జ్యోతిశ్శాస్త్రమనేది ఒక అద్భుతమైన శాస్త్రం. మానవ జీవితాన్ని సంపూర్తిగా చదవడానికి అది తోడ్పడుతుంది. అయితే ఎవరికిబడితే వారికి అది దక్కదు. అది బజారులో దొరికే వ్యాపార వస్తువు కాదు. జ్యోతిషం అంటే మాయమాటలు చెప్పటమే అనుకుంటారు కొందరు. ఇది పొరపాటు అభిప్రాయం. అది ఉత్త గణితం మాత్రమే అని చాలామంది అనుకుంటారు. ఇదీ పొరపాటు అభిప్రాయమే.
గణితం శరీరం వంటిది. స్ఫురణ ఆత్మ వంటిది. రెండూ కలిసినప్పుడే ఫలితం గోచరిస్తుంది. గణితానికి గట్టి పరిశ్రమ అవసరం. గణితమంటే ఉత్త లెక్కలే అని మాత్రమే అర్ధం కాదు. గ్రహ/రాశి/భావ స్వభావాలు, కారకత్వాలు, బలాబలాలు, ఇవేగాక యోగాలు, వివిధ దశలు, ముహూర్తం, ప్రశ్న, గోచారం, అష్టకవర్గు, మొదలైన అనేకములైన ఇతర సూత్రాలు అన్నీ దీనికిందకే వస్తాయి. వీటిని ఆకళింపు చేసుకోడానికి బహుగ్రంధ పరిశీలన అత్యంత ఆవశ్యం. ఆ తరువాత, చదివిన దానిని సింధసైజ్ చేసుకుంటూ, నిత్యజీవితంతో సమన్వయం చేసుకుంటూ పరిశీలిస్తూ, గ్రహిస్తూ ఉండాలి. ఇక స్ఫురణకో, ఉపాసనాపూర్వక మంత్ర బలం, దైవానుగ్రహం తప్పనిసరి. ఈ రెండూ అంత తేలికగా పట్టుబడేవి కావు. దీనికి మంత్రసాధన అవసరం. సాధనకు నియమపూర్వక జీవితం అవసరం. ఇవిగాక మానవ మనస్తత్వాన్నీ, లోక వ్యవహారాన్నీ నిత్యమూ సూక్ష్మంగా పరిశీలించగల దృష్టి ఉండాలి. ఇవన్నీ ఆచరించినప్పుడే జ్యోతిశ్శాస్త్రం పట్టుబడుతుంది.
ప్రాచీన కాలంలో నిష్టా గరిష్టులూ, నియమ సంపన్నులూ, నిరాడంబర జీవనులూ, నిస్వార్ధ మనస్కులూ, ఉన్నతాదర్శ ప్రేరితులూ, మహనీయులూ, జ్యోతిర్విద్యా విశారదులైన మహర్షులూ ఎందఱో ఉండేవారు. నేడు అటువంటివారు అక్కడక్కడా మాత్రమె చాలా అరుదుగా కనిపిస్తున్నారు. కనుకనే నిజమైన జ్యోతిర్విద్య కూడా అరుదుగా మాత్రమె నేడు కనిపిస్తుంది. అన్ని రంగాలలో ఉన్నట్లే దీనిలో కూడా మోసగాళ్ళు ఎక్కువనే విషయం మర్చిపోరాదు. నకిలీ లు ఉన్నంత మాత్రాన అసలు విద్యే తప్పు అనడం మూర్ఖత్వం అవుతుంది.
నేడు మనం పెద్ద సమస్యలుగా పరిగణిస్తున్న వాటిని ప్రాచీనులు పరిష్కరించినవారే. కాలక్రమేణా గ్రంధములూ, గురుశిష్య సంప్రదాయమూ కనుమరుగు కావడం వల్ల ఈ విజ్ఞానం మరుగున పడింది. మనకు వస్తున్న సందేహాలు పూర్వకాలం లోని వారికీ కలిగేవి. వాటికి పరిష్కారాలకోసం వారూ ప్రయత్నించేవారు. ఈ కృషిలో భాగం గానే జ్యోతిష్యం స్థూలం నుంచి సూక్ష్మానికి పయనం సాగించింది. చివరికి జన్మ జన్మాన్తరాలను కూడా చూడగలిగే నాడీశాస్త్రంగా అవతరించింది.
