నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

4, జూన్ 2011, శనివారం

జిడ్డు కృష్ణమూర్తి జీవితం- తత్త్వం- 3

ధియోసాఫీ అనేది బౌద్ధమతాన్నీ, హిందూమతాన్నీ, క్రైస్తవాన్నీ కలిపి వండిన కిచిడీ అని చెప్పవచ్చు. దీనిలో రహస్య సాధనామార్గం ఒకటి ఉంది.  

మాస్టర్ మోర్య, మాస్టర్ కుతూమి, మాస్టర్ మహాచోహన్ -- వీళ్ళు ముగ్గురూ మానవ స్థాయిని దాటి ఎంతో ఎత్తుకు ఎదిగిన మహాపురుషులని వాళ్ళు ఉండేది దివ్యలోకాలలో అయినప్పటికీ ప్రస్తుతం వాళ్ళ దివ్య శక్తులతో టిబెట్ పరిసర ప్రాంతాల్లో మానవ రూపాలలో ఉన్నారని, వీరి కంటే పై స్థాయిలో  "మైత్రేయ" అనే ఒక దివ్య పురుషుడున్నాడని, ఈ మైత్రేయ ఊర్ధ్వ లోకాలలో ఉన్నాడనీ, క్రితం సారి ఇతను కృష్ణునిగానూ, క్రీస్తుగానూ లోకంలోకి వచ్చాడనీ, పవిత్రాత్ముడైన ఒక వ్యక్తి శరీరంలోకి అతను దిగి రావడానికి సిద్ధంగా ఉన్నాడనీ,  అతని కంటే పై స్థాయి బుద్ధునిదనీ ఒక ప్రాధమిక నమ్మకం దియోసఫీలో ఉంది. ఈ నమ్మకాన్ని మేడం బ్లావత్స్కీ మొదటగా ప్రారంభించింది.

ఆమె నేపాల్ లో నివసించిన రోజులలో  బౌద్ధమత ప్రభావానికి లోనై, వీరిని భౌతిక స్థాయిలో కలుసుకున్నట్లూ మాట్లాడినట్లూ నమ్ముతారు. ఈ ముగ్గురు సిద్ధ పురుషులూ దివ్యజ్ఞాన సమాజాన్ని నడుపుతున్న మార్గదర్శకులని భావిస్తారు. 

వీరి శిష్యులుగా మారి వారంతటి ఉన్నత స్థాయికి ఎదగాలంటే వరుసగా అయిదు దీక్షలున్నాయని వీరి నమ్మకం. శిష్యుడు ఎదిగిన స్థాయిని బట్టి ఉన్నత దీక్షలు ఒకదాని తరువాత ఒకటిగా ఇవ్వబడతాయి.  కల్నల్ ఆల్కాట్, మేడం బ్లావత్స్కీ ల తర్వాత అనీబిసెంట్, లెడ్ బీటర్లు ఈ సంస్థకు నాయకులయ్యారు. ఒక పవిత్రాత్ముడైన బాలుని  ఎన్నుకొని అతనికి కొన్నేళ్ళు సరియైన రహస్య ట్రయినింగ్ ఇవ్వటం ద్వారా, అతని శరీరంలో "మైత్రేయ" దిగివచ్చి లోకానికి వెలుగు చూపిస్తాడనీ, ఈ దిగిరావడమే అనేక మతాలలో చెప్పబడిన అవతార పురుషుని రాకడ అనీ వీళ్ళు నమ్మారు. అహంకారపు స్పర్శ ఏ మాత్రం లేని తేజో వలయాన్ని కలిగి ఉన్నాడని లెడ్బీటర్ నమ్మబలికిన జిడ్డు కృష్ణమూర్తిని ఆ పవిత్రబాలునిగా ఎన్నుకున్నారు.

