాడు. ఇంత గొప్ప యోగం గాంధీగారి జాతకంలో లేదు. అందుకనే గాంధీ గారి జాతకాన్ని ఈయన జాతకాన్ని పక్కపక్కన పెట్టి, ఏ జాతకం ఎవరిదో చెప్పకుండా, ఎవరి జాతకంలో ఆధ్యాత్మిక బలం అధికం అంటే, అంబేద్కర్ జాతకాన్నే చూపవలసి వస్తుంది.

సరియైన జన్మసమయం దొరికితే ఇతర జీవిత వివరాలను కూడా చక్కగా వివరించవచ్చు.
read more " అంబేద్కర్ జాతకం-కొన్ని ఆలోచనలు "