“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

18, జులై 2011, సోమవారం

ముంబై బాంబు పేలుళ్లు - జ్యోతిష్య పరిశీలన

రాహు కేతువులు మనిషి యొక్క జీవితంలో వచ్చే అన్ని చెడుఘటనలలోనూ ముఖ్యపాత్ర వహిస్తాయి. ముఖ్యంగా బాంబుపేలుళ్లు, పెద్ద పెద్ద దుర్ఘటనలు, యాక్సిడెంట్లు,  కుట్రలలో వీరిపాత్ర తప్పకుండా ఉంటుంది. మానవ జీవితం మీద వారికి తిరుగులేని అధికారం ఉంది.
 
రాహుకేతువులు కాల స్వరూపాలు.అందుకే వీటితో ఏర్పడే కాలసర్పయోగం ఉన్నవారికి కాలం అనుకూలించదు. ఇవి ఉచ్చస్థితిలో ఉన్నవారికి కాలం అనుకూలించడమూ  నీచ స్థితిలో ఉన్నవారికి కాలం పామై కాటువెయ్యడమూ గమనించవచ్చు. జాతకంలో మంచిదశలు గనుక జరుగుతుంటే ఎండకు పట్టిన గొడుగులాగా ఈ చెడుప్రభావం నుంచి దశలు రక్షిస్తాయి. దశలు కూడా చెడువి జరుగుతుంటే ఇక చెప్పనక్కర్లేదు. అన్నీ కలిసి  మనిషిని పీల్చి పిప్పిని చేస్తాయి. 

అయితే ఇదంతా గ్రహాలు ఎవరిమీద కోపంతోనో చేస్తున్నట్లు భావించరాదు. మన కర్మ ఫలితాన్నే గ్రహాలూ చూపిస్తాయి. అంతేగాని వాటికి ఒకరంటే ద్వేషమూ ఒకరంటే ప్రేమా లేవు. అవి దైవీ శక్తులు. లోకులందరి పైనా సమదృష్టితో మనకు రావలసిన కర్మ ఫలాన్ని అవి ఇస్తూ ఉంటాయి. అంతిమ విశ్లేషణలో మనం చేసుకున్నదే మనం అనుభవిస్తాము.

ఇదంతా ఎందుకు వ్రాస్తున్నానంటే, ప్రస్తుతం మే 3 తేదీనుంచి రాహు కేతువులు నీచ స్థితిలో ప్రవేశించారు. వీరు ఈ స్తితిలో ఒకటిన్నర సంవత్సరం ఉంటారు.
కనుక ఈసమయంలో మనుషుల జీవితాలలో విపరీత మార్పులు కనిపిస్తాయి. ఏ ఏ జాతకాలకు వీరు బాధకులో వారిని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగిస్తారు. అంటే ఆయా జాతకులు చేసిన పూర్వ చెడుకర్మ అంతా ఈ సమయంలో ఫలితానికి వస్తుంది. రాహు కేతు ప్రబావాల నుంచి తప్పించుకోగలమని లోకులు అనుకుంటారు. కానీ అది తేలికగా జరిగేపని కాదు. చేసిన చెడుకర్మ, దొంగపూజలవల్ల తొలగదు. ఎవరికో డబ్బులు పడేసి చేయించిన రాహుకేతు పూజలవల్ల దోషాలు పోతాయని అనుకోవడం పిచ్చి భ్రమ. అవి అంత తేలికగా పోయేవి కానే కావు. మన జీవితాలను శాసిస్తున్న దైవీ శక్తులను మనం బురిడీ కొట్టించగలమని అనుకోవడం వెర్రి తనం. అయితే రేమేడీలు అన్నీ బూటకాలేనా అన్న అనుమానం వస్తుంది. కానేకావు. రేమేడీలు నిజాలే. అయితే వాటిని చేసే తీరు ఒకటి ఉన్నది. ఆ తీరులో వాటిని చేసినపుడే అవి ఫలితం చూపిస్తాయి. జాగ్రత్తగా గమనిస్తే మే నెలనుంచి, అనుకోని పరిస్తితులు తలెత్తడం, ప్రమాదాలు జరగడం, త్రిప్పట, విసుగు, చికాకులు ఎక్కువకావడం మొదలైన విపరీతపు సంఘటనలు జరగడం, అనేకమంది జీవితాలలో ఎవరికి వారే చూసుకోవచ్చు.

ఆ సంగతి అలా ఉంచితే, ప్రస్తుతం 13 -7 -2011 న జరిగిన ముంబై బాంబు పేలుళ్ళ కూ వీటికీ సంబంధం ఉందంటే విచిత్రంగానే ఉంటుంది. అదెలాగో వివరిస్తాను. నేనెన్నో సార్లు సూచించిన పౌర్ణమి అమావాస్య ఎఫెక్ట్ ఈసారికూడా
మళ్ళీ నిజమైంది. ఈసారి ఆషాఢ పౌర్ణిమకు ఒకరోజు ముందు ముంబై పేలుళ్లు జరిగాయి.