లగ్నం శరీర భావాన్ని మాత్రమె సూచిస్తుంది.కవలల లగ్నాలు ఒకటిగానే ఉంటాయి. కనుకనే కవలల శరీరాలు చాలావరకూ ఒకటిగానే ఉంటాయి. ఇద్దరి లగ్నాలూ ఒకటే అనే విషయం అంతవరకే పనిచేస్తుంది. కాని వారి విభిన్న సూక్ష్మ సంస్కారాలను అది చూపలేదు. దానికి సూక్ష్మ పరిశీలన అవసరం. ఈ పనికి తోడ్పడేవే వర్గ చక్రాలు.
లగ్నం దాదాపు రెండు గంటల కాలం ఉదయిస్తుంది. ఈ రెండుగంటల సమయంలో ఎంత మందైనా పుట్టవచ్చు. కనుక వ్యక్తిగత సూక్ష్మ పరిశీలనకు ఇది చాలదు. అందుకనే ప్రాచీనులు అనేక ప్రత్యేకలగ్నాలను లెక్కలోకి తీసుకున్నారు.నక్షత్ర లగ్నం దాదాపు ఒకరోజు ఉంటుంది. హోరాలగ్నం ఒక గంట వ్యవధి. ఘటీ లగ్నం 24 నిముషాల వ్యవధి వరకూ ఉంటుంది. అర్ధ ఘటీ లగ్నం 12 నిముషాల వ్యవధి. భాగలగ్నం నాలుగు నిముషాల వ్యవధిగా ఉంటుంది. నిమేష లగ్నం ఒక నిముష వ్యవధి. ఇంత కంటే సూక్ష్మ లగ్నాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చూడాలనుకుంటున్న విషయాన్ని మైక్రోస్కోప్ లో చూడడానికి ఉపకరించే సాధనాలు.
"భాగ" అనేదాన్ని ఇంగ్లీషులో డిగ్రీ అన్నారు. ఇది దాదాపు నాలుగు నిముషాలు ఉదయిస్తుంది. మన గ్రంధాలలో "మృత్యుభాగలు" అనేవి ఉన్నాయని వివరించ బడ్డాయి. ఫలదీపిక, సారావళి, జాతకపారిజాతం, సర్వార్ధ చింతామణి, బృహత్ ప్రాజాపత్యం వంటి గ్రంధాలలో వీటి వివరణ ఉన్నది. అంటే ఇవి మారణశక్తి కలిగిన Death inflicting degrees అన్నమాట. కొన్ని డిగ్రీల దగ్గరలో జననం జరిగినప్పుడు అది మృత్యు కారకమౌతుంది. ప్రస్తుత కవలల విషయంలో ఇవే ప్రధానపాత్ర పోషించాయి. ఆరోజున 11 .25 .02 కి కన్యా లగ్నంలో మృత్యు భాగలు ఉదయిస్తున్నాయి. ఇవి 11 .23 నుంచి 11 .28 వరకూ అయిదు నిముషాల వ్యవధిలో ఉదయించాయి.ఈ సమయంలో లగ్న డిగ్రీ త్రిమ్శంశ లో కూడా మృత్యు భాగల మీద ఉన్నది. కనుక ప్రస్తుతం జీవించి ఉన్న పాప దీనికంటే ముందుగా 11.22 నిముషాలకు, మృత్యుభాగలకు దూరంగా పుట్టి ఉండవచ్చు. రెండవ పాప 11.23 నుంచి 11.28 లోపు పుట్టి ఉండాలి. వీరిద్దరికీ మధ్యన రెండు లేదా మూడు నిముషాల కంటే దూరం లేదని అన్నారు. కనుక రెండవ పాప 11.23 లేదా 11.24 లేదా 11.25 నిముషాలకు జన్మించి ఉండాలి. ఈ మూడు నిముషాల జాతకాలను జల్లెడ పట్టి ఎవరికి ప్రాణగండం ఉందొ, ఎవరికి లేదో నిర్ణయించాలి.
