ఆయన గతించి నూరేళ్ళు దాటింది. కాని ఇప్పటికీ ఆయన్ను లోకం సరిగ్గా అర్ధం చేసుకోలేకపోతున్నది. ఆయన్ను ఒక సంఘ సంస్కర్తగా టీవీ చానళ్ళూ, పేపర్లూ ప్రచారం చేస్తున్నాయి. యువతకు ధైర్యాన్ని నూరిపోసినవానిగానూ, సంఘాన్ని సంస్కరించాలనుకున్నవానిగానూ ఆయన్ను చూపిస్తూ, పాజిటివ్ థింకింగ్ క్లాసుల్లోనూ, మేనేజిమెంట్ క్లాసుల్లోనూ ఆయన సూక్తులు కొన్నింటిని వాడుకుంటున్నారు. మంచిదే. కాని ఆయన గురించి అదే పూర్తి అవగాహన మాత్రం కాదు.
బుద్ధుడు కూడా ప్రాధమికంగా ఒక సంస్కర్తగా ప్రజల్లో ప్రచారం జరిగింది. వేమన గురించి కూడా అలాగే ప్రచారం జరిగింది. వివేకానందుని గురించి కూడా నేడు అదే ప్రచారం జరుగుతున్నది. కాని సత్యం అదికాదు. అసలు మన మీడియాకు నిజాలు వ్రాయడం, చెప్పటం చేతకాదేమో అన్న నా అభిప్రాయం రోజురోజుకూ బలపడుతున్నది. ఆ మహనీయులు పుట్టిన దేశంలోనే వారిగురించి సరైన అవగాహన ఉన్నవారు అరుదుగా కనపడుతూ సమాజం అంటే అసహ్యాన్ని కలిగిస్తున్నారు.
వివేకానందుడు ప్రాధమికంగా ఒక దైవప్రేమికుడు. ఒక జ్ఞాని. ఒక మహర్షి. అంతేగాక ఆయన దర్శించిన పరిపూర్ణత్వాన్ని సమాజంలో చూడాలని తపించిన ఒక స్వాప్నికుడు. తాను పొందిన జ్ఞానాన్ని అజ్ఞానంతో ఆవరింపబడిన లోకానికి అందించాలని శ్రమించిన బోధిసత్త్వుడు. హిమాలయ గుహల్లో ఉన్న యోగాన్ని సమాజ జీవనానికి ఆవశ్యకం అయిన కర్మతో ఎలా మిళితం చెయ్యాలో చూపించి, కర్మను యోగంగా మార్చి చూపిన యోగిపుంగవుడు. ఆధ్యాత్మికవాదులకు సమాజం పట్ల ఉన్న బాధ్యతను వేలెత్తి చూపిన మహాప్రవక్త.
ఆయన తర్వాత ఇప్పటివరకూ వచ్చిన ఏ మహాపురుషుడైనా సరే ఆయన చూపిన బాటనే నడుస్తున్నారు. నడవక తప్పదు. వారు ఏ గురుపరంపర వారైనా సరే, ఏ మహనీయుని భక్తులమని చెప్పుకునేవారైనా సరే, ఆయన మార్గాన్నే అనుసరించక తప్పదు. వారు వివేకానందుని పేరు చెప్పుకున్నా చెప్పుకోకపోయినా, "కర్మను సేవాభావంతో పరమేశ్వరార్చనగా చెయ్యి" అన్న వివేకానంద వాణిని ఇప్పటికీ ఎప్పటికీ అనుసరించక తప్పదు.
సేవాభావం అన్న ఈ కోణం వివేకానందుని అనేక బోధనలలో ఒకటి మాత్రమే. మిగిలిన కోణాలను అర్ధం చేసుకునే ప్రయత్నం ఎవ్వరూ సరిగా చెయ్యటం లేదు. ఆయన్ని మాత్రం వక్రదృష్టితో చూపిస్తున్నారు. రానురాను వివేకానందుడంటే హిందువులలో తీవ్రవాదులు ఆరాధించే ఒక సంఘ సంస్కర్త అన్న భావం ప్రచారం కాబడుతున్నది. ఇది పూర్తిగా తప్పు భావన.
వివేకానందుడితో సమానమైన ప్రతిభావంతుడైన ప్రవక్త బుద్దుని తర్వాత పుట్టలేదు అని నేను ఘంటాపధంగా చెప్పగలను. "ఐదువేల సంవత్సరాలకు సరిపడా సందేశాన్ని లోకానికి ఇచ్చివెళుతున్నాను" అని ఆయనే చెప్పాడు. కాని ఆయన్ని చదివేవారూ అర్ధం చేసుకునేవారూ మాత్రం కనపడటం లేదు. మన మహాపురుషులను పటాలు కట్టి పూజించే మనం వారు చెప్పినవి అర్ధం చేసుకునే ప్రయత్నం మాత్రం చెయ్యం. అదే మన దేశపు విచిత్ర లక్షణాలలో ఒకటి.
మా సంస్కృతి గొప్పది, మా మతం గొప్పది, మా ప్రవక్తలు, మహాపురుషులూ గొప్పవారు అని చెప్పుకునే మనం వారిని చదవాలనీ అర్ధం చేసుకోవాలనీ ప్రయత్నం మాత్రం చెయ్యం. వాళ్ళు చెప్పినవి ఆచరించటం ఇక మనవల్ల ఏమవుతుంది?
వివేకానందుడు ఒక వైరాగ్యమూర్తి. ఒక విశ్వప్రేమికుడు. బ్రహ్మానుభూతిని పొందిన ఒక జ్ఞాని. జీవన్మరణపు అంచులు దాటిన ఒక యోగి. ప్రపంచానికి మార్గం చూపడానికి అప్పుడప్పుడూ వచ్చిపోయే ఒక వెలుగు. లోకపు కష్టాలతో మమేకం చెంది అవి తీర్చడానికి తపించిన మృదుహృదయుడు. వెరసి ఒక మహాప్రవక్త. అటువంటి మహనీయుని జన్మదినం నాడైనా ఆయన చెప్పినది ఏమిటో తెలుసుకోవాలని ప్రయత్నం చేద్దామా? లేక ప్రసార మాధ్యమాలు చూపుతున్నదే నిజం అన్న భ్రమలోనే ఉందామా?