“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

29, జూన్ 2011, బుధవారం

నిత్యజీవితంలో జ్యోతిశ్శాస్త్రం

మొన్న 27-6-2011 న ఒక పనిమీద విజయనగరం వెళ్ళవలసి వచ్చింది. అక్కడ ఒక ప్రముఖ వ్యక్తిని కలవవలసిన పని ఉంది. ఉదయం 9.30 కల్లా వాళ్ళ ఆఫీసుకు చేరి వెయిట్ చేస్తూ కూచున్నాము. ఆయనకు ఆ రోజున ఏదో పని ఉందనీ, లేటుగా వస్తారనీ, ఎప్పుడు వస్తారో తెలీదనీ  వాళ్ళ పీ.ఏ. చెప్పారు.

నాతొ వచ్చిన వారికి ఆదుర్దాగా ఉంది. పని చూసుకొని వెంటనే వెనక్కు తిరిగి వెళ్ళాలని వారి తాపత్రయం. తిరుగు ట్రెయిన్ మధ్యాన్నం మూడు గంటలకు విశాఖపట్నంలో బయలుదేరుతుంది. ఒకవేళ ఈయన మధ్యాన్నం వరకూ రాకపోతే మాకు తిరుగు ట్రెయిన్ దొరకదు. విజయనగరం నుంచి విశాఖపట్నానికి ఒక గంట ప్రయాణం ఉంటుంది. అప్పుడు రాత్రికి విశాఖపట్నం లో  ఉండి మర్నాడు ఉదయం బయలుదేరి వెళ్ళాలి. ఒకరోజు ప్రయాణంలో  వెస్ట్ అవుతుంది. ఈ రకమైన ఆలోచనలతో నాతొ వచ్చినవారు కొంత కంగారుగా ఉన్నారు. అప్పటికి 10.30 అయ్యింది.

సరే ఎలాగూ వెయిటింగ్ లో ఉన్నాం కదా, ఖాళీగా కూర్చోవడం ఎందుకు, జ్యోతిశ్శాస్త్ర సహాయం తీసుకొని మేము ఎదురు చూస్తున్న వ్యక్తీ ఎన్నింటికి ఆఫీసుకు వస్తారో చూద్దామని అనిపించింది. 

నా దగ్గర ఏ కంప్యూటర్ గాని, ఇతర మెటీరియల్ గాని, పెన్ను పేపర్ గాని లేదు. ఎడారిలో మనం ఉన్నా కూడా పనికొచ్చే జ్యోతిష్య కిటుకులు కొన్నున్నాయి. ఇలాటప్పుడు అవసరానికి పనికొచ్చే హోరా విధానాన్ని ఉపయోగించాను. లాంజ్ లో వెయిట్ చేస్తూ, కుర్చీలో వెనక్కువాలి, కళ్ళు మూసుకొని, మనసులో ఈ విధంగా లెక్కించాను.

ప్రస్తుతం గుంటూరులో అయితే సూర్యోదయం 5.42 కు అవుతున్నది. విజయనగరం తూర్పున ఉన్నది గనుక ఇంకా ముందుగా సూర్యోదయం జరుగుతుంది. గుంటూరుకు విజయనగరానికి మధ్యన దూరం దాదాపు 440 కిమీ ఉంటుంది. భూమి చుట్టుకొలత దాదాపు 40,000 కి.మీ. 

40,000 కి.మీ దూరం 24 గంటలలో భూమి ఒకసారి తిరుగుతుంది. అంటే 24x60=1440 నిముషాలు పడుతుంది. అదే 400 కి.మీలు 14.4 నిముషాలు పడుతుంది. అంటే దాదాపు 15 నిముషాలు పడుతుంది. 440 కి.మీలలో ఉన్న 40 కి.మీ కోసం ఇంకొక్క నిముషం వేసుకుని 16 నిముషాలు అనుకోవచ్చు. కనుక విజయనగరంలో ఆ రోజున 5.42-0.16= 5.26 కే సూర్యోదయం అయ్యి ఉండాలి. ఇది వాస్తవమే ఎందుకంటే ఉదయం 5.45 కి అక్కడ దిగినప్పుడే సూర్యోదయం అయ్యి ఉండటాన్ని గమనించాను. కనుక 5.26 నుంచి దైనందిన గ్రహహోరలు లెక్కించాలి. దాదాపు ప్రతి 28 కిమీ లకూ సూర్యోదయంలో ఒక నిముషం తేడా వస్తుంది. తూర్పుకు పోయేకొద్దీ ముందుగా సూర్యోదయం అవుతుంది. పశ్చిమానికి పోయేకొద్దీ ఆలస్యం అవుతుంది.