మరి ఆ సమయంలో జన్మించిన అందరికీ మృత్యువు వాటిల్లిందా అని అనుమానం సహజంగానే వస్తుంది.ఈ విషయం నిర్ధారణగా తెలియాలంటే ఆ సమయానికి హాస్పిటల్స్ లోనూ, ఇళ్ళలోనూ పుట్టిన శిశువులలో ఎందరు జీవించి ఉన్నారో, ఎవరికి ఏమైందో గణాంకాలు సేకరించాలి. అటువంటి స్టాటిస్టికల్ స్టడీ వల్లనే ఈ విషయాలకు రుజువులు లభిస్తాయి. శిశ్నోదర పరాయణులైన ప్రస్తుత కలిప్రజలలో ఇటువంటి పనులకు పూనుకునే వారెందరున్నారు? విలాస జీవితాల మోజులో దిక్కు తెలీకుండా సంచరిస్తున్న నేటి జనానికి ఇటువంటి సబ్జెక్టులూ, రీసెర్చీ పిచ్చితనంగా కనిపిస్తాయి.
ఆ సంగతి అలా ఉంచితే, ఈ మూడు నిముషాలలోనూ పుట్టిన శిశువులలో ఎవరికి 21-10-2001 న గండం ఉన్నదో ముందుగా చూడాలి. దానిని బట్టి చనిపోయిన పాప జనన సమయాన్ని లెక్కించవచ్చు. మొదటగా, 11.23 కి జన్మించిన పాప వివరాలు చూద్దాం.
సిద్ధాంశ చక్రం వరకూ ఇద్దరి వర్గ చక్రాలలో పెద్ద మార్పులు లేవు. కనుక అక్కడ నుంచి పై చక్రాలను పరిశీలించాలి. 11.23 వరకూ సిద్ధాంశ లగ్నం కర్కాటకం గా ఉన్నది. చంద్రుడు రాశిచక్రం లో లాభాదిపతిగా లగ్నంలో ఉంటూ విద్యా లాభాన్ని సూచిస్తున్నాడు. విద్య ఉండాలంటే ఆయుస్సు ఉండాలి. కనుక ఈ రెండు నిముషాలలో పుట్టిన పాపకు ఆయుస్సు ఉంది. కాని 11.24 నుంచి 11.28 వరకూ మాత్రం సిద్ధాంశ చక్రంలో సింహ లగ్నం వచ్చింది. సూర్యుడు రాశి చక్రంలో రాహు గ్రస్తుడై ప్రమాదం ద్వారా విద్యా నాశనాన్ని సూచిస్తున్నాడు. కనుక ఈ సమయంలో పుట్టిన పాపకు విద్యా లేదు. కనుక ఆయుస్సూ లేదని ఊహించాలి. కాని అయిదు నిముషాల సమయం చాలా ఎక్కువ నిడివి కలిగినది. ఇది మన సమస్యను తీర్చలేదు. కనుక ఇంతకంటే పై స్తాయిదైన నక్షత్రాంశను చూద్దాం.
నక్షత్రాంశ కుండలిలో 11.22 వరకూ కర్కాటక లగ్నం ఉన్నది. చంద్రునికి పైన ఇచ్చిన వివరణమే దీనికి కూడా వర్తిస్తుంది. ఇక్కడ చంద్రుడు లగ్నంలోనే, విద్యా కారకుడగు బుదునితో కలిసి ఉండటం చూడవచ్చు. కనుక ఈ పాపకు నక్షత్ర బలం బాగానే ఉంది. కాని 11.23 నుంచి ఈ లగ్నం సింహానికి మారుతున్నది. సింహ లగ్నంలో రోగ, మారక స్తానాదిపతిగా ఉన్న శని కొలువై ఉన్నాడు. యితడు ఈ లగ్నానికి బద్ధ శత్రువు కూడా. 11.27 వరకూ నక్షత్రాంశలో సింహ లగ్నమే నడిచింది. సిద్ధాంశ లో అయితే 11.28 వరకూ ఇదే లగ్నం ఉన్నది. అంటే నక్షత్రాంశ స్థాయిలో ఒక నిముషం ఎలిమినేట్ అయిపొయింది. అంటే చనిపోయిన పాప ఈ నాలుగు నిముషాల వ్యవధిలోనే పుట్టి ఉండాలి. కనుకనే ఈ పాపకు నక్షత్రబలం లేదు. సమయాన్ని ఇంకా నేరో డవున్ చెయ్యడం కోసం, ఇంతకంటే పైదైన ఖవేదాంశను చూద్దాం.
