నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

15, జులై 2011, శుక్రవారం

పంచవటి -- సత్య ప్రేమికుల, జిజ్ఞాసువుల సమూహం.

పంచవటి -- నిజమైన సత్య ప్రేమికుల, ఆధ్యాత్మిక జిజ్ఞాసువుల సమూహం. నా బ్లాగు చదువుతున్నవారికి ఈ గ్రూపు గురించి తెలుస్తుంది.  25-7-2010 గురుపూర్ణిమ రోజున పంచవటి గ్రూప్ మొదలైంది. అంటే నేటికి సరిగ్గా ఒక సంవత్సరం అయింది. 

ఈ ఏడాదిలో పంచవటిలో ఎన్నో మార్పులు వచ్చాయి. సభ్యుల ఆధ్యాత్మిక అవగాహన వేగంగా పెరిగింది. వారియొక్క అంతరిక పరిధి విస్తృతమైంది. నిజమైన ఆధ్యాత్మికత అంటే ఏమిటో వారికి అర్ధమైంది. ఆధ్యాత్మిక సాధనవైపు వారి ఆకాంక్ష బాగా పెరిగింది. ఏడాదిగా పంచవటిలో ఉంటూ అసంతృప్తికి లోనైనవారు ఎవ్వరూ లేరు. దీనిని సక్రమంగా ఉపయోగించుకుని అద్భుతమైన ఆద్యాత్మిక ప్రగతి సాధించినవారు మాత్రం ఉన్నారు.

ఊకదంపుడు చర్చలు కాక ఆచరణతో కూడిన అవగాహనను పెంపొందించేదీ, సత్యం వైపు అడుగులు వేయించేదీ, అయిన జిజ్ఞాసువుల సమూహమే పంచవటి. ఇక్కడ అహంకారులకూ, వితండవాదులకూ, ఊకదంపుడు పుస్తకజ్ఞానులకూ, పాండిత్య ప్రదర్శకులకూ  చోటు లేదు. పంచవటి అంటే, మనం చెయ్యలేని పనులను గురించి వ్యర్ధంగా  చర్చించుకుంటూ ఇతరులను తిట్టుకునే రచ్చబండ కాదు.ఆద్యాత్మికంగా ఎదగాలనుకునే వారికోసం ఉన్నతమైన సదుద్దేశ్యాలతో మొదలైన గ్రూప్ పంచవటి. 

ఇందులో చేరడానికి ఏదో గొప్ప లక్షణాలు అక్కరలేదు. విశాలభావాలూ, మర్యాదపూర్వకంగా విషయాన్ని చర్చించగలగడమూ, ఎదుటి మనిషిని గౌరవించడమూ, సత్యాన్ని తెలుసుకోవాలన్న తపనా, తెలుసుకున్నదానిని ఆచరణలో పెట్టగల ధైర్యమూ ఉంటే చాలు.

మౌన సభ్యులుగా ఉండేవారు పంచవటిలో ఇమడలేరు. ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాటలాడేవారూ ఇక్కడ ఇమడలేరు. నిత్యమూ తాము ఆధ్యాత్మికంగా ఎదుగుతూ, ఇతరులతో మర్యాదపూర్వకమైన, సంస్కారవంతమైన, అర్ధవంతమైన, ఉన్నతమైన చర్చలు చెయ్యగల వారే ఇక్కడ ఉండగలరు. ఇటువంటి లక్షణాలు మీకున్నాయా? అయితే పంచవటి లో చేరడానికి ఇదే ఆహ్వానం. 

ఆసక్తి ఉన్నవారూ, పై లక్షణాలున్నవారూ, గ్రూప్ లో చేరాలనుకుంటున్న వారూ నా e - mail కు వ్రాయండి.