Once you stop learning, you start dying

26, జులై 2011, మంగళవారం

మార్మిక నగరం

మార్మిక నగరపు వీధుల్లో 
మనసు సంచరిస్తోంది
వింత వింతలను చూస్తూ 
మౌనంగా సాగుతోంది 

సృష్ట్యాదినుంఛి జారుతున్న 
జ్ఞాపకాల జలపాతం 
హృదయాన్ని అభిషేకిస్తోంది 
అనుభూతుల వెల్లువతో 

ఆత్మ దూదిపింజలా తేలి 
దేన్నో వెతుకుతోంది 
నిశీధాంతరాళపు
నిశ్శబ్ద సీమలలో 

విశ్వపుటంచుల కావల 
ఏముందో చూద్దామని
ప్రియతముని జాడకోసం 
మనసు పరుగులెత్తింది  

నీరవ నిశీధశూన్యంలో 
ఉబికొచ్చిన ప్రియుని స్వరం 
హృదంతరాళపు లోతుల్లో
మధురనాదం నింపింది 

విశ్వపు హద్దులు దాటి
ఎక్కుపెట్టిన చూపు
విచలితమై పోయింది.
గమ్యాన్ని కానలేక

సృష్టికి ముందున్న 
అగాధ జలాశయం 
అడుగులోతుల్లోంచి
ఉబికోచ్చిందొక  నాదం 

పట్టిచ్చింది ప్రియతముని జాడలను 
ఆ నాదం వింటున్న మనసు
మూగగా మారింది.
మౌన పరవశ వేదనలో 

అన్వేషణ మరచింది 
అడుగులన్ని ఆపింది 
మార్మిక నగరపు అంచున
నిలిచి చూస్తోంది మౌనంగా

శూన్యాకాశపు సముద్రంలోకి
దూకడానికి సిద్ధంగా ...........