ఇందులో 11.24 వరకూ వృశ్చిక లగ్నం ఉన్నది. లగ్నాధిపతి అయిన కుజుడు వక్రించి బలహీనుడుగా ఉన్నా, యోగకారకుడైన గురువు భాగ్య స్థానంలో ఉచ్ఛస్థితిలో ఉంటూ ఈ జాతకానికి బలాన్నిస్తున్నాడు. 11.25 కి మాత్రం లగ్నం ధనుస్సు గా మారుతున్నది. లగ్నాధిపతి గురువు అష్టమంలో ఉన్నాడు. అంతే గాక మిధునం నుంచి కుజ దృష్టి లగ్నం పైన ఉండి, ఊపిరితిత్తులకు, రక్తానికీ సంబంధించిన దుర్ఘటనను సూచిస్తున్నది. అంటే 11.22 నుంచి 11.24 లోపు మొదటి పాప జననమూ, ఆ తర్వాత రెండవ పాప జననమూ జరిగి ఉండాలి. ఇప్పుడు జనన సమయం ఇంకొక రెండు నిముషాలు నేరో డవున్ అయ్యింది. మరింత మెరుగైన దృష్టి కోసం ఇంతకంటే పై స్తాయిదైన షష్ట్యంశ ను చూద్దాం.
ఇక్కడ చిక్కు ముడి పూర్తిగా విడిపోతున్నది. ఎలాగో కాస్త అర్ధం చేసుకుందాం. 11.22 కి షష్ట్యంశ స్థాయిలో తులా లగ్నం అయ్యింది. లగ్నంలో యోగకారకుడైన శని ఉచ్ఛ స్థితిలో ఉండి లగ్నాన్ని కాపాడుతున్నాడు. ఈ నిముషంలో పుట్టిన శిశువుకు గండం లేదు. కనుక మొదటి పాప ఈ సమయానికి పుట్టింది. 11.23 కి లగ్నం వృశ్చికం అవుతున్నది.కుజ గురులు ఇక్కడ ఉండటం వల్ల లగ్నానికి రక్షణ కలిగింది. 11.24 కి కూడా ఇదే లగ్నం నడిచింది. కాని 11.25 నిముషాలకు లగ్నం మారి ధనుర్లగ్నం అవుతుంది. శుక్ర కేతువులు ఇక్కడ ఉండటంవల్లా, రాహు కేతు ఇరుసు మిధునం నుంచి లగ్నాన్ని చేదించడం వల్లా, పాలకు సంబంధించి, ఊపిరితిత్తులకు సంబంధించి, ఒక హటాత్ దుర్ఘటన జరుగుతుంది అని తెలుస్తున్నది. పాలు తాగుతూ అవి ఊపిరి తిత్తులలోకి పోవడం వల్లే ఈ పాప చనిపోయింది. ఇప్పుడు క్లారిటీ వచ్చింది. మొదటి పాప 11.22 కి పుట్టింది. రెండవ పాప 11.25 కి పుట్టింది. షష్ట్యంశ స్థాయిలో టైం అనేది ఇంకా నేరో డవున్ అవడం వల్ల నిముష నిముషానికీ జాతకంలో తేడా స్ఫుటంగా కనిపించింది. అంటే ఒక లగ్నాన్ని అరవై భాగాలు చేసి సూక్ష్మంగా మైక్రోస్కోప్ లో పరిశీలించినట్లు పరిశీలిస్తే తప్ప జాతకం లో క్లారిటీ రాదని అర్ధం అవుతున్నది.
సిద్ధాంశ చక్రం ప్రకారం 11.22,11.23 నిముషాలలో మొదటి పాప పుట్టినట్లూ, 11.24 నుంచి 11.28 లోపు రెండవ పాప పుట్టినట్లూ కనిపిస్తున్నది. నక్షత్రాంశ ప్రకారం 11.22 కి మొదటి పాప, 11.23 నుంచి 11.27 లోపు రెండవ పాప పుట్టినట్లు సూచన వచ్చింది.ఖవేదాంశ ప్రకారం 11.22 నుంచి 11.24 వరకూ మొదటి పాప, ఆ తర్వాత రెండవ అమ్మాయి పుట్టినట్లు తెలుస్తున్నది. షష్ట్యంశ కుండలి ప్రకారం 11.22 కి మొదటి అమ్మాయి, 11.25 నుంచి 11.26 వరకూ రెండో అమ్మాయి పుట్టినట్లు సూచించింది. ఇద్దరి మధ్యనా రెండు లేక మూడు నిముషాల కంటే తేడా ఉండరాదు. కనుక అన్నింటిలో కామన్ గా వచ్చిన ఫలితాన్ని చూడగా 11.22, 11.25 అనే టైం విండోస్ మిగులుతున్నాయి.