కృష్ణమూర్తినీ, అతని తమ్ముడు నిత్యానందనూ దీక్షలు ఇచ్చి సాధన చేయిస్తూ వచ్చారు. వాళ్ళు ట్రాన్స్ వంటి నిద్రావస్తలోకి వెళ్ళాక వాళ్ళ ఆత్మలను తీసుకుని టిబెట్ లోని మాస్టర్స్ ఇంటికి లెడ్ బీటర్ వెళ్ళేవాడు. అక్కడ మాస్టర్స్ ఇచ్చే ఉపదేశాలు అందుకుని వాళ్ళు తిరిగి వచ్చేవారు. ఇదంతా ఒక మార్మిక సాధనగా సాగేది.

అయితే ఈ అనుభూతులన్నీ నిద్రలో వారి కలలా లేక నిజంగా జరిగాయా తెలుసుకోడానికి వాళ్ళ పరస్పర అంగీకారం తప్ప వేరే రుజువు ఏదీ ఉండేది కాదు. నిన్న రాత్రి మేం హిమాలయాలలో ఉన్న మాస్టర్ కుతూమి ఇంటికి సూక్ష్మ శరీరాలతో వెళ్లి వచ్చాము. నీవూ అక్కడ కనిపించావు. ఇది నిజమేనా? నీవు అక్కడకు వచ్చావా? అని లేద్బీతర్ అనీబెసంట్ ను అడిగేవాడు. ఆమె అవునని చెప్పేది. ఇద్దరూ కలిసి అది నిజమే అనుకునేవారు. ఈ మొత్తం వ్యవహారం నచ్చని జిడ్డు తండ్రి, తన పిల్లల్ని తనకు కాకుండా చేస్తున్నదంటూ, అనీబెసంట్ మీద కేసుపెట్టి కోర్టుకెళ్ళాడు. ప్రీవీ కౌన్సిల్ దాకా సాగిన కేసులో అనీబెసంట్ నెగ్గింది. ఇలా దాదాపు పదహారేళ్ళు గడిచాయి.  ఈ లోపు కృష్ణమూర్తీ, నిత్యానందా అనీబెసంట్ తో కలిసి దేశదేశాలు తిరుగుతూ, ఇంగ్లీషు చదువు నేర్చుకుంటూ,  కొన్నాళ్ళు యూరప్ లోనూ కొన్నాళ్ళు అమెరికాలోనూ ఉంటూ గడిపారు.

ఈ లోపు కృష్ణమూర్తి శరీరంలో  " ప్రాసెస్" అనబడే ఒక విచిత్ర చర్య మొదలైంది. అతను ఒకరకమైన మూర్చవంటి స్తితికి లోనయ్యేవాడు. ఆ సమయంలో అతని శరీరం నుంచి ఆత్మ దూరంగా వెళ్ళిపోయేది. వెన్నులోనూ, తలలోనూ విపరీతమైన నొప్పి మొదలయ్యేది. శరీరం బాధతో కూడిన అనేక మార్పులకు లోనయ్యేది. అతను బాధతో మెలికలు తిరిగిపోయేవాడు. ఇలా కొన్ని గంటలు జరిగేది.  తరువాత ఏమీ జరుగనట్లు మామూలుగా ఉండేవాడు. కొన్ని సార్లు ఆ స్తితిలో ఏం జరిగిందో కూడా ఇతనికి గుర్తుండేది కాదు. ఇదంతా కూడా "మైత్రేయ" దిగిరావడానికి ఇతని శరీరంలో జరుగుతున్న ప్రక్షాళన ప్రక్రియగా అందరూ భావించారు. కొందరు మాత్రం ఇవి అతన్ని జీవితాంతం బాధించిన మలేరియా ఎటాక్స్ గా అనుకునేవారు. కృష్ణమూర్తిని అవతార పురుషుడిగా భావిస్తూ "ఆర్డర్ ఆఫ్ ది స్టార్" అన్న సంస్థను ప్రారంభించారు. దానికి విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. అవతారపురుషుడైన "మైత్రేయ" జిడ్డు శరీరంలోకి అతి త్వరలో రాబోతున్నాడనీ, దానికి సర్వం సిద్ధం అయిందనీ అందరూ నమ్మేవారు. ఈ లోపల ధియసాఫికల్ సొసైటీ లో లుకలుకలు మొదలయ్యాయి. జార్జి అరుండేల్, వేడ్జివుడ్ మొదలైన వారితో ఒక యాంటీ గ్రూపు మొదలైంది. 