ఆ రోజు సోమవారం గనుక చంద్ర, శని, గురు, కుజ, సూర్య, శుక్ర, బుధ హోరలు వరుసగా నడుస్తాయి. 10.26 నుంచి శుక్ర హోర నడుస్తున్నది. ఆ రోజు భరణీ నక్షత్రం ఉన్నది. భరణికి అధిపతి శుక్రుడు. ఈ నక్షత్రం అంత మంచిది కాదు. ఈ నక్షత్రం పైన యముని యొక్క ప్రభావం ఉంటుంది. 

పైగా వెయిట్ చేస్తున్న మా ముగ్గురికీ భరణీ నక్షత్రం విపత్తార, నైధనతార, ప్రత్యక్తార అవుతుంది. కనుక ఈరోజు వచ్చిన పని జరుగక పోవచ్చు. కాని తిధి బహుళ ఏకాదశి గనుక ఆలస్యం మీద పని సఫలం కావాలి. కనుక  ఖచ్చితంగా శుక్ర హోరలో పని జరుగదు. శుక్ర హోర 11.26 వరకూ ఉన్నది. కనుక మేం వెయిట్ చేస్తున్న వ్యక్తి  ఆ తర్వాతే రావడం జరుగుతుంది. అప్పటినుంచీ వచ్చేది బుధ హోర కనుక, మేము వచ్చిన పని బుధుని యొక్క ఆధిపత్యం లోనికే వస్తుంది గనుకా, బుధ హోర మొదలు కావడం తోనే, అంటే, 11.26 తర్వాత ఆయన రావచ్చు.

ఇలా మనసులోనే గుణించుకొని, రేమేడీగా ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపిస్తూ  గమనిస్తున్నాను. నాతొ వచ్చిన వారికి కళ్ళు మూసుకొని నేనేమి చేస్తున్నానో తెలీలేదు. బహుశా ఏదో ధ్యానంలో ఉన్నానని అనుకున్నారు. గడియారం లో ముళ్ళు ముందుకు కదులుతున్నాయి. నాతొ వచ్చిన వాళ్ళు అసహనంగా కదులుతున్నారు. నేను ఏం జరుగుతుందో చూద్దామని గమనిస్తున్నాను. చివరికి 11.26 అయిపొయింది. కానీ ఏమీ జరుగలేదు.

సరిగ్గా 11.27 కి కారు వచ్చి ఆగడం, మేం వెయిట్ చేస్తున్న వ్యక్తీ వచ్చి చేంబర్ లోకి వెళ్ళడం టకటకా జరిగిపోయాయి. నాకు నవ్వొచ్చింది. ఎందుకు చిరునవ్వు నవ్వావని నాతొ వచ్చినవారు అడిగారు. నేనేమీ జవాబు చెప్పలేదు. సరిగ్గా 11.30 కి మమ్మల్నిచేంబర్ లోకి పిలవడం, 11.45 కి ఆయనతో మాట్లాడి, వచ్చిన పని పూర్తి చేసుకోవడం జరిగిపోయాయి. వెంటనే తిరుగు ప్రయాణం అయ్యి, సరైన సమయానికి విశాఖపట్నం చేరి, ట్రెయిన్ అందుకొని రాత్రికి గుంటూరు చేరడం జరిగిపోయింది.

మన జీవితం మీద అనుక్షణం గ్రహ ప్రభావం ఉంటుంది. గమనించేవారికి అది అర్ధమౌతుంది. గమనించే నేర్పు లేకపోతే అర్ధం కాదు.