జాతకుని కుండలిలో చతుర్ధ స్థానం వాహనయోగాన్ని సూచిస్తుంది అని మనకు తెలుసు.ఈ రాశి ద్విపాద రాశి అయితే అతనికి టూ వీలర్ యోగం ఉంటుంది. అది చతుష్పాద రాశి అయితే అతనికి ఫోర్ వీలర్ యోగం ఉంటుంది. వాయుతత్వరాశి అయితే వాయుయానం (ఎయిర్ ట్రావెల్) ఎక్కువగా జరుగుతుంది. భూతత్వ రాశి అయితే భూమిమీద ప్రయాణం సాగుతుంది. జలతత్వ రాశి అయినవారికి సముద్ర ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి.
ఇదే లాజిక్ ను ఇంకొంచం ముందుకు పొడిగించి రీసెర్చి చేశాను. గ్రహాలకు మన దేహంలోని వివిధ అవయవాలమీద అధిపత్యం ఉన్నదని మనకు తెలుసు. ఒక వాహనం కూడా మన దేహం వంటిదే. మన దేహంలోని వ్యవస్ఠ లాగే వాహనంలో కూడా ఒక వ్యవస్థ ఉంటుంది. ఎలాగో చూద్దామా?
గుండె, కళ్ళు = ఇంజన్, హెడ్ లైట్= రవి
రక్తం= పెట్రోల్/డీజిల్/ఫ్యూయల్= చంద్రుడు
కండబలం, ఆకలి= కంబషన్ చాంబర్/పిస్టన్/మొబిలిటీ= కుజుడు
బుద్ది, చర్మం= టైర్లు, బాడీ= బుధుడు
జీర్ణశక్తి,బైల్ సెక్రీషన్= ఇంజన్ ఆయిల్= గురువు
శరీరానికి సుఖమైన స్తితి=మెత్తని సీటు, వాహనం రిపేర్ లేకుండా ఉండటం= శుక్రుడు
నరాలు, బాధలు, బద్ధకం=వాహనం లోని వైరింగ్, టైర్లలోని గాలి, తరచూ రిపేర్లు, స్టార్టింగ్ ట్రబుల్= శని
శరీరంలో తరచూ మార్పులు, అర్ధంకాని రోగాలు= మాటమాటకీ రిపేర్లు, వాహనాన్ని కొత్త కొత్త మార్పులు చెయ్యవలసి రావటం, వాహనాలు తరచూ మార్చటం= రాహువు
శరీరంలో హఠాత్తుగా వచ్చే మార్పులు, ప్రమాదాలు= అనుకోకుండా వాహనం ట్రబుల్ ఇవ్వటం, ఏక్సిడేంట్లు= కేతువు
మన వాహనం కొన్న తేదీ, డెలివరీ తీసుకున్న టైమ్ కు జాతకం వెస్తే అది ఆ వాహనం యొక్క జాతకం అవుతుంది. ఆ జాతకాన్ని బట్టి, పైన ఇచ్చిన కారకత్వాలను బట్టి, గ్రహాల యోగాలను బట్టి, ఆ వాహనానికి ఏ సమయంలో రిపేర్ వస్తుంది? ఏ పార్ట్ పాడౌతుంది? ఏక్సిడెంట్ ఎప్పుడు అవుతుంది? దాని ఆయుష్షు ఎంత ఉంది? ఈ వాహనం ఏ కార్యక్రమాలకు వాడబడుతుంది? మొదలైన వివరాలు ముందుగానే తెలుసుకోవచ్చు. వ్యక్తి జాతకానికి వలెనే వాహన జాతకం కూడా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ఇది నేను అనుభవంలో పరిశీలించి చూచాను.
>>>కొన్ని వాహనాలు కొనిన కొద్ది రోజులలోనే ఏక్సిడెంట్ లో తుక్కు తుక్కు అవుతాయి. ఇలాటి వాహనాలకు బాలారిష్టాలు కనిపిస్తాయి. లేదా లగ్నం మీద షష్ట అష్టమాధిపతుల ప్రబావం ఖచ్చితంగా ఉంటుంది. చ చ ఈ కారు కొన్న తర్వాత అన్నీ అపశకునాలే. ఏక్సిడెంట్లే అని ఎందరో తిట్టుకోటం నాకు తెలుసు.
>>>కొన్ని వాహనాలు కొన్న తరువాత యజమానికి బాగా కలిసి వస్తుంది. ఇలాటి వాహనాలకు రాజయోగాలు ఉంటాయి. లగ్న, పంచమ, నవమాధిపతుల సంబంధం చతుర్ధ దశమాలతో ఖచ్చితంగా ఉంటుంది. అందుకే కొత్త వాహనం కొన్నా కూడా పాత వాహనం అమ్మకుండా ఉంచుకుంటారు. దానికి కారణం సెంటిమెంట్ మరియు అది కొన్న తరువాత కలిసి రావటం. దీని జాతకంలో ఆయుశ్షు కూడా పూర్ణాయుష్షుగా ఉంటుంది.
>>> జాతకంలో ద్వికళత్ర యోగం ఉంటే రెండో భార్య వస్తుంది అని మనకు తెలుసు. అలాగే వాహన జాతకంలో ద్వియజమాని యోగం ఉంటే ఆ వాహనం అమ్ముడు పోయి ఇంకొకరి చేతిలోకి పోతుంది. ఇది ఎప్పుడు జరుగుతుందో ఆయా దశలవల్ల తెలుసుకోవచ్చు.