లేద్బీతర్ కూడా ఒక విడి గ్రూపును ప్రారంభించాడు. మధ్య యుగాలలో జీవించిన మాస్టర్ కౌంట్ అనబడే ఒక యూరోపియన్  సిద్ధమాంత్రికుడు  ఈ భూమ్మీద యూరప్ లో  ఎక్కడో  ఒక  కోటలో ఉన్నాడని, అక్కడకు వెళ్ళడానికి తమకు రహస్య సందేశాలు అందుతున్నయనీ భావించిన ఒక బృందం అనీబెసంట్ తో సహా యూరప్ అడవుల్లో కొంతదూరం వెళ్లి, వాళ్ళనుకున్న సిగ్నల్స్ అందక, అదెక్కడుందో కనుక్కోలేక నిరాశతో తిరిగి వచ్చింది. ఇన్నాళ్ళ, వారి నమ్మకాలు తప్పేమో, ఇదంతా భ్రమేమో  అన్న ఆలోచన అందరిలో మొదలైంది.


ఈలోపల ఇంకొక ముఖ్య సంఘటన జరిగింది. కృష్ణమూర్తి తమ్ముడు నిత్యానందది  మొదట్నుంచి అనారోగ్యపు ఒళ్ళు. ఎప్పుడూ ఏదో ఒక రోగంతో బాధపడుతూనే ఉండేవాడు. ఈలోపు అతనికి టీబీ సోకింది. అతనికి యూరప్ లో అత్యుత్తమ ట్రీట్మెంట్ ఇప్పించారు. అతనికి ఏమీ కాదని, మాస్టర్స్ అతన్ని కాపాడతారనీ, ఆ రకమైన సందేశాలు తమకు హిమాలయన్ మాస్టర్స్ నుంచి  అందాయనీ కృష్ణమూర్తీ, అనీబెసంటూ, లెడ్ బీటరూ, ఇతర సంఘప్రముఖులూ  నమ్మేవారు. కాని వారందరి నమ్మకాలనూ వెక్కిరిస్తూ నిత్యానంద రోగంతో  మరణిస్తాడు. ఆదెబ్బతో కృష్ణమూర్తికి జ్ఞానోదయం అవుతుంది. తాను ఇన్నాళ్ళు అనుకుంటున్నది అబద్దం అనీ, మాస్టర్స్ అనేవాళ్ళు ఎవరూ లేరనీ ఇదంతా తమ భ్రమ అనీ తెలుసుకుంటాడు. అక్కణ్ణించి అతని నమ్మకాలలో మార్పు రావడం కనిపిస్తుంది. తాము అప్పటిదాకా గుడ్డిగా నమ్ముతున్న అనేక విషయాలను అతను ప్రశ్నించడం మొదలుపెడతాడు. ఇది ఎంత వరకూ పోతుందంటే, మాస్టర్స్ అనేవాళ్ళు ఈవెంట్స్  మాత్రమే అని ఒక ఉపన్యాసంలో చెప్పి సంచలనం సృష్టిస్తాడు. ఇది అనీబెసంట్ ను చాలా బాధిస్తుంది. 

