ఒక వ్యక్తి జీవితం లో అనుభవిస్తున్న రోగాలకూ, అతనికి అప్పుడు నడుస్తున్న గ్రహదశలకూ, అతని మనస్తత్వానికీ అతనికి సూచింప బడుతున్న ఔషదాలకూ అవినాభావ సంబంధం ఉంటుంది.
పరిశీలనగా గమనిస్తే ఈ లింకులన్నీ చక్కగా కనిపిస్తాయి. ఈ విధమైన పరిశీలనతో ఒక మనిషిని ఎంతో చక్కగా అర్ధం చేసుకోవచ్చు. ఒక్కోసారి ఒక మనిషిని చూడకుండానే ఇవన్నీ మన కళ్ళముందు దర్శించవచ్చు. దూరంనుంచే అతని జీవితాన్ని చదివినట్లుగా చెప్పవచ్చు. ఇదీ ఒక రకమైన దివ్యదృష్టే అని నేనంటాను. దీనికి రుజువుగా, ఈ మధ్య జరిగిన ఒక సంఘటన చెప్తాను.
మొన్నీ మధ్య నా స్నేహితుడు ఒకాయన వచ్చాడు. ఆయనిప్పుడు హైదరాబాద్లో పని చేస్తున్నాడు. అందుకని ఇంతకుముందు లాగా తరచూ కలవడం లేదు.
"మా అమ్మాయికి పెళ్లి చేద్దామనుకుంటున్నా". అన్నాడు.
"మంచిదే. కానీయ్." అన్నాను.
"ఒక చిక్కొచ్చి పడింది. అందుకే నీ దగ్గరికి వచ్చాను." అన్నాడు.
"చెప్పు". అన్నాను.
"ఏం లేదు. పెళ్ళికొడుకు మా మేనల్లుడే. MBA చేసాడు. "శాప్" కోర్స్ చేసాడు. హైదరాబాద్లో పని చేస్తున్నాడు. కాని ఈ మధ్యన వింతగా ప్రవర్తిస్తున్నాడు. "
"ఏమైందో వివరంగా చెప్పు." అన్నాను.
"కాన్సర్ ఉందని అతనికి ప్రగాఢ నమ్మకం. అన్ని టెస్టులూ చేయించాము. మద్రాస్ కాన్సర్ ఆస్పత్రిలో చూపించాము. ఏమీ లేదని చెప్పారు. అయినా అతనికి అనుమానం మాత్రం పోలేదు."
"అతని బాధ ఏమిటి?" అడిగాను.
"ఏది తిన్నా వికారంగా ఉంటుంది. ఇమడదు. వాంతికి వచ్చినట్లు అవుతుంది. అందుకని భయపడి ఏమీ తినడం లేదు. ప్రస్తుతం స్కేలేటెన్ లా తయారయ్యాడు. హైదరాబాద్లో ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గాస్త్రో ఎంటరాలజీ డా|| నాగేశ్వర రెడ్డి గారికి చూపించాము. ఆయన అన్ని టెస్టులూ చేసి, కొద్దిగా ఫాటీ లివర్ తప్ప ఇంకేమీ లేదు. నీకేమీ రోగం లేదు అని చెప్పాడు. అయినా మావాడు నమ్మడు. తనకు కాన్సర్ ఉందని అతనికి ప్రగాఢమైన విశ్వాసం. డాక్టర్లతో వాదిస్తాడు. ఏమీ లేకపోతే నాకీ వికారం ఎందుకుంది అంటాడు. మీరు చదువుకున్న చదువంతా తప్పు అంటాడు. నాకు కాన్సర్ ఉంది. అందుకే పెళ్లి చేసుకోను. మీ అమ్మాయి జీవితం నాశనం చెయ్యడం నాకిష్టం లేదు అంటాడు. ఏం చెయ్యాలో అర్ధం కావడం లేదు. రిపోర్టులు తెచ్చాను. చూడు." అన్నాడు.
