నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

9, ఏప్రిల్ 2011, శనివారం

అవినీతి వ్యతిరేక ఉద్యమం

ఇండియాలో అవినీతి వ్యతిరేక ఉద్యమమా? ట్రాష్. ఇట్ విల్ నెవర్ సక్సీడ్.

ఒక విదేశీమిత్రుడు నిన్న చాట్ లో నాతో అన్నమాటలివి. విదేశీయులకు మనదేశ వ్యవస్థ మీద ఎంత గొప్ప అభిప్రాయం ఉందో ఈ మాట కళ్ళకు కడుతోంది. ఒకరకంగా అది నిజమేనేమో అనిపిస్తున్నది. మన దేశంలో అవినీతి అన్ని స్థాయిలలో పాతుకుపోయింది. ప్రస్తుత సమాజంలో "నీతి"- "అవినీతి" అన్న పదాలకు అర్ధాలు లేవు. ఏదో విధంగా పని అయితే చాలు. అడ్డగోలుగా సంపాదిస్తే చాలు. అలాటివాడే మొనగాడు అన్న భావన సమాజంలో జీర్ణించుకుపోయింది. ఈ భావనకు చదువురానివాళ్ళూ, చదువొచ్చినవాళ్ళూ అన్న తేడా లేదు. వ్యాపారులూ, ఉద్యోగులూ అన్న భేదం లేదు. సామాన్యులూ, ధనికులూ అన్న విఛక్షణ లేదు. అంతలా సమాజంలోని అన్ని స్థాయిలలోనూ అనివీతి విస్తరించింది.

పాలకులు నీతిమంతులై ఉండాలి. ధర్మపరంగా ప్రజలను పాలించాలి. ఇది ప్రాచీన రాజ్యాలకాలపు నియమం. లేదా కనీసం ప్రజలన్నా నీతిమంతులై ఉండాలి. ఇక నవీన ప్రజాస్వామ్య దేశాలలో ప్రజలే పాలకులు కనుక ప్రజలకు అక్షరాస్యతా, సామాజిక స్పృహా, దేశ భక్తీ, నిజాయితీలు ఉండాలి. మనదేశంలో ఇవేవీ లేవు. ఎక్కడో ఒక "అన్నా హజారే" లాటివాళ్ళు గళం విప్ఫుతూ అప్పుడపుడూ కనిపిస్తారు. వారికి వత్తాసుగా ఒక అయిదుగురో పదిమందో ఉంటారు. సముద్రమంత నీటిలో పది పాలచుక్కలుంటే సరిపోతుందా? ఆ నీటి ఉప్పదనం పోతుందా? అసంభవం. అన్నా హజారే ఉద్యమానికి అవినీతి పార్టీలూ, నాయకులూ, బడా వ్యాపారవేత్తలూ, అధికారులూ కూడా లోపల్లోపల ఏడుస్తూ బయటకు తెచ్చి పెట్టుకున్న నవ్వు నవ్వుతూ మద్దతు పలకడం వింతల్లో వింత. ఆయనకు వత్తాసుగా ప్రతిజ్ఝలు చేస్తున్నవారంతా నిజంగా అవినీతివ్యతిరేకులే అనుకోవడం, చిరంజీవి సభలకు వచ్చిన జనమంతా ఓట్లేస్తారనుకున్నట్లు ఉంటుంది.

ఏదైనా విపత్తు ఎదురైనప్పుడు నాయకులు టీవీల్లో కొచ్చి " మీరంతా త్యాగాలు చెయ్యడానికి సిద్ధంగా ఉండాలి" అని ప్రజలకు గొప్ప సందేశం ఇస్తూ ఉంటారు. దీన్ని మించిన జోక్ ఇంకోటి ఉండదు. ప్రజలేమో త్యాగాలు చేస్తూ ఉండాలి. అధికారులూ, నాయకులూ ప్రజాధనంతో జల్సాలు చేస్తూ ఉంటారు. త్యాగాలు ప్రజల వంతు. భోగాలు నాయకుల వంతు. చాలా బాగుంది. అందుకే ప్రజలు కూడా బాగా గారడీ నేర్చుకున్నారు. యధారాజా తధాప్రజా అని ఊరకే అనలేదు. నేడు ప్రజలలో ఎవరూ త్యాగాలు చెయ్యడానికి సిద్ధంగా లేరు. ఆదర్శాలకు పోయి అలా చేసినందువల్ల నష్టపోయేది మనమే అన్న స్పృహే దానికి కారణం. పక్కవాడు అవినీతితో ఎడాపెడా సంపాదిస్తూ, పలుకుబడి పెంచుకుంటూ, సమాజంలో దర్జాగా తిరుగుతుంటే, మనం ఆదర్శాలకు పోతే చేతికి మిగిలేది చిప్పే అని ఎవరినడిగినా చెప్తారు. ఇది చేదునిజం. ఈ పరిస్థితి వాంచనీయం కాకున్నా, మనం ఏమీ చేయలేని స్థితికి సమాజంలో అవినీతి పెరిగిపోయింది అన్నది వాస్తవం. ప్రతివాడూ, తానుతప్ప అందరూ నీతిగా ఉండాలని భావించడం వల్లా, నాయకులు ఎడాపెడా అవినీతిని ప్రోత్సహించడం వల్లా, అవినీతి సంపాదనకు సమాజం గౌరవం ఇవ్వడం వల్లా, ఈ అద్వాన్నస్థితి వచ్చింది.