ఇంతకంటే ఇంకా సూక్ష్మ స్థాయికి వెళ్ళవచ్చు. కొన్ని జాతకాలలో షష్ట్యంశ స్థాయి కూడా సరిపోదు. అప్పుడు లగ్నాన్ని 81,108,144,150,300,600 భాగాలు చేసి నాడీ అంశను రాబట్టి, దాన్ని మళ్ళీ పూర్వ - పర భాగాలుగా విభజించి, అందులో మళ్ళీ పంచ భూతాలనూ, పురుష స్త్రీ విభాగాలనూ చదవగలిగితే అది ఇంకా సూక్ష్మ విశేషాలను, జన్మ జన్మాంతర సుకృత దుష్క్రుతాలనూ, ఈ పాపకు ఇటువంటి మరణం ఎందుకు కలిగింది? రెండవ పాప జాతక బలం ఎక్కడ ఉన్నది? వీటికి కారణాలేమిటి అన్న విషయాలను, అద్దంలో చూసినట్లు చూపగలదు.ఈ ప్రక్రియ జీన్ మాపింగ్ లాటిది. కాని అంత లోతుకు ప్రస్తుతం పోవడం అక్కర్లేదు. ఆ రహస్య వివరాలు అందరికీ అవసరం లేదు కూడా. అవి ఎవరికి అవసరమో వారికి మాత్రమే చెప్పడం జరుగుతుంది.
ఇప్పటికీ మన ఎనాలిసిస్ నిజమేనని మనం నమ్మరాదు. దీన్ని ఇంకా శల్య పరీక్షలకు గురి చేస్తేనే గాని నిజానిజాలు బయట పడవు. ఇప్పుడు మన ఎనాలిసిస్ నిజమో కాదో డబల్ చెక్ అప్ చెయ్యడం కోసం దశలను పరిశీలిద్దాం. పరాశర మహర్షిచే కొనియాడబడిన విమ్శోత్తరీ దశను తీసుకుందాం.
11.22 కి పుట్టిన పాపకు 21.10.2001 న ఉదయం ఆరుగంటలకు చంద్ర/గురు/రాహు/శని/శని దశ జరిగింది. ఇద్దరి జాతకాలలో ప్రాణదశ మాత్రమే మారుతున్నది. సూక్ష్మదశా, ప్రాణదశలలో యోగకారకుడూ, లగ్నంలో ఉన్నటువంటి ఉచ్ఛశని కాపాడుతూ ఉండటం చూడవచ్చు. పైగా తులా లగ్నానికి రాహువు నవమ స్థానంలో ఉండి, ఈ లగ్నానికి మిత్రుడైన బుధున్ని సూచిస్తూ శుభాన్ని కలిగిస్తున్నాడు. శరీరాన్ని యోగ కారకుడైన శని కాపాడుతూ ఉన్నాడు. కనుక ఈ పాపకు ఏమీ కాలేదు.
11.25 కి పుట్టిన పాపకు అదే రోజున చంద్ర/గురు/రాహు/శని/రాహు దశ జరిగింది. మూడునిముషాలలో ప్రాణదశ మాత్రం మారి, ప్రాణం రాహువు యొక్క పరిధిలోకి వచ్చింది. విదశానాధుడు కూడా అయిన రాహువుకు మరింత బలం చేకూరింది. రాహువు మారక స్థానమైన మిధునంలో ఉండటమూ, ధనుర్ లగ్నానికి ఇది బాధకస్థానం కూడా కావడమూ గమనించవచ్చు. పాలను సూచించే శుక్రుడూ, హటాత్ సంఘటనలకు కారకుడైన కేతువూ ధనుర్లగ్నం లో ఉండటమూ, ఊపిరితిత్తులకు సూచిక అయిన మిథునం నుంచి మారక శక్తి కలిగిన రాహువు యొక్క ప్రభావమూ ఇవన్నీ కలిసి ఆ సమయంలో ఆ విధంగా మరణాన్ని కలిగించాయి.
