“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

25, ఫిబ్రవరి 2011, శుక్రవారం

బహుముఖ ప్రజ్ఞా శాలి- భానుమతీ రామకృష్ణ


"మల్టీ ఫేసేటేడ్ క్వీన్ అఫ్ ఇండియన్ సినెమా" అన్న ఒక్క మాటలో భానుమతి గారికి చక్కగా నిర్వచనం ఇచ్చారు ఎవరోగాని. ఒక వ్యక్తిలో సంగీతం, సాహిత్యం, నటనా వైదుష్యం,కార్య నిర్వహణా దక్షత, దర్శకత్వ ప్రతిభా, ఎడిటింగ్ నైపుణ్యం, పాటలు వ్రాయడం, సంగీతం సమకూర్చడం, స్టూడియో నిర్వహణా, మంచితనం, మానవత్వం, ధైర్యం --ఇలా అన్నన్ని సుగుణాలు ఎలావచ్చాయో అని ఆలోచిస్తే అది భగవద్దత్తం అని అనిపించక మానదు.

ఆమెకు జ్యోతిష్య, సాముద్రిక శాస్త్రాలలో మంచి అనుభవం ఉందన్న సంగతి బయటి వారికి కొద్ది మందికే తెలుసు.1950 ప్రాంతాల్లోనే ఆమె నాడీ గ్రందాల మీద పరిశోధన చేసారంటే ఈనాడు చాలామంది నమ్మలేరు. కానీ అది సత్యం. ఎమ్జీ ఆర్ కు రాజపరిపాలనాయోగం ఉందని ఆయన ముఖ్యమంత్రి కావడానికి ఇరవై ఏళ్ల ముందే షూటింగ్ విరామ సమయంలో చేతిరేఖలు చూచి చెప్పిన సాముద్రిక వేత్త భానుమతి గారు. సంగతి ఆమె మరచి పోయినా, తాను ముఖ్యమంత్రి అయినసమయంలో ఎమ్జీ ఆర్ ఆమెకు గుర్తు చేసారట.

అంతేకాదు ఆమె శ్రీ విద్యోపాసకురాలనీ బాలా, నవాక్షరీ మంత్రాలను శృంగేరి శంకరాచార్యులూ మహా తపస్వులూ అయిన అభినవవిద్యాతీర్థస్వామివారి నుంచి ఉపదేశం పొంది నిత్యమూ లలితా సహస్ర నామాలతో శ్రీ చక్రాన్ని అర్చించేవారనీ , సప్తశతీ పారాయణ చేసేవారనీ కొద్దిమందికే తెలుసు. అటువంటి ఉపాసకురాలికి జ్యోతిష్య జ్ఞానం పట్టుబడటం వింతేముంది ?

అన్నింటినీ మించి, నీతీనియమాలు ఎక్కడా లేని సినిమారంగంలో, నిప్పులాంటి వ్యక్తిత్వంతో లేత్తుకుని హుందాగా నిజాయితీగా బ్రతికిన ఆణిముత్యాల్లో ఆమెది అగ్రస్థానం అని చెప్పవచ్చు.

ఇన్ని విశిష్టలక్షణాలున్న భానుమతిగారి జాతకం తప్పకుండ విశిష్టమైనదే అయ్యుంటుంది. చూద్దామంటే ఆమె జననతేది దొరుకుతున్నది గాని జనన సమయం ఎక్కడా దొరకటం లేదు. ఎవరికైనా వారి జనన వివరాలు తెలిస్తే నాకు మెయిల్ చేయ్యండి. ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి జీవితాన్ని జ్యోతిష్య పరంగా అధ్యయనం చెయ్యడానికి వీలవుతుంది.