రిపోర్టులు అన్నీ నార్మల్ గా ఉన్నాయి. కొద్దిగా ఫాటీ లివర్ తప్ప ఏమీ లేదు.
"అసలీ గోల ఎలా మొదలైంది." అడిగాను.
"ఒకరోజు ముఖం కడుక్కుంటుంటే నోట్లోంచి రక్తం పడింది. అప్పటినుంచీ ఈ వరస మొదలుపెట్టాడు. కొంత కాలం క్రితం ఇతని బాబాయి స్టమక్ కాన్సర్ తో చనిపోయాడు. అతనికి వీడే దగ్గరుండి అన్నీ సేవలు చేసాడు. అతను పడిన బాధలు అన్నీ చూచాడు. బహుశా తనకు కూడా అవే బాధలు ఉన్నాయని భ్రమలో ఉన్నాడేమో. పైగా ఇతనికి చైన్ స్మోకింగ్ అలవాటుంది. అలాటి వాళ్లకు నోట్లోంచి బ్లడ్ పడుతుంది. నేనూ ఒకప్పుడు సిగిరెట్లు బాగా తాగేవాన్ని. నాకూ కొన్నిసార్లు అలా బ్లడ్ పడేది. అది మామూలేరా. భయపడకు అని చెప్పాను. అయినా వీడు వినడం లేదు." అన్నాడు.
"కావచ్చు. ఇప్పుడూ తాగుతున్నాడా మరి.? అడిగాను
"లేదు. మానేశాడు. సైకియాట్రిస్ట్ దగ్గరికో, హిప్నాటిస్ట్ దగ్గరికో తీసికెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పిద్దామని అనుకుంటున్నాను. ఏమంటావ్ ?" అడిగాడు.
"శుద్ధ దండగ. ఆపని మాత్రం చెయ్యకు. సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళితే ట్రాన్క్విలైజర్స్ ఇస్తాడు. దాంతో మీవాడు మమ్మీ లాగా తయారౌతాడు. అప్పుడు మీవాడి పరిస్తితి పులిమీద పుట్ర అవుతుంది. " అన్నాను.
"మరేం చెయ్యమంటావ్. నీ సలహా చెప్పు" అన్నాడు.
ఈ అబ్బాయి లక్షణాలను వింటూ ఉన్నప్పుడే అతని తత్త్వం నాకు అర్ధమైపోయింది. హోమియోపరంగా లోతైన అవగాహన ఉంటె మానవమనస్తత్వం చిటికెలో అర్ధమౌతుంది. అంతేగాక రోగి యొక్క కాన్స్టిట్యూషన్, అతనికి ఏ మందు సరిపోతుంది అన్న విషయాలు వెంటనే అర్ధమౌతాయి. అదేగాక దీనికి జ్యోతిశ్శాస్త్రం తోడైతే ఇక చెప్పాల్సిన పనే లేదు. వేలమైళ్ళ దూరాన ఎక్కడో ఉన్న మనిషి ఎదురుగా ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తాడు.
వెంటనే మనసులో గ్రహస్తోత్రం జపించి గమనించాను. ఈ సంభాషణ జరుగుతున్న సమయంలో చంద్ర హోర జరుగుతున్నది. అమావాస్య తర్వాత రెండురోజులు గడిచాయి. చంద్రుడు పుష్యమీ నక్షత్రంలో ఉన్నాడు. బుదునితో కలిసి ఉన్నాడు. వృశ్చికం లో ఉన్న రాహువుతో చూడబడుతున్నాడు. కనుక ఇతనికి మానసిక భ్రమలు ఎక్కువగా ఉన్నాయి. అబ్సేస్సివ్ బిలీఫ్స్ ఎక్కువగా ఇతన్ని పీడిస్తున్నాయి. అవి మాత్రమె గాక రోగం కూడా ఉన్నది. రాహు ప్రభావం వల్ల ఎంతమంది డాక్టర్ల చుట్టూ తిరిగినా ఫలితం ఉండటం లేదు. మానసిక చింత, భయం వెంటాడుతూ ఉంటాయి.