11.22 కి మృత్యుభాగలు కొంచం దూరంగా ఉన్నాయి. జాతకంలో బలం ఉంది. కనుక ఈ అమ్మాయి బ్రతికింది. 11.25 కి మృత్యుభాగలు బాగా దగ్గరగా ఉన్నాయి. దానికితోడు జాతకంలో బలం లేదు. కనుక ఈ అమ్మాయి చనిపోయింది. వెంటనే ఎందుకు చనిపోలేదు అని అనుమానం వస్తుంది. మృత్యుచ్చాయలో పుట్టినప్పటికీ కొంత ఆయుస్సు ఉండటం వల్ల మూడునెలలపాటు బ్రదికింది. అనువైన దశాకాలం రావడం తోనే ఆయుస్సు తీరింది. మృత్యువాతబడింది. ఈ ఆయుస్సును ఎలా లెక్కించాలి అన్నది ఇంకొక సబ్జెక్టు గనుక ప్రస్తుతానికి దానిని అలా ఉంచుదాం.
ఒకే సమయంలో పుట్టినవారికి కూడా పూర్వ కర్మానుసారం ఇలా విభిన్నమైన కర్మఫలితాలు కలుగుతూ ఉంటాయి. వారి కర్మకు తగినట్లే ఆయా గ్రహసమయాలకు వారి జన్మలు కలుగుతూ ఉంటాయి. ఈ సంఘటనలన్నింటి వెనుకా ఒక మాస్టర్ ప్లాన్ ఉన్నదనీ, మన ఊహకు అందని ఒక అతీతమైన దివ్యశక్తి ఈ ప్రపంచాన్ని నడుపుతూ ఉన్నదనీ, చీమ చిటుక్కుమనడం కూడా ఆ ప్లాన్ ప్రకారమే జరుగుతుందనీ, మనకు అర్ధం కావడానికి జ్యోతిష్యం బాగా తోడ్పడుతుంది. మన అజ్ఞానం వల్ల, హ్రస్వదృష్టి వల్లా, తెలిసీ తెలీక మాట్లాడుతూ జ్యోతిష్య శాస్త్రాన్ని హేళన చేస్తూ ఉంటాము. ఋషిప్రోక్తమైన వేదవిజ్ఞానాన్ని అలా ఎగతాళి చెయ్యడం చాలా పొరపాటు అన్న విషయం గ్రహించాలి.
కనుక ఈ విశ్లేషణ వల్ల, ప్రస్తుతం జీవించి ఉన్న పాప 11.22 కి పుట్టిందనీ, చనిపోయిన పాప 11.25 కి పుట్టిందనీ అర్ధం అవుతున్నది. దీనికి ఇంకా రుజువులు కావాలంటే, ప్రస్తుత దశలు పరిశీలించి, జీవించి ఉన్న పాప యొక్క జీవితంతో పోల్చి చూచుకుంటే కరెక్ట్ గా సరిపోవడం కనిపిస్తుంది. ఈ ఎనాలిసిస్ కరెక్ట్ అనడానికి ఇదే రుజువు అవుతుంది. మొదట్లోనే చెప్పినట్లు, జ్యోతిష్యం అనేది మాయమాటలు చెప్పటం కాదు, దీని వెనుక సూక్ష్మ పరిశీలనా, డిడక్టివ్ మరియు ఇండక్టివ్ లాజిక్కూ, శాస్త్రజ్ఞానమూ, దైవబలమూ కలిసి మెలిసి ఉండాలన్న విషయం చెప్పడానికే ఇదంతా వివరించాను.
ఇన్ని కోణాలలో సూక్ష్మంగా పరిశీలిస్తేగాని కవలల జాతకాల చిక్కుముడి విప్పడం సాధ్యంకాదు. సాంప్రదాయ జ్యోతిష్యం లోకూడా ఈ పని సాధ్యమే అని నా అంతర్వాణి ఎప్పుడూ చెబుతూ ఉంటుంది.