హోమియోపతి నాలుగో సంవత్సరం చదువుతున్న ఒక BHMS విద్యార్ధి ఆమధ్య నాతో మాట్లాడాలని వచ్చాడు.
1990 - 95 మధ్యన పొన్నూరు వాస్తవ్యులైన డా|| పీ వీ గోపాలరావు గారి దగ్గర నేను హోమియోపతీని చాలా సీరియస్ గా ఒక తపస్సులాగా అధ్యయనం చేసాను. ఆయన మద్రాస్ హోమియో మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. సమాజంలో హోమియోపతి యొక్క గొప్ప విజ్ఞానాన్ని పంచాలనే సదుద్దేశంతో విజయవాడ లో "హన్నేమాన్న్ హోమియో స్టడీ సర్కిల్" అని ఆయన పెట్టిన సంస్థ ఒకటి ఉండేది. అందులో నేను చేరి హోమియోపతిని పట్టుదలగా అధ్యయనం చేశాను.
అతి త్వరగా ఆ సిద్ధాంతాలలో నాకు పట్టు చిక్కినందువల్ల నన్ను ఆయన బాగా అభిమానించేవారు. అప్పట్లోనే BHMS గ్రాడ్యుయేట్లు సబ్జెక్ట్ ను శుద్ధంగా నేర్చుకోటానికి ఆయన వద్దకు వచ్చేవారు. "అపర హన్నేమాన్" అని ఆయనకు పేరుండేది. హోమియోపతిని ఆయన బోధించే తీరు చాలా విలక్షణంగా ఉండేది. ఆర్గనాన్ లోని అంతరార్ధాలను ఆయన వివరించే తీరు అద్భుతంగా ఉండేది. అప్పట్లో నాతో బాటు నేర్చుకున్న ఒక సహాధ్యాయి నా గురించి చెపితే విని నన్ను కలుద్దామని ఈ అబ్బాయి ఇక్కడకు వచ్చాడు.
తనకు క్లినికల్ అనుభవం ఏ మాత్రమూ లేదనీ, సబ్జెక్ట్ లోతులు ఎవరూ చెప్పడం లేదనీ, మొత్తం తామే చదువుకోవలసి వస్తున్నదనీ, ఒక సామాన్యజ్వరాన్ని కూడా శుద్ధంగా తాము ట్రీట్ చెయ్యలేకపోతున్నామనీ అతను వాపోయాడు. ఒకప్పుడు నేనూ ఇతని లాగా సబ్జెక్ట్ చెప్పగలిగిన గురువుల కోసం తపనతో వెతికినవాణ్ణే గనుక అతని బాధ నాకు అర్ధమైంది.
మామూలుగా డాక్టర్లకు ఉండే అహంకారం ఇతని దగ్గర కనిపించలేదు. పైగా వినయమూ, నేర్చుకుందామనే తపనా కనిపించాయి. కనుక ఇతనితో మాట్లాడదామని నాకూ అనిపించింది. ఇతని దగ్గర సబ్జెక్టు ఎంత ఉందొ తెలుసుకుందామని కొన్ని ప్రశ్నలు వేశాను.
హన్నేమాన్ వ్రాసిన "ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్" లో ఉన్న పేరాలను ఎఫోరిజమ్స్ ( సూత్రాలు ) అని ఎందుకన్నారు? అని ప్రశ్నించాను.
"తెలీదు. దానికి ప్రత్యేకమైన కారణం ఉండక పోవచ్చు. " అని జవాబిచ్చాడు BHMS.
సరే. ఆర్గనాన్ లో మొదటి సూత్రాన్ని చెప్పగలవా? అడిగాను.
ఏమీ జవాబు లేదు. బ్లాంక్ గా చూస్తున్నాడు.
సరే నేను చెప్తాను విను అంటూ ఇలా చెప్పాను." The physician's high and only mission is to restore the sick to health, to cure, as it is termed. అంతేనా."
"అవును" అన్నాడు ఆశ్చర్యంగా.
హోమియోపతి సిద్దాంతం చాలా వరకూ ఈ మొదటి సూత్రం లోనే దాగి ఉన్నదంటే నమ్మగలవా ? అడిగాను.
అతను అనుమానంగా చూచాడు. "ఇందులో ఏమి విశేషం ఉంది సార్. ఇది చాలా సింపుల్ సూత్రం. అందరికీ తెలిసిందే కదా." అన్నాడు.
"అదే నాయనా రహస్యం. మామూలు పేరాలను సూత్రాలని పిలవడం లో ఉన్న రహస్యం అదే. అనల్పమైన అర్ధాన్ని అల్పమైన మాటల్లో పొదిగి చెప్పడమే సూత్రం అంటే. సూత్రానికి భాష్యం అవసరం. లేకుంటే అర్ధం కాదు. అలాగే ఈ సూత్రాలకూ వివరణాత్మకమైన అర్ధాలున్నాయి. వాటిని తెలుసుకుంటే నీవు ఆశ్చర్య పోతావు." అన్నాను.
"అందుకే గదా సార్ మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. చెప్పండి మరి " అడిగాడు.
"నేను ఇప్పుడే చెప్పను. ఈ సూత్రాన్ని బాగా ధ్యానం చేసి, ఆలోచించి, ఒక వారం తర్వాత వచ్చి నీకేమి అర్ధమైందో చెప్పు. అప్పుడు దాని అసలైన అర్ధాన్ని నేను చెప్తాను." అని అతన్ని పంపించేసాను.
(మిగతా వివరాలు వచ్చే భాగం లో)
(మిగతా వివరాలు వచ్చే భాగం లో)