>>>అల్పాయుష్షు ఉన్న వాహనాలు స్క్రాప్ గా మారి గారేజీలలో పడి ఉంటాయి. అంగచ్చేదన యోగం ఉన్న వాహనాలు పార్ట్ లు గా విడదీయబడి అమ్మబడతాయి. గురుచండాలయోగం గాని, షష్టాష్టమాధిపతుల యోగాలు గాని ఉన్న వాహనాలు కేసుల్లో ఇరుక్కుని పోలీస్ స్టేషన్లలోగాని, స్కూటర్ స్టాండ్ లలో గాని నెలల తరబడి పడి ఉంటాయి. లేదా దొంగ సొమ్ముగా విక్రయించబడతాయి.
>>>విధవాయోగం ఉన్న వాహనాలు వాటి సీ బుక్/ఇతర సర్టిఫికెట్లు పోగొట్టుకుని అనాధలుగా మారుతాయి. మాటిమాటికీ చేతులుమారి అనేక మందిచేత వాడబడతాయి.
>>>శని ప్రబావం అధికంగా ఉన్న వాహనాలు లగేజి కారియర్లుగా, కార్గో కారియర్లుగా వాడబడతాయి. అంతేగాక పెయింట్స్ పోయి, కళావిహీనంగా, పాత వాహనాలలాగా కనిపిస్తుంటాయి. వీల్ ఎలైన్ మెంట్ తప్పి ఊగుతూ నడుస్తుంటాయి.
>>> రాహు/కేతు ప్రభావం అధికంగా ఉన్న వాహనాలు అంబులెన్సులుగా, శవయాత్ర వాహనాలుగా వాడబడతాయి. కిడ్నాప్ వాహనాలుగా, క్రిమినల్స్ వాడే వాహనాలుగా, నేరస్తులను జైలుకు తరిలించే వాహనాలుగా రూపాంతరం చెందుతాయి.
>>>దుర్మరణయోగం ఉన్న వాహనాలు ప్రమాదంలో చిక్కుకుని పూర్తిగా ముక్కలు ముక్కలు అవుతాయి. తమలో ప్రయాణం చేస్తున్న వారిని కూడా అంతం చేస్తాయి.
>>>గురు బలం ఉన్న వాహనాలు రెలిజియస్ పనులకు, దేవాలయాల పనులకు, విగ్రహాల ఊరేగింపులకు వాహనాలుగా, శుభ కార్యాలకు, పెళ్ళిళ్ళకు వాహనాలుగా వాడబడతాయి.
>>>కుజ ప్రభావం ఉన్న వాహనాలు అతి వేగంగా రాష్ గా నడుపబడతాయి. ఎక్కువ ధ్వని కలిగి ఉంటాయి. అదే శని ప్రభావం ఉన్న వాహనాలు స్పీడ్ కంట్రోల్ చేయబడి నిదానంగా స్లో లేన్ లో పోతుంటాయి. వాటి హారన్లు నెమ్మదిగా మోగుతాయి.వీటిలో సీట్లు కంపు కొడుతూ ఉంటాయి. సీట్ కవర్లు మురికిగా ఉంటాయి.
>>>రాహు/శుక్ర ప్రభావం అధికంగా ఉన్న వాహనాలలో తాగుడు మొదలైన వ్యవహారాలు ఇంకా ఇతర అనైతిక కార్యక్రమాలు జరుగుతాయి. విలాసవంతంగా ఉంటాయి. మంచి పెర్ ఫ్యూమ్ వీటిలో వాడబడుతుంది. సువాసనగా ఉంటాయి.
>>> ప్రమాధాలలో కూడా వాహనానికి ఎక్కడ దెబ్బలు తగులుతాయో ఇదే లాజిక్ వల్ల చెప్పవచ్చు. లగ్నానికి, ద్వితీయ, తృతీయాలకు చెడుయోగాలుంటే ముందుభాగంలో సొట్టలు పడటం, దెబ్బలు తగలటం జరుగుతుంది. అదే దశమం నుంచి ద్వాధశం వరకూ ఈ యోగాలుంటే వాహనం వెనుక భాగానికి దెబ్భలు తగులుతాయి.
>>>ఎప్పుడూ తళతళ లాడె వాహనాలకు శుక్రబలం ఎక్కువగా ఉన్నట్లు లెక్క. అదే దుమ్ము కొట్టుకుని ఉంటే శని/రాహువుల ప్రబావం వాటిమీద ఎక్కువగా ఉన్నట్లు లెక్క.
>>>మాటమాటకీ ఎలక్ట్రికల్ రిపేర్లు, బాటరీ రిపేర్లు వస్తుంటే కుజుని దుష్ట ప్రబావం ఉన్నట్లు లెక్క.
రంగులను బట్టి కూడా ఆ వాహనం మీద ఏ గ్రహం ప్రభావం అధికమో చెప్పవచ్చు. గ్రహాల రంగులు మనకు తెలుసు. వాటిని బట్టి ఈ పరిశీలన జరుగుతుంది. జాతకుని త్రికస్థానాధిపతుల రంగులలో వాహనం ఉంటే అతనికి యాక్సిడెంట్ ఖచ్చితంగా జరుగుతుంది.
ఈ విధంగా వ్రాస్తూ పోతే ఇది ఒక పుస్తకం అవుతుంది. ఊరకే ఔట్ లైన్స్ ఇక్కడ ఇచ్చాను. ఇది ఒక నావెల్ మెధడ్. ప్రాక్టికల్ గా కూడా బాగా పనిచేస్తుంది. దీన్ని నేను కొంత కాలం నుంచీ గమనిస్తూ వచ్చి, ఇవన్నీ నిజాలేనని నిర్ధారించుకున్న తర్వాతనే వ్రాస్తున్నాను.