తరువాత కొన్నాళ్ళకి, ఇదే కృష్ణమూర్తి, తనలోకి "మైత్రేయ" దిగి వచ్చాడని చెబుతూ ఉపన్యాసాలు ఇవ్వసాగాడు. అతని ద్వారా మాట్లాడేది " మైత్రేయ " కాదనీ, చీకటిసైతాన్ శక్తులు అతన్ని ఆవహించాయనీ, అవే అలా మాట్లాడుతున్నాయనీ, జార్జి అరుండేల్ చీలికబృందం అనీబిసెంట్ ను నమ్మించింది. దానికి తగినట్లే కృష్ణమూర్తి చెప్పేది కూడా వాళ్ళు అప్పటిదాకా నమ్ముతున్న విషయాలకు భిన్నంగా వ్యతిరేకంగా ఉండేది. చాలాసార్లు వాళ్ళ నమ్మకాలను ఆయన సూటిగా విమర్శించేవాడు.  థియాసాఫికల్ సొసైటీ గ్రూపులుగా విడిపోవడం ఆరంభించింది.

ఈలోపు  ప్రపంచ వ్యాప్తంగా ధియసాఫికల్ సొసైటీ చేసిన ప్రచారంలో-- "వరల్డ్ టీచర్" అనబడే "మైత్రేయ"-- అనేక సంవత్సరాల సాధనలో శుద్ధి పరచబడిన కృష్ణ మూర్తి శరీరంలోకి దిగి వచ్చాడని నమ్మించారు. ఈ క్రమంలో,  ప్రపంచవ్యాప్తంగా అనేకమంది సభ్యులు కృష్ణమూర్తికి అనేక దేశాలలో ఇళ్ళూ, ఎస్టేట్లూ సమర్పిస్తారు. కృష్ణమూర్తి మాత్రం తాను వరల్డ్ టీచర్ నని, మైత్రేయ తనలోకి దిగి వచ్చాడనీ భావించినప్పటికీ, దియసాఫికల్ సొసైటీలో వస్తున్న అనేక గ్రూపులను, వాళ్ళ నమ్మకాలను మాత్రం  ఖండిస్తాడు. వీళ్ళది అంతా భ్రమ అని, వాళ్ళు ఈగో ట్రిప్స్ లో చిక్కుకున్నారనీ  నమ్ముతుంటాడు.  

చివరికి 1929 లో ఆమెన్ లో ఏర్పాటు చేసిన బ్రహ్మాండమైన సమావేశంలో దేశ దేశాలనుంచి వచ్చిన దివ్యజ్ఞానసమాజ సభ్యుల సమక్షంలో కృష్ణమూర్తి అసలు నిజాన్ని కుండ బద్దలు కొట్టినట్లు వెల్లడిస్తాడు. "ఆర్డర్ ఆఫ్ ది స్టార్" సంస్థను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి తనకు వచ్చిన ఇళ్ళూ భూములూ అన్నీ ఎవరివి వారికి తిరిగి ఇచ్చేస్తాడు.

Truth is a pathless land అంటూ సత్యం అనేది ఒక సంస్థద్వారా తెలుసుకునేది కాదనీ అది ఎవరికీ వారు తమలో తాము తెలుసుకోవాలనీ చెప్తాడు. గురువులు, మాస్టర్స్ అంతా మాయ అంటూ సత్యం ఎవరి సొత్తూ కాదనీ, ఏ గురువూ దాన్ని చూపించలేడనీ, దాన్ని ఎవరికి వారే తెలుసుకోవాలనీ చెప్తాడు. ఇది పెద్ద సంచలనం సృష్టిస్తుంది. తరువాత థియాసాఫికల్ సొసైటీకి కూడా రాజీనామా చేసి తనదారి వేరంటూ కాలిఫోర్నియాలోని "ఒజై" లో ఉన్న తన ఇంటికి వెళ్ళిపోతాడు. అంతకుముందే  అనీబెసంటు రాజకీయాల్లోకి దిగి "హోంరూల్" ఉద్యమాన్ని నడుపుతుంది. చివరికి అక్కడా సక్సెస్ కాలేకపోతుంది. ఆమె, లెడ్ బీటరూ కొద్ది తేడాతో మరణిస్తారు. అనీబెసంట్ కు చివరిలో మతిభ్రమిస్తుంది.

(వచ్చే పోస్ట్ లో కృష్ణమూర్తి సాధనానుభవాలను  జ్యోతిష్య పరంగా పరిశీలిద్దాం)