“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

23, ఫిబ్రవరి 2011, బుధవారం

భారతీయ జ్యోతిష్యంలో ప్రత్యేకతలు

భారతీయజ్యోతిష్యమూ పాశ్చాత్యజ్యోతిష్యమూ ఒకదానికొకటి భిన్నమైనవి. రెండింటి ముఖ్యోద్దేశాలు ఒకటే అయినప్పటికీ వాటి విధానాలు, పద్దతులూ వేరు వేరు. రెండింటితోనూ భవిష్యదర్శనం చెయ్యవచ్చు. కాని పాశ్చాత్యులకు అందుబాటులోలేని కొన్ని ముఖ్యమైనవిధానాలు మన జ్యోతిష్యశాస్త్రానికి సొంతం గా ఉన్నాయి. అవేమిటంటే-- గ్రహ యోగాలు, దశలు మరియు అంశ చక్రాలు.

గ్రహ యోగాలు

గ్రహ యోగాలంటే కొన్ని విచిత్రమైన గ్రహ స్తితులు. వీటినే కాంబినేషన్స్ అని ఇంగ్లీషులో అన్నారు. అనేక వేల జాతకచక్రాలను పరిశీంచి వీటిని తయారు చేసారేమో అని అనిపిస్తుంది. జాతకంలో కొన్నికొన్ని గ్రహయోగాలున్నపుడు కొన్నిసంఘటనలు తప్పకుండా రిపీట్ అవుతుండటం మనం చూడవచ్చు. ఆయా యోగాలను క్రోడీకరించి, వర్గీకరించి,విభజించి మనకు అందించారు ప్రాచీన జ్యోతిష్య శాస్త్రవేత్తలు. వీటిలో స్థూలమైన పంచమహాపురుష యోగాల నుంచి, వివాదాత్మకమైన కాలసర్పయోగం వరకూ కొన్నివందలయోగాలు మనకు కనిపిస్తాయి. జాతకం చూడటం తోనే ఆయాయోగాలను గుర్తించగలగడం ఒక కళ. ఇది అభ్యాసంమీద సులువుగా అలవడుతుంది. తద్వారా జాతక పరిశీలన సులభం అవుతుంది.

దశలు

విధానం కూడా మన జ్యోతిష్యానికి ప్రత్యేకమైనదే. ఇందులో మళ్ళీ గ్రహదశలు, రాశిదశలు అని రెండువిధాలున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే జననకాల చంద్రుని లేక రాశులను ఆ చక్రానికే ప్రత్యేకమైన ఒకపద్దతిలో ముందుకు నడిపించటమే దశావిధానం. కనీసం ముప్పై రకాలైన దశలు ప్రస్తుతం మనకు నిర్ధారణగా కనిపిస్తున్నాయి. ఇవిగాక మన నిర్లక్ష్యంతో లుప్తమైపొయిన దశావిదానాలు ఎన్నో ఉన్నాయి. "టైమింగ్ ఆఫ్ ఈవెంట్స్" ను తెలుసుకోవడానికి దశావిధానం ఉపయోగపడుతుంది. అంతేగాక ఆయాదశలలో ఉపచారాలు శాంతులు చేసుకోవడానికి, చెడు ఫలితాలను మార్చుకోవడానికీ ఆయా నక్షత్ర, రాశినాధులద్వారా మార్గం కనిపిస్తుంది.

అంశ చక్రాలు

జీవితంలోని ఒక్కొక్క విషయాన్ని భూతద్దం లో పట్టి చూపేవే అంశ చక్రాలు. ఆయా రంగాలలో సునిశిత విశ్లేషణకు ఇవి ఉపకరిస్తాయి. రాశిచక్రం ద్వారా మేక్రో ఎనాలిసిస్ వీలయితే అంశచక్రాల ద్వారా మైక్రోఎనాలిసిస్ చెయ్యడం సాధ్యపడుతుంది. రాశి చక్రాన్నీ ఒక్కొక్క అంశ చక్రాన్నీ పక్కపక్కనే పెట్టి సునిశిత పరిశీలన చెయ్యటం ద్వారా జీవితం యొక్క మొత్తం స్కోప్ ను మాత్రమె గాక ఆయారంగాలలో లోతైనవిశ్లేషణ ద్వారా మొత్తం వివరాలు తెలుసుకోవచ్చు. ఉదాహరణకు D-6 ద్వారా ఆరోగ్యపరిస్తితిని, రోగ సంబంధ విషయాలను తెలుసుకోవచ్చు. D-10 ద్వారా వృత్తి, ఉద్యోగం మొదలైన విషయాలుతెలుసుకోవచ్చు. ఇలా జీవితంలోని ప్రతి అంశాన్నీ తెలుసుకోవడానికి ఆయా ప్రత్యెక అంశచక్రాలను పరిశీలించవలసి వస్తుంది. కొన్ని నిముషాల తేడాతో పుట్టిన కవలపిల్లలకు రాశిచక్రం ఒకటే అయినప్పటికీ సూక్ష్మస్థాయిలో అంశచక్రాలు భిన్నంగాఉంటాయి. అందుకే వారిజీవితాలు కూడా తేడాగా ఉండవచ్చు.

చెప్పుకోటానికి సులువుగా కనిపించినప్పటికీ వీటిని విశ్లేషణ చెయ్యటం చాలా కష్టమైనపని. ఒక మనిషిని సంపూర్ణం గాఅర్ధం చేసుకోవాలంటే ఎంత కష్ట పడాలో ఒక జాతకాన్ని ఆమూలాగ్రం చదవాలంటే కూడా అంతే కష్టపడాలి. దానికి కనీసం కొన్నిరోజులు పడుతుంది. ముందుగా జాతకసమయాన్ని రెక్టిఫై చెయ్యవలసి ఉంటుంది. జాతకం చెప్పటం వెనుక ఇంత తతంగం ఉందని తెలియనివారు "నా పూర్తి జాతకాన్ని చెప్పండి" అని అడుగుతుంటారు. విధమైన రిక్వెస్ట్ తో నాకు కొన్ని వందల ఈ-మెయిల్స్ వస్తుంటాయి. వారందరికీ నేను చెప్పేదేమంటే-- పూర్తి జాతకాన్ని ఎనలైజ్ చెయ్యాలంటే ఒక్కొక్క జాతకానికి కనీసం ఒక వారం పడుతుంది. అది ఆషామాషీగా అయ్యేపని కాదు. ఒకవేళ ఎవరైనా అలా చెప్పగలం అంటే అది ఉత్త మాయ మాత్రమే.

భారతీయ జ్యోతిష్య విజ్ఞానం ఇలా ఎన్నో విధాలైన ప్రత్యెక పద్దతులను మనకు అందించింది. వాటిని ఉపయోగించుకొని వెలుగుబాటలో చక్కగా నడుస్తామో లేక మిడిమిడిజ్ఞానంతో అహంకరించి చీకటిలోనే తడుముకుంటూ నడుస్తామో మన ఇష్టంమీద ఆధారపడి ఉంటుంది.