"నేను కొన్నిప్రశ్నలు అడుగుతాను జవాబులు చెప్పు" అన్నాను.
"అడుగు" అన్నాడు మిత్రుడు.
"మీ వాడికి ఆదుర్దా ఎక్కువ. అవునా ?"
"అవును."
"అనుమానం బాగా ఎక్కువ. ప్రతిదాన్నీ అనుమానిస్తాడు. కంగారు పడిపోతూ ఉంటాడు.అవునా?"
"నిజమే. తనను తానే నమ్మడు. అన్నీ అనుమానాలే. గదికి తాళం వేసి బయటకు వెళుతూ కూడా తాళం వేశానా లేదా అని అనుమానంతో మళ్ళీ వెనక్కు వచ్చి చూసుకుంటాడు." అన్నాడు.
"ఏదైనా ఫంక్షన్ కు వెళ్ళాలన్నా, ప్రయాణం పెట్టుకున్నా, మాటమాటకీ బాత్రూం కి వెళ్ళవలసి వస్తుంది. అవునా?"
"ఈ సంగతి నాకు తెలీదు. కనుక్కుంటాను."-- అని వాళ్ళ చెల్లెలికి ఫోన్ చేసాడు. నేను చూస్తూ ఉన్నాను. ఫోన్ పెట్టేసి-- "అలాటిదేమీ లేదని మా చెల్లెలు చెప్పింది." అన్నాడు.
"కొన్ని విషయాలు తల్లికి, తండ్రికి కూడా తెలీవు. వాళ్ళు అంతగా గమనించక పోవచ్చు. ఆ అబ్బాయినే డైరెక్ట్ గా అడగండి." అని చెప్పాను.
సరే అని, అతనికే ఫోన్ చేసాడు. హైదరాబాద్ లో ఉన్న మేనల్లుడు ఫోన్ ఎత్తాడు. అతనితో మాట్లాడుతూ నా వైపు తిరిగి,
"నిజమే వాడికి ఆ అలవాటు ఉందట." అన్నాడు.
"అది అలవాటు కాదు. రోగలక్షణం" అన్నాను. "ఇంకొక్క ప్రశ్న. ఫోన్ కట్ చెయ్యకు. అతనికి స్వీట్లు ఎక్కువగా తినాలని అనిపిస్తుందా అడగండి." అన్నాను.
"అదీ నిజమే. ఒకప్పుడు తినేవాన్ని. ఇప్పుడు తింటే వికారంగా ఉంటుంది. అయినా నేను స్వీట్లు ఇష్టపడతానని మీకెలా తెలుసు? " అని అవతలి నుంచి జవాబు వచ్చింది.
"స్టేజి ఫియర్ ఉందా మీ వాడికి. కనుక్కో ?" అడిగాను.
"ఉంది. స్టేజి ఎక్కి మాట్లాడాలంటే కాళ్ళూ చేతులూ వణుకుతాయి." అవతలనుంచి జవాబు వచ్చింది.
ఫోన్ పెట్టేసి మా ఫ్రెండ్ కొద్ది సేపు మాట్లాడలేదు. " మా వాడిని నువ్వు చూడలేదు కదా. ఇదంతా ఎలా చెప్పగలిగావ్. ఏమిటీ వింత?" అడిగాడు.
"నాకు దివ్యదృష్టి ఉంది. దాంతో చూచి చెప్పాలే." అన్నా నవ్వుతూ. "ఎలా చెప్తే నీకెందుకు గాని మీ వాడికి రోగం ఉన్నమాట వాస్తవం. అయితే అది కాన్సర్ కాదు. మంచి హోమియో ట్రీట్మెంట్ ఇప్పించు తగ్గుతుంది." అని చెప్పాను.
"ఆ రోగం పేరు ఏమిటో చెప్పు." అడిగాడు.