సహజ ద్వితీయ స్థానమూ, సంపదకు సూచికా, శుక్రునిచే సూచింపబడుతున్న విలాసప్రదేశం  అయిన వృషభంలో కుజుడూ కేతువూ కలిసి ఉండటం చూడవచ్చు. అంటే ఒక విలాసవంతమైననగరంలో దుర్ఘటన జరుగబోతున్నదని  సూచన వస్తుంది. రాహువు కుజునిదైన వృశ్చిక రాశిలో ఉన్నాడు. వృశ్చికం కుట్రలకూ కుతంత్రాలకూ రహస్య ప్లానులకూ, నీటివనరుల దగ్గర ఉండే ప్రదేశాలకూ మూలస్థానం. రాహువు కుట్రదార్లకూ విద్రోహులకూ అధిదేవత. ఇక కేతువు శుక్రునిదైన వృషభంలో కుజునితో కలిసి ఉన్నాడు. కుజ కేతువులు పేలుళ్లకు, శక్తి విస్ఫోటనాలకూ సూచికలు.

11.7.2011 నుంచి 16-7-2011 వరకూ అగ్ని ప్రమాదాలకు సూచిక అయిన కుజుడు నవాంశలో నీచస్థితిలో ఉంటూ విధ్వంసకరమైన   నీచుల పన్నాగాలను సూచిస్తున్నాడు. అలాగే 13 , 14   తేదీలలో మాత్రమె నవాంశలో శుక్రుడు ఉచ్చ స్థితిలోకి వస్తూ రాహువుతో కలిసి మీనంలో ఉంటున్నాడు. అంటే విధ్వంసకారుల కుట్రలు ఈ సమయంలో బలం పుంజుకుంటాయని తెలుసుకోవచ్చు. 14 తేదీన పౌర్ణమి ఘడియలు వస్తున్నాయి. కనుక డేంజరస్ టైం స్లాట్ 13 , 14 తేదీలకు కుదించబడింది. 13 సాయంత్రం పేలుళ్లు జరిగాయి. పౌర్ణమి అమావాస్యలు కొన్ని గ్రహ ప్రభావాలను విపరీతంగా ఉత్తెజపరుస్తాయనీ ప్రధాన సంఘటనలు వీటికి అటూ ఇటూ జరుగుతాయనీ ఖచ్చితంగా చెప్పవచ్చు. అందుకేనేమో మన జ్యోతిర్విద్యలో చంద్రునికి అమితమైన ప్రాధాన్యత ఇవ్వబడింది.

ఇప్పుడు రెండు ప్రశ్నలు తలెత్తుతున్నాయి?


ఒకటి-- ముంబై లోనే ఈ ఘటన ఎందుకు జరగాలి? ఈ గ్రహ పరిస్తితులు అన్ని నగరాలకూ వర్తిస్తాయి కదా? అన్ని నగరాలకూ ఒకే పరిస్తితి ఉండదు. ముంబైకీ ఈ సమయానికీ ఉన్న సంబంధం పరిశోధనలో  నిర్ధారించాలి.

ఇకపోతే రెండవది-- ఘటన జరిగిన తర్వాత ఈ పరిశీలన వల్ల ఉపయోగం ఏమిటి? ముందే చెబితే జాగ్రత్తలు తీసుకునేవారు కదా? దీనికి నా జవాబు ఏమిటంటే, ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ఉన్న గ్రహ స్తితులను గుర్తించడం వల్ల ముందుముందు ఇలాటి సంఘటనలు ఎప్పుడు జరుగుతాయో తెలుసుకునే అవకాశం తప్పకుండా ఉంటుంది. ఇకపోతే, జాగ్రత్తల విషయానికొస్తే,  అదేన్నటికీ జరిగే పని కాదు. పొరపాటున దొరికిన దొంగలనూ  హంతకులనూ, ఏళ్ల తరబడి రాజభోగాలతో పోషిస్తున్న మనం, జరుగబోయేవి చెబితే జాగ్రత్తలు తీసుకుంటామా? అసంభవం. ఈ దేశంలో అది ఇప్పట్లో జరిగే సూచనలు కనిపించడం లేదు. 

మరి ఈ ఎనాలిసిస్ ఎందుకూ అని అనుమానం సహజం. పరిశీలన వల్లా, రీసెర్చిల వల్లనే, సూత్రాలు వెలుగులోకి వస్తాయి. ఇప్పటి సంఘటనలు, భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండటానికి, ముందు జరుగబోయే సంఘటనలను తెలుసుకోవడానికీ   ఉపయోగపడతాయి. ఈ ఎనాలిసిస్ ఉపయోగం అంతవరకే.

రాహు కేతువులు 24-12-2012 వరకూ నీచ స్థితిలోనే ఉంటాయి. ఈ లోపల మరిన్ని దుర్ఘటనలు జరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. వీలును బట్టి ఆయా సమయాలను సూచించడం జరుగుతుంది.