అన్ని చారిత్రిక సినిమాల లాగే దీన్నీ కొంత యదార్ధమూ కొంత కల్పనా కలగలిపి తీశారు. అలా తియ్యకపోతే అది డాక్యుమెంటరీ అయ్యే ప్రమాదం ఉంది కదామరి. సినిమా అన్నాక ప్రజలకు నచ్చే విషయాలు కొన్ని చేర్చాల్సి వస్తుంది. సెంటిమెంట్ కూడా చేర్చాల్సి వస్తుంది. 1937 లో జపాన్ తమను ఓడించిన సంఘటన చైనా వారికి ఒక పెద్ద సెంటిమెంట్. ఆ కాలంలో జపాన్ కరాతే వీరులకు చైనా కుంగ్ ఫూ మాస్టర్లకూ మధ్య జరిగిన చాలెంజ్ ఫైట్స్ ఆధారంగా అనేక సినిమాలొచ్చాయి. దీంట్లో కూడా అదే ధీమ్ ను వాడుకున్నారు. జపనీస్ బ్రూటాలిటీని హైలైట్ చేసి చూపారు. కాకపోతే ఇప్ మాన్ జీవితానికి ఈ సెంటిమెంట్ కూ లంకె పెట్టి కధ నడిపారు.
నిజమైన మార్షల్ ఆర్ట్స్ మాస్టర్లకు గొప్ప కల్చర్ ఉంటుంది.నిజాయితీ కలిగిన ప్రవర్తన, ఆత్మగౌరవం, హుందాతనం, ధర్మాన్ని అనుసరించే జీవితం ఇవన్నీ వారికుంటాయి. ఇదే కోణాన్ని మాస్టర్ ఇప్ మాన్ జీవితంలో హైలైట్ చేసి చూపించారు. ఉదాత్తమైన ఆయన వ్యక్తిత్వాన్ని చూపటంలో దర్శకుడు కృతకృత్యుడైనాడు. అయితే మాస్టర్ ఇప్ మాన్ కు నల్లమందు అలవాటుందని ప్రచారం ఉంది. దాన్ని మాత్రం చూపించలేదు. బాగుండదు కదా.
మార్షల్ ఆర్ట్స్ కొరియోగ్రఫీ బాగా చేశారు. వింగ్చున్ మాస్టర్ అయిన ఇప్ మాన్ తో ఇతర కుంగ్ఫూ స్టైల్స్ అయిన నార్తరన్ షావోలిన్ స్టైల్, డ్రాగన్ బాక్సింగ్, చొయ్-లే-ఫట్ మొదలైన వివిధ రకాల ప్రత్యర్ది మాస్టర్ల ఫైట్స్ బాగా కొరియోగ్రఫీ చేశారు. ఈ రకరకాల స్టైల్స్ లోని తేడాలు తెలిస్తే ఆ ఫైట్స్ ను బాగా ఎంజాయ్ చెయ్యవచ్చు. ఈ ఫైట్స్ లో భాగంగా ఆయాస్టైల్స్ లోని ప్రత్యేక టెక్నిక్స్ ను సమర్ధవంతంగా చూపించగలిగారు. చివరి ఫైట్ లో జపనీస్ కరాతే కూ, వింగ్ చున్ కూ ఉన్న తేడాను బాగా చూపించారు.
ఉదాహరణకు-- వింగ్ చున్ కుంగ్ ఫూ ప్రత్యేకతలైన వుడెన్ డమ్మీ టెక్నిక్స్, ట్రాపింగ్ హాండ్స్, స్విచ్చింగ్ హాండ్స్, హాంటింగ్ హాండ్స్, ఎకానమీ ఆఫ్ మూమెంట్, సెంటర్ లైన్ పంచింగ్, లా ఆఫ్ ఇంటర్సెప్షన్, లాంగ్ పోల్ రొటీన్ మొదలైన అన్నింటినీ ఫైట్స్ లో ఇమిడ్చి చూపగలిగారు. అలాగే నార్దరన్ కుంగ్ ఫూ టెక్నిక్స్ లో విండ్ మిల్ పంచెస్, సర్కులర్ పంచెస్, హైకిక్స్, లెగ్ స్వీపింగ్ టెక్నిక్స్, వాటర్ ఫాల్ పంచింగ్ టెక్నిక్, స్పిన్ కిక్స్, విరల్ విండ్ కిక్స్ మొదలైన వాటిని బాగా కొరియోగ్రాఫ్ చెయ్యగలిగారు. అయితే మామూలు ప్రేక్షకుడికి ఇవన్నీ అర్ధం కావు. మార్షల్ ఆర్ట్స్ లో లోతైన టెక్నికల్ నాలెడ్జి ఉన్నవారు అయితే బాగా ఎంజాయ్ చెయ్యగలుగుతారు.