"దానికి నామకరణ మహోత్సవం చెయ్యాల్సిన ఖర్మ మనకెందుకు? యాంగ్జైటీన్యూరోసిస్ అనో అబ్సేస్సివ్ కంపల్సరీ డిసార్డర్ అనో ఏదోఒకటి ప్రస్తుతానికి పిలుచుకో. " అన్నాను.
"మరిచిపోయాను. మావాడి జాతకం రాయించాను చూడు." అని ఒక జాతక చక్రం నా చేతిలో పెట్టాడు.
మా స్నేహితుడు ముస్లిం మతానికి చెందినవాడు. అయినా కొన్నేళ్ళ నా సాంగత్య దోషం (?) వల్ల చాలావరకూ హిందూ పద్దతులు పాటిస్తాడు. జాతకాలు, ముహూర్తాలు, వాస్తు అన్నీ నమ్ముతాడు. అందుకే మేనల్లుడి జాతకాన్ని రాయించి మరీ తీసుకొచ్చాడు.
ప్రస్తుతం మేనల్లుడి జాతకంలో శుక్ర/శని దశ జరుగుతున్నది. శుక్రుడు యూరినరీ ఆర్గాన్స్ కు అధిపతి. శుక్రునిపైన శని యొక్క ప్రభావం వల్ల కంగారు, భయం దానివల్ల మాటిమాటికీ ఒంటేలుకు పోవడం ఉంటాయి. శుక్రుని యొక్క లోహం వెండి. ప్రస్తుతం ఇతనికి ఇండికేట్ అయిన హోమియో ఔషధం పేరు " అర్జెంటం నైట్రికం " అంటే "సిల్వర్ నైట్రేట్" అన్నమాట. శుక్రుని దశలో, శుక్రుని కారకత్వ అవయవాలలో వచ్చిన రోగానికి, శుక్రుని లోహం అయిన వెండికి సంబంధించిన ఔషధం ఇతనికి సూచింప బడుతున్నది. ఇంతకంటే విచిత్రం ఇంకెక్కడుంటుంది? ఇటువంటి విచిత్రాలు చూచినప్పుడు, ఎంత లోతైన పరిశీలనతో గ్రహాలకు లోహాలకూ ఉన్న సంబంధాన్ని ప్రాచీనులు వ్రాసిపెట్టారో అని ఆశ్చర్యం కలుగుతుంది.
"మీ వాడికి హైదరాబాద్ లో మంచి హోమియో ట్రీట్మెంట్ ఇప్పించు. తప్పకుండా తగ్గుతుంది. ఆ భయం పోతుంది. తరువాత పెళ్లి చెయ్యి. అంతా సర్దుకుంటుంది." అని చెప్పి మా మిత్రున్ని పంపేశాను.
ఇండికేట్ కాబడిన మందు లక్షణాలనూ, హోరానాధుడు సూచించిన లక్షణాలనూ కలిపి అతని రోగాన్నీ మనస్తత్వాన్నీ ఈ విధంగా కళ్ళకు కట్టినట్లుగా చదవడం సాధ్యం అయింది.
ఈ విధంగా ఔషదాలకూ, గ్రహాలకూ, దశలకూ, మానవ మనస్తత్వానికీ, రోగాలకూ, అలవాట్లకూ సంబంధాలు ఉంటాయి. ఒక మనిషిని చూడటం తోనే, లేక అతని వివరాల గురించి వినడంతోనే అతనికి జరుగుతున్న దశలూ, అతన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తున్న గ్రహమూ, తద్వారా అతని అలవాట్లూ, ఆ సమయంలో అతన్ని పీడిస్తున్న రోగాలూ, అతనికి ఏ మందు పని చేస్తుంది అన్న విషయమూ, అతని భవిష్యత్తు ఎలా ఉంటుంది అన్న విషయమూ, అతని జీవితమూ సమస్తం ఈ విధంగా తెలుసుకోవచ్చు.
ఇదీ ఒకరకమైన దివ్యదృష్టే మరి. కాదంటారా?