పాలకుల నీతిని చూచీ , చట్టానికి భయపడీ , సామాన్య ప్రజలు నీతిని అనుసరిస్తారు. ఇది ప్రకృతి సహజం. కాని మన దేశంలో, కొద్దోగొప్పో సామాజిక స్పృహ మిగిలిఉన్న ప్రజలు, అవినీతి పాలకులకు బుద్ది చెప్పే దిశగా ఉద్యమిస్తూ ఉండటం, "బండి గుర్రాన్ని లాగుతోంది" అన్న సామెతకు అద్దం పడుతోంది. మొన్నీ మధ్యన ఒక ప్రజాప్రతినిధిని మర్యాదపూర్వకంగా నేను కలవాల్సి వచ్చింది. మాట్లాడిన అరగంటసేపూ, ఆయన ఆలోచనలూ మాటలూ " వ్యాపారం" దానివల్ల వచ్చే "లాభం" అన్న ఈ రెండు అయిడియాల మధ్యనే తిరుగుతూ ఉండటం చూచి నాకు నిస్పృహ అనిపించింది. ప్రజాసమస్యలపట్ల ఆయనకు ఇసుమంత కూడా ఆలోచన లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఇటువంటి నాయకులు లోక్ పాల్ బిల్లును తూట్లు పొడవకుండా బతకనిస్తారా? అన్నది అనుమానమే. ఎందుకంటే, ఇంతకు ముందొచ్చిన కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్టూ, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్టూ పెద్దగా సక్సెస్ అయినట్లు కనిపించవు. కుళ్ళిపోయిన ఈ వ్యవస్థను బాగుచేసుకునే క్రమంలో ఇంకా మంచిమంచి యాక్టుల్ని సాధ్యమైనంత "పిల్ఫర్ ప్రూఫ్" గా తయారుచేసుకోవడంలో ప్రయత్నాలు చేసుకుంటూ పురోగమించడమే ప్రస్తుతానికి మన గతి.

పెరుగుట విరుగుట కొరకే అన్న సామెత అవినీతికి కూడా వర్తిస్తుంది. చాలా దేశాల్లో అలా జరిగింది. మన దేశంలో అయితే, స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర్నుంచీ అవినీతి కాలక్రమేణా పెరిగిపోతూ నేడు విశ్వరూపం దాల్చి భరించలేనంత స్థాయికి పెరిగింది. అందుకే సర్వత్రా నిరసన వ్యక్తం అవుతున్నది. అయితే మన సమాజంలో, నిరంతర జాగరూకతతో ఒక ప్రక్షాళనప్రక్రియను చాలాకాలం కొనసాగించిన దాఖలాలు ఇప్పటిదాకా లేవు. మనది ఆరంభశూరత్వం మాత్రమేననీ, మాటలు చెప్పినంత శ్రద్ధ మన వాళ్లకు చేతల్లో ఉండదనీ , గతం లో ఎన్నోసార్లు రుజువైంది.

అటువంటి నిరంతరజాగరూకతను పెంపొందించుకోనంతవరకూ, వ్యక్తిగత జీవితంలో త్యాగాలకు సిద్ధపడి, అవినీతిని అన్ని స్థాయిలలోనూ ప్రతివారూ ప్రతిఘటించనంతవరకూ, ఇటువంటి బిల్లులు ఎన్నొచ్చినా ఉపయోగం ఉండదు. ఎన్ని పదునైనకత్తులు తయారుచేసి చేతికిచ్చినా, కత్తిని వాడాలి అన్న స్పృహ రానంతవరకూ, ఎలావాడాలో తెలియనంతవరకూ, ఉపయోగం ఉండదు. ఆలోచనావైఖరిలోనూ, ఆదర్శాలస్థాయిలోనూ ఔన్నత్యం లేనంతవరకూ సమాజం మారదు. ప్రజలలో అవినీతి అనేది "యాక్సెప్టెడ్ ఐడియాలజీ" అవుతున్నప్పుడు ఎవరేం చేయగలరు?