డానీ యెన్ చాలా హుందాగా మాస్టర్ ఇప్ మాన్ పాత్రలో ఒదిగిపోయాడు. ఆ పాత్రకు ఆయన చాలా న్యాయం చేశాడు. అనవసర డైలాగ్స్ లేకుండా, చక్కని సన్నివేశాలు పెట్టి, సెంటిమెంట్ కలగలిపి చక్కటి సినిమాను తియ్యగలిగారు. ఒక ధీరోదాత్తుడైన కుంగ్ ఫూ మాస్టర్ గా డానీయన్ చాలా బాగా నటించాడు.
నిజజీవితంలో మాస్టర్ ఇప్-మాన్ ఒక పోలీస్ ఆఫీసర్. కాని సినిమాలో ఆయనను ఒక మాస్టర్ గా మాత్రమే చూపించారు. సినిమాకు కావలసిన మార్పులు చేర్పులు చేసి ఆయన జీవితాన్ని మార్చి చూపారు. జపనీస్ వారిని మాత్రం విలన్లుగా నరరూపరాక్షసులుగా చూపించారు. కమ్యూనిష్టులు చైనాను ఆక్రమించిన తర్వాత యిప్-మాన్ అక్కడ ఉండలేక హాంగ్ కాంగ్ కు వెళ్ళి స్థిరపడ్డాడు. ఆ విషయాన్ని మాత్రం సూచన ప్రాయంగా చెప్పి వదిలేశారు. కమ్యూనిశ్ట్ రివల్యూషన్ని ఏమన్నా కామెంట్ చేస్తే మళ్లీ చైనా ప్రభుత్వానికి కోపం వస్తుంది కదా. ఎంతైనా సినిమాకదా ఆడాలి. నాలుగు డబ్బులు రావాలి.
సినిమా చూచి వస్తుంటే మాకొక సందేహం వచ్చింది. సైనో-జపనీస్ వార్ లో జపాన్ చైనాను ఆక్రమించింది గాబట్టి ఈసినిమాలో జపనీస్ ను విలన్లుగా చూపారు. రేపు టిబెట్ వాళ్ళు ఏదైనా సినిమా తీస్తే దాంట్లో చైనావాళ్లను పరమ కిరాతకులుగా రాక్షసులుగా చూపించక మానరు. అని నవ్వొచ్చింది.
హాల్లో ఆడియన్స్ చాలా పలచగా ఉన్నారు. చవకబారు తెలుగు సినిమాలు అలవాటుపడ్డ నేటి ఆంధ్రాజనానికి ఇలాటి క్లాసిక్స్ నచ్చవు. మన సినిమాలు కధాపరంగా, యాక్షన్ పరంగా, హాలీఉడ్ స్ఠాయిని అందుకోలేక పోతే మానె, కనీసం ఈ స్థాయిని ఎప్పుడు అందుకుంటాయో కదా అని బాధ కలిగింది.
ఈ సందర్భంగా ఒక సంగతి గుర్తొచ్చింది. 1992 ప్రాంతాల్లో "సైలెన్స్ఆఫ్ ది లాంబ్స్" అని ఒక సినిమా విజయవాడ లీలామహల్లో చూశాను. చాలా మంచి సినిమా. చాలా అవార్డులు గెలుచుకుంది. కానీ విజయవాడలో ఒకే ఒక్కరోజు ఆడింది. మన జనాలకు అలాటి సినిమాలు ఎక్కవు కదా అని అప్పట్లో అనుకుని నవ్వుకున్నాం. ఇరవై ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడూ అదే మాట అనుకోవలసి వచ్చింది. అప్పటికీ ఇప్పటికీ మనవాళ్ల టేస్ట్ ఇంకా చాలా చీప్ గా మారిందని -దిగజారిందని- నేడు వస్తున్న సినిమాలు చూస్తే అనిపిస్తుంది.
మొత్తం మీద నేటి మన తెలుగు సినిమాలు చవకబారువని ఒప్పుకోక తప్పదు. తెలుగు ప్రేక్షకులకు మంచి టేస్టూ, ఉన్నతమైన కల్చరూ లేదనీ ఒప్పుకోక తప్పదు. చైనా వాళ్ళు హాలీఉడ్ స్థాయిలో- కధా, స్క్రీన్ ప్లే, ఎడిటింగూ, నటనా, డైలాగ్సూ కలిపి వెకిలితనం ఏమాత్రం లేని సినిమాలు తియ్యగలుగుతున్నారు. మనం మాత్రం వెకిలి పాటలు, వెర్రి డాన్సులు, డోకు హాస్యం, హింసా, కాపీ కధలూ, కాపీ ఫైట్లతో నిండిన అర్ధం పర్ధం లేని సినిమాలు -తీస్తూ- చూస్తూ- పరమ చీప్ టేస్ట్ లో పడి ఉన్నాం. ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుందో మాత్రం తెలియదు.